"యశస్వి చెప్పినా చాలు నేనూరికొస్తాను అనేసరికి నాకూ అనిపించింది."
"ఏమని?"
"నీ సరుకేమిటో తెలుసుకోనూ వచ్చు, అటు నువ్వు చెప్పేస్తే దాన్ని వూరికి రప్పించనూవచ్చని ఈ ప్రయోగం చేశావు. తెలిసిపోయింది."
"ఏంటో."
"నీ ఐక్యూ కే ఢోకా లేదని. యూ ఆర్ ఢిఫరెంట్ ఫ్రమ్ ది డిపార్ట్ మెంట్."
"థాంక్యూ" యశస్వి పెదవులమీద విడీవిడని నవ్వు. "అవును అసలు నీకు మా డిపార్టుమెంటుమీద ఎందుకు ఇంత చిన్నచూపు."
"ఎందుకంటే" నవ్వేసింది ఫకాలున. "మీలో ఎలాంటి మేధావులున్నారో ప్రాక్టికల్ గా చూసిందాన్ని కాబట్టి."
"ఏమి చూశావు" చిరుకోపంగా యశస్వి అడిగేసరికి అతడ్ని చేరి "కోపం తెచ్చుకోనంటే చెబుతాను" అంటూ భుజాలపై తలానించింది.
"ఓరోజు నేను ఫ్రిజ్ కొనాలని ఓ షాపుకెళ్ళాడు. అప్పటికే అక్కడ షాపు వాడికి ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కి పెద్ద గొడవ జరిగిపోతూంది. ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాను. ఆ ఫ్రిజ్ నాక్కావాలంటే ఎందుకమ్మవూ అని ఆయన అదే పోలీసాఫీసరు నిలదీస్తుంటే అదస్సలు నేను అమ్మనంటే అమ్మను అంటూ జవాబిస్తున్నాడు షాపు యజమాని. నాకదే కావాలంటూ పోలీసాఫీసరూ అది నేనమ్మనంటూ షాపువాడూ ఒకటే గొడవ. చుట్టూ జనం పోగయ్యారు. అప్పుడు గమనించాను పోలీసాఫీసరు వేలుపెట్టి చూపిస్తున్నదాన్ని..." క్షణం ఆగింది నవ్వాపుకోడానికన్నట్టు. "తీరా చూస్తే అది ఫ్రిజ్ కాదు."
"మరి."
"వాషింగ్ మిషన్ ."
ఈసారి నవ్వడం యశస్వి వంతయింది. " అంటే మావాళ్లకి ఫ్రిజ్ కి, వాషింగ్ మిషన్ కి తేడా తెలీదనా నువ్వు అనేది."
"అవును... చట్టానికి కళ్ళులేవు అన్నది నిజం కాబట్టి ఆ చట్టాన్ని కాపాడే మీకు సరిగ్గా కళ్ళుండవు అన్నది ఆరోజే బోధపడిపోయింది.
"ఎగ్జాగరేషన్ ఓ.కే. ఒకవేళ సరిగా చూడక వాషింగ్ మెషిన్ ఫ్రిజ్ అనుకున్నాడనుకో... షాపువాడు చెప్పొచ్చుగా."
"అస్సలు మీ పోలీసులకి అడగడమేగాని చెబితే వినే అలవాటుంటేగా. అందుకే చెప్పి చెప్పి అలసిపోయి ఆ పద్ధతిలో షాపువాడు ఆ పోలీసాఫీసర్ని పదమంది మధ్య ఫూల్ ని చేసుంటాడు."
"మేడమ్...ఇది నిజంగా జరిగింది కాదు."
"మరి."
"రీడర్స్ డైజెస్ట్ లో ఓ జోక్."
"గుడ్. నీ బుర్ర షార్ప్ గానే పనిచేస్తోంది."
"నాకూ అర్థమైంది."
"ఏమని?"
"అసలు వ్యవహారాన్ని దాటెయ్యాలని నువ్విలా టైం స్పెండ్ చేస్తున్నావని" ఆమె భుజాలపై సుతారంగా చేతులుంచి "మీ డాడీ వచ్చే టైమైపోతూంది" అన్నాడు.
"రానియ్... నీకు పరిచయమేగా."
"కాని మన పందెం సంగతి తెలీదుగా."
గభాలున దూరంగా జరిగింది. "అయితే మరచిపోలేదన్నమాట ఇంకా."
"ఐ.పి.సి. లో ఏ పోలీసాఫీసరూ మరిచిపోలేని సెక్షన్ నెంబర్లలో 375 ఒకటి."
"ఆ సెక్షను ఇప్పుడు అమలుచేద్దామనుకుంటే మీ ఉద్యోగం వూడుతుంది" ఆకతాయితనంగా మాట్లాడుతున్నా అతడి స్పర్శతో క్రమంగా వివశురాలైపోతూంది. బిడియంగా తలవంచుకున్నా బింకంగా అంది. "అయినా మనం అగ్రిమెంట్ ఏం రాసుకోలేదు."
"ఇట్స్ మోరల్ బైండింగ్."
"ఆ మోరల్ కోసమే పెళ్ళికి ముందు ఇలాంటివాటికి బైండింగ్ కాకూడదనుకుంటున్నాను" ఆమెను దగ్గరగా లాక్కోబోయేంతలో బూట్లు చప్పుడు వినిపించి దూరంగా జరిగిపోయాడు.
కంగారుగా వెనక్కి తిరిగిన యశస్వి హరితతండ్రి పాండురంగారావుని చూసి తొట్రుపడుతూ "గుడీవినింగ్ సర్" అన్నాడు.
"గుడీవినింగ్... ఏంటీ ఇంకా నిలబడేవున్నావు" ఒక పెద్ద పదవిలో వున్నా భేషజం లేని వ్యక్తాయన. చాలా వుత్సాహంగా మాట్లాడేస్తుంటాడు."
"నో... ఇదేం బాగోలేదమ్మా... ఇంటికొచ్చిన అతిథులను గౌరవించడం మన ధర్మం."
"కరెక్ట్ సర్... గౌరవంగా మాట నిలబెట్టుకుంటుందేమోనని అయిదు నిముషాలుగా చూస్తున్నాను."
ఆ మాటల్లోని నిగూఢతని అర్థంచేసుకున్న హరిత హడావుడి పడిపోయింది తండ్రెక్కడ గుర్తుపడతాడో అని.
"ఏమిటా" అడిగాడు పాండురంగారావు.
"అదేసర్... మీరు చెప్పినమాటే... రాగానే అతిథుల్ని ఏ సెక్షన్ ప్రకారం మర్యాద చేయాలో ఆ కోడాఫ్ కాండాక్ట్స్ మీద నచ్చచెబుతున్నాను. అప్పటికీ నిలబట్టి మాట్లాడుతూంది తప్ప మాట నిలబెట్టుకోవడంలేదు."
"సిగ్గులేకపోతేసరి" పంటిబిగువున కోపాన్ని అదిమి పెడుతూ నెమ్మదిగా అంది యశస్విని చూస్తూ.
"డాడీ" తండ్రిని సమీపించి "అదేంటో పాపం యశస్వి ఇందాకట్నుంచి మీ గురించి, షుగర్ ఫేక్టరీగురించి తెగ వర్రీడ్ గా మాట్లాడుతుంటే ఆ విషయాలు నాలు తెలీదూ మా డాడీ వచ్చాక ఆయన వివరంగా చెబుతారని నచ్చచెబుతున్నాను. ఇంతలో మీరెలాగూ వచ్చారు కాబట్టి ఇక నాకు ప్రాబ్లం తప్పింది" అంది.
యశస్వి తల పట్టుకున్నాడు.
పాండురంగారావు భడేలున నవ్వేసి "ఆ విషయాలు అమ్మాయికేం తెలుస్తాయి యశస్వి... అసలు ఈ చెరుకుధర వుంది చూశావూ" ఒక ఉత్తమ శ్రోత దొరికితేచాలు మెదడుని రోలర్స్ మధ్య చెరుకుగడలా నజ్జు చేసి తన అనుభవాలను చెప్పాలనుకునే ఆయనకి ఓ అద్భుతమైన అవకాశం చిక్కినట్టు అలవాటుగా ఉపన్యాసం మొదలుపెట్టాడు.
దొరికిపోయాననుకుంటూ సోఫాలో చతికిలబడిన యశస్వికి మరో అయిదు నిముషాలలో కాఫీ తీసుకొచ్చిన హరిత "గుడ్ నైట్" అంది రహస్యంగా.
హరితకీ తెలుసు డాడీ మద్దెలదరువు అర్థరాత్రిదాకా కొనసాగిపోతుందని.
* * *