Previous Page Next Page 
సాహసి పేజి 22


    కాగితం, పెన్ను తీసుకుని కపాలేశ్వర్ ముందుకొచ్చాడు.

    "మనం అడవిలో వెళ్ళడానికి ఒక జీపు ముందు రాసుకో. తరువాత స్లీపింగ్ బేగ్స్, రైఫిల్స్, పిస్టల్స్, టార్చిలైట్లు, రైసు, గోధుమపిండి, టిన్ ఫుడ్, బిస్కెట్లు, జామ్స్ లాంటివి, బాండేజ్ క్లాత్, ఐరన్ రోప్, ఆర్డనరీ మౌంటనీరింగ్ రోప్స్, ఆక్సిజన్ బాటిల్స్, రేడియో, దిక్సూచి, రిస్ట్ వాచెస్. వీటితోపాటు ప్రాధమిక చికిత్సకు అవసరమైన మందులు ప్రాణాపాయ మందులు. కెమెరా... వచ్చేప్పుడు దారి మర్చిపోకుండా వుండేందుకు రెడ్ క్లాత్ ఐదారు మీటర్లు... డీజిల్ డ్రమ్ము, స్పేర్ టైర్, ట్యూబ్స్, కారు బ్యాటరీ, పవర్ ఫుల్ టార్చిలైట్స్, కేప్, క్రాప్ రబ్బర్ షూస్, కత్తులు, గొడ్డళ్ళు వీటితో ఏది మిస్ అయినా మధ్యలో యిబ్బంది పడిపోతారు. వైజాగ్- కొత్తరోడ్ దగ్గర... అడవుల్లోకి వెళ్ళే వాళ్ళకోసం, కొండలు గుట్టలు ఎక్కేవాళ్ళ కోసం, ఒక షాపుంది. అక్కడికి ఎవర్నయినా పంపించు. ఏం కావాలంటే అవి దొరుకుతాయి. ఆటోమెటిక్ టెంట్ లు దగ్గర్నుంచి టూలీ కిట్స్ వరకూ" చెప్పాడు విశ్వరూపశర్మ.

    "అయ్యా... మనకు బళ్ళేలూ, కుక్కలూ ఏం అవసరం లేదా?" అడిగాడు ముత్యాలనాయుడు.

    "దొరికితే మంచిదే. మన కోటలో పాత కత్తులూ, బళ్ళేలు ఏమైనా వుంటే తియ్యి. మంచి జాతి కుక్కని సంపాదించు. ఆ కుక్క ఎలా వుండాలో తెల్సా! అడవి సింహంలా వుండాలి"

    ఆ తర్వాత కౌశికభూపతి, విశ్వరూపశర్మ మధ్యాహ్న నిద్రకు వెళ్ళిపోయారు. ఎవరెవరు, ఏయే పనులు చెయ్యాలో పురమాయించింది ఇందుమతి.

    "జీపుతోనూ, మిగతా సరంజామాతోనూ, రేపు సాయంత్రానికల్లా వస్తాం" చెప్పాడు యువరాజు.

    "నాకవసరమైన మెటీరియల్ నేను తెచ్చుకుంటాను" చెప్పాడు కపాలేశ్వర్.

    "నేను కూడా వీళ్ళతో వెళ్తాను. ఇంటికి ఫోనుచేసి చెప్పాలికదా" అంది వైశాలి.

    "జాగిలాన్ని తేవడానికి నేనూ వెళతాను" ముత్యాలనాయుడు చెప్పాడు. కావలసిన, కొనాల్సిన వస్తువుల కోసం, ఎంత డబ్బవుతుందో అంచనా వేసి, ఆ డబ్బుని ముత్యాలనాయుడుకి ఇచ్చింది ఇందుమతి.

    కపాలేశ్వర్ చాలా హుషారుగా వున్నాడు. దానిక్కారణం వైశాలి. మొదటి చూపుతోనే వైశాలిని చూడగానే కోరికతో ఉక్కిరి బిక్కిరై పోయాడు. అరేబియా ఎడారి గుర్రాన్ని చూసిన కాంక్షకు లోనయ్యాడు.

    "అడవిలో ఆకులా- అలమటించిపోవాలనుకున్నాను- ఫర్వాలేదు. ఈ పిల్ల దొరికింది. ఈ పిల్లని ఇప్పట్నించే- కొంచెం- లైన్ లో పెట్టేస్తే- ఒక గొడవ వదిలిపోతుంది" మనసులోనే అనుకున్నాడు కపాలేశ్వర్.

    అందరూ కోట దగ్గిర్నించి వైజాగ్ కు బయలుదేరారు. రాజభవనంలో విశాలమైన టేబుల్ కి ఒక పక్కనున్న కుర్చీమీద కూర్చున్నాడు విశ్వరూపశర్మ.

    ఆయనకు అటూ ఇటూ కౌశికభూపతి, ఇందు కూర్చున్నారు. విశ్వరూపశర్మ నిశితంగా లాకెట్ లోని వస్తువుల్ని పరిశీలించాడు. ఆయన పక్కనే కొన్ని పాతకాలపు తాలూకు గ్రంథాలున్నాయి రిఫరెన్స్ కోసం.

    నవరత్నాల్ని ఒక పక్కగా పెట్టి, తోలు ముక్కని భూతద్దంలో పరిశీలిస్తున్నాడు. మధ్య మధ్యలో పెన్నుతో కాగితమ్మీద ఏదో రాసుకుంటున్నాడు. కొద్ది నిముషాలు అలా గడిచాయి.

    కొంత పరిశీలించాక తలెత్తి "చూసావా... ఇందూ... రాజరికపు వ్యవస్థలో ప్రతిదానికీ ఒక గుర్తింపు విలువా ఉంటాయి. ఈ తోలుముక్క మొదట, నవరత్నాల్ని పొట్లం కట్టడానికి ఉపయోగించారనుకున్నాను. కానీ కాదు ఈ తోలుముక్కే మనకు మార్గదర్శి. నిధి దారిని తెలిపే మ్యాప్... కానీ సగభాగం మాత్రమే ఉంది."

    ఆ మాటతో ఎలర్ట్ అయింది ఇందుమతి. దీర్ఘంగా ఆలోచించి, తనలో తను ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు విశ్వరూపశర్మ.

    "మనం నిధి అన్వేషణకు వెళ్ళే ముందు మొదట తెలుసుకోవలసింది నాలుగువందల సంవత్సరాల కాలచరిత్రని యాభై అరవై ఏళ్ళకే మన నగరాలు మన నాగరికత మన స్వరూప స్వభావాలు ఊహించినంత పెనువేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అడవుల సంగతి ఆలోచించు. వాగు సంగతి అక్కడ నివసించే మనుషుల సంగతి ఆలోచించు. ఒకప్పటి పెను జలపాతాలు ఎండిపోయి చిన్నవాగులు అయిపోయాయి అదే కాల మహిమ.

    ప్రీ హిస్టరీకి ముందు మనకు నాగరికత ఉందా అనే విషయంలో ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. 3000 బి.సి. నాటికే మనకో అద్భుతమయిన నాగరికత వెలిసిందని కొంతమంది తమ పరిశోధనల ద్వారా రుజువు చేశారు. మనిషి ఎప్పుడూ, ఎక్కడ ప్రపంచంలో మొట్టమొదట సెటిలయ్యాడు, నాగరికతను అభివృద్ధిచేశాడు అనే విషయంలో స్పష్టమయిన ఆధారాలు లేకపోయినప్పటికీ, ఒక గొప్ప నాగరికతతో వెలసిన దేశం మొత్తం కాలగర్భంలో కలిసిపోయిందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. అట్లాంటిక్ మహాసముద్ర భాగంలో ఒకప్పుడు అట్లాంటిస్ అనే మహానగరం ఉండేదట. అక్కడి ప్రజలు గొప్ప నాగరికతతో విలసిల్లారట. మహాసముద్రం మింగేసిన నాగరికతకు మునిగిపోయిన ఆ మహానగరం ఒక నిదర్శనం. మహానగరానికే సాక్ష్యాధారాలు లేనప్పుడు మామూలు వాటికెలా ఉంటాయి. అందుకే రాజులు, అద్భుతమయిన కాలజ్ఞానంతో భవిష్యత్ స్పృహతో ప్రవర్తించేవారు.

    అందుకు నిదర్శనం... ఈ నవరత్నాలు... ఈ తోలుముక్క- ఈ నవరత్నాలు దేనికి నిదర్శనమో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నా అంచనా ప్రకారం, ఈ నవరత్నాలు తొమ్మిది కొండలకు నిదర్శనం కొండల్ని గుర్తులుగా ఎంచుకోవడంలోనే, మీ పూర్వులు ఎంత పకడ్బందీగా నిధిని నిక్షిప్తంగా చేశారో అర్ధమౌతుంది.

    ఈ లాకెట్ దొరకడం ఇందులో ఈ వస్తువులు దొరకడం వల్ల తేలిన ఇంకో గొప్ప విషయం ఏమిటంటే నిధి అనేది ఖచ్చితంగా ఉందని" ఆ మాట చెప్పి సంతోషంగా నవ్వారాయన.

    ఆ మాటకు కౌశికభూపతి కళ్ళు ఆనందంతో చెమర్చాయి.

    "ఇక మేప్ సంగతి పరిశీలిద్దాం... ఇందులో గీతల్లా కనిపిస్తున్నవి గీతాలు కావు. మీ వంశ పురుషుడు... సూర్యుడు. సూర్యుడికి గుర్తు కాంతి. కాంతికి గుర్తు రేఖలు. ఇందులో కన్పిస్తున్న ఏడురేఖలు సప్తాశ్వాలకు అంటే సూర్యుడికి గుర్తు.

    నువ్వెళ్ళే దారిలో తొమ్మిది కొండల ప్రాంతం ఉంది. ఉంటుంది. అక్కడ సూర్యుడికి గుర్తు అంటే ఓ సూర్యదేవాలయం ఉండాలి. ఆ తర్వాత విషయానికి వస్తే ఈ రేఖల పక్కన ఎద్దు బుర్ర ఉంది. ఏనుగు దంతం వుంది. ఎద్దు బుర్ర, ఏనుగు దంతం, దేనికి గుర్తులు?" ఆలోచిస్తున్నాడాయన.

    "ఎద్దు బుర్ర అంటే... కొంతమంది గిరిజనులు, ముఖ్యంగా గిరిజన నాయకుడు... ఎద్దుబుర్రని తన శిరస్సు మీద అలంకరించుకుంటాడు. అది వారి రాచరికానికి గుర్తు" ఏదో జ్ఞాపకం చేసుకుంటూ చెప్పాడు కౌశికభూపతి.

    "వెరీగుడ్. ఇట్స్... కరెక్ట్... మరి ఏనుగు దంతం" అడిగాడు విశ్వరూపశర్మ.

    "ఏనుగు దంతం అంటే!"

    "ఆ ఏరియాలో ఏనుగు లెక్కువగా ఉంటాయేమో" అంది ఇందుమతి.

    "నీ పాయింట్ ఒక రకంగా కరెక్ట్ కావచ్చు. కానీ, కొన్ని గుర్తులు స్పాట్ కి వెళ్తేనేగానీ బయట పడవు" అన్నాడు విశ్వరూపశర్మ.

    ఆ మేప్ ని తీసుకొని పరిశీలించింది ఇందుమతి.

    "కోటల్లోనూ, అంతఃపురాల్లోనూ, అగడ్తల్లోనూ దాచిన నిధుల్ని- ఎలాగయినా సంపాదించొచ్చు. కానీ... అడవుల్లో దాచిన నిధుల్ని సంపాదించడం చాలా కష్టం. భుజ బలంతోపాటు, బుద్ధిబలాన్ని కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచాలి.

    మీ పూర్వులు అడవిలో ఎందుకు నిధిని దాచారు అన్నదానికి, చారిత్రక అంశాన్ని తోడుచేసి, పరిశీలిస్తే, శత్రురాజుల దండయాత్రలు ప్రకృతి వైపరీత్యాలు కారణంగా కనిపిస్తాయి... ఎప్పుడు దాడుల్తోనూ, యుద్ధాలతోనూ గడిపే రాజులు, తమ ప్రాణాపాయాన్ని ముందుగానే ఊహించి తమ భవిష్యత్ తరాల భవిష్యత్ ను ఊహించి- వారికి ఏ లోటు పాట్లూ రాకుండా జాగ్రత్తపడడమే ఇందుకు కారణము.

    ఆదిత్యభూపతి, ఈ నిధిని అడవుల్లో దాచడానికి కారణం, గిరిజన వనితను ఆయన వివాహం చేసుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఆ గిరిజన సంతతి ఆ నిధికి కాపలాగా ఉండి ఉండొచ్చు. ఇప్పటికీ, ఆ వారసులు ఆ నిధిని కాపాడుతున్నారని నా అనుమానం-

    కాగా, నిధిని ప్రక్షిప్తం చేసే సమయంలో ఆదిత్యభూపతి, ఆ గిరిజన యువతితోపాటు, ఆదిత్యభూపతికి సన్నిహితులైన వారు కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు. వారి తాలూకా వారు, తర్వాత కాలంలో ఆ నిధి కోసం ప్రయత్నించారా లేదా అన్నది అనుమానాస్పదమే. ఈ నిధి రహస్యం మీ నాన్నగారికి ఎందుకు తెలియలేదన్నది, ఇప్పటికీ నాకు బోధపడని రహస్యం"  

    "అందుకు ఒకటే కారణం. మా తండ్రికి వారి తండ్రిగారు తను చనిపోయే చివరి దశలో, ఆ నిధి రహస్యం చెప్పారు మా తండ్రిగారు- నాకా విషయం- చెప్పాలని అనుకొని ఉండొచ్చు. కానీ అకస్మాత్తుగా వారు చనిపోవడం వల్ల- నిధి రహస్యం- నాకు తెలియకుండా పోయింది" చెప్పారు కౌశికభూపతి.

    "అప్పట్లోనే, వారిని నేను అడగాలనుకున్నాను. కానీ- కొత్తగదా- అడిగితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని అడగడం మానేసాను"

    అప్పటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు విశ్వరూపశర్మ.

    "వంశానుపరంగా, మా తాతల తరం నుంచి, ఇప్పటివరకూ మాతో పాటు ఉంటున్నది అతి తక్కువమంది. వారికి ఈ నిధి రహస్యం తెలిసి ఉండకపోవచ్చు. అడవిలోకి వెళితేగానీ అసలు విషయాలు తెలీదు" అన్నారు కౌశికభూపతి.

    "నిధి బలి కోరుతుందంటారు. శక్తి ఎప్పుడూ నిధికి కాపలా ఉంటుందంటారు. వారసులు కాకుండా, ఇతరులు ఆ నిధి కోసం ప్రయత్నిస్తే... దారుణంగా చస్తారని అంటారు. నిజమేనా" అడిగింది ఇందుమతి.

    "నాకు తెలిసినంతవరకూ నిజమేనమ్మా... ప్రపంచ చరిత్రలో నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నిధులకోసం వెళ్ళినవారి చరిత్రని పరిశీలిస్తే ఎన్నో అపజయాలు, ఎన్నో దుర్మరణాలు, ఎన్నో దారుణ మరణాలు మన దృష్టికి వస్తాయి. ఒకసారి అమెరికాలో ఒక విచిత్రం జరిగింది. చాలామందికి అపూర్వమైన నిధిని చూడడమే అద్భుతమైన అనుభవం. కళ్ళారా చూసిన నిధి అకస్మాత్తుగా కనుల ముందు మాయమై పోవడం మరో గొప్ప అద్భుతం.

    ఇది నిజంగా జరిగిన సంఘటన. కొంతమంది ట్రెజర్ హంటర్స్ అష్టకష్టాలుపడి ఒక నిధిని కనుక్కున్నారు. మర్నాడు అదే ప్రదేశానికి వెళ్ళి చూడగా ఆ నిధి మాయమైపోయింది. ఇది నిజం. కానీ ఎవరూ నమ్మలేదు. వారసులు వెళితే ఆ అపూర్వనిది దక్కేదని అంటారు. నిజం కాదని అనగలమా?

    ప్రపంచ చరిత్రలో ఇన్ కాన్ నాగరికత గురించి నువ్వెప్పుడైనా విన్నావా? ప్రతి నిధి పరిశోధనకుడూ తెలుసుకోవాల్సిన చరిత్ర అది. ప్రపంచంలోని బంగారమంతా, ఒకప్పుడు ఇన్ కాన్ లోనే ఉండేది. ఒకసారి ఇన్ కాన్ మీద స్పానిష్ దాడి జరిగింది. ఆ సమయంలో ఇన్ కాన్ వాసులు తమ బంగారు రాసుల్ని, తాము అమితంగా ఆరాధించే ఎల్ సెంగీ అగ్ని పర్వతాలకు అర్పించారు. బహు విచిత్రమైన కథ ఇది. డాక్టర్ రైటేర్ అనే వ్యక్తి ఇన్ కాన్ నాగరికత మీద అపారమైన పరిశోధనలు చేశాడు.

    ఇన్ కాన్ నిధిని ఎలాగైనా స్వంతం చేసుకోవాలని, ఆర్కియాలజిస్టు డాక్టర్ రైటేర్, అహోరాత్రులు, కొన్నాళ్ళుగా శ్రమపడి ఆఖరికి ఎక్కడైతే బంగారు రాసులు దొరుకుతాయని భావించాడో అక్కడకు చేరాడు. తనకు దారి తెలియడం కోసం ఆయన అహానా, అనే ఒక గిరిజన యువతిని గైడ్ గా పెట్టుకున్నాడు.

    ఎల్ సెంగీ ప్రాంతంలో గాలింపులు జరుపగా, జరపగా ఒకరోజు అహానా ఒక ప్రదేశాన్ని చూపించి, ఇక్కడ వెతికితే నిధి దొరుకుతుందని చెప్పింది డాక్టర్ రైటేర్ పరిశోధన ప్రారంభించాడు. రైటేర్ తన తవ్వకాన్ని సాగిస్తున్న సమయంలో అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతాలు ఉండేవని, లావా బూడిదతో ప్రస్తుతం ఆ భూమంతా నిండిపోయిందని స్పష్టంగా గ్రహించాడు.

 Previous Page Next Page