Previous Page Next Page 
సాహసి పేజి 23


    తవ్వగా, తవ్వగా రైటేర్ కు మొదట కపాలం, ఆ తర్వాత లావా బూడిద దొరకడంతో, ఆ ప్రదేశంలోనే నిధి ఉంటుందని, ఇంకా ఉత్సాహంతో తవ్వకం సాగించారాయన. అలాంటి సమయంలో ఆయనకు ఒక విగ్రహం దొరికింది. అయిదువందల అడుగుల వెడల్పుతో ఒక అరమైలు పొడవునా తవ్వకాలు సాగాయి. గోతులు పక్కన గుట్టలు గుట్టలుగా లావా బూడిద ఏదో వేడిగా రావడంతో తల తిప్పి చూసిన రైటేర్ లావా బూడిద ప్రవాహమై సముద్రపు అలల్లా రావడంతో రైటర్ ఒళ్ళు కంపించింది. తను చనిపోవడం ఖాయం అని భయంతో చుట్టూ చూశాడు. అహనా అప్పుడు అక్కడలేదు అందిన విగ్రహాన్నే పట్టుకుని ప్రాణభయంతో పరుగెత్తాడు. కొన్ని మైళ్ళు దూరం వరకూ పరుగెత్తాక, అతనికి ఓ అడవి కనబడింది. అప్పటికి కానీ అతని ప్రాణం కుదటపడలేదు. అక్కడ తవ్వకాలు సాగించి ప్రాణాలతో బయటపడ్డవాడు. రైటేర్ ఒక్కడే! ఆ తర్వాత రైటేర్ మరి ఆ నిధి కోసం ప్రయత్నించలేదు... ఆ లావా పర్వతాల కింద ఇప్పటికీ బంగారు ఆభరణాలు అలాగే వున్నాయి. లావా అంటే ఏమిటి? అగ్ని... ఇన్ కాన్ వాసులకు దేవుడు అగ్ని ఆ అగ్నిదేవుడే, ఆ స్వర్ణ నిధిని ఇప్పటికీ కాపాడుతున్నాడని, ఆర్కియాలజిస్టులు కూడా ఇప్పటికీ నమ్మడం విశేషం. నన్నడిగావు చూడు... నిధికి కాపలా... ఉంటుందా... లేదా అని... ఆధ్యాత్మికతను నమ్మే భారతదేశంలోనే కాదు. శాస్త్రీయతను నమ్మె మిగతా ప్రపంచం కూడా సాల్వ్ చేయలేని ఇలాంటి వాటిని నమ్ముతుంది.

    శక్తులు, కాపలాలు... ఇవ్వే కాదు... నిధి అన్వేషణలో... జాగ్రత్తగా పరిశోధిస్తే... చాలా విషయాలు నీకు ప్రాక్టికల్ గా తెలుస్తాయి. చాలా రహస్యాలు కలిస్తేనే ఒక ప్రపంచం చాలా రహస్యాలు... పువ్వులా విడిపోవడం పరిశోధన" చెప్పడం ఆపాడు విశ్వరూపశర్మ.

    అక్కడితో ఆ చర్చ ముగిసింది.


                  *    *    *    *


    మర్నాడు రాత్రి-

    భోజనాలయ్యాక-

    "రేపు ఉదయాన్నే ప్రయాణం అనుకున్నారు. మనవాళ్ళింకా రాలేదేమిటి?" అన్నాడు కౌశికభూపతి.

    గోడ గడియారం వేపు చూసింది ఇందుమతి. పదిగంటలు దాటింది.

    "ఇక రావాలి" సింహద్వారం వైపు చూస్తూ అందామె.

    "ఫారెస్టు డిపార్ట్ మెంట్లో... ఫారెస్ట్ ఆఫీసర్... శంతనుకుమార్ కి ఫోన్ చేసి, మనం వస్తున్నామని చెప్పమన్నాను. ఆ విషయం నువ్వు కపాలేశ్వర్ కి చెప్పావా" గుర్తు చేశాడాయన.

    "చెప్పాను" అందామె.

    "నీకు కావలసిన వస్తువులు... పుస్తకాలు... దుస్తులు మందులు అన్నీ సర్దుకున్నావా" అడిగాడు కౌశికభూపతి.

    తలూపింది ఇందుమతి.

    "కౌశికా... రేపుదయం... మేం బయల్దేరతాం. మీకు సపర్యలు చెయ్యడానికి నా భార్య పరంజ్యోతి... ఇక్కడుంటుంది. అమ్మాయిని అడవిలోకి పంపించాక, ఆరునెలలు నేను ఫారెస్టు గెస్ట్ హౌస్ లో ఉంటాను. ఆ తర్వాత నేనొస్తాను. అవసరమైతే మళ్ళీ నేవెళ్తాను వెళుతున్నది... ఇందుమతి కాబట్టి... మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రాదని నా నమ్మకం" అని శర్మ అంటుండగా దూరంగా జీపు వస్తున్న చప్పుడైంది.

    "మన వాళ్ళేననుకుంటాను" ఆ మాట ఇందుమతి నోట్లోంచి వస్తున్నంతలోనే జీపు కోటలోకి ప్రవేశించింది.

    "యాహూ వచ్చేసాం" ఆ కేక యువరాజుది. లేచి నవ్వుకుంటూ, భవనం దాటి ప్రాంగణంలోకి అడుగుపెట్టింది ఇందుమతి.

    "మేడమ్ మొత్తం సరంజామాతో వచ్చేశాం. సాయంత్రానికే వచ్చేసేవాళ్ళం ఇదిగో వైశాలి చీరల షాపింగ్... మన ముత్యాలనాయుడు డాగ్ హంటింగ్... అందుకు లేటు" అంటూ జీపులో వున్న వస్తువులన్నిట్నీ ఒక్కొక్కటీ చూపించి ఆ లిస్టునీ, బిల్స్ నీ ఇందుమతికి అందించాడు యువరాజు.

    "అమ్మా... ఇందూ జాతికుక్క ఎలా వుంది" నల్లసింహంలా వున్న కుక్కని చూపిస్తూ అడిగాడు ముత్యాలనాయుడు.

    "తెచ్చినవాడ్నే... కరిచేలా వుంది" అంది నవ్వుతూ ఇందుమతి.

    "మంచి కుక్కమ్మా... శత్రువుని మైలు దూరంనుంచే... పసికడుతుంది" కుక్క తలని నిమురుతూ కితాబిచ్చాడు ముత్యాలనాయుడు.

    అందరూ భవనంలోకి-

    నడుస్తున్న సమయంలో వైశాలిని అడిగింది ఇందుమతి.

    "అవును మర్చిపోయాను. నిన్న రాత్రి... నువ్వెక్కడున్నావే"

    ఇందుమతి నుంచి, ఆ ప్రశ్నను ఊహించలేదు వైశాలి. గతుక్కుమంది. "యువరాజింట్లో... హి... ఈజ్ వెరీనైస్ మాన్" దూరంగా వున్న కపాలేశ్వర్ ని చూస్తూ అంది వైశాలి.

    "యువరాజు ఇంట్లోనా... ఆ ఒంటరి గదిలోనా" ఆశ్చర్యపోతూ అడిగింది ఇందుమతి.

    "యువరాజు రాత్రి ఇంట్లోనే లేడు. నన్నక్కడ దింపేసి... రాత్రంతా పనుల మీద తిరుగుతూనే వున్నాడు" చెప్పింది వైశాలి.

    అప్పటికిగానీ ఇందుమతి గుండె కుదుటపడలేదు.


                                        *    *    *    *


    ఉదయం సరిగ్గా 4.45 నిమిషాలైంది.

    విద్యుద్దీపాల వెలుగులో రాజభవనం, మిలమిలా మెరిసిపోతోంది. జీపులోని సామాన్లను సరి చూస్తున్నారు యువరాజు, కపాలేశ్వర్.

    సూరప్పడు, ఇందుమతి సూటుకేసు తెచ్చి జీపులో పెట్టాడు. పూజ గదిలోంచి వచ్చిన కౌశికభూపతి, ద్వారబంధానికి ఆనుకుని నిల్చున్నారు. పరంజ్యోతి వెంటరాగా, విశ్వరూపశర్మ తన గదిలోంచి బయటకొచ్చి, కౌశికభూపతిని చూస్తూ-

    "కౌశిక... మీ ఆరోగ్యం జాగ్రత్త..." నెమ్మదిగా అన్నాడు.

    "అమ్మాయి జాగ్రత్త... నీ చేతుల్లో పెడుతున్నాను" అన్నాడాయన. "దేవీబాల, దివ్యశక్తి సంపన్నురాలు మమ్మల్ని కనురెప్పల్లో ఉంచుకుని కాపాడేది అమ్మాయే... సాదాసీదాగా వెళుతున్న అమ్మాయి- ఆరునెలల్లో అపార నిధితో మహాలక్ష్మిలా వస్తుంది చూడు" అన్నాడు విశ్వరూపశర్మ.

    అదే సమయంలో లోపల్నుంచి వచ్చింది ఇందుమతి.

    తెల్లటి చీర, జాకెట్టుతో, నీలి జలపాతంలాంటి కురుల్తో... అప్పుడే తెల్ల కలువలోంచి, పుట్టిన లక్ష్మీదేవిలా కనిపించింది కౌశికభూపతికి. ఆ వెనుక వైశాలి.

    నేరుగా తండ్రివేపు నడిచి వంగి ఆయన పాదాలంటి "వెళ్ళొస్తాను నాన్నగారూ" అంది ఇందుమతి.

    వెళ్ళే ముందు, చాలా చెప్పాలని చాలా మాట్లాడాలని అనుకున్నాడాయన. అందుకు కారణం- ఇందుమతి తిరిగి వచ్చేటప్పటికి తనేమౌతానో నన్న భయమే!

    దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి-

    "శుభం... భూయాత్ ఇష్ట కమ్యార్ధ సిద్ధిరస్తు" ఆమె తల మీద అరచేతిలో నిమిరాడు.

    లేచి నిలబడి, ఇందుమతి తండ్రి కళ్ళల్లోకి చూసింది.

    ఆ కళ్ళల్లో తడి... కౌశికభూపతికి, కూతురు ముఖం మసక, మసగ్గా కనిపిస్తోంది. అలాంటి పరిస్థితిలోనే ఉంది ఇందుమతి కూడా. అందరూ జీపు దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నారు.

    సరిగ్గా అప్పుడు-

    కౌశికభూపతికి ఒక విషయం అతి ముఖ్యమయిన విషయం జ్ఞాపకానికి వచ్చింది.

    ఇందుమతి ముఖంవైపు ఒకసారి చూసి-

    "అమ్మా ఇందూ... అతి ముఖ్యమయిన విషయం- ఒక తండ్రిగా నీతో చెప్పకూడదు కానీ ఒక మహరాజుగా తప్పనిసరిగా చెప్పాలి... తప్పదు. జ్ఞాపకం ఉంచుకో... ఇది ఒక అనువంశిక ధర్మసూక్ష్మం... నీకు శత్రువుల వల్లగానీ, ఆటవిక జాతులవల్లగానీ, ప్రకృతివల్లగానీ... ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రాణానికి ప్రమాదం ఏర్పడినపుడు... ఏ ఆయుధాన్నీ నువ్వు ఆశ్రయించకు మహాశక్తి స్వరూపిణిని ధ్యానించుకో. నిన్ను నీవు ఆయుధంగా మలచుకో... ఎలాగో తెల్సా... ఇదొక పరమరహస్యం" అని ఆమె చెవిని దగ్గరగా తీసుకున్నాడాయన.

    మూడు నిముషాలు...

    ఆయన చెప్పిన ఆ పరమ రహస్యం వినగానే, ఇందుమతి వంటికి చిరుచెమట్లు పట్టేశాయి.

    అప్పుడు ఇందుమతికి, కౌశికభూపతి ఒక తండ్రిలా ఒక పురుషుడిలా కన్పించలేదు.

    అనంతమైన రహస్యాన్ని తనలో దాచుకున్న ప్రకృతిలా కనిపించాడాయన. "ఉంటాను నాన్నగారూ" ముందుకు నడిచింది ఇందుమతి. కౌశికభూపతి కూడా ముందుకు నడుస్తున్న సమయంలో ఎదురొచ్చాడు ముత్యాలనాయుడు.  

    "వెళ్ళొస్తాను రాజావారు... నా జీవితంలో మిమ్మల్ని వదిలి ఉండడము ఇదే మొదటిసారి" కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ముత్యాలు.

    "నేను లేకపోయినా, నువ్వున్నావనే నమ్మకంతోనే, అమ్మాయిని పంపుతున్నాను... జాగ్రత్త సుమా!" 

    "అదేంటి బాబూ... అమ్మాయి ప్రాణానికి ప్రమాదం వస్తుందా ఈ నాయుడు బతికుండగా" అంటూ బొడ్డులోంచి చురకత్తిని తటాలున తీసి బొటనవేలికి గాటు పెట్టుకున్నాడు.

    చివ్వున చిమ్మింది రక్తం. ఆ రక్తంలో కౌశికభూపతి నుదుటున బొట్టు పెట్టి, తను బొట్టు పెట్టుకుని ఠీవిగా జీపువేపు నడిచాడు ముత్యాలనాయుడు. అతన్ని జాగిలం అనుసరించింది.

    సరిగ్గా-

    అయిదుగంటలైంది. తూర్పున సూర్యుడు, బంగారు కలశంలా మెరుస్తున్నాడు.

    జీపు కదిలింది.

    అదే సమయంలో-

    కోటలోని మహాశక్తి దేవాలయంలో గణ, గణమని గంటలు మోగుతున్నాయి. ఆ గంటల శబ్దానికి ఆశ్చర్యపోయారు కౌశికభూపతి. శుభసూచకంగా గంటలు కొట్టడానికి ఎవరూ లేరు! ఎవరూ లేకుండా గంటలు ఎలా మోగుతున్నాయి?!

    ఆశ్చర్యంగా ఉందాయనకు. ఆ సమయంలో గాలి కూడా వీచడం లేదు. రొద చేసుకుంటూ జీపు సింహద్వారం దాటి రోడ్డు మీద అడుగు పెట్టింది.

    కనుమరుగైపోతున్న జీపువేపు, జీపులోని ఇందుమతివేపు అలా చూస్తుండిపోయారు కౌశికభూపతి.

   
                                           *    *    *    *


    ఎనిమిది గంటలు గడిచాయి.

    విజయనగరం నుంచి అరకు వెళ్ళే తాటిపూడి దారిలో తాటిపూడి రిజర్వాయర్ కు కిలోమీటరు దూరంలో ఆగింది జీపు. మనిషి సృష్టించిన జలపాతంలా దూరంగా రిజర్వాయరు.

    అటూ ఇటూ పంట పొలాలు... దూరంగా ఏదో పల్లె... ఒక వేపున కొండలు... కొండలకు అంచున ఫారెస్ట్ డిపార్టుమెంట్ చాలా అందంగా నిర్మించిన గెస్ట్ హౌస్.

    దూరం నుంచే ఆ గెస్ట్ హౌస్ నీ, ఆ గెస్ట్ హౌస్ ముందున్న జీపుని చూశాడు విశ్వరూపశర్మ.

 Previous Page Next Page