"ఒట్టు" అంటూ సామ్రాజ్యం చేతిలో చెయ్యేసింది.
"ప్రకృతికి విరుద్దంగా పోరాడాలనీ, పోరాడగల శక్తి నాకుందని నేననుకోవటంలేదొదినా కాని నా మనస్సుకు విరుద్దంగా మాత్రం నడుచుకోలేక పోతున్నాను. బావ నాకు భర్తగా కనబడటంలేదు."
"బేబీ!" సామ్రాజ్యం తృళ్ళిపడి అరిచింది. "నీకేం దెయ్యం పట్టింది?"
"అవునొదినా! నాకు దెయ్యంపట్టింది. అందుకే ఎన్నడూ తెలియని ఈ ఆలోచనలు నన్ను నలిపేస్తున్నాయి. బావ నాకు కేవలం ఓ రక్తబంధువులా కనిపిస్తున్నాడు. నన్ను చలింపచేసే ఒక పురుషుడిగా, తియ్యదనం చిలికించే ఓ ప్రేమికుడిగా కనబడటంలేదు. అతని స్పర్శ నాకే అనుభూతినీ యివ్వటం లేదు నిన్ను ముట్టుకుంటే ఎలా వుందో, మా అమ్మనీ, నాన్ననీ ముట్టుకుంటే ఎలా వుందో, యశోదత్తయ్యను ముట్టుకుంటే ఎలా వుందో అంతే! అలా మాత్రమే వుంది. అతన్లో నాకేం థ్రిల్ లేదు. వివశత్వం లేదు అతన్ని చూస్తే నాలో పులకరింతలూ లేవు అతనెవరు! మీరంతా అన్నారు కాబట్టి, తాళి గట్టాడు కాబట్టి భర్త కాని నేనెంత ఆత్మవంచన చేసుకుని పదింతలు దిగజారి పోయినా ఆ భావం నాలో కలగటంలేదు. మీ అందరిలా నేను కన్విన్స్ కాలేకపోయాను నా దురదృష్టం వదినా."
గిరిజముఖం ఎరుపెక్కింది. కళ్ళు రక్తారుణిమ దాల్చాయి. కోపం ఎంత ఎర్రగా వుంటుందో వర్ణించలేని దుఃఖంకూడా అంతే ఎర్రగా వుంటుంది.
"బేబి! నీకు పుణ్యముంటుంది. అలాంటి ఆలోచనలు నీ మనసులోంచి చెరిపెయ్యి నీలో స్వార్ధాన్ని పెంచుకుని ఆ వింతభావాలని ముక్కలు ముక్కలుగా నిర్దాక్షిణ్యంగా చంపెయ్యి."
"నాకు చేతకావటంలేదు వదినా! నేను చిరిగిపోతున్నాను కాని అతని ఆలోచనలు పెరిగిపోతున్నాయి."
"వద్దు బేబీ! వద్దు తక్షణం వాటిని అణిచెయ్యి ఏ సంబంధ బాంధవ్యాలని చూసి మేమంతా మధురాలోచన్లతో మునిగిపోతున్నామో వాటిని చూసి నువ్వు వణికిపోతున్నావు. వేటిని స్మరించి మేము పులకించిపోతున్నామో నువ్వు వాటికి ఝడిసి దూరంగా పారిపోతున్నావు. వాటిలో తియ్యదనం మేమాస్వాదిస్తున్నాము. చప్పదనం తప్ప నువ్వేం పొందటంలేదు బేబీ! ఇది నా సమస్య మాత్రమే కాదు. ఇవాళ్టి రేపటి సమస్యే కాదు. తరతరాల చరిత్ర, యుగ యుగాల చరిత్ర ప్రపంచంలో ఎన్నో జాతులచరిత్ర మన ఇతిహాసాలు, పురాణాలు, సంస్కృతి అన్నీ ఇందులో ముడిపెట్టబడి వున్నాయి. బేబీ! నీ కాళ్ళు పట్టుకుంటాను. దయయుంచి ఈ వందల, వేల సంవత్సరాల చరిత్ర లోని మాధుర్యాన్ని నీ అవకతవక ఆలోచనలతో కలుషితం చెయ్యటానికి ప్రయత్నించకు."
ఆమె ఆవేశానికి తెల్లబోయింది కాని, ఆవేశంలోని నిజాయితీకి ముగ్ధురాలై జోహార్లర్పించక తప్పలేదు. మనిషి మంచిపని చెయ్యనీ, చెడుపని చెయ్యనీ అతని ఆలోచనలు అంతరంగం చదరంగం కాకుండా నిజాయితీ కేంద్రం అయినప్పుడు ఆ వ్యక్తిత్వానికి తలవంచి తీరాల్సిందే.
అయితే రెండు వ్యక్తిత్వాలు ఒకదానితో ఒకటి పోటీపడినప్పుడు పరస్పర అభినందన ప్రలోభంలోంచి బయటపడి నిజరూపాలు ఎప్పటికప్పుడు ఢీకొంటూ వుంటాయి.
ఆ రోజు దురదృష్టవశాత్తూ సామ్రాజ్యం రోగగ్రస్తురాలు అందువల్ల మంచానపడి వుండే మాట్లాడగలుగుతోంది.
"వదినా! ప్రపంచమంతా ఏకంకానీ, ఒకేదార్న నడవనీ, ఘోషించనీ, ఎక్కడో ఒకచోట ఒక కంఠం నాలా ఆర్తనాదం చెయ్యకూడదా?"
"వీల్లేదు కొన్ని విషయాలలో వీల్లేదు."
"అంటే నువ్వు చెప్పిన కొన్ని విషయాలలో మనిషే అసలు ఆలోచించటానికి వీల్లేదా?"
"వీల్లేదు, వీల్లేదు."
"వదినా! నాకీ విషయం చెప్పు అమ్మ చెల్లెలు పిన్ని అవుతుంది. పిన్ని కొడుకుగాని, కూతురుగాని అన్నో తమ్ముడో, అక్కో చెల్లెలో అవుతారు. కాని నాన్న చెల్లెలు అత్తయ్య అవుతుంది. అత్తయ్య కొడుకు బావ అవుతాడు. నాన్నకీ అమ్మకీ ఏమిటీ తేడా?"
"తేడా వుంది. ఉండే వుంటుంది. మనకి తెలియకపోవచ్చు. మనకి అర్ధం కాకపోవచ్చు."
"చేసుకోవచ్చు అంతే! శాస్త్రాలు లిఖించాయి."
"ఓహో! నాన్న తమ్ముడు బాబాయి. తండ్రితో సమానం. అమ్మతమ్ముడు మాత్రం మేనమామ అంటే మొగుడితో సమానం."
"అవును అంతే అంతే"
"ఆ మేనమామ కొడుకు మళ్ళీ బావ అవుతాడు. అతన్ని చేసుకోవచ్చు. అంటే తండ్రిని చేసుకోవచ్చు. కొడుకునీ చేసుకోవచ్చు. ఇద్దరూ వరస అవుతారు. తండ్రి కొడుకూ ఇద్దరూ వరసే ఏం? అదేనా మీ శాస్త్రం?"
ఆమె మాటలు వింటూంటే సామ్రాజ్యానికి కోపం వచ్చింది, ఏడుపోచ్చింది, బాధ కలిగింది.
గిరిజమీద మళ్ళీ జాలేస్తుంది. ఆమె వింత ఆలోచనలు ఎలాంటి విపరీత పరిణామాలకి దారితీస్తాయో అని.
"బేబీ! నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ ధోరణి కట్టిపెట్టు నీ జీవితం ఏమయిపోతుందోనని నాకు భయంగా వుంది. బేబీ! నువ్వంటే నాకు ప్రాణం నువ్వు సుఖపడాలి. నువ్వందంగా వుంటావు, చదువుకొన్నదానివి. నాలాగా మంచాన పడివుండాల్సిన దురదృష్టం నీకేమీ లేదు. పనికిరాని వాటితో నీ మనస్సు పాడుచేసుకుని ఒడిదుడుకులతో నింపుకొనే హక్కు నీకేమి లేదు. నువ్వు సుఖపడాలి తెలిసిందా? నువ్వు సుఖపడాలి."
"నేను కష్టాన్ని కావాలని కోరుకొంటున్నానని నువ్వపోహ పడకు వదినా విషాదంలో థ్రిల్ ని అనుభవించే వింతమనస్తత్వం కాదు నాది. నిజాన్ని మాత్రం కాదనలేకపోతున్నాను."
"నువ్వనుకొంటున్నది నిజంకాదు."
"కనీసం నాకనిపిస్తుంది నిజం అవునా?"