Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 22


    
    తలవంచుకుని వుండటంవల్ల ముఖం కనబడటంలేదు. నల్లగా నిగనిగలాడే జుట్టూ, పొడుగాటి పూలజడా, చెవులకున్న ఎర్రదుద్దులూ అతడ్ని కవ్విస్తున్నాయి.
    
    "చూడు" అంటూ రెండుచేతులతో చెంపలదగ్గర పట్టుకుని బలవంతంగా ముఖం పైకి ఎత్తాడు.
    
    మిలమిలలాడే ఆమెకళ్ళలో జలజలా కన్నీరు.
    
    అదిరిపడ్డాడు. ఆ మాత్రం ఆలోచనా జ్ఞానం వుంటుంది.
    
    "బేబీ!" అన్నాడు బాధగా "బాధపెట్టానా?"
    
    లేదన్నట్లు తలవూపింది.
    
    "నేనంటే... నేనంటే ఇష్టంలేదా?"
    
    అదికాదన్నట్లు చూసింది.
    
    "మరేమిటో?"
    
    "ఏమీలేదు."
    
    "పోన్లే! పడుకుని హాయిగా నిద్రపో నిన్నేం ఇబ్బంది పెట్టనులే."
    
    "మీరు పడుకోండి నేను కాసేపలా కూర్చుంటాను."
    
    "మీరు" అతని పెదవులమీద చిరుహాసం ఉదయించి అంతలోనే అంతరించింది.
    
    బల్లమీద రకరకాల తినుబండారాలున్నాయి. గాజుగ్లాసునిండా పాలున్నాయి. పళ్ళెంనిండా పళ్ళున్నాయి. వాళ్ళింట్లో ఏంజరిగినా యధావిధిగా జరుగుతుంది.
    
    ఎవరూ వాటిజోలికి పోలేదు.
    
    ఆమెను గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నించటం ఇష్టంలేక, అతను మంచంమీదకు వచ్చి మెదలకుండా పడుకున్నాడు. ఉత్సాహమంతా చచ్చిపోయింది. పువ్వులు జల్లిన పక్క, పన్నీటి పరిమళాలు, గది నలుమూలలా అగరొత్తుల గుభాళింపు, జీవితంలో మొదటిసారిగా కోరుకున్న స్త్రీతో పొందుతూన్న ఏకాంతం ఆమె అందం, ఆమె వయస్సు, ఆమె యౌవనం, ఆమె కూర్చున్న భంగిమ అతని గుండెలో మంటలాంటిది బయల్దేరింది.
    
    ఆమెకూ అక్కడ కూర్చోవటం ఇష్టంలేదు. ఎక్కడన్నా ఒంటరిగా గడపాలనుకుంది. ఊరికినే ఆవేశపడటమేగాని, ఈ విశాల విశ్వంలో నలుగుర్నీ తప్పించుకుని ఒంటరిగా గడపటానికి చోటెక్కడ దొరుకుతుంది? అసలు జీవితమంతా ఏదో రూపంలో అంటిపెట్టుకునుండే మనుషుల్నించి తప్పించుకునేందుకు మాత్రం ఎలా సాధ్యమౌతుంది?
    
    చాలాసేపు సతమతమయ్యాక అతనికి మాగన్నుగా నిద్రపట్టింది.
    
    కళ్ళువిప్పి చూసేసరికి మంచంపట్టెనానుకుని ఆమె యింకా అలాగే కూర్చొని వుంది.
    
    "బేబీ!" అని పిలిచాడు.
    
    "ఊ" అన్నది కాని కదలలేదు. తలత్రిప్పి చూడలేదు.
    
    ఆమెవంక చూస్తూ నిశ్శబ్దంగా పడుకున్నాడు. మళ్ళీ పిలవలేదు.
    
    గోడనెక్కడా గడియారంలేదు. చేతికి వాచిలేదు. టైమెంతయిందో తెలియటం లేదు బహుశా తను పడుకుని ఓ గంటసేపయిందేమో అనుకున్నాడు.
    
    కొంతసేపటికి మళ్ళీ కునుకుపట్టింది.
    
    మెలకువ వచ్చేసరికి అర్దరాత్రి దాటివుంటుంది. గిరిజ అతని ప్రక్కనే సాధ్యమైనంత దూరంగా గోడవైపు తిరిగి పడుకునుంది. నిద్రపోతూందో, తెలివిగావుందో తెలియటంలేదు. గదిలో లైటు వెలుగుతూనే వుంది.
    
    అప్రయత్నంగా ఆమె వంటిమీద చెయ్యివేశాడు.
    
    ఏమిటిది? ఎందుకిలా జరుగుతోంది? తానెందుకు స్తబ్దుగా వుండాలి?
    
    కాలాన్నింత బరువుగా ఎందుకు గడవనివ్వాలి?
    
    క్షణంలో అతను వ్యామోహితుడయ్యాడు. అతని శరీరం పులకరించింది.
    
    ప్రక్కనే పడతి పద్దెనిమిదేళ్ళ పదునైన వయసులో, ఆ వయస్సుకు న్యాయం చేసే శరీరలావణ్యంతో అలంకారాలవల్ల యినుమడించిన శోభతో అతని పురుషత్వాన్ని రెచ్చకొట్టినట్లయింది.
    
    రెండోచేతినికూడా ముందుకుజాపి, ఆమెను పొదివిపట్టుకుని తనవైపు త్రిప్పుకున్నాడు.
    
    ఆమె అప్పుడే మేలుకుందో, అసలు మేలుకునేవుందో కళ్ళు విప్పి అతనివంక చూస్తోంది.
    
    ఆ చూపుల భావం అతను చదవదల్చుకోలేదు. అలాగే ఆమెను మీదకు లాక్కోబోయాడు.
    
    "ఎందుకు గొడవ? నేను స్త్రీని... స్త్రీని... అతని అర్ధాంగిని, లొంగిపోనా? లొంగిపోనా?" అనుకుంది.
    
    కాని...
    
    సినిమాహాల్లో ఆ అమ్మాయి అన్నమాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. "ఇతను మీ అన్నయ్యా? ఇతను మీ అన్నయ్యా?"
    
    తనని చుట్టుకున్న అతని చేతులు ఒక భర్త చేతులనిపించటంలేదు. ఏమిటి! యింత భయంకరమైన ఆలోచనలు.
    
    హారిబుల్.
    
    తనకూ, అతనికీ అంత పోలికలున్నాయా? తరతరాలనుంచీ యిరువంశాలలో ఒకేరక్తం ప్రవహిస్తోంది. అతన్లో తన్లో ఒకేరక్తం.
    
    ఎదురు తిరిగింది.
    
    అతని ముఖం ఆమె ముఖానికి చేరువగా వచ్చేస్తుంది.
    
    మరింత చైతన్యంలోకి వస్తూ ఆ వెలుగులో కళ్ళు వెడల్పు చేసుకొని అతన్ని అతన్లోకి చూసింది.
    
    ఎలాగో, ఎలాగో వున్నాడు. భర్తలా లేడు. లేనేలేడు. "బావ" అన్న ప్రియమైన పదం యింత అప్రియమైనదా! యుగ యుగాలనుండి 'బావ' అన్నస్థానానికి అంత ప్రాధాన్యతవుంటే, తనకేం జరిగింది? దెయ్యం పట్టిందా? ఎందుకు కాంప్రమైజ్ కాలేకపోతోంది. బావ! బావ!! బావ!!! చరిత్రలో కొన్ని లక్షలమంది బావలు భర్తలుగా రూపొందారు. వాళ్ళకేం జరిగింది? ఆమె కళ్ళముందు కొన్నివందల, వేల, లక్షల బావల ముఖాలు గిర్రున తిరుగుతున్నాయి. వలయంగా, వికటంగా నవ్వుతున్నాయి. అన్ని ముఖాలు, అన్ని పెదాలు...

 Previous Page Next Page