అపూర్వ ప్రేమాశ్రమం అను పాపపు కథ
ఆదివారం నాడు మా నిర్భయ్ నగర్ కాలనీ వాళ్ళందరం నిశ్చింతగా ఉదయం తొమ్మిదింటివరకూ నిద్రపోవాలని కలలు కనటం - మా కలల్ని మా కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శాయిరామ్ ఏదోవిధంగా భగ్నం చేయడం మీ అందరికీ తెలిసిన సంగతే కదా!
అంచేత ఆ శనివారం రాత్రి కాలనీ చాలామందిమి కలసి ఊరేగింపుగా శాయిరామ్ ఇంటికి వెళ్ళాం.
"బాబ్బాబు! మేమంతా రేపు ఉదయం తొమ్మిదింటి వరకూ హాయిగా నిద్రపోవాలని, రోజంతా హాయిగా భార్యాబిడ్డలతో గడపాలనీ నిశ్చయించుకున్నాం. గనుక రేపొక్కరోజు మమ్మల్ని మీటింగులూ, గొడవలూ లేకుండా వదిలేస్తే చచ్చి నీకడుపున పుడతాము" అన్నాడు గోపాల్రావ్.
"భలేవారే దాన్దేముంది! అంతగా కావాలంటే మీరు నిద్రలేచాకే మీటింగ్ పెట్టుకుందాం!" అన్నాడు శాయిరామ్ చిరునవ్వుతో.
"బాబోయ్! అంతమాటనకు. అసలు రేపు నువ్వు మా ఇంటికి రావద్దు" బ్రతిమలాడాడు రంగారెడ్డి.
శాయిరామ్ అయిష్టంగానే అంగీకరించాడు.
ప్రోగ్రాం ప్రకారం కాలనీ వాళ్ళందరం నిద్రలో కరిగిపోతున్నాం. అంతలోనే హఠాత్తుగా లాంగ్ విజిల్స్ వినిపించేసరికి నాకు నిద్ర కాస్తా చెడిపోయింది. ఆ విజిల్స్ వెనుకే పిల్లల కోలాహలం, కేకలు, అరుపులూ వినిపించేసరికి కళ్ళు తెరవక తప్పలేదు.
టైము ఏడే అయిందప్పటికి.
శాయిరామ్ మీద కోపంతో లేచి ఇంట్లో నుంచి బయటికొచ్చి చూశాను.
అప్పుడే మిగతా కాలనీ వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో నుంచి బయటికొస్తున్నారు నిద్రకళ్ళతో.
కాలనీ మధ్యలో కొంతమంది చిన్న పిల్లలు చినిగిన బట్టలతో లైనుగా నిలబడి ఉన్నారు.
శ్యామల్రావ్ మధ్యలో నిలబడి పుస్తకంలో ఏదో రాసుకుంటున్నాడు.
శ్యామల్రావ్ కొడుకు పిల్లలందరినీ లైన్లో నుంచోబెడుతున్నాడు.
ఆ గొడవ శాయిరామ్ తాలూకూ మీటింగ్ ది- కాదని తెలిశాక మాక్కోపం తగ్గిపోయింది.
కుతూహలం కొద్దీ వాళ్ళ దగ్గరకు చేరుకున్నామందరం.
ఆ పిల్లలను చూడగానే గుర్తుపట్టాము.
ఆ మధ్య మతకల్లోలాలు జరిగినప్పుడు తల్లిదండ్రులిరువురినీ పోగొట్టుకుని, ఆదరించేవారు లేక తిండికోసం కర్ఫ్యూ ఏరియాదాటి మా కాలనీలో కొచ్చి అడుక్కోవటం పెట్టారు. వారిలో పూటకు గడవని కుటుంబాల పిల్లలూ, మధ్యతరగతి కుటుంబాల పిల్లలూ, ముస్లిమ్ ల పిల్లలూ, హిందువుల పిల్లలూ అందరూ ఉన్నారు. వాళ్ళు మా కాలనీలో కొచ్చి ఇంగ్లీష్ లోనూ, ఉర్దూలోనూ, తెలుగులోనూ "ఆకలేస్తుంది! అన్నం కావాలి" అని కళ్ళల్లో నీళ్లు నింపుకుని అడుగుతూంటే మా కాలనీ వాళ్ళందరం జాలిపడి, వారి కథంతా తెలుసుకుని అందరికీ ఎంతో కొంత భోజనం ఏర్పాట్లు చేశాము. వాళ్ళు కాలనీలో తలో ఇంట్లో భోజనం చేసి మేమిచ్చిన పాత దుప్పట్లూ, దుస్తులూ వాడుతూ కాలనీ వరండాల్లోనే గడుపుతున్నారు.
ఇప్పుడు శ్యామల్రావ్ వాళ్ళనే కాలనీ మధ్యకు చేర్చి అందరి పేర్లూ రాసుకుంటున్నాడు.
ఆ తరువాత ఫోటోగ్రాఫర్ వచ్చి వాళ్ళందరి గ్రూప్ ఫోటోలూ వివిధ కోణాల్లో తీసుకుంటున్నాడు. ఆఖర్లో మరీ చిక్కి శల్యమైపోయిన ఓ ఏడేళ్ళ పాపను ప్రత్యేకంగా ఫోటోలు తీశాడు.
"ఏమిటిదంతా?" రంగారెడ్డి ఆశ్చర్యంగా అడిగాడు శ్యామల్రావ్ ని.
"ఏమిటా? కనబడ్డంలేదూ? దరిద్రం! కటికదరిద్రం. మనందరం రెండుపూటలా కడుపునిండా భోజనం చేస్తూ ఉదయం తొమ్మిదింటి వరకూ నిద్రపోతూంటే- మన పక్కనే ఉన్న ఈ చిన్నారి పాపలు ఒక్క పూటయినా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతకాలం వీరినీ దారుణమైన పరిస్థితిలో చూడటం? అందుకే వీరి బాధలు నాచేతనయినంత వరకూ రూపుమాప దలచుకున్నాను- వీరికోసం ఓ ఆశ్రమం పెట్టి నేనే పోషించదల్చుకున్నాను- భావి భారత పౌరులు వీళ్ళు. వీళ్ళను నా దేశం నిర్లక్ష్యం చేసినా నేను చేయను-" ఆవేశంగా అన్నాడతను.
ఆ స్పీచ్ కి మేమంతా ఎంత చలించి పోయామంటే- అలా మాట్లాడింది శ్యామల్రావ్ కాక ఇంకెవరయినా అయివుంటే అయిదు నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేసేవాళ్ళం.
శ్యామల్రావ్ స్వార్థం గురించీ "గెట్ రిచ్ క్విక్" మెంటాలిటీ గురించీ మాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అందరం అనుమానంగా మొఖాలు చూసుకున్నాం.
"నిజంగా మీరు చేయబోయేది అద్భుతమయిన సేవ సార్. రేపే మీ గురించి మా పేపర్లో హెడ్ లైన్స్ లాగించేస్తాను. "అనాథ పాపాలకు తాత- శ్యామల్రావ్ దాత" ఎలా వుంది?" అన్నాడు గోపాల్రావ్ శ్యామల్రావ్ స్పీచ్ కి కదిలిపోయి.
శ్యామల్రావ్ చిరునవ్వు నవ్వాడు.
"పరమ శివుడి అనుజ్ఞ మేరకు నిర్వహిస్తున్న ఈ మహోన్నత కార్యక్రమానికి ప్రచారం వద్దు నాయనా. అంతా ఈశ్వరేచ్చ!"
అంటూ ఆ పిల్లలందరినీ వరుసగా లైన్లో తీసుకెళ్ళిపోయాడు.
మేము మరి కాసేపటికి తర్వాత మా ఇంట్లో సమావేశమయ్యేసరికే జనార్ధన్ ఓ న్యూస్ తీసుకొచ్చాడు.
శ్యామల్రావ్ ఇంటికి అపూర్వ ప్రేమాశ్రమం అన్న బోర్డు పెట్టారుట.
"తమాషాగా ఉందే. ఒకవేళ శ్యామల్రావ్ నిజంగానే నిస్వార్థపరుడిగా మారలేదు కదా?" అడిగాను నేను.
"అది మాత్రం నేను నమ్మను" అన్నాడు శాయిరామ్.
"అవును. మేమూ నమ్మం." అన్నారు మిగతావాళ్ళు.
"మారకపోతే మరి అంతమంది పిల్లలకు భోజనం ఎలా పెడతాడు?" అడిగాడు రంగారెడ్డి.