అతని పెదవులు, ఆమె పెదవుల్ని ఆక్రమించుకోబోతున్నాయి. గ్రహించింది.
"నో నో నో!'
పెద్ద కేక తెలివితప్పి ప్రక్కకు వాలిపోయింది.
7
ఇంట్లోంచి చుట్టాలింకా వెళ్ళిపోలేదు. గిరిజ క్రిందకు దిగివస్తుంటే ఆమె ముఖంకేసి పరిశీలనగా చూస్తూ వరసైన వాళ్ళందరూ తెగ పరాచికాలాడారు. అలాంటి సందర్భాలలో వాడే పరిభాష ఒకటుంది. ఆ భాష గుప్పించేశారు. గిరిజకు మహా చిరాకేసింది. అసలే రాత్రిపడిన సంఘర్షణకు విపరీతమైన తలనొప్పిగా వుంది. వాళ్ళను ప్రయత్నంమీద తప్పించుకుని దూరంగా తొలగి పోసాగింది.
ఆమె స్నానం చేసి యివతలకు వస్తూండగా లోపల గదిలోంచి సత్యవతక్కయ్య పెడుతున్న ఆక్రందనల్లాంటివి వినిపిస్తున్నాయి.
ఈ అరుపులు, మూలుగులు గిరిజకు చిరపరిచితమైనవే. సంవత్సరాల తరబడి, సంవత్సరానికెన్నోసార్లు చొప్పున ఆ ఇంటిగదుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కూతుళ్ళ పురుళ్ళు, కోడళ్ళ పురుళ్ళు, చుట్టాల పురుళ్ళు, మైల, బారసాల ఈ తతంగాలతో ఆ ఇంటిచరిత్ర నిండిపోయివుంది.
"సత్యవతక్కయ్యకు నొప్పులొస్తున్నాయి" అనుకుంది.
"ఇహ కంటుంది పిల్లాడ్నో, పిల్లనో వాడో అదో పుడుతూనే ఓ వరసకూడా ఈ భూమ్మీద సిద్దంగా, రెడీమేడ్ గా వుంటుంది."
సత్యవతి కేకలతో యిల్లదరగొట్టేస్తుంది.
ఆమెకు ప్రతిసారీ ఇది మామూలే. ఇరుగుపొరుగువాళ్ళందరూ ఈ యింట్లో ఏదో చోద్యం జరుగుతూందని అపోహపడే పరిస్థితికి తీసుకొచ్చి, పెద్ద రభస చేసేంతవరకు తన ప్రసవవేదన పూర్తికానివ్వదు.
పుండరీకాక్షయ్యగారు ఎక్కడ్నుంచో కేకలు పెడుతున్నారు. "త్వరగా వెళ్ళి మంత్రసానిని పిల్చుకురండర్రా! ఎవరూ కదలరేం? ఒరేయ్ చిట్టబ్బాయ్! నువ్వెళ్ళు, ఊఁ!"
మన్మథరావు అప్పటికింకా స్నానం చెయ్యలేదు. రాత్రి వేసుకున్న పైజమా, చొక్కాతో వున్నాడు. సైకిలు బయటకు తీసి ఆదరాబాదరగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
అనసూయమ్మగారు కూతురి ప్రక్కన కూర్చుని అనునయపరుస్తోంది.
గిరిజ చిన్నొదిన గదిలోకి వెళ్ళింది.
సామ్రాజ్యం మంచంమీద గోడవైపు తిరిగి పడుకుంది.
"వదినా?"
సామ్రాజ్యం కుతూహలంగా గిరిజలో కొత్తదనం వెదుకుతోంది చిలిపి కళ్ళతో గిరిజ పట్టుబడకూడదనుకుంటోంది.
"ఎలా వుంది వదినా వంట్లో?"
సామ్రాజ్యం నవ్వింది. ఆ నవ్వులో విషాదమూలేదు, ఏ ముభావమూ లేదు.
"కొందరి విషయంలో వాళ్ళు అనారోగ్యంగా వుంటే ఆశ్చర్యపడకూడదు. బావుంటే ఆశ్చర్యపడాలి. ఓ శుభదినం చూచుకుని నేనే ప్రకటిస్తాను ఈరోజు నా ఆరోగ్యం దివ్యంగా వుందని కాని ఎప్పుడో ఆరోజు!"
ఎప్పుడో ఆ రోజు...
వదిన గొంతు తొణక్కపోయినా మరదలి తనువు వణకింది.
"వదిన!" అంటూ దగ్గరకొచ్చింది.
"ఉహుఁ! చాలదు. ఇలా వచ్చి నా ప్రక్కనే కూర్చోవాలి"
గిరిజ కరిగిపోయినట్లయి వదిన ప్రక్కనే మంచంమీద కూర్చుంది. సామ్రాజ్యం ఆమెచేతుల్ని తనచేతుల్లోకి తీసుకుంది. ఆమెకళ్ళు గిరిజ ముఖాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
"బేబీ! కొత్తగా కనబడటం లేదేం?" గిరిజ ముఖం వెలవెలబోయింది.
"పెళ్ళయిన వాళ్ళందరూ కొత్తగా కనబడాలని వుందా వదినా"
"పెళ్ళయ్యాక కొంత కొత్తదనం... తర్వాత అంటే ఆ.... ఆ తర్వాత ఇంకా కొంత కొత్తదనం."
"పో వదినా! నువ్వు కొంటెవి."
"కొంటెతనంలో కూడా ఒక్కోసారి నిజాయితీ చాలా వుంటుంది. బేబీ! సిగ్గువిడిచి ఓ సంగతి చెప్పనా? అద్దంముందు నిలబడి నాలోని కొత్త అందాలు చూసుకోవాలని ఎంతగానో కలలుగన్నాను. ఆ కలలన్నీ కల్లలేనని నీకు వేరే చెప్పక్కర్లేదు. అప్పట్నుంచీ నాలో చూసుకోలేని కొత్తదనం యితరుల్లో చూడటం సరదా బేబీ! అది నువ్వు అల్పత్వం అంటే అనొచ్చు కాని, యివేళ నీలో నేననుకున్నది చూడలేకపోతే అసహజంగా వుంది. ఈ అసహజత్వం నాకు బాధ కలిగిస్తోంది బేబీ!"
గిరిజ ఏమీ మాట్లాడలేదు. ఆమెచూపులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
"బేబీ! నిజం చెప్పు."
ఉలిక్కిపడింది. "ఏమిటొదినా? ఎలా?"
"నేననుకున్నట్లు."
"నిజంగా నాకేం తెలీటం లేదొదినా నేనతీతమైన దాన్ననటంలేదు. అందరిలా మాత్రం మసులుకోలేకపోతున్నాను. అది నా తప్పు కావచ్చు"
"తప్పని తెలిసే ఎందుకు తప్పించుకోలేకపోయావు?"
"నాలో చెలరేగే భావాలు, నన్ను సతమతం చేస్తోన్న ఆలోచనలు నీతో చెబితే వెర్రిదానిక్రింద జమకడతావు. కాని నీతోతప్ప ఎవరితో చెప్పలేను వదినా! ఈ సంగతులు ఎవరితో చెప్పకూడదు" గిరిజ తనచేతిని ఆమె చేతిలోనుంచి విడిపించుకుని, మళ్ళీ ముందుకు జాచింది.