"అయితే ఇదెవరి పని అంటావ్?"
"ఎవరయినా కావచ్చు. మనం కొంచెం కేర్ లెస్ గా ఉన్నమాట నిజం. మొదటిసారి మీరు తీసుకెళ్ళిన హోటల్ అంతమంచి బాక్ గ్రౌండ్ ఉన్న హోటల్ కాదనుకుంటాను."
"అవును! నాకూ ఆ హోటల్ వాళ్ళమీదే అనుమానంగా ఉంది. ఆ హోటల్ రికార్డు అంత మంచిదికాదని ఎవరో అనుకుంటూండగా కూడా విన్నాను."
"ఇది పదిలక్షలతో పోయేది కాదని నాకనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఇలా లక్షలకు లక్షలు అడుగుతూనే వుంటారు. అందుకని నామీద మీకున్న అనుమానం తొలగిపోడానికి నేను ఓ పని చేయదల్చుకున్నాను."
"ఏమిటది?"
"మిమ్మల్ని వివాహం చేసుకోవటం. అలా చేయటం వల్ల ఆ బ్లాక్ మెయిలర్ మన జోలికి రాడిక. అఫ్ కోర్స్! మీ ప్రపోజ్ ఇష్టమైతేనే, బలవంతమేమీ లేదు."
తానకామె ఆలోచన సమంజసంగానే ఉన్నట్లనిపించింది.
ఆరోజే ఇద్దరూ ముఖ్యమయిన మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
* * * *
శ్రీరంజని నిరంజన్ కెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
"నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు. చెక్ సైన్ చేసే అధికారం నా కంఠంలో ప్రాణ ముండగా నీకివ్వను" ఆవేశంగా అన్నాడు.
"ఎందుకని?"
"ఎందుకంటే డ్రగ్స్ కోసం డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావ్. నేను వర్రీ అవుతోంది డబ్బు గురించి కాదు, డ్రగ్స్ తీసుకోవటం గురించి."
"షిట్" ఆవేశంగా అరచిందామె. "పెళ్ళికి ముందు ఇలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్తే నిన్ను చేసుకునేదానిని కాదు. బాస్టర్డ్"
నిరంజన్ కి ఆమె మాటలు, ప్రవర్తన చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయ్.
"శ్రీరంజనీ! సరిగ్గా మాట్లాడటం నేర్చుకో! చీప్ జాక్ లాగా బిహేవ్ చేయకు."
"నాకు చెక్ ఫెసిలిటీ కావాలి. ఇస్తావా, ఇయ్యవా?"
"నేనివ్వను."
"ఇవ్వకపోతే నేను డైవర్స్ తీసుకుంటాను. నీలాంటి శాడిస్టు దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు."
నిరంజన్ కోపంగా లేచి నిలబడ్డాడు.
"నీకూ డైవర్స్ కావాలా? నిన్నిలా తయారు చేస్తుందెవరో నాకు తెలుసు. ఆ సిద్ధార్థగాడు డైవర్స్ తీసుకోమని వాడే నిన్ను పురిగొల్పుతున్నాడు. అలా చేస్తే నువ్వు నా ఆస్థితో సహా వాడికి దక్కుతావని వాడి ప్లాన్. మీ ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. వాడికీ నీకూ ఎప్పటినుంచో సబంధం వుంది. ఏమీ తెలీనట్లు నిన్ను నాకు పరిచయం చేసి నాకు తెలీకుండా నాకు డ్రగ్స్ ఇచ్చి నేను మత్తులో ఉండగా, మనిద్దరం నగ్నంగా పడుకుని ఉన్నట్లు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయించాడు వాడు. వాడి సపోర్టు లేనిదే ఇవన్నీ సాధ్యం కావు" బిగ్గరగా అరచాడతను వణికిపోతూ.
శ్రీరంజని నవ్వింది.
"ఆల్ రైట్! నువ్వలా అనుకుంటే నాకేం నష్టం లేదు. నీ కథ నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నేను నిన్ను పెళ్ళిచేసుకునేసరికే నాకు చాలా ఆస్తి వుందన్న సంగతి మర్చిపోకు. అంత ఆస్తి వున్నదాన్ని మళ్ళీ ఆస్తి కోసం నీ వెనుక పడాల్సిన అవసరం ఏముంది? కథ వింటే అందరూ నవ్వుతారు."
"అవును! నవ్వుతారు. ఎందుకంటే నీ ఆస్తి అంతా అప్పటికే తాకట్టులో వున్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి. పెళ్ళయ్యాకే ఆ విషయం నాకు తెలిసింది కాబట్టి. రజనీ! నీకు స్పష్టంగా చెపుతున్నా విను. నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగబోవటం లేదు. నా కంఠంలో ప్రాణం వుండగా నీకు డైవర్స్ ఇవ్వను. అంతేకాదు. నువ్ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారం కూడా ఇవ్వను. నువ్వూ, ఆ సిద్ధార్థగాడూ ఏం చేసుకుంటారో చేసుకోండి. నౌ గెటౌట్ ఫ్రమ్ దిస్ రూమ్."
"నేను వెళ్ళను. నాకు నువ్వు సంతకం చేసిన బ్లాంక్ చెక్ బుక్ ఇచ్చేవరకూ నిన్నింకోపని కూడా చేయనివ్వను. నేనెంత మొండిదాన్నో, ఇంతకు తెగించగలనో నీకు తెలీదు" అంటూ టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసిపారేసి చేతికి దొరికిన కాగితాలన్నీ చింపి పారేయసాగిందామె.
నిరంజన్ ఇక కోపం పట్టలేకపోయాడు.
"బ్లడీ బిచ్! నిన్ను..." అంటూ ఆమెమీదకు వచ్చి విసురుగా ఆమెను బయటకు తోయబోయాడు.
కానీ ఆమె అతనిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమయి ఉండడంతో అతని చేయి పట్టుకుని గట్టిగా తనవేపు లాగింది.
ఈ అనుకోని కదలికతో నిరంజన్ బాలెన్స్ తప్పి ఆమె మీదకు వరిగిపోయాడు. అదే అదనుగా తీసుకుని అమాంతం అతనిని తనతోపాటు కిందకు లాగి అతనిమీదపడి ఛాతీ మీద కూర్చొని చేతుల్ని కదలకుండా నొక్కి పట్టింది.
సడెన్ గా నేలను తాకటంతో నిరంజన్ గుండె విపరీతంగా కొట్టుకో సాగింది.
అతనికి డాక్టర్ చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చినయ్.
"యూ మస్ట్ బి వెరీ కేర్ ఫుల్ మిస్టర్ నిరంజన్. మీ గుండె అదివరలా స్ట్రెయిన్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కువగా ఎగ్జయిట్ అవడం చాలా ప్రమాదకరం."
నిరంజన్ కి భయం వేసింది. హార్ట్ ఎటాక్ రాదు కదా?
హఠాత్తుగా మరో ఆలోచన అతనిని మరింత భయకంపితుడిని చేసింది.
తన హార్ట్ విషయం శ్రీరంజనికి కూడా తెలుసు.
ఒకవేళ ఆమె తనని కావాలనే రెచ్చగొట్టడం లేదుకదా?
తన గుండె ఆగిపోతే ఈ ఆస్తంతా ఆమెకే చెందుతుంది.
ఆ భయం రాగానే అతను బిగ్గరగా కేకలు వేయసాగాడు.
"అరే విజయ్, మధూ! త్వరగా రండి. కమాన్ క్విక్" పిచ్చివాడిలా కేకలు వేయసాగాడు.
పోర్టికోలో వున్న సెక్యూరిటీ గార్డు విజయ్ పరుగుతో గన్ తీసుకుని నిరంజన్ గదిలో కొచ్చాడు.
అతనిని చూడగానే శ్రీరంజని నిరంజన్ ఛాతీ మీదనుంచి లేచి నిలబడింది. తనూ కోపంతోనూ, భయంతోనూ వణికిపోతూ లేచి నిలబడ్డాడు నిరంజన్.
"ఏమిటి సార్?" అడిగాడు విజయ గన్ దించేస్తూ.
"ఆ రాక్షసి నన్ను చంపటానికి ప్రయత్నిస్తోంది. దానిని తీసుకెళ్ళి గదిలో పడేసి లాక్ చెయ్! కమాన్! త్వరగా."
విజయ్ అక్కడనుంచి కదల్లేదు. నిరంజన్ వేపు ఎలాంటి భావం లేకుండా చూస్తూండిపోయాడు.
"విజయ్! నీకే చెప్పేది. దాన్ని ఈడ్చుకెళ్ళి దాని గదిలో పడేసి లాక్ చెయ్! నేను ఆర్డర్ చేస్తున్నాను. భయపడకు కమాన్!"
విజయ్ అప్పటికే కదలకపోవటంతో శ్రీరంజని నవ్వింది నెమ్మదిగా.
"నువ్వు శాడిస్టువే కాదు, పరమ మూర్ఖుడివి కూడా! ఈ భవనంలో నీ మాట వినేవారెవరూ లేరు" హేళనగా అందామె.
"విజయ్!" బిగ్గరగా అరచాడు నిరంజన్. "యూ ఆర్ డిస్ మిస్ డ్."
విజయ్ చలించలేదు. శ్రీరంజని వేపు చూశాడు.
"అతనిని తీసుకెళ్ళి గదిలో వేసి లాక్ చేయండి" తాపీగా అందామె.
మరుక్షణం విజయ్ తన జేబులోని విజిల్ తీసి ఊదాడు.
మధు గన్ సిద్ధంగా పట్టుకుని పరుగుతో వచ్చాడక్కడికి.
ఇద్దరూ తనవేపు వస్తూంటే నిరంజన్ కి చెమటలు పట్టేయసాగినయ్.
తను ఊహించిన దానికంటే చాలా పెద్ద కుట్రే జరుగుతుంది.