నన్ను మీరు బ్లైండ్ గా నమ్ముతున్నందుకు...
శ్రీహర్ష అలా అన్నది అసంకల్పితంగా కాదు. జూలీకోసం తప్పనిసరి పరిస్థితిలో యిక్కడ వుండితీరాలన్న ఆలోచన వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవకముందే చాలా విచిత్రమైన అనుభవాల్ని అతడు ఎదుర్కొన్నాడు.
విదేశాలలో నేరవ్యవస్థలు చాలా స్పష్టంగా గుర్తించబడతాయి.
ఎవరేమిటి అన్నది సులభంగా బోధపడిపోతుంది.
` కాని యీ దేశంలో అలా కాదు...
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతలూ కనిపిస్తున్నారు. పతివ్రతలుండే ప్రాంతాల్లో వేశ్యలూ దర్శనమిస్తున్నారు. ఇదమిద్దంగా ఎవరు ఏ కేటగిరీకి చెందినవాళ్లో తెలుసుకోవడం బహుశా భారతదేశంలో సాధ్యంకాదేమో అని శ్రీహర్ష తలపోయడం యాదృచ్చికం కాదు.
"ఓ.కే మిస్టర్ శమంత్..." రెండు నిమిషాల తర్వాత అన్నాడు శ్రీహర్ష. "ఇక్కడి ప్రజాస్వామ్యం గురించి, ప్రజానాయకుల గురించి చాలా అద్భుతమయిన విశ్లేషణ అందించిన మీ మేధస్సుని అభినందించకుండా వుండలేకపోతున్నాను. ఇంత తెలిసిన మీరు ఎందుకిలా ఒంటరిపోరాటంతో అలసిపోతున్నారూ అని నిలదీయడంలేదు. ఐకెన్ అండర్ స్టాండ్. హిరణ్యకసిపుడు బెదిరించినా ప్రహ్లాదుడు హరినామస్మరణం ఆపడు. అది భక్తి కావచ్చు... బలహీనత కావచ్చు. మీరూ మీ నమ్మకాలని అలానే వేళ్ళాడుతూ బ్రతుకును కొనసాగించాలనుకుంటున్నారని అర్థమైంది. సో... నాకొక్క సహాయం చేయగలరా?"
"ఆదేశించండి..."
"అదేమిటి" విస్మయంగా చూసాడు శ్రీహర్ష.
"యస్ మిస్టర్ శ్రీహర్షా... ఒకరాత్రి నన్ను కాపాడటానికి అరచేతిని అడ్డం పెట్టిన మీరు నాకు అలా సాయం చేసినందుకు ఈరోజు మీ శరీరాన్ని గాయపరుచుకున్నారు. మీకు నేనే సహాయమైనా చేయడానికి సిద్ధమే.
ఎంతటి కృతజ్ఞత! నిజాయితీపరుడయిన యీ వ్యక్తి మనసుతో తనుచేసిన చిన్న సహాయానికి ఎంతటి మూల్యాన్నయినా చెల్లించాలనుకుంటున్నాడు.
ఒకవేళ ఇంటర్ పోల్ గాలిస్తున్న "షా" తనే అని తెలిస్తే.
"ఈరోజు ఉదయం షియోసోప్ కి సంబంధించిన ఓ ఏడ్ ఫిల్మ్ ని చూసాను."
"అందులో ఓపాప నటించింది."
"ఐనో" వెంటనే అన్నాడు శమంత్ "షి లుక్స్ ప్రెట్టీ"
ఆమె యెవరన్నదీ చెప్పలేదు "ఆ పాప వివరాలు కావాలి."
ఎందుకూ, యేమిటి అని అడగలేదు శమంత్. అప్పటికే శ్రీహర్షపై ఏర్పడ్డ అభిమానం అతడ్ని ఎంత ఉద్వేగపరిచిందీ అంటే వెంటనే బాంబేకి చెందిన ఓ ఏడ్ ఫిల్మ్ అధికారితో యస్.టి.డిలో మాట్లాడాడు.
సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత చెప్పాడు.
"ఆ పాప పేరు మున్నీ..."
"శ్రీహర్ష భృకుటి ముడిపడింది.
"ఆ తరువాత చాలా ఆఫర్స్ వచ్చినా పాప నటించలేదు. దానికి కారణం ఆమెను పెంచుకున్న రేష్మి.
"రేష్మి అంటే--"
"నిన్నగాక మొన్నటిదాకా దేశంలోనేగాక విదేశాలలో సహితం అగ్రశ్రేణి మోడలింగ్ ఆర్టిస్టుగా ప్రఖ్యాతి చెందిన తెలుగమ్మాయి. రెండేళ్ళ క్రితం మిస్ ఇండియా... ప్రస్తుతం ఆమె ఎక్కడుందో వివరాలు తెలీవు. కాని హఠాత్తుగా మోడలింగ్ వృత్తికి ఉద్వాసన చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది." అరక్షణం ఆగి అన్నాడు. "అయినా ఆ వివరాలు సాధించడం అంతకష్టం కాదు."
శ్రీహర్ష ఆలోచనల్లో మునిగివుండగానే పిలిచింది లల్లూ. "అంకుల్..."
లాలనగా చూసాడు.
"మున్నీ నాకంటే ముద్దొస్తుందా..."
"లేదమ్మా... నీ అంత ముద్దొస్తుంది" లల్లూని పైకెత్తుకున్నాడు.
"ఆ పాపంటే నీకంత యిష్టమా..."
జవాబు చెప్పలేకపోయాడు.
"నాకన్నానా" లల్లూలో అస్పష్టమైన ఉక్రోషం "అంటే మన ఫ్రెండ్ షిప్ కటిఫా"
"లేదమ్మా... మన స్నేహం అస్సలు కటిఫ్ కాదు."
ఈదేశంలో అడుగుపెట్టాక అణువంత వూరట చెందడానికి కారణమైన లల్లూని గాని, చెల్లిలా అన్నంపెట్టి సేదతీర్చిన ఆమె తల్లినిగాని ఎలా మరిచిపోగలడు!
"ప్రామిస్" రెట్టించింది.
ప్రమాణంలా చేతిని కలిపాడు.
"మరిక్కడే వుండిపోతావా."
అంకుల్ వెళ్ళిపోయి మరెవరో పాపతో స్నేహం చేయడం బొత్తిగా యిష్టం లేదు.
"వెళ్ళాలి లల్లూ."
"నా దగ్గరికి అస్సలు రావా"
"వస్తాను పిలవగానే".
"అంటే... దేవుడంకుల్లానా..." పిలవగానే ప్రత్యక్షమయ్యే దేవుడి కథని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అంది "ప్రామిస్".
చాలా నిజాయితీగా పాపకి హామీ యిచ్చాడు.
సరిగ్గా అదే సమయంలో...
రాణా లోపలికి దూసుకొచ్చాడు.
"మిస్టర్ శమంత్" రాణా రొప్పుతున్నాడు "రాజ్యం మరణానికి సంబంధించిన అతిముఖ్యమైన సమాచారం తెలిసింది."
"వ్వాట్"
"మహేంద్రపై మీ గెలుపుకి అవసరమయిన ఆధారాన్ని రాజ్యం నాకు పంపించింది."
శమంత్ ఉద్విగ్నంగా చూసాడు.
"రాణా ఓ కవరు అందించాడు."
రాణా పనిచేస్తున్న దినపత్రిక్కి అతడి పేరున పోస్ట్ చేయబడిన కవరది. దిగువ రాజ్యం సంతకం ఉంది.
"రాణాజీ..."
"నేనెవరో మీకు తెలియకపోయినా మీరు నాకు తెలుసు. ఎలా అంటే అప్పుడప్పుడూ మా క్లాస్ మేట్స్ చెప్పుకునేదాన్ని బట్టి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా మీరు చేసే సాహసం గురించి అందరూ అనుకుంటుంటే వినేదాన్ని తప్ప నాకూ మీ అవసరం యేర్పడుతుందనుకోలేదు. అంత చిన్న జీవితం నాది...
నిజం. వృద్ధాప్యంలో వున్న తండ్రి, ఇంకా నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు, పేదరికం, బ్రతుకుపోరాటం. వీటన్నిటినీ అధిగమించి బ్రతికేయాలన్న మొండితనం యివే నా జీవితానికి మూలపదార్థాలు. కాబట్టే అందరి ఆడపిల్లల్లా బ్రతకడం నాకు అలవాటు కాలేదు. అదికాదు. బ్రతకగలగడం అటుంచి అలా బ్రతకాలనుకోడం నాకు పెద్ద లగ్జరీలాంటిది. విచిత్రం చూసారా... నా యీడు పిల్లలకి సహజంగా వుండే కలలు నాకు లేవు. అది నా గొప్పతనం కాదు" నా చుట్టూవున్న పరిస్థితులు నన్నలా తయారుచేసాయి.