ఘర్షణలో జరుగుతున్న వారి మధ్యలోకి వచ్చాడు. "వ్యసనంలో న్యాయాన్ని కోరుకుంటున్నారు. మోసంలో నీతికోసం ప్రాకులాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. జరిగిన మోసానికి క్లబ్ కి సంబంధం వుండదని మీకు తెలుసు. క్లబ్ కి తెలియకుండా ఓనర్స్_టైనర్స్_జాకీలు బుక్ మేకర్స్ ఆడుతున్న చదరంగంలో అమాయకులైన క్లబ్ సిబ్బందికి సంబంధం ఏముంది....?" కొంత ఆవేశం తగ్గింది పంటర్స్ లో.... సిబ్బందిని వదిలేశారు.
ఎవర్ని న్యాయం అడగాలో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. మోసం జరిగింది. కొంతమంది పంటర్స్ భోరున ఏడ్చేస్తున్నారు.
"నెలాఖరు ఖర్చులకు దాచుకున్న డబ్బంతా తెచ్చేసాను. ఇప్పుడు నాకతేంటి....!" ఒకరు మా ఆవిడ గాజులు తాకట్టు పెట్టేసి ఎంతో జాగ్రత్తగా బెట్టింగ్ కాస్తే ఇలా చేసారు దొంగ వెధవలు" అని ఒకరు "ఫీజు కట్టడానికి మా నాన్న కష్టపడి పంపిన డబ్బు పోయిందే" అని ఓ స్టూడెంట్ వాపోతున్నారు.
"మీ పట్ల జాలిపడటం అవివేకం....ఎందుకేడుస్తారు....? ఇక్కడ ఎవరి సొమ్ము కుప్పలు పోసుందని తేరగా ఎత్తుకెళదామని వచ్చారు....? దురాశపరులైన మీకు న్యాయం కావాలా....? బుద్దుంటే రేపు రాకండి. మరెప్పుడూ ఈ వేపు రాకండి...." రావాలనుంటే ఈ రభస అనవసరం. వెళ్ళండి వెళ్ళిపోండి" గద్దించాడు శుక్రాచార్య.
అయోమయంగా శుక్రాచార్య వేపు పంటర్స్ చూస్తుండగానే శుక్రాచార్య వడివడిగా అంబులెన్స్ వేపు కదిలిపోయాడు. అంబులెన్స్ అప్పుడే బయలుదేరింది.
అక్కడే ఉన్న శశాంక వేపు, అశ్వని వేపు చూసాడు శుక్రాచార్య ప్రశ్నిస్తున్నట్లు.
"నీవేం కంగారు పడవద్దు, అతనికేం కాదు. అతని వెనుక శశాంక ఉన్నాడు అన్నాడు శశాంక గర్వంగా. మొఖంలో మోసంతో నెగ్గానన్న అనందం. అశ్వని మొఖంలో లీలామాత్రంగా ఆందోళన కనబడింది. అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాడు శుక్రాచార్య.
* * *
గాంధీ హాస్పిటల్ లో స్పెషల్ వార్డులో చేర్చబడ్డాడు అశ్వభరత్.
తగిలిన దెబ్బలు పెద్దవి కాకపోయినా షాక్ నుండి ఇంకా తేరుకోలేదు భరత్.
పక్కటెముకల దగ్గర చర్మం చీరుకు పోయింది.
భరత్ శశాంక తేజ్ దత్త మనిషిని ముందే శశాంక ఎస్టేట్ నుండి గాంధీ హాస్పిటల్ సూపర్నెంట్ కి ఫోన్ వెళ్ళటంతో__అన్ని ఏర్పాట్లు పకడ్భందీగా నిమిషాల్లో జరిగిపోయాయి.
గంట తరువాత శుక్రాచార్య భరత్ బెడ్ పక్కనున్నాడు. అశ్వని కూడా పక్కనే ఉంది. ఆమె అక్కడకు రావటం శుక్రాచార్యకు అయిష్టంగా ఉంది. కాని ఆ భావాన్ని బయటపడ నివ్వలేదు.
శుక్రాచార్య వచ్చిన అరగంటకు కాస్త కదిలాడు భరత్.
అది చూసి చెంగున లేచింది అశ్వని.
అక్కడి నుండి వరండాలోకి వచ్చింది. భరత్ కి స్పృహ రాబోతోందని డాక్టర్ కి చెప్పేందుకు.
శుక్రాచార్యకు ఆందోళనగా ఉంది. ఓ పక్క తన చావు దగ్గరవుతోంది. అలాంటి సమయంలో శశాంక వేసిన పథకానికి ఒప్పుకొన్నందువల్ల తన పని మరింత త్వరగా పూర్తవుద్దని తలూపాడు గాని దానివలన భరత్ ప్రమాదంలో ఇరుక్కుంటాడని ఊహించలేదు శుక్రాచార్య.
భరత్ కళ్ళు విప్పాడు. శుక్రాచార్య వేపు చూసి మౌనంగా చూపులతోనే విష్ చేశాడు.
శుక్రాచార్య ఆందోళన కాస్త తగ్గింది.
"ఎలా జరిగింది....?" అడిగాడు శుక్రాచార్య.
ఆశ్చర్యంగా చూసాడు భరత్.
భరత్ ఎందుకలా చూసాడో శుక్రాచార్యకు అర్ధంకాలేదు.
"ఎలా ఉందని కదా అడగాల్సింది" సౌమ్యంగా అడిగాడు భరత్.
చెళ్ళున కొట్టినట్టనిపించింది శుక్రాచార్యకు.
ఇబ్బందిగా పెట్టాడు మొహం.
అంతలోనే తేరుకున్నాడు.
"నీకేం కాలేదని తెలుసుకున్నాను. నాలుగు రోజుల్లో డిస్చార్జి అవుతావని చెప్పారు. అది తెలిసి ఎలా వుందని అడగటం మధ్యతరగతి మర్యాదే అవుతుంది. నిన్ను నీ ఆత్మసంతృప్తికోసం అలా పరామర్శించటం కన్నా నీకు మంచి ట్రీట్ మెంట్ ఇప్పించటం ముఖ్యం కాదా....?"
భరత్ నవ్వాడు మౌనంగా.
"మీనుంచి చాలా నేర్చుకోవాల్సుంది అంకుల్" అన్నాడు భరత్.
ఇక్కడ వీరి సంభాషణ ఇలా జరుగుతుండగా అక్కడ అశ్వని డాక్టరుని వెంటబెట్టుకొని వస్తోంది.
శుక్రాచార్య లేచాడు. డాక్టరు రావటం ఎందుకు లేటయిందని కనుక్కొనేందుకు.
వరండాలోకి వస్తూనే పక్కకు చూసిన శుక్రాచార్య షాక్ అయ్యారు.
ఓ క్షణం ఏం అర్ధంకాలేదు.
క్షణంలో వెయ్యోవంతులోపు తేరుకొని పక్కకు తప్పుకున్నాడు.
ఆ తప్పుకొన్నది ఎవరన్నది భరత్ ని అటెండ్ అయ్యేందుకు అశ్వని వెంట వస్తూన్న త్రివేణి దృష్టిలో పడలేదు.
* * *
జాక్ పాట్ లో 70,000 గెల్చుకున్న ఆనందరావు ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
ఆ ఆనందాన్ని తన స్కిల్ ని మెచ్చుకొని, తన సెలక్షన్ నమ్మని చక్రవర్తి ఇంటి తలుపు తట్టగానే శారద వచ్చి తలుపు తీసింది. ఎదురుగా వున్న ఆనందరావుని చూసి పక్కకు తప్పుకుందేగాని అతనిపట్ల తన విముఖత మోములో కనిపించకుండా జాగ్రత్తపడింది.
ఆనందరావు విషయమేమిటో చెప్పలేదు చక్రవర్తికి.
ముందు 70,000 తీసి చక్రవర్తికి చూపించాడు. ఆ డబ్బు చూసిన చక్రవర్తికి ఏం అర్ధంకాలేదు.
కాని సూచాయగా ఆనందరావుకి ఆ డబ్బు ఎలా వచ్చిందో ఊహించగలిగాడు. ఆ మరుక్షణం చక్రవర్తికి చాలా బాధ వేసింది. అసూయ కల్గింది.
ఎంతటి అసూయ అంటే ఆనందరావు గొంతు పిసికి, ఆ డబ్బు లాగేసుకుందామన్నంతగా.
శారద ఇచ్చిన కాఫీ తాగాక ఇద్దరు టెర్రస్ మీదకు వెళ్ళారు.
"చూసావా....నీవేం కోల్పోయావో...."
చెప్పమన్నట్లుగా చూసాడు చక్రవర్తి.
"నా సెలక్షన్ ఎంత గొప్పదో చూసావా...." ఐదు రేసుల్లో నేననుకున్న గుర్రాలే ఫస్టొచ్చాయి." గర్వంగా అన్నాడు ఆనందరావు.
నిభ్రంగా చూస్తుండిపోయాడు చక్రవర్తి.
ఆఖరి ఐదవ రేసులో తన సెలక్షన్ లో ఎంత రాంగ్ ఉందో ఆ రేసుకు ముందు జరుగుతుండగా ఎంతగా వాపోయాడో చెప్పలేనిది.
ఇద్దరు ఓనర్స్ ఆడిన నాటకం వల్లనే ప్లూక్ గా తన ఐదవ సెలక్షన్ సెట్ అయిందని చెప్పలేదు.
చక్రవర్తి ఇక్కడే మెత్తబడ్డాడు.
ఆనందరావు వేపు చూసాడు. నీవెంత తెలివిగలవాడినన్నట్లు ఆ చూపుల్ని ఆనందరావు గుర్తించగలిగాడు.
హఠాత్తుగా చక్రవర్తి లేచి మెట్లదాకా వెళ్ళి శారద అటుగాని వస్తుందేమోనని చెక్ చేసుకొని తిరిగొచ్చి ఆత్రంగా ఆనందరావు కుర్చీ మీదకు వంగాడు.
"రేపు నేను ఖాయం వస్తాను. తీసుకెళ్తావా....?"
"ఓకే....అసలు నిన్ను బాగుచేద్దామనే నా ఆలోచన. చూసావా కాస్తలో తప్పిపోయింది నీ అదృష్టం. ఈ 70,000 నీకు రావాల్సినవి గదా....?"
అవునన్నట్లుగా తలూపుతూ, నా పొరపాటే నన్నట్లుగా మొఖం పెట్టాడు చక్రవర్తి.
"సరే నేనొస్తాను...." లేచాడు ఆనందరావు. చక్రవర్తి ఆనందరావుని గేటుదాకా పంపించి అలాగే అతనివేపే చూస్తూ ఉండిపోయాడు.
అలా ఎంతసేపున్నాడో తెలియదు. శారద వచ్చి ఆప్యాయంగా లోపలకు పిలిచేంత వరకు స్పృహ లేదు.
ఇదేమి తెలియని శారద భర్తని లోనికి తీసుకెళ్ళింది.
"ఏంటలా ఉన్నారు....?"
అప్పుడిక అబద్ధం ఆడటానికి సంకోచించలేదు చక్రవర్తి, ముందు జారిపోయిన 70,000 అదృష్టం వెక్కిరిస్తోంది.
"ఏం లేదు....నా ఫ్రెండ్స్ మిసెస్ కి ఎలా ఉందోనని...." అన్నాడు.
శారద నమ్మేసింది.
"మీరెంత జాలిగుండె గలవారండి. బాధపడకండి. ఆమెకు తప్పక తగ్గుతుంది. రేపు మరలా వెళ్ళిరండి."
భార్యవేపు ప్రేమగా చూసాడు.
ఆ ప్రేమలో ఇదివరకు నిజాయితీ లేదు. అదివరకు ఆర్ద్ర లేదు.
భార్యను దగ్గరకు తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు.
మరో అబద్దం ఎలా ఆడాలని అతని దురాశ అతన్ని ముందుకుతోస్తోంది.
అతని చేతులు క్రమంగా శారద 37 మీదకు వెళ్ళాయి. అక్కడ నుండి 25 మీదకు....ఆ తరువాత 36 మీదకు వెళ్ళాయి.
శారద తలెత్తి భర్తవేపు చిలిపిగా చూసింది.
"సిగ్గయినా లేదు....
సమయమిది కాదు.
చాలన్న మాట
జన్మలో రాదు...." అది కింద పెదవిని పంటితో సుతారంగా నొక్కుతూ,
నవ్వాడు చక్రవర్తి_చూపులతో బ్రతిమాలాడాడు.
శారద కాళ్ళ మునివేళ్ళమీద కాస్త పైకిలేచింది. "అబ్బ" అన్నా చక్రవర్తి బుగ్గను నిమురుకుంటూ.
* * *
బంజారా హోటల్ సూత లో అసహనంగా పచార్లు చేస్తున్నాడు యజ్ఞభూపతి. వశిష్ట తలుపు వేపు చూస్తూ కూర్చున్నాడు.