Previous Page Next Page 
రక్షరేకు పేజి 22


    అటు చంద్రమ్మకీ నాగమ్మ సంబంధాలు చూస్తోంది. మళ్ళీ మరో సంబంధం కురిర్చింది. ఆ పెళ్ళికొడుక్కీ పోస్టాఫీస్ లో ఉద్యోగం. పల్లెటూళ్ళో పొలంకూడా ఉంది. చంద్రిని చూసి రెండువందలు ఓలి కట్టటానికి ఒప్పుకుని మనువు కుదుర్చుకున్నాడు. చంద్రి ఇదివరకులాగే పెళ్ళికొడుక్కి ఉత్తరం రాసిపడేసింది. పెళ్ళికొడుకు వెనుకటిలాగానే పెళ్ళి వద్దనేశాడు. కానీ కారణం చెప్పకుండా వద్దనలేదు.....
    "మాకెవరో ఉత్తరం రాశారు, మీ చంద్రికి మరెవరిమీదనో మనసుందట! ఈ పెళ్ళయితే అది బావిలో పడిసస్తాదట. మాకెందుకొచ్చిన గొడవలు? దేశం గొడ్డోయిందా, మావోడికి పిల్లే దొరకదా? దొరబాబులా ఉజ్జోగం చేస్తున్నాడు" అన్నారు పెళ్ళిపెద్దలు.
    ఈమాటలు విన్న నాగమ్మ మండిపోయింది. తన కూతురి పెళ్ళి చెడగొట్టే ఉద్దేశం ఎవరికుంటుంది? ఎవరు రాసి ఉంటారు. ఆ ఉత్తరం? జైహింద్ బాబే రాయించి ఉంటాడనుకుంది! ఆ గుడిసెమీద విరుచుకుపడింది.
    ఇదేం పొయ్యేకాలమే! నా కూతురిపెళ్ళి చెడగొడితే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి సేస్తాననుకుంటావుండాడేమో నీ కొడుకు! ఈ నాగమ్మ అట్లాంటి కట్టుదప్పిన పనులెప్పుడూ సెయ్యదని తెలుసుకోండి!"
    అన్మమ్మ స్వాతికురాలే కాని, ఇంటిమీద పడి తిట్టిపోస్తాంటే ఎలా భరించగలదు?
    "యేంటే? నీకూతురి పెళ్ళి నా కొడుకు సెడగొట్టాడా! ఆడికేం కరమమే! రాజానాగ చదువుతున్నాడు. నువ్వేనేంటే, కట్టు దప్పిన పనులు సెయ్యని దానివి? ఈ అన్నమ్మ అసలు కట్టుదప్పదే!"
    పెళ్ళాం బిడ్డలున్న రాజయ్యతో లేచివచ్చిన నాగమ్మ రోజు తాగుబోతు మొగుడిచేతిలో చావుదెబ్బలు తింటూ వాణ్ని తిట్టుకునే అన్నమ్మ - ఒకరిని మించి ఒకరు "నేను కట్టుతప్పనిదా"న్నంటే, "నేను కట్టుదప్పనిదా"న్నని హోరాహోరీ పోట్లాడుకున్నారు.
    నాగమ్మనోరు చాలాచెడ్డది. అది విజృంభించి "ఒసే! బంగారంలాంటి నా బిడ్డని నీ కొడుక్కి కట్టబెడతానని అనుకోకు. సదివాడులే, మాలావు సదువు - ఎంత సదివినా, ఈడు సేసేది కూలి పనేగా! ఏటుంది ఆడికి! మంద సంసారం తప్ప?" అని విదిలించింది.
     "యేటే? యేటికూశావు? నా బిడ్డ కూలిపని సేస్తాడా? ఆడు పెద్దబాబవుతాడే! నీ యసుమటోళ్ళంతా ఆడి కాల్లకాడే పడుండాల! నీ బిడ్డ దేనికే! నా కొడుక్కి? మా కాల్లమీదపడ్డా నీ కూతుర్ని సేసుకోనే! లచ్చిందేవంటి పిల్ల ఏరికోరి చేసుకుంటది నా కొడుకుని. సూడలేక నువ్వే కుళ్ళిపోవాల!"
    "ఎన్నడో సూడలేక నే కుళ్ళిపోతానంటం దేనికే! మీరంతా యిప్పుడే కుళ్ళిసస్తన్నారే! కుదిరిన సంబంధాలు కూలదోస్తున్నారే! ఒసే! ఇప్పుడే సెప్తన్నా! మీరెంత గింజుకు సచ్చినా, ఆ కూలిసచ్చినోడికి నా బిడ్డనియ్యను"
    అరుచుకుంటూ పోయింగి నాగమ్మ. అన్నమ్మ క్రింద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది. సాయంత్రం జైహింద్ బాబు వచ్చేవరకూ అలా ఏడుస్తూనే ఉంది. జైహింద్ బాబు గుండె చెదిరిపోయింది.
    "ఏంటమ్మా? మళ్ళీ అయ్య వచ్చాడా? నిన్ను కొట్టాడా?" అని అడిగాడు ఆరాటంగా.
    అన్నమ్మ మరింత ఏడుస్తూ "నువ్వు కూలోడివంటరా! ఎంత సదువుకున్నా, నువ్వు కూలిపనే సేస్తావంట!" అంది.
    జైహింద్ బాబుకి తలా తోకా అర్థం కాలేదు. నెమ్మదిగా తల్లిని ప్రశ్నలడిగి విషయమంతా తెలుసుకున్నాడు. అతని మనసంటూ చికాకు పడిపోయింది. చంద్రి ఏ ఉపాయంతో, తన పెళ్ళి సంబంధాలు తప్పించుకోగలుగుతుందో అతనికర్థమయింది.
    "ఊరుకోమ్మా! నాగమ్మత్త సంగతి తెలిసిందేగా!" అన్నాడు ఓదారుస్తూ....
    "అది కాదురా! నువ్వు కూలోడివంట! నీకు దొరికేది కూలి పనేనంట!....." తలుచుకుని తలుచుకుని కుమిలిపోసాగింది అన్నమ్మ.
    నాగమ్మ మాటలన్నింటిలో తన తల్లిని బాధిస్తున్నది ఈ విషయమేనని అర్థమయింది జైహింద్ బాబుకి, బాధ, జాలీ రెండూ కలిగాయి అతనికి.
    "కూలోడయితే తప్పేముందమ్మా? మనసు మంచిది కావాలి కాని, బ్రతకటానికి ఏ మార్గమయితేనేం?"
    "ఒరేయ్! వద్దురా! అంతమాటనకురా! నువ్వు దొరబాబువిరా! దొరనాగ బతకాలిరా!" ఏడుస్తూ అంది అన్నమ్మ.
    "ఏడవకమ్మా! దొరనేలే!" నవ్వుతూ అన్నాడు జైహింద్ బాబు.
    నవ్వుతోన్న కొడుకు మొహం చూసి కన్నీళ్ళు తుడుచుకుంది అన్నమ్మ.

                                                        11
    "చంద్రి నిన్ను మద్దెనయేల తోటలోకి రమ్మంది." అని రహస్యంగా చెప్పాడు వెంకడు జైహింద్ బాబుతో-
    "ఆ మధ్యాహ్నం లంచ్ టైంకు కాలేజీ నుంచి తిన్నగా రాజయ్య తోటకి వచ్చాడు జైహింద్ బాబు- చంద్రి జైహింద్ బాబుని చూడగానే అతడి రెండు చేతులూ పట్టుకుని "నన్ను క్షమించు బావా? నా మూలంగా నువ్వూ, అత్తయ్యా. అమ్మచేత తిట్లు తిన్నారు -  " అంది బాధగా.
    అతను నవ్వి "అది సరే కాని, నువ్వింత గంధ్రసాంగురాలి వెప్పుడయ్యావు? నీ పెళ్ళి నువ్వే చెడగొట్టుకుంటున్నావా? నీమీద నువ్వే అపనిందలు వేసుకుంటే నీకు పెళ్ళెలా అవుతుందీ?" అన్నాడు.
    "ఏం? నామీద నేను వేసుకున్న అపనిందలు నమ్మి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా?"
    "ఏమో చంద్రి! నేను నిన్ను పెళ్ళి చేసుకోవటం జరిగే పనేనా?"
    "ఎందుకు జరగదు."
    "మీ అమ్మ అన్నట్లు నేను కూలివాణ్నే అవుతానేమో...."
    "ఛ పో."
    "ఒకవేళ కూలివాణ్నే అయితే, అప్పుడేం చేస్తావు చంద్రా? అందుకే ఇంక ముందయినా బుద్ధి తెచ్చుకుని నీ మీద నువ్విలాంటి అపనిందలు వేసుకోకు."
    "అంటే! నువ్వు కూలివాడివయితే నేను మరొకళ్ళని చేసుకుంటాననా? నేనూ చెయ్యగలను కూలిపని..... నీ కంటే బాగా చెయ్యగలను."
    "చంద్రా!" తన చేతులలో ఉన్న చంద్రి చేతులు ఆప్యాయంగా నొక్కాడు జైహింద్ బాబు-
    "ఏమో చంద్రి మన చుట్టూ వున్న మన వాళ్ళందరినీ చూస్తోంటే నాకు భయంగా ఉంది- బెంగగా వుంది."
    "భయం దేనికి బావా? ఇంకొక్క మూడేళ్లలో నీచదువు పూర్తయిపోతుంది. అప్పుడే వాళ్ళే అధికారానికి దాసోహమంటారు - "
    "అమ్మలాగ నువ్వూ బంగారు కలలు కంటున్నావు - "
    "అవును - అందులో తప్పేముందీ"    

 Previous Page Next Page