Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 24


    నిజం మాస్టారూ! నిన్నటిదాకా నిబ్బరంగా బ్రతికిన నాకు, యీ చివరి క్షణాలలో ఈ వాక్యాలు రాయడానికి ఎంత కలవరపడుతున్నదీ, అసలు ఎంత జుగుప్సాకరంగా కుమిలిపోతున్నదీ మీరాలోచించలేదు. ఉన్నదాన్ని కాకపోయినా సాంప్రదాయకమైన కుటుంబం. అభిమానంవున్నదానిగా పెరిగినదాన్ని...

 

    తెలివిగా వంచించబడ్డాను రాణాజీ. నాన్నకి అనారోగ్యంగా వుందని క్లాసులో కబురొస్తే గుండె చిక్క బట్టుకుంటూ రోడ్డుమీద అడుగుపెట్టాను. కనిపించని దేవుడిని మొక్కుకుంటూ వడివడిగా నడుస్తుంటే ప్రత్యక్షమయింది దేవుడు కాదు. నలుగురు కిరాతకులు. వూరుకోలేదు. వెంటపడ్డారు. పరుగెత్తాను. నన్ను రక్షిస్తున్నట్టు మరోవ్యక్తి నన్ను యింకోలా దగాచేసి మరెక్కడికో తీసుకువెళ్ళాడు.

 

    అన్నీ దేవుడి కథలే చెప్పిన నాన్న నాకు రాక్షసుల కథలెందుకు చెప్పలేదా అని కుమిలిపోతున్న క్షణాలలో దారుణంగా బలయిపోయాను. చైతన్యాన్ని నరాలుగా పేర్చుకున్న నా శరీరం అమానుషంగా పంకిలమై పోయింది. నాన్న నేర్పిన వేదాల ఘోషలు కలిగిన నా పెదవులు క్రూరంగా రక్తసిక్తమైపోయాయి. దానికి కారణం మహేంద్ర.

 

    అంతటితో సరిపెట్టినా సరిపుచ్చుకునేదాన్ని రాణాగారూ.

 

    కాని నా భగ్నమైన జీవిత దృశ్యాన్ని నాకు చూపించి అడిగినప్పుడల్లా అంగీకరించి తీరాలని పట్టుబట్టారు.

 

    అంతే. చావులాంటి బ్రతుకుతోనయినా రాజీపడిపోదామనుకున్నా. నాకు బ్రతుకుమీద పూర్తిగా ఆసక్తి చచ్చిపోయింది. అయినా ధైర్యంగా పోలీసులకి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ తర్వాత ప్రపంచం నామీద కురిపించే సానుభూతికిగాని, సరిదిద్దుకోలేని ఆ కళంకంతో నా వాళ్ళని నలుగురిముందు చులకనగా నిలబెట్టడంకాని నేను భరించలేను. కాబట్టి ఆ స్థితిలో ఆడది, అందులోనూ నాలాంటిఆడది కోరుకునేది తప్పుచేసిన వ్యక్తికి శిక్షకాదు విముక్తి. ఈ బ్రతుకు బంధాలనుంచి శాశ్వతమైన అజ్ఞాతవాసం.

 

    ఏ అగ్ని సరస్సు నన్ను పరిశుద్ధురాలిని చేస్తుందో నాకు తెలీదు. ఏ కొత్త నెత్తురుకు నేను మళ్ళీ మనిషిగా బ్రతగ్గాలనో అర్థంకాలేదు. అందుకే... అందుబాటులో వున్న సముద్రాన్ని గుర్తు చేసుకున్నాను. నాలోని బడబాగ్ని చల్లార్చుకోటానికి సముద్ర గర్భాన్ని యెన్నుకున్నాను.

 

    ఈ నిర్ణయం తీసుకున్నాక యిప్పుడెందుకు మీకు రాస్తున్నానూ అని మీరు నన్ను అడిగితే యిప్పుడయినా నేను చెప్పగలిగేది ఒక్కటే. ఈ రాక్షస రాజ్యంలో ఒక రాజ్యం కథ యిలా సమాధి అయినా పర్వాలేదు కాని మరో రాజ్యం అంతంకాకూడదు. ఆరిపోతున్న ఈ దీపం యింకో దీపం ఆరకుండా అణువంత ఉపకరించాలి. చివరిగా నా అభ్యర్థన మన్నించి నా కథ మీరు తెలుసుకోండి తప్ప నాన్నదాకా వెళ్ళనీకండి. ప్లీజ్--రాజ్యం"

 

    శమంత్ మొహం జేవురించిపోయింది.

 

    బ్రతికి పోరాడలేని రాజ్యం పోయి పోరాటానికి ఓ చిన్న ఆయుధాన్ని సమకూర్చి యిచ్చింది."

 

    ఓ అభాగినిగా రాలిపోయిన రాజ్యం చేసిన చివరసహాయం చాలు మహేంద్ర కథ ముగించడానికి.

 

    "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు" అడిగాడు రాణా.

 

    ఉద్విగ్నంగా అన్నాడు శమంత్ "మరణవాంగ్మూలంలాంటి ఈ ఉత్తరం చాలు రాణా. వెయిట్ అండ్ సి."

 

    పదిహేను నిముషాలకు యస్పి శ్యాంసుందర్ ఛాంబర్ లో అడుగుపెట్టాడు శమంత్.

 

    ఉత్తరాన్ని అందించి "ఇదోసారి చదవండి" అన్నాడు.

 

    ముందు పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా చదువుతుంటే క్రమంగా అతడి మొహంలో రంగులు మారిపోయాయి.

 

    శ్యామసుందర్ ఉత్తరాన్ని మడిచి సొరుగులో వుంచాడు.

 

    "ఇట్స్ గుడ్."

 

    "మహేంద్రను నేరస్థునిగా నిరూపించే నా ప్రయత్నానికి మీ సహాయం వుంటుందనుకుంటాను."

 

    ఏభై అయిదేళ్ళ వయసులో వున్న శ్యామ్ సుందర్ రియాక్ట్ కాలేదు. అంత సులభంగా రియాక్ట్ కావడానికి కష్టపడి కృషితో ఐపియస్ సంపాదించుకున్న మనిషి కాడతడు.

 

    "యు సీ మిస్టర్ శమంత్. చనిపోయిన ఓ అమ్మాయి రాసిన ఉత్తరం ఆధారంగా మహేంద్రని నేరస్థుడనలేం."

 

    ఇలాంటి జవాబుని శమంత్ ముందే వూహించాడు "అనలేం" కాని బ్రతికున్న మనం దాన్ని వాంగ్మూలంగా తీసుకోవచ్చు. నిజంగా అది రాసింది రాజ్యమో కాదో తెలుసుకోడానికి దస్తూరీని పరిశీలించొచ్చు.

 

    "డోంట్ వేస్ట్ యువర్ టైమ్."

 

    "సర్..."

 

    "మహేంద్రమీద వ్యక్తిగతమైన కక్ష మీకు ఆరోగ్యాన్నివ్వదు మిస్టర్ శమంత్."

 

    ఆ విషయం దాడిలో గాయపడ్డ నేను హాస్పటల్లో చేరాక మీ రెస్పాన్స్ తోనే బోధపడిపోయింది."

 

    "వాట్ డు యు మీన్" అసహనంగా చూసాడు యస్పి శ్యాంసుందర్ "మీమీద కలయబడ్డ ప్రతివాడూ మహేంద్ర మనుషులే అని నన్ను నమ్మమంటారా...?"

 

    "అది మీరు నమ్మకపోతే అంత సులభంగా అయిదుగుర్ని విడిచిపెట్టేవారు కాదు. ప్లీజ్ సర్. నన్ను మాట్లాడనివ్వండి.

 

    మీ డిపార్టుమెంటులో వున్న ఓ పోలీసు అధికారిపై హత్యా ప్రయత్నం చేసిన క్రిమినల్స్ ని అంత సులభంగా విడిచిపెట్టడంలో మీకున్న స్వార్థమేమిటని అడగటం లేదు. అవినీతిపరులయిన కొందరు పోలీసు అధికారుల మూలంగా మన డిపార్టుమెంట్ ఎంత భ్రష్టుపడుతుందో నేను ఏకరువు పెట్టడంలేదు. నా విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని నిశ్శబ్దంగా అంగీకరించినా రాజ్యం విషయంలో మీరు పట్టించుకోకపోయినా నేను నిశ్శబ్దంగా కూర్చోనంటున్నాను. ఏం చేయగలవు నేనుండగా అని మీరు అనొచ్చు. మీరు అడ్డంవున్నా నేను చాలా చేయగలనని నిరూపించబోతున్నాను. అలాంటప్పుడు మరి నాకెందుకు చెబుతున్నట్టు అని మీరు నన్ను నిలదీస్తే నా జవాబొక్కటే. ఈ జిల్లా పోలీసు యంత్రాంగానికి అధికారిగా మీకు కొన్ని వివరాలు ముందేతెలిస్తే రేపు సంఘానికి జవాబు చెప్పుకునే ఛాన్సు వుంటుందని నా ప్రయత్నం.

 

    "ఆగు" ఉక్రోషంగా అరిచాడు శ్యాంసుందర్.

 

    వెళ్ళబోయిన శమంత్ ఆగేడు "చెప్పండి."

 

    "డోంట్ ట్రై టుబి స్మార్టు."

 Previous Page Next Page