Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 22

 

    ఇదిగో మీద చెయ్యి వేశావో - నా మీద అత్యాచారం చేయబోయావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను - " అంది మహేశ్వరీదేవి. దీప్ చంద్ టక్కున నిలబడిపోయాడు. పోలీస్ అనగానే అతనికి భయం కలిగింది.
    అప్పుడే కిందపడిన ఫోటోను తీసి చూశాడు భీమారావ్.
    అతని మొఖంలో రంగులు మారిపోయినయ్.
    లోటస్ లేడీస్ వెల్పేర్ క్లబ్ తాలుకూ ఓ ఫంక్షన్ లో తనూ, సలీంఖాన్ కలిసి భుజాల మీద చేతులేసుకుని నవ్వుతూ దిగిన ఫోటో అది! సలీం ఖాన్ ని ఆ తర్వాత చాలా అక్రమాలు మోసాలు చేసి, ప్రభుత్వాన్ని, ప్రజలను మోసగించి నందుగ్గాను అరెస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు ప్రచురిస్తే - తనకూ అతనికీ ఏవో లావాదేవీలున్నాయనీ , తనూ ఆ అక్రమాల్లో భాగస్తుడనీ ప్రజలందరూ అనుకునే ప్రమాదం ఉంది. దానివల్ల ఎలక్షన్లో తను ఓడిపోవడం తప్పదు. అసలు తనకి పార్టీ టికెట్ కూడా ఇవ్వకపోవచ్చు.
    మహేశ్వరిదేవి అలా ఆ ఫోటోతో తనను బ్లాక్ మెయిల్ చేయడం సహించలేక ఎదురుగ్గా ఉన్న ట్రేలోని టమాటో పచ్చడి తీసి మహేశ్వరిదీవి మొఖం మీద బలంగా విసిరాడతను . కానీ -
    మహేశ్వరీదేవి మెరుపులా పక్కకు తప్పుకోవడంతో పచ్చడంతా వెళ్ళి - నోరు తెరచి చూస్తూన్న దీప్ చంద్ మీద పడింది.
    "తిక్క వదిలింది! లేకపోతే నన్ను బయటకు గెంటాలని చూస్తాడా! నేను రాక్షసినా?- కాస్కో ఆర్. భీమారావ్ - మా ఆయనకు గవర్నర్ గా చేయకపోయావో ఈ ఫోటో పేపర్లో వేసి నీ బ్రతుకు బజారు పాలు చేస్తాను. నన్ను రాక్షసి అన్నావ్ కదా! ఇంక నుంచీ నా రాక్షసి రూపమే చూద్దూ గాని ...." అనేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపొయిందామె.


                                      *****

    ఉదయం ఎనిమిదవుతోంది టైం.
    ఆ సమయంలో హైద్రాబాద్ రోడ్లన్నీ స్కూళ్ళకు వెళ్ళే చిన్నారులతో నిండిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి, నడవడానికి వీల్లేని పరిస్థితిలో ఉంటాయ్! ఆ రాష్ లోనే పిల్లల మధ్య నుంచి ఈదుతున్నల్టు నడుస్తూ ద్రాక్షగుతుల్లా వేలాడుతోన్న పిల్లల్తో కదుల్తోన్న రిక్షాలను తప్పించుకుంటూ "ఏ భాయ్! జర దేఖ్హేచలో - ఆగే హీనాహీ, పీచేభీ - నీ చేహీనహీ - ఊపర్ భీ!" అన్న పాట ఉత్సాహంగా పాడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు భవానీశంకర్. ఆ పాటను కేవలం హైద్రాబాద్ నగరం కోసమే ఆ గీత రచయిత రాసినట్లు పూర్తీ నమ్మకం కలిగిందతనికి.
    తెలుగుకిరణం పత్రికాఫీసు చేరుకొని గేటులో నుంచి లోపలకు నడువబోతుంటే వాచ్ మాన్ టక్కున అడ్డం వచ్చేశాడు.
    "ఎవరు కావాల్సార్?"
    భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
    "ఇలా లోపలికి వచ్చేవాళ్ళందరినీ ప్రశ్నలడిగే వాచ్ మాన్ లంటే నాకెంతో ఇష్టం. సహోదరా! కీప్ టప్! ఏదో ఒక రోజు టపీపని పైకొచ్చేస్టావ్ నువ్వు- అన్నట్లు నీ పేరేమిటి?"
    హనుమాన్ సార్!"
    "ఇంటి పేరు 'రామభక్త' అయుంటుందనడంలో నాకెలాంటి అనుమానం లేదు - అన్నట్లు భవానీశంకర్ దిగ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ పేరు విన్నావా నువ్వు? నేనే ఆ పేరు ఓనర్ని! అన్నట్టు ఇవాళ్టి నుంచీ తెలుగుకిరణం కొత్త చీఫ్ ఎడిటర్ని! నీకీ విషయం తెలుసా?"
    హనుమాన్ ఈసారి మాట్లాడలేదు. చీఫ్ ఎడిటర్లంటే తనకున్న గౌరవాన్ని యాక్షన్ లో చూపించాడు . ఒక్కసారి ఎగిరిపడినట్లు బిగుసుకుపోయి సెల్యూట్ కొట్టాడు.
    "వెరీ గుడ్ మైడియర్ రామభక్త హనుమాన్! మిలటరీలో ఉన్నప్పుడు కూడా నువ్వెంతో అద్భుతమైన క్రమశిక్షణ పాటించావని విన్నాను. నీ సిన్సీయారిటీ , స్వామి భక్తిని మనసులో ఉంచుకుంటాను!" అనేసి ఆఫీస్ లో అడుగు పెట్టాడు.
    ఎదురుగ్గా ఉన్న రూమ్ బయట చీఫ్ ఎడిటర్ శివతాండవం అన్న బోర్డ్ వేలాడుతోంది. లోపల ఎవరూ లేకపోవటం చూసి,వెనుక వున్న రూమ్ కర్టెన్ తొలగించి చూశాడు.
    చిరంజీవి ఓ పాత గుడ్డ తీసుకుని తనే టేబులూ, కుర్చీ అన్నీ తుడుస్తూ కనిపించాడు.
    గుడ్ మాణింగ్ ఫ్రెండ్! సంస్థ యజమాని తన ఆఫీస్ టేబుల్ తనే క్లీన్ చేసుకోవటం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అబ్రహం లింకన్ తన బూట్లు తనే పాలిష్ చేసుకున్నాడన్న విషయం చదివి నువ్వు ఉత్తేజితుడివయుంటావనడంలో ఎలాంటి సందేహం లేదు బ్రదర్! అయ్ లవ్ దిస్ స్పిరిట్! నాకూ బూట్లూ ఉంటె తప్పక నేనే పాలిష్ చేసుకునేవాడిని!" అన్నాడు భవానీశంకర్ ఉత్సాహంగా.
    "ఆ ఫార్ములా వినడానికి చాలా ఇంపుగానే ఉంటుంది - ఇది మాత్రం నేను గత్యంతరం లేక చేస్తున్నాను-"
    "అంటే?" అనుమానంగా అడిగాడు భవానీ శంకర్ టేబుల్ మీదే ఓ పక్కగా కూర్చుంటూ , చిరంజీవి తుడవటం ముగించి రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు.
    "మనకీ ఆఫీస్ లో చాలా సమస్యలున్నాయ్ భవానీ!" దిగులుగా అన్నాడతను.
    "ఏమిటా సమస్యలు?"
    "నేను మొదటిరోజు ఆఫీస్ కొచ్చినప్పుడు చాలా అవమానాలు జరిగినాయ్. వాటన్నిటికి కారణం శివతాండవం! ఆఖరికి ఆఫీస్ ఫ్యూన్ కూడా నన్ను లెక్క పెట్టలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ నువ్వే ఊహించుకో! ఇది ఆస్తికి సంబంధించిన విషయమై పోయింది గానీ లేకపోతే ఒకరిద్దర్నయినా రక్తం కక్కించేవాడిని!" ఉద్రేకంగా అన్నాడు చిరంజీవి.
    భవానీశంకర్ ఆప్యాయంగా అతని భుజం తట్టాడు.
    "కూలాఫ్ మైడియర్ ఫ్రెండ్! అహింసే మన భారతదేశం, పాలసీ గనుక, మనం కూడా అదే పాలసీ అవలంభించటం మంచిది! బైదిబై - ఈ శివతాండవం అనే పక్షి అలా విలన్ లా ప్రవర్తించడానికి కారణం ఏమిటి?"
    "ఆస్తి నాకు దక్కటం వాడికిష్టంలేదు."
    "అందువలన ఆ పక్షి కేమిటి లాభం?"
    "విభూతి బాబా శివతాండవం గురువు! అసలు విభూతి బాబాను మా మావయ్యకు అంటించింది కూడా శివతాండవమే! కనుక ఎలాగయినా మావయ్య ఆస్తిని విభూతి బాబాకు దక్కేలా చెయ్యాలని వాడి కోరికనుకుంటాను."
    భవానీ శంకర్ కి అర్ధమైపోయింది.
    "ఓకే ఓకే ఓకే బ్రదర్! కధా, స్క్రీన్ ప్లే అన్నీ అర్ధమయిపోయాయ్! ఇంక నువ్వు ఈ విషయాలన్నీ నాకొదిలెయ్! ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను నిమిషాల్లో సెటిల్ చేస్తాను. నువ్వు వెంటనే మన ఏజెంట్స్ అందరికీ లెటర్స్ రాయించు 'తెలుగుకిరణం' దినపత్రిక యువ యజమాని చిరంజీవి అధ్వర్యంలో - ది గ్రేట్ జర్నలిజం గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్ - సంపాదకత్వంలో ఇక నుంచీ ఎంతో అద్భుతంగా వెలువడబోతోందని హెచ్చరికలు చేసేయ్. నేనీలోపల నా రూమ్ లో కూర్చుని పాలసీ రివ్య్వు ప్రారంభిస్తాను." అంటూ బయటకు నడిచాడతను.
    శివతాండవం రూమ్ లోకి ఓసారి తొంగి చూసేసరికి అదింకా ఖాళీగానే కనిపించిందతనికి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలకు నడిచి శివతాండవం కూర్చునే రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. టేబుల్ మీదున్న ఆరోజు 'తెలుగుకిరణం' పేపర్ తీసుకుని హెడ్ లైన్స్ చదవసాగాడు.
    అయిదు నిమిషాలైన గడవకముందే శ్రీరాములు హడావుడిగా గదిలో కొచ్చి గదిలో శివతాండవం బదులు మరో వ్యక్తీ కూర్చుని ఉండటం చూసి ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    ఎవరైనా విజిటర్స్ పొరపాటున అలా కుర్చున్నారేమోనని అనుమానం కలిగిందతనికి.
    తన రాక తెలియజేయడానికన్నట్లు చిన్నగా దగ్గాడు.
    భవానీశంకర్ న్యూస్ పేపర్ తిప్పకుండానే ఓరకంట అతనిని గమనించి "నీ పేరేంటోయ్?" అనడిగాడు తాపీగా.
    "శ్రీరాములండీ...తమరు....." అంటూ వాడు ఇంకేదో అడిగే లోపలే భవానీ శంకర్ మళ్ళీ మాట్లాడాడు.
    "చూడవోయ్ శ్రీరాములూ! నిన్నింత హటాత్తుగా ఉద్యోగంలోంచి తీసెయ్యటం నాకే మాత్రం ఇష్టం లేదు. కానీ మన సంస్థ యజమాని చిరంజీవి గారు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించే వ్యక్తీ . అంచేత నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. నీ డిస్మిసల్ ఆర్డర్స్ తయారవుతున్నాయ్. నువ్వు వెళ్ళి మన సేక్యురీటీ ఆఫీస్ దగ్గర కూర్చుంటే - నీ డిస్మిస్ ఆర్డర్స్, మూడు నెలల అడ్వాన్స్ జీతం తాలూకూ చెక్కు - అన్నీ రడీ అయ్యాక కబురు చేస్తాం - వచ్చి తీసుకోవచ్చు. నువ్వీ సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేశావని నాకు చాలామంది చెప్పారు! కానీ మేం మాత్రం ఏం చేయగలం?"
    శ్రీరాములుకు కోపం ముంచుకొచ్చింది.
    "ఇంతకీ తమరేవరండి?" అన్నాడు వెటకారంగా.
    "ఆ వివరాలన్నీ నీకు రామభక్త హనుమాన్ చెప్తాడు శ్రీరాములూ - నాకంత టైం లేదు -" అంటూ డైరక్టరీ చూసి ఇంటర్ కాం లో సెక్యురిటీ కి రింగ్ చేశాడతను.
    "హనుమాన్! నేను చీఫ్ ఎడిటర్ ని మాట్లాడుతున్నా- ఒకసారి  నా రూమ్ కొచ్చి 'శ్రీరాములు ' అనే మన మాజీ ఆఫీస్ ఫ్యూన్ ని బయటకు తీసుకెళ్తే నేను ఆఫీస్ పని చూచుకోడానికి వీలవుతుంది" అనేసి ఫోన్ పెట్టేసి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు.
    శ్రీరాములకు భయం వళ్ళంతా పాకింది. ఇదంతా నమ్మాలో నమ్మకూడదో కూడా తెలీటం లేదు. చిరంజీవికి తనను డిస్మిస్ చేసే అధికారం ఎలా ఉంటుందో అర్ధం కావటం లేదు.
    శివతాండవమే ఇలాంటి వ్యవహారాన్నిటికీ అధికారి అని తన నమ్మకం. తీరా చూస్తే ఇతనెవరో ఎకాఎకీన శివతాండవం సీట్లోనే కూర్చున్నాడు.
    హనుమాన్ తన పాత మిలటరీ మర్చింగ్ తో భవానీశంకర్ గదిలో కొచ్చి ఓ సెల్యూట్ కొట్టాడు.
    "యస్ హనుమాన్ - శ్రీరాముల్ని తీసుకెళ్ళు! ఇంతకాలం సిన్సియర్ గా నమ్మకంతో పనిచేసిన తర్వాత ఇలా సెక్యురిటీ స్టాఫ్ తో గెంటించడం - వ్యక్తిగతంగా నేను ద్వేషిస్తాను. కానీ చెప్పాను కదా! చిరంజీవిగారు క్రమశిక్షణ విషయంలో మాత్రం రాక్షసుడు - ఇవన్నీ అతని ఆర్డర్స్!"
    అతనలా చెప్తుండగానే హనుమాన్ చేయి శ్రీరాములు భుజం మీద పడింది. "పద శ్రీరాములూ - ' అన్నాడు కర్కశంగా.

 Previous Page Next Page