Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 21


    "భయపడుతున్నారా?" అనునయంగా అడిగాడు కిరణ్ కుమార్.

    ఆమె గొంతు పొడారిపోతున్నది. దైన్యం ఆవరించింది. దీనంగా చూసింది.

    "మౌనం అర్ధాంగీకార మన్నమాట! సో, మీరు పోలీస్ ఆఫీసరే! ఔనా?" గట్టిగా, దగ్గరలోని సాయుధులకు వినిపించేట్టు అన్నాడు కిరణ్ కుమార్_కావలెననే.

    "నో...నాటెటాల్...! మీలా నేనేం పోలీస్ ఆఫీసరుని కాను!" తనూ కావాలంటే అంతకంటే గట్టిగా అరిచింది ఆషా.

    కిరణ్ కుమార్ తెల్లబోయాడు.

    సాయుధులు కొరకొర చూసారు. వారి అనుమానం వారిది!

    ఇరువురిలో ఎవరు పోలీస్ ఆఫీసరు అనేది అప్పటికి పూర్తికాని ఫజిల్!


                            *    *    *


    జత కళ్ళు రెప్పవాల్చకుండా సూటిగా ఆమెనే చూస్తున్నాయి.

    అవి ఆమెను శల్యపరీక్ష చేస్తున్నాయి. ఆ చూపులలో ఈర్ష్యా ద్వేషాలతో పాటు క్రోధం బుసకొడుతున్నది.

    ఆ విషపు చూపుల బారినుంచి తప్పించుకోవడానికి ఆమె పడుతున్న ఆరాటం, ఆతురత అంతా ఇంతా కాదు.

    పులిని చూసిన లేడి పిల్లలా వణికిపోతున్నది.

    క్షణం క్షణం ఆ చూపులు దగ్గరవుతున్నాయి. భయంగొలుపుతున్నాయి.

    వాటికి అందనంత దూరం పోవాలెనన్నట్టు ఆమె వడివడిగా నడుస్తున్నది. రాను రాను దూరం తగ్గిపోతున్నది.

    ఆమె గుండె బేజారెత్తిపోతున్నది.

    చీర కుచ్చెళ్ళను ఎగబట్టుకుని పరుగెత్తబోయింది.

    "హేండ్సప్!" పులిగాండ్రింపు వంటి హెచ్చరిక.

    ఆమె పరుగు ప్రారంభించింది.

    "ఆగు! ఆగకుంటే కాల్చేస్తాను!"

    ఆమె లెక్క చేయలేదు. పరుగు వేగం హెచ్చింది....

    "ఢాం!"

    రివాల్వరు పేలింది.

    కెవ్వున కేక పెట్టి పడిపోయింది ఆమె.

    ఆమె సునంద. డాక్టరు సునంద.

    గురి తప్పకుంటే ఒకే ఒక్క బుల్లెట్ ఆమె గుండెను చీల్చివేసేదే.

    కేవలం షాక్ తోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది!   

    అప్పుడే  అటుగా వచ్చిన నవీన్ షడన్ బ్రేక్ తో తన కారును ఆపాడు.

    నవీన్ ను చూస్తూనే రివాల్వర్ ను హేండ్ బ్యాంగ్ లో పెట్టుకున్నది భానురేఖ. చేరువనే గల చెట్లచాటుకు రెప్పపాటు కాలంలో కనుమరుగైపోయింది.

    డాక్టరు సునందను చూసిన నవీన్ కారులోని వాటర్ బ్యాగ్ ను తెచ్చి ఆమె ముఖం మీద నీళ్ళు చిలకరించాడు. ఆమె స్పృహలోకి వచ్చింది. సర్దుకుంటూ లేచింది.

    "ఒంట్లో బాగాలేదా డాక్టర్...." పలకరించాడు నవీన్.

    "ఆ ఆఁ....ఏదో పైత్యం చేసి, కళ్ళు తిరిగాయి....అంతే...." తత్తరపడింది డాక్టరు సునంద.

    "ఆడవాళ్ళు అబద్దమాడితే అతికినట్టు వుంటుందంటారు. అందునా ఒక డాక్టరు పైత్యం చేసిందంటే, నమ్మవలసిందే మరి!" ఎత్తిపొడుపుగా అన్నాడు నవీన్.

    "నా సహాయం కావాలనుకుంటే నిజం చెప్పండి. వద్దనుకుంటే, అబద్దమే నిజం కాబోలు అనుకుని నా దారిన నేను పోతాను!" నవ్వుతూ అన్నాడు.

    "సారీ! అటువంటి దేమీ లేదు. నిజమే చెబుతున్నాను. నాకు ఇన్ పేషెంట్లు వున్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. మీ దర్యాప్తు పూర్తయినట్టేనా? నేను వెళ్ళొచ్చా?" నిష్టూరంగా అంది డాక్టరు సునంద.

    ఆమె మాటలో తత్తరపాటు. కనులలో భయం.

    "ఆల్ రైట్! ఆల్ రైట్! మీ దారికి నేనెప్పుడూ అడ్డురాను. తప్పక వెళ్ళండి. నా సహాయం అవసరం అనిపిస్తే ఫోన్ చేయండి, చాలు!" అంటూనే నవీన్ తన విజిటింగ్ కార్డును తీసి ఆమెకు అందించబోయాడు, ఆమెనే పరీక్షగా చూస్తూ.

    "మీ విజిటింగ్ కార్డును ఇదివరకే ఇచ్చారు. నా దగ్గర వుంది!" అంటూనే తలవంచుకుని చకచకా ఆసుపత్రి వైపుకు వెళ్ళిపోయింది డాక్టరు సునంద. ఆమె అడుగులు తడబడుతున్నాయి.

    ఆలోచిస్తూ తనూ కదిలాడు నవీన్.

    చెట్టు చాటు నుంచి తప్పుకుంది భానురేఖ.


                           *    *    *


    కారుమబ్బులు కమ్ముకున్నాయి.

    ఆకాశాన ఎక్కడా ఒక్క చుక్క కనుపించడం లేదు.

    అది ఒక పాక. ఈతాకుల చాపలతో కప్పిన చిన్న పాక. అది పేరుకే పాక, కుండపోతగా వర్షం కురిస్తే ఎందుకూ పనికిరాదు!

    చల్లని గాలికోసం ఆషా, కిరణ్ కుమార్ అప్పటి వరకు చెట్టు కింద పడుకున్నారు. అయినా కంటి మీదకు కునుకు రావడం లేదు వాళ్ళకు.     
 

 Previous Page Next Page