"ఒడ్డూ, పొడువూ, రంగూ జయసూర్ది, శ్రీచక్రదీ ఒకటే. కన్ను, ముక్కూ కొంచెం తేడా వుంది. అయినా మేకప్ తో సరిచేయవచ్చు. జయసూర్య సన్యాసుల్లో కలిశాడని కదా మీరు చెప్పింది? గడ్డం , మీసం తగిలించి సన్యాసిలాగా నిలబెడితే, బ్రహ్మ కూడా కనుక్కోలేడు" ఉత్సాహంగా అంది కౌస్తుభ.
"నేనొకసారి శ్రీచక్రని చూడాలి. అతడిలో మరుగున పడిన ఆత్మ శక్తిని జాగృత పరచాలి.
* * * *
శ్రీ చక్ర ఇంకో వారం రోజుల్లో సింగపూర్ నుండి వచ్చేస్తాడనగా దిగంబరరావు అన్న ఒకాయన మారుతీరావుకు ఫోన్ చేసి, "నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఎప్పుడు రమ్మంటావు?" అని అడిగాడు.
"సాయంత్రం ఆరు గంటల తరువాత ఎప్పుడైనా రావచ్చు. ఇంట్లోనే వుంటాను" అన్నాడు మారుతీరావు.
"మా సిస్టరుందా?"
"మీ సిస్టర్ అంటే?"
"అదేనోయ్ నీ భార్య. నీ సిస్టరు కూడా వస్తుంది నాతో. అందుకని. "
"ఉంది."
దిగంబరం భార్యా సమేతంగా వచ్చి మాట్లాడే ముఖ్య విషయం ఏమై వుంటుందాని ఆలోచనలలో పడ్డాడు మారుతీరావు.
పెళ్లి సంబంధం కోసమా?
శ్రీచక్ర అమెరికాలో ఎం.బి. ఏ. చెస్తున్నప్పటినుండే అతడిని అల్లుడిని చేసుకోవడానికి చాలామంది తహతహ లాడారు. కట్నమూ, ఆస్తీ రెండు కలిసొచ్చే సంబందం వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇంతవరకూ ఎవరికి మాటివ్వలేదు.
పది సంవత్సరాల క్రితం ఈ దిగంబరం తనకి బిజినెస్ లో పార్టనర్ గా వుండేవాడు. విడిపోయాక అతడు స్మగ్లింగ్ లో చాలా సంపాదించాడని విన్నాడు.
అలాంటి దిగంబరరావు చీకటి పడుతుండగా భార్యాసమేతంగా కారు నుండి దిగాడు. మిలమిల మెరిసిపోతున్న అతడి ఫారిన్ కారు చూస్తే చెప్పొచ్చు. అతడు ఎన్ని అంతస్తుల పైనున్నాడో.
"ఈమె నా భార్య సరోజిని" అంటూ ఎదురెళ్లిన మారుతీరావుకు పరిచయం చేసాడు దిగంబరం. వాళ్ళని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి పద్మావతికి పరిచయం చేశాడు మారుతీరావు.
"కూర్చోండి" పద్మావతి వాళ్లను కూర్చోబెట్టి అతిథి మర్యాదలలో పడింది. పావుగంటలో అదీ పూర్తయింది.
మగవాళ్లిద్దరూ ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు.
"ఇల్లు చూద్దురుగాని రండి" అంటూ సరోజినిని పైకి తీసుకెళ్ళింది పద్మావతి. బాల్కనీ, రూఫ్ గార్డెన్ ఎంక్వేరియం అన్నీ చూపింది. అడుగడుగునా ఐశ్వర్యం చిమ్ముతున్నట్టుగా వుండే సరోజిని రాజప్రసాదంలాంటి ఇల్లుని చూసివుంటే, తన ఇల్లు చూసే సాహసం చేసేదికాదు పద్మావతి. వాళ్ల భవంతి ముందు, సూర్యుడి ముందు దివిటీ అని తెలిసిపోయింది. అసలింత చొరవగా కూడా ఆమెతో మెలిగేది కాదు.
"ఇది మా అబ్బాయి శ్రీచక్ర గది. వాడిక్కడ లేకపోయినా రోజూ శుభ్రంచేసి పెడుతుంటాను. పనివాళ్లని కూడా రానివ్వను. నా చేతులతో చేసుకుంటేనే నాకు తృప్తి. ఇదిగో మా అబ్బాయి శ్రీచక్ర ఫోటో. మూడు సంవత్సరాలు వాడిని ఎలా విడిచి వున్నానో నాకు తెలియదు. కానీ...."
"మీ అబ్బాయి సింగపూర్ వెళ్లి మూడు సంవత్సరాలైందా?"
"వాడు అమెరికా వెళ్లినప్పటి సంగతి. పిల్లల అభివృ-ద్దికి మన ప్రేమ అడ్డు కాకూడదని మనసు నిబ్బరం చేసుకున్నాను. వాడు అమెరికా వెళ్లినా, సింగపూర్ వెళ్లినా బాధపడడం లేదిప్పుడు."
"మీ అబ్బాయి ఫోటో ఇదివరకే చూసాన్నేను. మా అమ్మాయి ఆల్బంలో"
"మా అబ్బాయి ఫోటో మీ అమ్మాయి ఆల్బమ్ లోకి ఎలా వచ్చింది" ఆశ్చర్యపోయింది పద్మావతి.
"కాలేజీలో మీ అబ్బాయి శ్రీచక్ర మా అమ్మాయి వినోదిని క్లాస్ మేట్స్, మా వినోదిని చెపితేనే మీ అబ్బాయి గురించి తెలిసింది."
"అలాగా!"
"బికాం లాస్టియర్ లో వున్నప్పుడు ఎగ్జామినేషన్స్ ముందు కాలేజీ నుండి మన పిల్లలు బెంగుళూరు, ఊటీ విహారయాత్రలకి వెళ్లినప్పుడు మీ అబ్బాయిని మా వినూ చాలా యాంగిల్స్ లో ఫోటోలు తీసింది. వాటిని ఎంతో అపురూపంగా ఆల్బంలో పెట్టుకుంది. ఈ మధ్య తనకి పెళ్లి సంబంధం చూస్తుంటే, మీ అబ్బాయి గురించి చెప్పింది. అతడంటే తనకిష్టమని. పెళ్ళి చేసుకుంటే అతడినే చేసుకుంటానని చెప్పింది."
"మీ అమ్మాయి ఏం చేస్తోందిప్పుడు?"
"సిఎ. చేసింది. మీరు చూస్తారని మా వినూ ఫోటో కూడా తెచ్చాను" హాండ్ బాగ్ లోంచి కూతురి ఫోటో తీసిచ్చింది.
పద్మావతీ పరీక్షగా చూసింది. ఎవరికో ఫోన్ చేస్తున్నట్లుగా కలర్ ఫోటో. అందం తక్కువగా, మేకప్ ఎక్కువగా కనిపించింది. ఫోటో కోసం అలా దిగిందో, రోజూ ఇంత శ్రద్దగానూ అలంకరించుకుంటుందో తెలియదు.
"అమ్మాయి కొంచెం నలుపా?"
"బొత్తిగా నలుపుకాదు. చామనచాయ. ఇహ అమ్మాయి రూపు రేఖలు.... .నన్ను చూసారుకదా. ఇరవయ్యేళ్లక్రితం నేనెలా వుంటానని వూహిస్తారో సరిగ్గా అలాగే వుంటుంది."
పద్మావతి నవ్వాలనుకుంది. కానీ నవ్వలేకపోయింది.
తన కొడుకని అతిశయం కాదుగానీ వాడి శరీరఛాయ మేలిమి బంగారం. రూపంలో మన్మధుడు. కాకి ముక్కుకు దొండపండు కట్టినట్లుగా ఈ కర్రిమొద్దుతోనా పెళ్లి? ఆవిడ వూహకే జలదరించిపోయింది.
"ఇరవై సంవత్సరాల క్రితం మీరెలా వుండేవారోనని వూహించడం అనవసరం అనుకుంటాను. ఎందుకంటే పెళ్లీడు పిల్లకి మీరు తల్లి అంటే ఎవరూ నమ్మరు. మీ వయసు ముప్పై దగ్గర ఆగిపోయిందని నా నమ్మకం."
"ఓ! మీరు చాలా నైస్ గా మాట్లాడతారు"సరోజిని సంతోషంతో తబ్బిబ్బుపడిపోతూ అంది. ఆడవాళ్లకి ముప్పైదాటి నలభయ్ సమీపిస్తుంటే ఒకవిధమైన దడ గుండెలో బయలుదేరుతుంది. సాధ్యమైనంత తక్కువ వయసు కనిపించేలా శ్రద్ద తీసుకోవడం మొదలుపెడతారు. ఎవరయినా మీ వయసు ముప్పయ్ అనుకున్నా అంటే, వాళ్లలో యవ్వనం అప్పుడే ఉదయిస్తున్నట్లుగా ఉత్సాహపడిపోతారు.
"చాలామంది అంటుంటారు మా వినూకి నేను అక్కలా వుంటానని" అంది సరోజిని ముసిముసిగా. "ఇంకో వారం పదిరోజుల్లో వచ్చేస్తాడటగా మీ అబ్బాయి?" ఫారిన్ రిటర్న్ డ్ అంటే అందరికీ మోజేకదా? ఇంకెవరయినా తొందరపడి మాట్లాడుకుపోయాక చేసేదేమీ వుండదని ముందుగానే సంబంధం ఖాయం చేసుకుంటే, కాబోయే అల్లుడిని ఎయిర్ పోర్ట్ లో పూలదండలతో రిసీవ్ చేసుకోవచ్చని వచ్చాం!"
"పిల్లాడు రాకుండానే సంబంధం ఖాయమా? అదెలా వీలవుతుందమ్మా?వాడు పిల్లను చూడాలి. ఇష్టపడాలి. ఆ తరువాతే మన పెద్దవాళ్లం మాట్లాడుకోవడం బాగుంటుంది."
"మీ అబ్బాయి కొత్తగా పిల్లను చూడడం ఏమిటి వదినా? వాళ్లు క్లాస్ మేట్స్. ఒకరినొకరు మూడు సంవత్సరాలపాటు ఎరుగుదురు. ఇద్దరి మధ్య చక్కని స్నేహం వుండేదట. మా వినూ చెప్పింది తనంటే క్లోజ్ గా కూడా వుండేవాడుట. కావాలంటే సింగపూర్ కి ట్రంకాల్ చేసి అతడికి విషయంచెప్పాకే ఖాయం చేసుకుందాం.
ఆవిడ గొంతుమీద క్తి పెట్టినట్లుగా మాట్లాడుతుంటే, ఏం మాట్లాడాలో పాలుపోలేదు పద్మావతికి. ముఖంమీదే "మీ అమ్మాయి నాకు నచ్చలేదు" అని చెప్పేయ్యలేదుకదా!"
"ఇలాంటి విషయాలు ఆడవాళ్లం మాట్లాడుకోవడం ఏం బావుంటుందమ్మా? మగవాళ్లు చూసుకుంటారులే."
"రాజముద్ర మనం వేయందే మగవాళ్లు, ఏ ఫర్మానా జారీ చేయరులే వదినా. తెరవెనుక వుండి సూత్రాల్ని కదిలించేది మనమే. వాళ్లు వట్టి తోలుబొమ్మలు" తనేదో గమ్మత్తయిన జోక్ వేసినట్లుగా ఫెళ్లున నవ్వింది సరోజిని.
పద్మావతి మాత్రం నవ్వలేదు. "మీ ఆయన తోలుబొమ్మేమోగానీ మా ఆయన కారులే. ఎక్కడయినా అత్తా అనుకాని, వంగతోట దగ్గర మాత్రం కాదు అన్నట్లుగా నేనంటే ఎంత అభిమానమున్నా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం ఆయనే తీసుకుంటారు."
"మీరొట్టి అమాయకులున్నట్లున్నారు వదినా! ఎంత వారలైనా కాంతదాసులే అన్న విషయం మీకు తెలీనట్టుంది."
"తెలీకపోతే నాకు జరిగిన లోటేమీలేదమ్మా! నేను హాయిగానే వున్నాను."
"క్రిందకి రమ్మంటున్నారమ్మా" నౌకరు వచ్చి చెప్పాడు.
ఇద్దరూ క్రిందకి వచ్చారు.
దిగంబరం విప్పారిన ముఖంతో "సరూ! వచ్చిన పని సక్సెస్. మారుతి ఒప్పుకున్నాడు మనమ్మాయిని తన కొడుక్కి చేసుకోవడానికి"అని చెప్పాడు.
"నాకంటే మీరే చతురులన్నమాట. కార్యాన్ని సాధించారు. వదిన గారి నుండి మాత్రం నేను మాట తీసుకోలేకపోయాను."
"ఇందులో అంత చతురత ఏమీలేదులే. నాకూ అతడికీ మధ్యనున్న స్నేహం వల్ల ఈ పని సాధించగలిగాను" గర్వంగా అన్నాడు దిగంబరం.
కనీసం ఒక్కమాటైనా చేసుకునేవాడికి చెప్పకుండా, పిల్లనైనా చూడకుండా సంబందం ఖాయం చేయడం ఏమిటో అర్దంకాలేదు పద్మావతికి. వాళ్లు ఆనందంతో తేలిపోతుంటే మండుకొస్తోంది. వాళ్లముందు ఏమీ అనలేనట్లుగా మౌనం వహించినా, ముఖం మాత్రం ఏదోలా పెట్టుకుంది.
భార్య ముఖంలో భావాలు గుర్తించినా గుర్తించనట్టుగా ముఖంమీదికి నవ్వు తెచ్చి పెట్టుకుంటూ "అబ్బాయికి సంబంధం నిశ్చయమైన శుభ సందర్బాన్ని పరస్కరించుకుని మా నోరు తీపి చేయి పద్మావతీ!" అన్నాడు మారుతీరావు. ఆమె లోనికి వెళ్లి మైసూరుపాక్ బిళ్లలు తెచ్చింది.