సుఖంలో కూడా దుఃఖం యిమిడి వుంటుంది ఎక్కడో తెలీదు. ఏ మూలనో తెలీదు. దుఃఖం మిణుకు మిణుకుమంటూ తొంగి చూస్తూ ఉంటుంది. ఆఖరికి జీవితచరమాంకంలో ఆశ్రయించే వేదాంతంలో కూడా ఎంతో కొంత దుఃఖం ఆవరించి వుంటుంది.
ఏదో సాధించాలి.
సాధించాలన్న ఆశ వుంది. పట్టుదల వుంది. తెలివితేటలున్నాయి. కాని ఎలాగో తెలియటంలేదు.
సాధ్యమైనంతవరకూ రాజీకి దూరంగా బ్రతకాలన్న దీక్ష మాత్రం ఉన్నది.
* * * *
నీరజ తన సీటులో కూర్చుని టైప్ చేస్తున్నది.
అది ఓ ఛిట్ ఫండ్ ఆఫీసు. అందులో రెండు లక్షలూ, లక్షా యాభయివేలూ, యిరవై వేలూ, పదివేలూ యిలా చీట్లున్నాయి.
చీటీ పాడుకున్న వారిదగ్గర్నుంచి రావాల్సిన బకాయిలూ, పాడుకోని వారి దగ్గర్నుంచి వసూలు కావల్సిన వాయిదాలూ...ఇలా వీళ్ళందరికీ రాయవల్సిన రిమైండ్ లెటర్స్ ఆమెకు అందచెయ్యబడ్డాయి. ఆ ఉత్తరాలన్నీ చూసుకుంటూ, తప్పులు లేకుండా జాగ్రత్త పడుతూ చకచక టైపు చేస్తున్నది.
అలా తనపని తాను నిర్వర్తిస్తోంటే ఆమెకెందుకో సంతోషమూ ఒకింత గర్వమూ అనిపించింది.
మనిషికి వ్యాపకం ఉండటంలో, విధి నిర్వహణలో ఇంత తృప్తి ఉందా అనిపించింది.
ఓ అరగంట గడిచాక కొంచం అలిసినట్లయి, రెండు నిముషాలపాటు రెస్టు తీసుకుందామని, టైప్ చెయ్యటమాపి తల ప్రక్కకి త్రిప్పి చూసింది.
అప్పుడు తెలిసింది ఆఫీసులో వున్న వారిలో చాలామంది కళ్ళు తనని తినేసేటట్లు గమనిస్తున్నారని.
ఆ కళ్ళలో ఎంత దాహం, ఎంత ఆకలి!
వారిలో పాతికేళ్ళవాళ్ళూ వున్నారు, నడివయసు వాళ్ళూ వున్నారు, అరవై ఏళ్ళు సమీపిస్తున్నవాళ్ళూ వున్నారు.
అందరి చూపులూ ఒకేరకంగా వున్నాయి.
విసుగుతో, అసహ్యంతో తల ప్రక్కకి త్రిప్పుకుంది.
ఒక ఆడపిల్ల యుక్తవయసొచ్చినప్పట్నుంచీ, యీ వికృత సమాజంలో, నవనాగరికంగా మారిందని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఎంతటి అవమానాలు భరిస్తూ ఉండాలి.
ఇంట్లోంచి కాలు బయటపెట్టి రోడ్డుమీద కొచ్చిందంటే ప్రతి వెధవాయి తృష్ణతో కూడిన చూపులు ఆమెపైనే.
కాలేజి స్టూడెంట్లు, ఉద్యోగులు, వయసు మళ్ళుతున్న వాళ్ళూ_మళ్ళినవాళ్ళూ అందరూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ప్రవర్తిస్తారు.
ఆడపిల్లను చూడగానే ప్రతివాడూ అమాంతం ఓ హీరో అయిపోతాడు. రోడ్డుమీద నడిచే ఆడపిల్ల మీద సర్వాధికారాలూ వున్నట్లు, ఆమె తన సొత్తు అయినట్లు లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ అయినట్లు ప్రవర్తిస్తారు.
రకరకాల వ్యాఖ్యానాలు, అసభ్యంగా, అతి జుగుప్సాకరంగా, పచ్చి బూతులతో...
ఆ కామెంట్సు వింటుంటే చచ్చిపోదామనిపిస్తుంది.
ఇహ మీద మీదకొచ్చి రాసుకుంటూ, డాష్ ఇచ్చుకుంటూ, బ్రెస్ట్ తగిలేలా చేతులు వొడుపుగా పెట్టి నడుస్తూ.
హారిబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఓ ఆడపిల్ల శరీరంలో తాకబడని భాగమంటూ వుండదు. తమ పిల్లలు రోడ్లుమీదకొచ్చాక యిలాంటి అగచాట్లకు గురవుతుందని పూర్తిగా తెలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు గుండెలు పగిలి చస్తారు.
చిత్రమేమిటంటే ఆడపిల్లలనేకాదు, కొంచం వయసొచ్చిన ఆడవాళ్ళను కూడా వాళ్ళు విడిచిపెట్టరు. ఇంటర్ చదివేటప్పుడు తమ క్లాస్ మేట్ ఓ అమ్మాయి తల్లి అలా నడిచి వెడుతుంటే, తన క్లాస్ మొగపిల్లలు "ఆంటీ! మీ మంగళసూత్రం బయటకి కనబడుతోంది. ఆంటీ! మీ బ్లౌజ్ బావుంది" అంటూ ఏడిపించటం గుర్తుంది.