"ఎవడివల్లా కాదు డియర్! అంతెందుకు _ అలాంటిది మళ్ళీ రాయమంటే నేనే రాయలేను."
"రాయలేరా?"
"నో..."
"ఎందుకని?"
"ఎందుకంటే.. జీనియస్ ల మాస్టర్ పీస్ లు చాలా తక్కువగా వుంటాయ్."
"అబ్బ! మళ్ళీ సూపర్బ్ ఎక్స్ ప్రెషన్. జీనియస్ లు ఏం మాట్లాడినా మాస్టర్ పీస్ అని నా అభిప్రాయం. మీర్రాసిన '24 గంటలు' నవల్లో ప్రతి వాక్యం మాస్టర్ పీసే అని నా డైరీలో రాసుకున్నాను. కావాలంటే డైరీ చూపిస్తాను. మేడ మీద గదిలోకొస్తారా?"
"అక్కర్లేదు. మీ మాట మీద నాకు ఎంతో నమ్మకం"
పూజా ఆనందంగా చూసింది.
"నా మాటంటే అంత నమ్మకం ఎలా కలిగింది?"
"అందమైన అమ్మాయిలు అబద్ధాలు చెప్పరు. వాళ్ళ మాటలు అందరూ నమ్మి తీరాల్సిందే.."
వాళ్ళ సంభాషణ కల్నల్ కి నచ్చటం లేదు. అతనికసలు రచయితల మీద సదభిప్రాయం లేదు. మనదేశంలోని దౌర్భాగ్యాలన్నిటికీ కారణం రచయితలేనని అతని తిరుగులేని అభిప్రాయం. నవలల ద్వారానూ, టీవీ సీరియల్ ద్వారానూ, సినిమాల ద్వారానూ, కథా రచయితలు, గీత రచయితలు కలసి యువతను సర్వనాశనం చేస్తున్నారని అతను మనస్పూర్తిగా నమ్మాడు. ముఖ్యంగా అతను ఇటీవల చదివిన 'హాకస్ ఫోకస్' అనే నవల_
అందులో హీరో హిప్నాటిజం నేర్చుకుని ప్రజల్ని ఎన్నో బాధల నుండీ, సమస్యల నుండీ రక్షిస్తూ రాత్రింబవళ్ళు తిరుగుతూంటాడు.
ఏనాటికైనా ఆ నవలా రచయిత కనబడితే అతని చేతి వేళ్ళమీద కాల్చాలని కల్నల్ కనకారావు కోరిక.
"ఆల్ రైట్ మిస్టర్ చంద్రకాంత్! మీ ట్రైన్ కి టైమయినట్లుంది" అన్నాడతను.
"నో డాడీ! చంద్రకాంత్ గారు అప్పుడే వెళ్ళిపోడానికి వీల్లేదు. ఇలాంటి గొప్ప వ్యక్తి మనింటికొస్తే అంత తేలిగ్గా పంపించి వేస్తామా..? నో... కనీసం రెండు రోజులైనా మనింట్లో వుండాల్సిందే" అంది పూజ పట్టుదలతో.
"ఆ... రెండు రోజులా? ఎందుకు?" చిరాగ్గా అడిగాడు కల్నల్.
సరిగ్గా అప్పుడే గోపాల్రావ్ వచ్చాడు.
"నేననుకుంటూనే వున్నా. ఆఫీస్ కెళితే మనల్ని వదల్రని. అలాగే జరిగింది. మా బాస్ కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. వదిలించుకునేసరికి యీ టైమయింది" అంటూ భవానీశంకర్ ని చూసి ఆశ్చర్యపోయాడు.
"మైగాడ్ నువ్వా? ఏమిటీ సర్ ప్రైజ్? నువ్వు ఉదయం ఆరుగంటల బస్ కి ఖమ్మం వెళ్ళిపోతానన్నావుగా? వెళ్ళలేదా?"
"ఆరుగంటల బస్ మిస్సయింది బ్రదర్! ఆరుగంటల బస్ ఆరుగంటలకే వెళ్ళిపోయింది."
గోపాల్రావ్ హోరున ఆశ్చర్యం నటించాడు.
"మైగాడ్! ఆరుగంటల బస్ ఆరుగంటలకే వెళ్ళిపోయిందా?"
"అవును."
"వెరీ బాడ్! ఆరుగంటల బస్ సాధారణంగా ఏడు గంటలకు కదా వెళ్ళాల్సింది?"
"అవును కానీ ఎందుకో ఆరుగంటల బస్ ఆరుగంటలకే వెళ్ళిపోయింది."
"విన్నావా సీతా! ఆరుగంటల బస్ ఆరుగంటలకే వెళ్ళిపోయిందట! ఈజ్ దేర్ ఎనీ సెన్స్? బైదిబై... వీడెవడో తెలుసా? నా చిన్ననాటి ఫ్రెండ్ చంద్రకాంత్! రాత్రంతా మేమిద్దరం కలిసి గడిపామని చెప్పాను గదా! సేమ్ ఫెలో..."
"ఇప్పుడే పరిచయం చేసుకున్నాం."
"సరిగ్గా ఫోర్ ఇయర్స్ తర్వాత కనబడ్డాడు. ఫన్నీ ఫెలో... కదురా?"
"ఫోర్ ఇయర్స్ థర్టీన్ డేస్"
"అవునవును. ఫోర్ ఇయర్స్ థర్టీన్ డేస్. భలే జ్ఞాపకశక్తి నీకు"
"ఎలాగూ ఆరుగంటల బస్ మిస్సైందిగదాని, మీ వాళ్ళందరినీ చూడాలని ఇంటికొచ్చేశాను మిత్రమా.. నీ పెళ్ళికి రాలేకపోయాను కదా! వెళ్ళిరానా మరి?"
"నో... అప్పుడేనా? కనీసం నెలరోజులైనా ఇక్కడుండాలి. అసలే ఫోర్ ఇయర్స్ థర్టీన్ డేస్ తర్వాత కలుసుకున్నాం."
"అవునవును ఫోర్ ఇయర్స్ థర్టీన్ డేస్. అయినా నెలరోజులు వుండటం కష్టం"
"పోనీ రెండ్రోజులైనా వుండాల్సిందే."
భవానీశంకర్ అందరి ముఖాల్లోకి చూశాడు.
"ఔనండీ! రెండ్రోజులైనా వుండండి" అంది సీత.
"యూ మస్ట్_ మిస్టర్ చంద్రకాంత్...! మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి" అంది పూజ.
"ఇప్పుడే వుండాలని లేదు. ఇంకోసారెప్పుడైనా వచ్చి వుండవచ్చు" అన్నాడు కనకారావు అయిష్టంగా.
"తప్పదంటావా?" గోపాల్రావ్ వైపు చూస్తూ అన్నాడు భవానీ.
"ఏమాత్రం తప్పదు."
"ఆల్ రైట్...! మీరంతా అంత ఇదిగా అంటూంటే నేనంత ఇది చేయటం బాగుండదు."
"ఏమాత్రం బాగుండదు."
"ఓకే టూ డేస్ గ్రాంటెడ్."
పూజ ఆనందంతో ఎగిరి గంతేసింది.
గోపాల్రావ్ ఆనందంగా అతన్ని కౌగలించుకున్నాడు.
"కమాన్! నీ గదిలో కెళ్దువుగాని."
"నా గదా? నా గది మీ ఇంట్లో ఎలా వుంది?"
"ఐమీన్ మా గెస్ట్ రూమ్."
ఇద్దరూ మేడ మీదకు నడిచారు.
కనకారావ్ చేయి అప్రయత్నంగా గన్ మీదకెళ్ళింది కసితో.
* * * *
ఇన్ స్పెక్టర్ రాంబాబు మందుకొట్టిన పెద్దపులిలా పోలీస్ స్టేషన్ లో పచార్లు చేస్తున్నాడు.
లాకప్ లో రాణి కూర్చుని "పోలీసులు_ వారి సైకాలజీ" అనే పుస్తకం చదువుతోంది. ఆ పుస్తకం ప్రముఖ గజదొంగ, డెకాయిట్ విక్కీ రాశాడు.
విక్కీ అసలు పేరు గంగరాజు. గంగరాజంటే పోలీసులు సరిగ్గా భయపడటం లేదని అనుమానం వచ్చి తన పేరు విక్కీగా మార్చుకున్నాడతను.
మార్చుకున్న దగ్గర్నుంచీ నిజంగానే అతనంటే పోలీసులకు గౌరవం పెరిగింది.
అదివరకు గంగరాజుగాడు_అనేవాళ్ళల్లా ఇప్పుడు విక్కీగారు అంటున్నారు. అయితే తమ సైకాలజీ గురించి విక్కీ అనే డెకాయిట్ గాడు పుస్తకం రాయటం పోలీస్ డిపార్ట్ మెంట్ కి నచ్చలేదు గానీ, ఈ పుస్తకాన్ని దూరదర్శన్ తెరమీద కనబడాలన్న కోరికతో మగ్గిపోతున్న పోలీస్ కమీషనరే దూరదర్శన్ కెమెరా ముందు ఆవిష్కరించేసరికి గత్యంతరం లేక అంతా తలో కాపీ కొనుక్కోవాల్సి వచ్చింది.
ఇద్దరు కానిస్టేబుల్స్ హడావుడిగా లోపలికొచ్చారు.
"ఏమయింది? దొరికినాయా?" అడిగాడు ఆత్రుతగా.
"లేద్సార్_ ఇల్లంతా వెతికాము_ రాణి ఫ్రెండ్ ఇంకో దొంగ రజని ఇల్లు కూడా సోదా చేశాం సార్_ దొరకలేదు. దొంగ నగలు, వజ్రాలు కొనే వ్యాపారస్థుల్ని కూడా ఎంక్వయిరీ చేశాం. రాణి తమకేమీ అమ్మలేదని చెప్పారు."