ఆవేశంగా అతనికి సమీపంగా నడిచింది.
దగ్గరకు చేరుకుంటూనే అమాంతం గాలిలోకెగిరి అతని మోకాలు మీద తన్నింది.
మోకాలు పగిలిపోయినంత బాధ ఒక్కసారిగా కలిగేసరికి శ్రీరామ్ 'అబ్బా' అంటూ వంగి మోకాలు పట్టుకున్నాడు.
ఈసారి ఆమె చేయి గాలిలో తిరిగి అతని భుజంమీద కరాటే దెబ్బ కొట్టింది.
దాంతో అక్కడే కూలిపోయాడతను.
వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ కి ఫోన్ చేసి పిలిపించిందామె. విజయ్ మధు గన్స్ తో వచ్చారక్కడికి.
"వీడిని తీసుకెళ్ళి మన బిల్డింగ్ కాంపౌండ్ బయట రోడ్డు మీద పడేయండి."
వాళ్ళు శ్రీరామ్ ని ఊడ్చుకెళ్ళిపోయారు.
రోడ్డు మీదకు తీసుకెళ్ళి పుట్ పాత్ మీద పడేసి వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
* * * *
"అయామ్ సారీ" అన్నాడు నిరంజన్ హాస్పిటల్లో శ్రీరామ్ బెడ్ దగ్గర నిలబడి.
"దయచేసి వెళ్ళిపోండి. జరిగిందంతా తల్చుకోవటం కూడా నాకిష్టంలేదు. నా దారిన నన్ను బ్రతకనీయండి. ఇంక జన్మలో మీదగ్గర నేను పనిచేయబోవటం లేదు. అలాంటి పొగరుబోతు పిల్లను కంట్రోల్ చేయకపోతే మీరు కూడా చిక్కుల్లో పడతారు" ఆవేశంగా అన్నాడు శ్రీరామ్.
"మా అమ్మాయి గురించి అలా మాట్లాడకు శ్రీరామ్. అయ్ డోంట్ లైకిట్. ఆ ఏజ్ లో ఎవరయినా అలాగే బిహేవ్ చేస్తారు. నథింగ్ రాంగ్ ఇనిట్! నీకు దెబ్బలు తగిలినందుకు సారీ చెప్పడానికి వచ్చాను గానీ...అమ్మాయి ప్రవర్తనలో తప్పుందని కాదు, అండర్ స్టాండ్."
"మిస్టర్ నిరంజన్! దేవుడు శిక్షించాక గానీ మీకు మీ తప్పేమిటో మీ అమ్మాయి తప్పేమిటో తెలిసిరాదు. దయచేసి వెళ్ళిపోండి."
"ఆల్ రైట్" ఆవేశంగా అని బయటకు నడవబోయి మళ్ళీ వెనక్కు తిరిగి జేబులో నుండి ఓ కవరు తీసి శ్రీరామ్ బెడ్ మీదకు విసిరేశాడతను.
"యాభయ్ వేలు! గుడ్ విల్ గా నీకిస్తున్నాను.
శ్రీరామ్ కవరందుకుని తెరవకుండానే ముక్కలుగా చింపి నేలమీదకు విసిరికొట్టాడు.
"గుడ్ విల్ కి వాల్యూ డబ్బు కాదు"
"మాడ్ ఫెలో" అనుకుంటూ బయటకు నడిచాడు నిరంజన్.
అతని యాభై సంవత్సరాల జీవితంలో ఇది మొదటి సంఘటన డబ్బుని ఓ వ్యక్తి అంత దారుణంగా తృణీకరించటం.
* * * *
"దీప, ఆమె ఫ్రెండ్ ప్రయాణానికి సిద్ధమై మేడ దిగి కిందకు వచ్చారు.
శ్రీరంజని అప్పుడే నిద్రలేచి బెడ్ కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుని వుంది.
"హాయ్ బేబీ! రడీ అయ్యారా?" అడిగిందామె దీపను చిరునవ్వుతో పలుకరిస్తూ.
"యా! డాడి ఏరి?"
"యాజ్ యూజ్ వల్! ఆఫీస్ రూమ్ లో వున్నారు.
దీప పరుగుతో ఆఫీస్ రూమ్ చేరుకుంది.
నిరంజన్ బిజీగా ఫోన్లో మాట్లాడుతున్నాడు.
దీప అతనిచేతిలోని ఫోన్ లాక్కొని కింద పెట్టేసింది.
"అరెరె! ఇటలీ మాట్లాడుతున్నానమ్మా"
"అయిదు నిమిషాల తర్వాత మాట్లాడవచ్చు డాడీ!" అంది అతని చెంపమీద ముద్దు పెట్టుకుంటూ.
"ఆల్ రైట్ అయితే నువ్వే మాట్లాడు ముందు."
"ఫ్లైట్ కి టైమయింది. వెళ్ళిపోతున్నాం."
"విష్ యూ హ్యాపీ జర్నీ"
"థాంక్యూ"
"ప్రోగ్రాం ప్రకారం టూర్ చేస్తారు కదూ? లేకపోతే రిజర్వేషన్స్ ప్రాబ్లమ్ అయిపోతాయి."
"ఓ యస్"
"రెండు మూడురోజులకోసారయినా నాతో మాట్లాడుతుండాలి ఓకే!"
"ఓకే డాడీ టాటా!"
ఆమె పరుగుతో వెళ్ళిపోయింది.
అందరూ కార్లల్లో కూర్చున్నారు.
కార్లు బయల్దేరుతుంటే పోర్టికో దగ్గర నిలబడి చేయి ఊపింది శ్రీరంజని.
ఆ తర్వాత తన గదిలోకి నడిచి త్వరగా రడీ అయి నిరంజన్ దగ్గరకొచ్చింది.
నిరంజన్ రోజు ఉదయం ఎనిమిది గంటలనుంచీ మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ తన ఆఫీస్ రూమ్ లో గడుపుతాడు. ఆ నాలుగ్గంటల్లో అతను ఫాక్స్, టెలెక్స్ అయ్.ఎస్.డి. ల ద్వారా కనీసం రెండు మూడు దేశాలు చుడుతుంటాడు. ఒకవేళ కాటన్ గార్మెంట్స్ ఎక్స్ పోర్టుకి సంబంధించిన విషయంలో విదేశీయులెవరయినా వస్తే మాత్రం అతని కార్యక్రమానికి అంతరాయం కలుగుతోంది.
వారిని రిసీవ్ చేసుకోవటం, హోటల్స్ కి తీసుకెళ్లటం వారితోపాటు పంచ్ కీ డిన్నర్స్ కీ వెళ్ళటం వాటితో రోజంతా బిజీగా గడిచిపోతుంటుంది.
మొదట్లో తనతోపాటు ఆఫీస్ వ్యవహారాల్లో శ్రీరంజని కూడా చురుకుగా పాల్గొంటుండేది. ముఖ్యంగా విదేశీయుల్ని రిసీవ్ చేసుకునేప్పుడు వారితో లంచ్ కి, డిన్నర్ కీ, సైట్ సీయింగ్ కి వెళ్ళాల్సివచ్చినప్పుడు తనే చొరవ తీసుకుని పాల్గొంటుండేది.
తనకూ ఆ ఏర్పాటు చాలా రిలీఫ్ కలిగించింది. తను ఆ సమయంలో ఆఫీస్ విషయాలు చూసుకోడానికి వీలుండేది.
వచ్చిన అతిథులక్కూడా తను రాలేదన్న ఫీలింగ్ వచ్చేది కాదు.
శ్రీరంజని కాన్వెంట్ ఎడ్యుకేషన్ సొసైటీలో పెరగటం వల్ల ఏర్పడ్డ కల్చర్ ఎడ్వాంటేజ్ అయినాయ్.
ఆమెకు ఫ్రెంచ్ కూడా రావటం వల్ల ఫ్రెంచ్ దేశస్తులెవరైనా వస్తే మాత్రం విధిగా ఆమె వారికి కంపెనీ ఇస్తుండేది.
కానీ ఓసారి జరిగిన సంఘటన చూశాక నిరంజన్ ఆమెను వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ వచ్చాడు.
ఆ రోజు ఇద్దరు ఇటాలియన్స్ కి డిన్నర్ ఇవ్వటం జరిగింది.
డ్రింక్స్ తీసుకునే సమయంలోనే వారిద్దరూ శ్రీరంజని పట్ల ఎక్కువ ఆసక్తి కనబర్చటం గమనించాడతను. తనకు కొంచెం చిరాకు కలిగించిందా విషయం.
డిన్నర్ తర్వాత తను బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చేసరికి శ్రీరంజని ఒకతని చేతి నుంచి ఏదో వస్తువు తీసుకుని తన బ్యాగ్ లో వేసుకోవటం కనిపించింది.
తను అది చూడనట్లు వూరుకున్నాడు.
ఇంటికి చేరుకున్నాక ఆమె డ్రస్ మార్చుకునే సమయంలో శబ్దం కాకుండా ఆమె బ్యాగ్ తెరచి చూశాడు. అందులో ఓ చిన్న ప్లాస్టిక్ కాగితంలో పచ్చని టాబ్ లెట్స్ ఆరు కనిపించాయి.
వాటిని చూస్తూనే తనకు అర్థమయిపోయింది.