Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 22


    మాలతి వెటకారంగా నవ్వింది "బలహీనతలకు మారు పేర్లు పెట్టి వాటికి గొప్పతనం ఆపాదించకండి."

    "కానీ మనిషి కొందర్ని ఆరాధించకుండా వుండలేడని మరచిపోకండి!"

    మాలతి మళ్ళీ హేళనగా నవ్వింది "ప్రాణ స్నేహితుడి భార్యపట్ల ఆరాధన.....ఛీ!" అని లోపలకు వెళ్ళిపోయింది.

    శంకర్ జీవితంలో ఓడిపోయిన సన్నివేశాలు చాలాతక్కువ. అతన్లోని చమత్కారం, మెలకువ అతన్నెప్పుడూ విజయుడ్ని చేస్తూవుండేవి. కానీ ఇప్పుడు.....నల్లబడ్డ ముఖంతో లోపలకు పోబోతుండగా, అప్పుడే స్నానంచేసి బట్టలేసుకున్న శేఖర్ ఎదురుగా వచ్చాడు.

    "ఏరా అలా వున్నావేం?" అన్నాడు.

    "శేఖర్! నీకో విషయం చెప్పాలి."

    "అర్ధమయిందిలేరా! మా ఇంట్లోంచి నువ్వు  వెళ్లిపోవటం గురించేగా?"

    శంకర్ తెల్లబోయాడు "శేఖర్!?"

    శేఖర్ నవ్వాడు. "ఎలా తెలిసిందాని ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితిలో నేనుంటే అలానే ఆలోచిస్తాను కాబట్టి....."

    శంకర్ తేలిగ్గా ఊపిరి విడిచాడు. "అవున్రా. సరిగ్గా కనిపెట్టావు. మీ ఇంట్లో నేను వుంటే మీకిబ్బందని నేను వెళ్ళిపోవటంలేదు, నాకు ఇబ్బందనీ.."

    "అలాగా? ఏమిటోయ్ ఆ ఇబ్బంది?"

    "అలా ప్రశ్నిస్తే చెప్పలేను. నాకు కొన్ని అలవాట్లుంటాయి, ఛాదస్తాలుంటాయి, కొత్తచోటు, అవి నెరవేరవు."

    అతని ఆరోపణని శేఖర్ తేలిగ్గా కొట్టిపారేశాడు. "మహా దిగివచ్చావులేవోయ్ ఆకాశంనుంచి. ఒరేయ్ చెబుతున్నాను విను. మా ఇంట్లోవుండి నువ్వు యాతనలు అనుభవిస్తూ వుండవచ్చు, కాదనను. కానీ నువ్వు ఈ ఊళ్ళో ఉన్నంతకాలం వేరేచోట వుండే అధికారం మాత్రం నీకులేదు. ఎందుకంటే.....అదంతే......!"

    "శేఖర్! నామీద అంత నమ్మకం ఉంచకు. నేను స్మగ్లర్ని తెలుసా?"

    "అదెప్పుడో గ్రహించాను. ఆ దారినుంచి మళ్ళీంచాలంనే  నా ప్రయత్నం...."

    "మన ఇద్దరిజీవితాలూ అంతగా చేలగాటమాడుకోవటం మంచిది కాదేమో శేఖర్! అదీగాక నీకు నేనుచేసే అపకారానికయినా ఒక హద్దు పద్దూ వుండాలి."

    శేఖర్ పిచ్చి పట్టినట్లు నవ్వాడు. "అపకారమా? నువ్వా? నాకా?"

    "ఏం? నేనపకారం చెయ్యగలనని నమ్మలేకపోతున్నావా? నేను చాలా మామూలు మనిషిని. మరిచిపోకు."

    "నిజంగా మామూలు మనిషినా? అయితే అంతేనా? నాకపకారం చేసే శక్తి సామర్ధ్యాలు లేవని ఛాలెంజి చేస్తున్నాను. ఈ పందెంలో నేను ఓడిపోతే నీకు పదివేలిస్తాను, నేను గెలిస్తే నేవ్వేమీ ఇవ్వనక్కరలేదు."

                                           11
    సెలవుమీద సెలవు పొడిగించటం ఇష్టంలేక శేఖర్ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. అతనికి పెద్దలద్వారా సంక్రమించిన ఆస్తి కొంతవుంది. ఆరోగ్యం కుదుటపడ్డాక వీలు చూసుకుని స్వంతంగా బిజినెస్ ప్రారంభిద్దామని అతని ఉద్దేశం.

    భానుమతి వీలు దొరికినప్పుడల్లా మాలతి దగ్గరకు వస్తూనే వుంది.

    ఓసారి అడిగేసింది. "నిజంచెప్పు? మీ ఇద్దరిమధ్యా ఇంతవరకూ సంసార జీవితమంతా ఏమీ లేదు కదూ?"

    మాలతి ముఖం పాలిపోయింది. నవ్వడానికి ప్రయత్నం చేస్తూ "మాది ఆదర్శ దాంపత్యం."

    "మళ్ళీ చెప్పు?"

    మాలతి ఈసారి గర్వంగా అంది "మాది చాలా ఆదర్శవంతమైన  సంసారం."

    "నీ సంతృప్తికీ, గర్వానికీ చాలా అభినందిస్తున్నాను. అసూయకుడాపడుతున్నాను. నీ ప్రాతివ్రత్య ధర్మానికి ఆశ్చర్యపడుతున్నాను. నువ్వు నువ్వుగా శాశ్వతంగా నిలబడగలిగేతే నా ఓటమిని సంతోషంగా అంగీకరిస్తారు."

    "భానూ! నీ ఓటమికోసం కాదు నేను బ్రతికేది. నా గెలుపుకోసంకుడా కాదు, మానవతా ధర్మాన్ని పాటిస్తున్నాను."

    భానుమతి మనసారా నవ్వింది "మళ్ళీ ఓసారి అభినందిస్తున్నాను."

    "సరేగానీ నీగురించి చెప్పు?"

    "ఏముంది చెప్పడానికి?"

    "అంత ఒంటరిగా ఎలా వుండగలుగుతున్నావు?"

    "పిచ్చిదానా! ఈ విశాలప్రపంచంలో ఆడదనే వస్తువు వంటరిగా ఎలా వుంటుందే? అడుగుతీసి అడుగువేస్తేనే మనకు అక్కర్లేని తోడు బలవంతపు తాడు. వద్దనుకున్నా జిడ్డులా వదలని తోడు లభిస్తూనే వుంది కదా?"

    "అయితే నీకెన్ని తోడులు లభిమచాయేమిటి?"

    "చెప్పమంటావా? ఈమధ్య మన బాస్ మోహన్ లాల్ లేడూ? ఏదో కారణం చెప్పి డిన్నర్ కి పిలిచాడు. చంపుతానన్నాడు కదా అని వెళ్ళాను. ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళెవరూ లేరు. వాడి ఉద్దేశం అర్ధమయింది. అవకాశం వచ్చిందికదా అని విజృంభించటం మొదలు పెట్టాడు. గ్లాసులో విస్కియో, బ్రాందీయో పోసి త్రాగమన్నాడు. అలవాటుంటే అభ్యంతరం లేదుగానీ, లేదు కాబట్టి అక్కర్లేదన్నాను. వాడుమాత్రం పీకలదాకా త్రాగాడు. త్రాగామన్నంతసేపూ ఏదో ఒకటి వాగుతూనే వున్నాడు. ప్రక్కకి వచ్చి కూర్చున్నాడు, మీద చేతులు వేస్తున్నాడు. చివరకి ప్రక్కమీదకి లాగాడు...."       

    మాలతి ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. గజగజమని వణికిపోయినట్లయింది.

    "ఒక్కనిముషమాగండి.....అన్నట్లు మీకు రెండో భార్య కదూ?" అన్నాను.

    "అవును" అన్నాడు.

    "ఆవిడకెన్నేళ్ళుం టాయి?"

    "దాదాపు పాతిక."

    "అంటే వయసులో వున్నట్లే. ఇప్పుడెక్కడుంది?"

    "పుట్టింట్లో."

    "అక్కడ చాలామంది మగవాళ్ళు ఉండి వుంటారు కదూ?"

    "........ఆఁ కొంతమంది వుంటారు."

 "ఆ కొంతమందిలో ఎవరో ఒకరి కౌగిల్లో మీ శ్రీమతి ఇప్పుడు నలుగుతూ వుండవచ్చు కదా?"   

 Previous Page Next Page