Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 22


    ఆ రాత్రి నిద్ర నటిస్తూ ఆమెనే గమనిస్తూంటే తన అనుమానం ధృవపడింది.
    అప్పుడు తెలిసింది తనకు శ్రీరంజని డ్రగ్ ఎడిక్ట్ అని.
    ఆ రాత్రంతా తనకిక నిద్రపట్టలేదు.
    శ్రీరంజనిని రెండో పెళ్ళి చేసుకుని తను తప్పుచేశాడా అన్న ఫీలింగ్ తనకు చాలా విచారం కలిగింది.
    శ్రీరంజని ఆ మత్తులో నవ్వటం, తనలో తను మాట్లాడుకోవటం...వింటూంటే తన భవిష్యత్తు ఎలా వుంటుందోనన్న దిగులు ప్రారంభమయింది.
    క్రమక్రమంగా శ్రీరంజని అసలు స్వరూపం బయటపడసాగింది.
    మొదటి భయంకరమయిన నిజం-ఆమెకూ, సిద్ధార్థకూ సంబంధం ఉన్న విషయం.
    తనింట్లో ఇచ్చిన విందులో ఆమె తరపున ఆహ్వానింపబడ్డాడతను.
    విందు పూర్తయ్యాక తను తాగిన మైకంతో తన గదిలోకెళ్ళి నిద్రలో మునిగిపోయాడు. అర్థరాత్రి మెలకువ వచ్చి శ్రీరంజని గదివేపు వెళుతూంటే అప్పుడే ఆమె గదిలోనుంచి సిద్ధార్థ బయటకు వెళ్ళటం కనిపించింది.
    అప్పుడు టైము తెల్లారుజామున మూడవుతోంది.
    నాలుగ్గంటలకు తనకు హార్ట్ ఎటాక్ వచ్చింది మొదటిసారి. మైల్డ్ హార్ట్ ఎటాక్.
    బైపాస్ సర్జరీ అవసరం లేదని డాక్టర్స్ అభిప్రాయపడ్డారు.
    చాలా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మరెన్నో అనుమానాలు తలెత్తసాగాయి.
    అసలు శ్రీరంజనిని సిద్దార్ధే తనమీద ప్రయోగించాడా అనే అనుమానం వాటిల్లో ముఖ్యమయినది. శ్రీరంజనిని తను వివాహం చేసుకోడానికి పురిగొల్పిన పరిస్థితులన్నీ కళ్ళముందు మెదిలాయి.
    హైదరాబాద్ లోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మహేందర్ రెడ్డి ఇచ్చిన డిన్నర్ సందర్భంలో జరిగిందా సంఘటన. కావాలని తనను పరిచయం చేసుకున్నాడు సిద్ధార్థ. ఇద్దరూ ఓ టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ తీసుకుంటూంటే జాయినయింది శ్రీరంజని.
    నగరంలోనే ఓ రాష్ట్రప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ భార్యగా ఆమెను పరిచయం చేసి తను వెళ్ళిపోయాడు సిద్ధార్థ.
    ఆమె రూపం వెంటనే తనను ఆకట్టుకుంది.
    ఆమె గురించి వివరాలడిగాడు.
    ప్రస్తుతం తను, ఆ ఐ.ఎ.ఎస్. అధికారీ విడిపోయినట్లు చెప్పిందామె.
    "ఎందుకని? మీలాంటి అందమయిన స్త్రీని వదులుకున్నవాడు పెద్ద మూర్ఖుడయి ఉండాలి" అన్నాడు తాగిన నిషాలో.
    ఆమె నవ్వింది.
    "అతను కూడా మనస్ఫూర్తిగా విడిపోవాలని కోరుకోలేదు" అంది.
    "మరి?"
    "పరిస్థితులలా వచ్చాయ్."
    "ఏమిటా పరిస్థితులు! అఫ్ కోర్స్-మీరు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి."
    "నిజానికి ఆయనకు నాతోపాటు ఇంకో భార్య కూడా వుంది."
    "ఓ!"
    "ఆమెను తల్లిదండ్రుల కోసం, నన్ను తనకోసం చేసుకున్నాడు."
    "అలా చాలామందికి యిద్దరు భార్యలున్నారు. విడిపోవాల్సిన పనేముంది?"
    "ఆమె కావాలని నా మీదా,అతని మీదా ఇన్ కమ్ టాక్స్ డిపార్టుమెంట్ కి చెప్పి మా ఇంటి మీద రైడ్ చేయించింది."
    "మైగాడ్! కానీ రైడ్ చేస్తే మాత్రం నష్టం ఏముంది?"
    "ఆయన తన పదవి వల్ల చాలా డబ్బు సంపాదించేవారు. సుమారుగా నెలకు నాలుగయిదు లక్షలు. ఆ డబ్బంతా రహస్యంగా నా ప్లాట్ లో దాచేవారు. మా ఇంటినిండా విదేశీ గుడ్స్ నిండిపోయాయ్. రోజూ పార్టీలు, డిన్నర్ లతో హడావుడిగా వుండేది. ఇన్ కమ్ టాక్స్ రైడింగ్ లో డబ్బూ, నగలూ పట్టుకున్నారు. ఆ డబ్బంతా ఆయన లంచాలు తీసుకున్నారని అందరికీ తెలుసు.
    కానీ నేను ఆయన పేరు చెప్పలేదు. వ్యభిచారం ద్వారా సంపాదించానని చెప్పాను. ఆయన బ్రతికి బయటపడ్డారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు మా ఇద్దరినీ కనిపెట్టి వుండటం వల్ల విడిపోవటం మంచిదని నిర్ణయించుకున్నాం."
    "కాని మీ పెళ్లి అయినట్లు రుజువులు..."
    "మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము"
    ఆమె స్వయంగా తమ ఇద్దరికీ డ్రింక్స్ తీసుకొచ్చింది.
    అప్పుడే బహుశా కుట్ర జరిగి వుంటుంది.
    తన డ్రింక్ లో ఏదో కలిపారు.
    ఆ తరువాత ఏం జరిగిందో తనకు తెలీదు.
    స్పృహ వచ్చేసరికి ఇద్దరూ నగ్నంగా ఓ హోటల్ గదిలో వున్నారు.
    తను ఆమెమీద మనసు పడిన మాట నిజం. కానీ ఆమెను అంత రాత్రివేళ హోటల్ కి తీసుకొచ్చి యిలా ప్రవర్తిస్తాడా అనేది సందేహాస్పదం.
    ఆమె కళ్ళు తెరచి నవ్వింది.
    "మీ రూపం చూస్తే ముసలాళ్ళని ఎవరయినా మోసపోతారు."
    తనూ నవ్వాడు ఆలోచిస్తూనే.
    "జీవితంలో ఇంత అద్భుతమయిన ఆనందాన్ని యిచ్చిన వ్యక్తి మీరే."
    "అబద్ధం కదూ?"
    "అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెపుతున్నాను ఆ ఐ.ఎ.ఎస్. వాడు డబ్బు ఎలా సంపాదించటమా, సంపాదించింది ఎలా దాయటమా అన్న విషయంమీదే ఎక్కువ ధ్యానంతో వుండేవాడు. సెక్స్ లో హి ఈజ్ జీరో."
    "ఐసీ!"
    "అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది. మనం అప్పుడప్పుడూ కలుసుకోవటంలో నాకేం అభ్యంతరం లేదు!"
    "థాంక్యూ! నాకూ సంతోషమే అది."
    ఆ తర్వాత కొద్దిరోజులు ఇద్దరూ ఆమె ప్లాట్ లోనే కలుసుకుంటూ గడిపారు.
    ఆ తర్వాత వచ్చింది రిజిష్టర్డ్ పోస్ట్.
    అందులో తనూ, శ్రీరంజనీ నగ్నంగా పడుకుని వున్న ఫోటోలున్నాయ్.
    మర్నాడు సాయంత్రం ఆరుగంటలకు పదిలక్షల రూపాయలు తీసుకుని ఎయిర్ పోర్ట్ లో నిలబడాలి. ఓ వ్యక్తి వచ్చి ఆ డబ్బు అడిగి తీసుకుంటాడు. లేకపోతే ఆ ఫోటోలు దేశమంతటా పంచబడతాయ్.
    తనకు శ్రీరంజని మీద అనుమానం కలిగింది.
    ఇదంతా ఆమె పన్నాగం కాదు గదా!
    "మీకు నామీద అనుమానం కలుగుతుందేమో! కానీ నాకిలా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇంకో తరంవరకూ సరిపోయే ఆస్తి వుంది."

 Previous Page Next Page