"అతను హాస్పటల్ కు చెందినవాడు ఐనా కాకపోయినా, అక్కడ ఎవరో ఒకరి సహకారం లేకపోతే ఒంటరిగా ఈపని చెయ్యటం అసాధ్యమనుకుంటాను."
"అది కూడా తేల్చుకోవాల్సిన విషయం. ఇవన్నీ తెలుసుకునేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చెయ్యటం జరిగింది."
రంజితకు నవ్వు వచ్చింది. "పటిష్టమైన ఏర్పాట్లు!" ఇలాంటి కబుర్లతో ఈ దేశం, పాలకులు సంవత్సరాలకు సంవత్సరాలు గడిపెయ్యడం అలవాటు చేసుకుంది.
"శత్రువు చూస్తే చాలా భయంకరమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అలాంటి వాడ్ని ఎదుర్కోవటానికి ఓ ఆడదాన్ని... అదే... ఓ స్త్రీని నియమించటం సమంజసం కాదనుకుంటాను" అన్నాడు ఎ.ఎస్.పి. అతని పేరు రాజశేఖర్.
"రంజిత కేవలం ఓ గూఢచారిణిగా మాత్రమే పనిచేస్తోంది. అంతమాత్రం చేత మిగతా పోలీస్ డిపార్టుమెంట్ అంతటినీ చేతులు కట్టుకు కూచోమనలేదే? మన డిపార్టుమెంట్ అంతా ఈ విషయంలో చాలా శ్రద్ధగా అన్వేషణ జరుపుతోంది. ఇక్కడ కావలసింది తెలివితేటలు గాని బలం, బలగం కావు."
"ఐతే ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలివితేటలు లేవంటారా?"
"ఆ మాట నేననలేదు."
"ఈ దుర్ఘటన జరిగి నాలుగైదు రోజులైనా ఇంతవరకూ మనం ఎవర్నీ అరెస్టు చెయ్యలేదు. దానివల్ల చాలా విమర్శల్ని ఎదుర్కోవల్సి వస్తోంది. ఇది తప్పుకాదా?"
"తొందరపడి అరెస్టులు చెయ్యటంవల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఐనా ఎవరెవర్ని అరెస్టు చెయ్యాలంటారు?"
"చాలామందిని చెయ్యవచ్చు. హాస్పటల్ సూపరింటెండెంట్ ని, నైట్ డ్యూటీ సిస్టర్ని, వార్డుబోయ్ ని, వాచ్ మేన్ ని..."
"అది చాలా గౌరవప్రదమైన హాస్పటల్. డాక్టర్ కృష్ణచైతన్య దేశంలో ప్రముఖ నేత్రవైద్యులలో ఒకరు. సరియైన ఆధారాలు లేకుండా అలాంటివార్ని అవమానం చెయ్యటం భావ్యంకాదు.
"చట్టానికి గొప్పా, సాదా అన్న తారతమ్యం లేదు" అన్నాడు. ఎ.ఎస్.పి. కోపంగా. అరెస్టులు చేసెయ్యటం, చితకబాదెయ్యటం. ఈ పద్ధతులకి బాగా అలవాటుపడ్డ ఆఫీసరతను.
"చట్టానికి గొప్పా. సాదా అన్న తారతమ్యం లేదు. కానీ మంచీ-చెడూ అన్న తారతమ్యం వుంది."
"మంచిగా వూరుకుంటే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది."
"కావచ్చు- కాని మంచిని చెడుగా చూడటం మంచి లక్షణం కాదు."
ఎ.ఎమ్.పి. ఏమీ మాట్లాడలేదు. అతని మొహం కోపంతో జేవురించి వుంది. రంజిత ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుని ఉంది.
"సార్! అన్నాడు ఇంకో ఎ.ఎస్.పి.
"చెప్పండి!" అన్నాడు ఎస్.పి.
"ఈ కళ్ళు పెరికివెయ్యటం ఎందుకు జరుగుతున్నదో మనం చెప్పలేకపోతున్నాం!"
"దీన్ని గురించి చాలాసార్లు ఆలోచించాం. ఐ బాల్స్ ఎక్కడికన్నా పంపబడుతున్నావేమోనని ఇండియన్ ఎయిర్ లైన్స్ లోని విమానాలన్నీ ప్రయాణీకుల్నీ చెక్ చేయించే ఏర్పాట్లు చేశాం. ప్రముఖ నేత్ర వైద్యశాలలు అన్నిటికీ ఇన్ ఫారమ్ చేశాం- అన్ అఫీషియల్ గా ఐ బాల్స్ వస్తే వెంటనే తెలియచెయ్యమని. సాధ్యమైనంతవరకూ నిఘా ఉంచాం. దేశంలో కొన్ని వేలమంది ఐ స్పెషలిస్టులున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఇతరులకు తెలీకుండా ఐ ట్రాన్స్ ప్లాన్ టేషన్ కండక్ట్ చేస్తే పట్టుకోవటం అసాధ్యం."
"నేరస్థుడ్ని త్వరలో పట్టుకోలేకపోతే ఇంకా ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం వుంది కదా?"
"ఉంది."
"సమావేశం పూర్తయింది. రెండు నిమిషాల్లో అందరూ లేచి బయటకు వెళ్ళిపోయారు. ఒక్క రంజిత తప్ప.
"మిస్ రంజితా!" అన్నాడు ఎస్.పి. జయసింహ.
"సార్!"
"నాతో ఏమయినా మాట్లాడాలా?"
"అవును సార్."
"ఏమిటి చెప్పు?"
"నేరస్థుడు ఒక డాక్టరుచేసిన పద్ధతిలో ఐ బాల్స్ తీసివేస్తూ వుండటం వల్ల కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ గురించే ఈ ఘోరాలు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. కాని వేరే కారణాలు కూడా వుండవచ్చు కదా."
"తప్పకుండా వుండవచ్చు."
"మందాకిని, హేమసుధల మీద పర్సనల్ గా గ్రడ్జ్ వున్నవారు ఎవరయినా వుండవచ్చు. ఆ వ్యక్తి ఒకరే అయివుండటానికి కూడా అవకాశం లేకపోలేదు."
"పాజిబుల్."
"ఇంత పెద్ద సిటీలో రాత్రివేళల ఎక్కడో దారుణం జరిగితే మనం పట్టుకోవటం అసాధ్యం. ఈ పని చెయ్యటానికి ఎవరికి అవకాశముంది అని మధించి, ఆ అనుమానస్థుడ్ని ఛేజ్ చేస్తూంటే కొంతవరకూ సాధించగలం."
"కొంచమైనా ఆచూకీ, ఆధారం లేకుండా మనం ఎవర్నని అనుమానిస్తాం మిస్ రంజితా!"
"రాజశేఖర్ గారన్నట్లు పద్మ నేత్రాలయ సిబ్బందికి ఎంతో కొంత సంబంధం వుండకపోదు. ఆ మరుగుజ్జువాడు హాస్పటల్ కేంపస్ లో కనిపించి కనురెప్పపాటులో మాయమైపోయాడు. ఎవరతను? ఎందుకు నన్ను చంపటానికి ప్రయత్నించాడు! ఒక మరుగుజ్జుమనిషి ఊళ్ళోవుంటే సహజంగా అతనివంక అందరూ వింతగా చూస్తారు. అతనికోస్థావరం, తినటానికీ వగైరాలకు ఎక్కడో అక్కడ తారట్లాడటం- ఇవన్నీ ఉండాలి. కాని నేనెంతమందిని ప్రశ్నించినా నాకు తారసపడినప్పుడూ, ఏవో కొన్ని సందర్భాలలో యాదృచ్చికంగా తప్ప ప్రత్యేకంగా కనబడలేదని చెబుతున్నారు. అతని ఉదంతం చాలా విచిత్రంగానే ఉంది."
"అతనెక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసెయ్యమని నేను పోలీస్ డిపార్ట్ మెంట్ అంతటికీ ఇన్ ఫామ్ చేశాను."