Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 22


    ఒంటిని కూడదీసుకుంటూంది.
   
    తెల్లని పూలపై పసుపుపచ్చని రంగులో నల్లని అడ్డచారలతో ఇప్పుడు ఏ క్షణంలో అయినా కాటేయడానికి సిద్ధంగా వుంది.

    ఆరుకోట్ల ప్రజలను పాలించే ముఖ్యమంత్రి అయినా కట్లపాము ముందు నిలబడి తొట్రుపాటుతో కంపించిపోతున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసి "పా...పా..." అంటూ తడబాటుతో గొణుగుతుంటే అప్పుడు చూసాడు పియ్యే.

    కట్రారులా అయిపోయిన పియ్యే వెన్నులోనూ, చలి మొదలైన లిప్తలో అది ఒంటిని ప్రాకింది.

    ఏం చేయాలి...ఏ చిన్న అలికిడికైనా కాటేసేట్టున్న ఆ పాము నుంచి ముఖ్యమంత్రిని ఎలా రక్షించాలి.

    క్షణాలు టెన్షన్ గా గడిచిపోతున్నాయి.


                        *    *    *    *


    సరిగ్గా ఇదే సమయంలో...చీకటిగదిలో ఓ మూల కూచున్న డాక్టర్ సంఘమిత్ర నిస్త్రాణగా తలతిప్పి చూసాడు. అక్కడ తెరుచుకున్న ద్వారం క్రీనీడలో ఓ వ్యక్తి నిలబడివున్నాడు. "హౌ ఆర్యూ ప్రొఫెసర్" మొహం కనిపించడంలేదు. కాని గొంతు బొంగురుగా విలపించింది.

    సుమారు ఎనభై గంటలుగా ఆ గదిలో బంధించబడ్డ సంఘమిత్ర జవాబు చెప్పలేదు.

    నిరంతర పరిశోధనలో మునిగి కాలాన్నివెళ్ళబుచ్చే ఒక శాస్త్రజ్ఞుడు ఇలా పనిలేకుండా కూర్చోవడం ఎంత అలసటకి గురిచేసేది ఆ స్థితిలో వున్నవాళ్లు మాత్రమే తెలుసుకోగలిగే విషయం...

    బయట గదిలోనుంచి ఏటవాలుగా పడుతున్న వెలుగురేఖకి కళ్ళు ఇంకా అలవాటుపడనట్టు చిట్లించి చూస్తున్నాడు.

    మొదటిరోజు అపహరించుకు రాగానే అడిగాడు తను నిర్వహిస్తున్న ప్రయోగం ఫార్ములా పూర్తిగా వాళ్ళకు స్వాధీనం చేయమని.

    ఆ రాత్రి కాలేదూ అనుకున్న ప్రయోగం జయప్రదమైందీ అని చెప్పిందీ వాళ్ళే.

    అంతా విన్నాడుతప్ప మిగిలిన బ్లాక్ మాంబా విషంతో చేయాల్సిన చివరి ప్రయోగం గురించి చెప్పలేదు.

    "మనసు మార్చుకో డాక్టర్ మిత్రా"

    "వీలుకాదని ఆరోజే చెప్పాను మైడియర్ ఫ్రెండ్. నేను ఏ ప్రజల శ్రేయస్సుకోసం ఇన్నాళ్ళు శ్రమపడ్డానో ఆ ఫలితాన్ని మీ సొత్తు చేయలేను. దాన్ని మీరే విదేశాలకో అమ్ముకుంటానంటే నిశ్శబ్దంగా వూరుకోలేను" నిర్భయంగా అన్నాడు తానెలాంటి పరిణామానికైనా సిద్ధమే అన్నట్టు.

    "అది ప్రజలకోసమే అయినప్పుడు ఆ ఫార్ములాని మేం విదేశాలకి అమ్ముకుంటేనేం..."

    "అప్పుడది ఈనగాచి నక్కలపాలు చేసినట్టు అవుతుంది. నా శ్రమ నా ద్వారా నా ప్రజలకి ఫలితంగా మారాలి" ఓ క్షణం భావరహితంగా చూస్తూ అన్నాడు.

    "జంటిల్ మెన్...విదేశాలకి వెళ్ళిన ఆ ఫార్ములాతో అక్కడ తయారైన ఆ మందు ఆ తర్వాత ఇక్కడా దిగుమతి చేసుకుంటారుగా అని నువ్వనొచ్చు కాని అప్పుడది దిగుమతి చేసుకున్న మెడిసనుగా సామాన్యుడికి అందుబాటులో లేనంత ఖరీదుదై వుంటుంది. నా ఉద్దేశ్యం అదికాదు. నేను తయారుచేసిన ఆయింట్ మెంటు చాలా మామూలు ధరకి ఈ దేశంలో ప్రతి ఇంటా లభ్యం కావాలి."

    "అదే నీ చివరి మాటా..."

    "మొదటినుంచీ ఇదే మాటగా"

    "అయితే చస్తానంటావు" హెచ్చరికలా వినిపించింది." అయినా నిన్నంత సులభంగా చావనిస్తామా సంఘమిత్రా...నువ్వీదేశాన్ని ప్రేమించే ఘనతవహించిన దేశభక్తుడిగా ఒక్కసారేకాదు. ఇంతింతగా చచ్చే ఏర్పాట్లుచేసాం. ఆ ప్రయత్నంగ మా కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నాం. అటుచూడు" ద్వారానికి గడియపెట్టి లోపలికి వచ్చిన ఆ వ్యక్తి గోడకున్న ఓ కిటికీరెక్క తెరిచాడు.

    పక్కగదిలో విశాలమైన గ్లాస్ కేజ్ విద్యుద్దీపాల కాంతిలో వెలిగిపోతూంది.

    కేజ్ లో సుమారు అయిదడుగుల పొడవున్న గోధుమరంగు త్రాచుపాము పడగవిప్పి నిలబడివుంది. దానికి సమీపంలో డైమండ్ ఆకారపు పొడలతో లావుగా ప్రాకుతున్న రక్తపొడరస్సెల్ వైపర్ కనిపించింది.

    "అదేమిటో నీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటాను.

    "సర్పాలతో రెండు దశాబ్దాల పరిచయమున్నవాడ్ని మిత్రుడా... వాటిని చూసి బెదిరించాలనుకుంటున్నావా..." భావరహితంగా అన్నారాయన.

    "యూ ఆర్ ధరోలీ మిస్టేకెన్......నీకది చూపించింది నిన్ను ఎలా చంపబోతున్నదీ చెప్పడానిక్కాదు...నీ దేశభక్తి చెక్ చేయడానికి..."

    ముందు అర్ధంకాలేదు అతడు చెబుతున్నదేమిటో...

    ఒక లిప్త నిశ్శబ్దం.

    సాలోచనగా చీకటిలోకి తలతిప్పుకున్న ఆ వృద్ధుడికి ముందో ఆర్తనాదం వినిపించింది. గభాలన అటు చూసాడు.

    అక్కడ కేజ్ లో ఇప్పుడు ఆరేళ్ళ పసికందు వున్నాడు. లోనికి బలవంతంగా నెట్టబడినట్టు పాముల్ని చూస్తూ భయంతో గావుకేక పెడుతున్నాడు.

    "అంకుల్...నన్ను చంపొద్దు పాములు...చంపే..." చేతులు జోడించి ప్రార్దిస్తున్నాడు పక్కకి చూస్తూ.

    అప్పటికే ఆలస్యం చేసినట్లు నాగు ఆ పసివాడి చెంపపై దారుణంగా కాటేసింది.

    సగం తెగిన మెడతో ఓ మేక అరిచిన కేకలా వినిపించిందో మూలుగు.

    త్రాచు మరోకాటు వేయబోతుంటే భయంతో గ్లాసు కేజ్ ని దాటి పరుగెత్తబోయి ఇప్పుడు రక్తపింజరపై పడ్డాడు. ఇప్పుడు తనవంతు పని అదీ నిర్వర్తించింది.

    ఆ వృద్ధుడు కంపించిపోయాడు...లోతు కళ్ళ నుంచి నీళ్ళు స్రవిస్తున్నాయి ఆందోళనగా.

    నీరవనదీ తీరాన మొలిచి గాలికి కదిలే ఓ లేత గరిక దట్టమైన అడవి మధ్య దాగిన గూఢ రహస్యమై సమసిపోతూంది. ఏ తల్లి పొత్తిళ్ళలో అమ్మ జోలపాట వింటూ నిదురపోవాల్సిన వాడు పాముకాట్లతో పెనునిద్దురనుంచి లేచినట్టు చేతులు జోడించి రక్షించమని వేడుకుంటున్నాడు.

    ఆ పసికందు ఏడుపు ఇప్పుడు ఆర్తనాదాల్లా వినిపించడంలేదు. మృత్యువుకి పెట్టే మొరలా తననుతాను ఘటించుకునే శ్రద్ధాంజలిలా వుంది.

    చూడలేనట్టు దూరంగా జరిగిపోతుంటే ఫకాలున నవ్వాడు. సమీపంలో నిలబడ్డ వ్యక్తి... "దటీజ్ బ్లాక్ మాంబా... మిస్టర్ సంఘమిత్రా. ఈ ప్రయోగాలు ఇక్కడ ఆగవు. నీ ప్రయోగం నువ్వు ప్రారంభించేదాకా రోజుకో పసికందు ఇలా ఆహుతై పోతూనే వుంటారు. మిస్టర్ ఓల్డ్ మెన్ నమ్మలేకపోతున్నావు కదూ. మేం దేనికైనా తెగించిన మనుషులం. నువ్విక్కడ చీకటికొట్టులో మగ్గిపోతున్నావుగాని అక్కడ జంట నగరాల్లో మారణహోమం జరిగి పాముకాట్లతో ఇప్పటికే ఏభైదాకా చచ్చారు..." ఓ క్షణం తర్వాత ద్వారం దాటి వెళుతూ చివరగా అన్నాడు... "నీ దేశాన్ని నువ్వంతగా ప్రేమించే మనిషివే అయితే నీ కళ్ళముందే పసిపిల్లలిలా ప్రాణాలు కోల్పోతే సహించలేవు మిత్రా! ఓ తండ్రిలా ఆలోచించు...రేపు మరో పసికందు ప్రాణాలు పోవడానికి నువ్వు కారణం కాకు...మా ప్రపోజల్ అంగీకరించు."

    డాక్టర్ సంఘమిత్ర కళ్ళిప్పుడు నీళ్ళు వర్షించడంలేదు.

    తను వూహించని మరో ఆటవిక వ్యవస్థని చూస్తున్నాడు.

    అప్పటికే అక్కడ కేజ్ లో పసిపిల్లాడు ప్రాణాలు వదిలాడు. ఒకనాడు ఇలాగే పాముకాటుతో మరణించిన సంఘమిత్ర ఒక్కగానొక్క కొడుకులా.


                        *    *    *    *


    ముఖ్యమంత్రిగారు అలాగే నిలబడి వుండిపోయారు. ఇప్పుడతనికి ప్రజలు పదవీ గుర్తులేవు...ప్రతిపక్షాలూ దళితవర్గాలూ అసలు స్పురించడం లేదు.

    ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీని స్థితిలో లిప్తలు లెక్కపెడుతూ బ్రతికుండగానే ఆవిష్కరించబడిన విగ్రహంలా మారిపోయారు...

    సర్పం తల కదపలేదు...కాని ఒంటినంతా బయటికిలాగి అదీ ఓ దండలా తోకని నెమ్మదిగా అతడి మెడకి చుట్టేసింది.

    ఇప్పుడు కాటుకి చాలా కన్వినియంట్ గా వుంది.

    "చలికాలంలో సైతం చెమట్లు పట్టును" అని ఓ స్టేట్ మెంటివ్వడానికి అనుకూలంగా లీటర్లకొద్దీ స్వేదం ఒంటి నుంచి ప్రవహిస్తూంది.

    తెలుగు రాష్ట్రంలోగాని మొత్తం దేశంలోగానీ ఒక ముఖ్యమంత్రి ఇలాంటి క్లిష్టపరిస్థితిలో చిక్కుకోవడం తెలీని ప్రేక్షకులూ అవాక్కయి చూస్తున్నారు.

    నేలపై ముందు వరసలో కూచున్న ఓ మంత్రి వర్గపు సహచరుడు ముఖ్యమంత్రి పోతే ఇక మిగిలింది తనే కాబట్టి ఇంకా కాటేయని పాముని కసిగా చూస్తున్నాడు.

    అతడు నిన్న మొన్నదాకా ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతి పాత్రుడిలా నటించినవాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వాడూ అయిన ఆర్ధిక శాఖామంత్రి నాగరాజు.

 Previous Page Next Page