"కల్నల్? అయితే ఇంకా సిగ్గుపడాల్సిన విషయం కల్నల్! మీ అల్లుడు చెప్పిన మాటలు నమ్మకుండా బయటివాడయిన అతని ఫ్రెండ్ చెప్పే విషయాలే మీరు నమ్ముతున్నారంటే... మీ మెదడు ఓసారి స్కానింగ్ చేయించుకోవాలని నా పర్సనల్ అభిప్రాయం. ఏసియన్ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ వుంది. వెంటనే బయల్దేరటం మంచిది. స్కానింగ్ చేసేవాడు మనకి ఫ్రెండే! అపాయింట్ మెంటు లేకుండా చేసేస్తాడు."
"వాట్! నేను బ్రెయిన్ స్కానింగ్ చేయించుకోవాలా? ముందు నీ మెదడులోకి రెండు బుల్లెట్లు పంపాక అప్పుడు స్కానింగ్ గురించి ఆలోచిద్దాం" అంటూంటే సీత చప్పున వారించింది.
"అయ్యో డాడీ! మనం ఇతనిని గోపాల్రావ్ కి తెలీకుండా పిలిపించామన్న సంగతి మర్చిపోతున్నారు. ఆయనొచ్చేలోగానే అసలు విషయం తెలుసుకుని పంపించేయాలి. లేకపోతే ఆయన మనమీద మండిపడతారు."
"ఓ... అవునవును... ఎస్... ఓ.కె. మిస్టర్ చంద్రకాంత్! మీకు మీ ఫ్రెండ్ గోపాల్రావ్ సంగతి తెలిసే వుంటుంది. అందంగా కనబడే అమ్మాయిలంటే వీక్ నెస్ వుంది."
"ఆఫ్ కోర్స్! ఉంది. అది ఎక్కువగా వుండబట్టే మీ అమ్మాయిని వెంటపడి బ్రతిమాలి పెళ్ళి చేసుకున్నాడు."
కనకారావ్, సీత ముఖాలు వాడిపోయినయ్.
"దటీజ్ ఓ.కె. మిస్టర్! పెళ్ళయ్యాక కూడా ఆ వీక్ నెస్ వుండటం మంచిది కాదని నా అభిప్రాయం."
"కర్నల్! ఇంక లాభం లేదు_ యూ మస్ట్ గో టు హాస్పిటల్! బ్రెయిన్ స్కానింగ్ తప్పదు. కమాన్_ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని_ మన ఫ్రెండే వున్నాడక్కడ. అపాయింట్ మెంట్ లేకుండానే..."
"నో" బిగ్గరగా అరిచాడు కనకారావ్.
"లేకపోతే ఏమిటి కల్నల్? 'వీక్ నెస్' అనే పదానికి అర్థం తెలుసా?"
"తెలుసు!"
"తెలిస్తే చెప్పండి ఏమిటో?"
"వీక్ నెస్ అంటే... అదే వీక్ నెస్."
"ఎస్! వీక్ నెస్ కి అర్థం వీక్ నెస్ అయినప్పుడు అది ఏ మనిషిలో నుంచయినా ఎలా పోతుంది? పోదు_ వీక్ నెస్ అనేది పర్మనెంట్. మనిషి చచ్చేవరకూ అంతే! మీకు మాట్లాడితే గన్ పట్టుకుని కాల్చాలనుకోవటం వీక్ నెస్. ఎంత వయసొచ్చినా ఆఖరికి డెత్ బెడ్ మీదున్నా మీకా వీక్ నెస్ పోదు. చచ్చేలోగా ఇంకొక్కసారి గన్ ఎవడిమీదో ప్రయోగించాలనిపిస్తుంది. అవునా, కాదా?"
"నో_"
"ఎస్! డోంట్ సే నో_ కనుక మా గోపాల్రావ్ గాడిక్కూడా వీక్ నెస్ వుండటం సహజం. అందమయిన అమ్మాయిలు కనబడితే మాట్లాడవచ్చు. నవ్వవచ్చు, పరిచయం చేసుకోవచ్చు. అందులో తప్పేమిటి? నథింగ్? అవునా కాదా?"
"అంతవరకూ ఓ.కే. మిస్టర్! కానీ నిన్న రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి..."
"రాకపోయేసరికి ఎవరో అమ్మాయితో గడిపాడని అనుమానించేయటమేనా? మిస్టర్ కల్నల్! వెరీ బాడ్_ వెరీ బాడ్ బ్రదర్! మీరు గన్ పట్టుకుని ఎవడివెంటో పడినంత మాత్రాన మీరు కాల్చి చంపేసి వుంటారని అనుకోవాలా? నో... ఖచ్చితంగా మీ బ్రెయిన్లో ఏదో లోపం వుంది మిత్రమా! నా మాట నమ్మండి_ కమాన్ ఏసియన్ హాస్పిటల్ కెళ్దాం. ఇప్పటికయినా మించిపోయింది లేదు. మన ఫ్రెండే స్కానింగ్ మిషన్ దగ్గరున్నాడు."
"అంటే నిన్న రాత్రంతా ఆయన మీతోనే వున్నారా?" అడిగింది సీత ఆత్రుతగా.
"ఎస్ సిస్టర్! గోపాల్రావ్ చెప్పింది సెంట్ పర్సెంట్ కరెక్ట్. చాలా కాలానికి కలుసుకున్నామని చెప్పి నేనే బలవంతం చేసి బార్ కి లాక్కెళ్ళాను. అక్కడ కల్నల్ బ్రాండ్ విస్కీ తాగుతూ చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూంటే రాత్రి పన్నెండయిపోయింది. ఆ టైమ్ లో కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్ళటం మంచిది కాదని నేనే అన్నాను. ఆ పక్కనే వున్న మా హోటల్ రూమ్ లో పడుకున్నాం. పూర్ ఫెలో! నిద్రలో కలవరిస్తూంటే విన్నాను. సీతా! అయామ్ సారీ! నీ బర్త్ డే సంగతి మర్చిపోయాను_ ప్లీజ్ ఫర్ గివ్ మీ సీతా" అని ఒకటే ఏడుపు. తలగడంతా ఏడుపుతో తడిసిపోయాక నేనే వాడిని లేపి డోంట్ వర్రీ! భారత భార్య తప్పకుండా భర్తను అర్థం చేసుకుంటుంది. అది మన భారత స్త్రీ సంప్రదాయం అని ఓదార్చాను."
సీత కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
"అయామ్ సారీ చంద్రకాంత్ గారూ! మీకు చాలా ఇబ్బంది కలిగించాను."
"దట్సాల్ రైట్ సిస్టర్! ఈసారికి పర్లేదు. కానీ భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి. పచ్చని సంసారాలు కేవలం భార్యల అనుమానాలవల్లే సర్వనాశనమయిపోతాయన్న విషయం తెలుసుకోండి. మరి నే వెళ్ళిరానా కల్నల్?"
"ఓ.కె. జెంటిల్మన్! మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్"
భవానీశంకర్ గతుక్కుమన్నాడు.
"రెండ్రోజులు వుండండి" అంటుందేమో అని ఎక్స్ పెక్ట్ చేశాడు. సరిగ్గా అప్పుడే స్కూటరు ఇంటిముందాపి లోపలకు పరుగుతో వచ్చింది పూజ.
"అక్కా! మాకు హాలిడేస్ ఇచ్చేశారు. పదిరోజుల వరకూ మన మకాం ఇక ఇక్కడే" అంది వుత్సాహంగా.
"ఎందుకని హాలిడేస్ ఇచ్చారు?" అడిగాడు కల్నల్.
"ఎవరో చచ్చిపోయారంట."
"ఎవరు?"
"ఎవరో తెలీదు. మా ప్రిన్సిపాల్ ఎవరు పోయారో తెలుసుకుందామని ఫోన్లు చేసి చేసి చివరకు మనకెందుకులే అని శలవు డిక్లేర్ చేసేశాడు" అంటూ భవానీశంకర్ని చూసింది.
అప్పటికే అతను పూజ అందాన్ని తనివితీరా చూస్తున్నాడన్న విషయము గమనించి కొంచెం సిగ్గుపడింది.
"సీతాజీ! హూ యీజ్ దిస్ బ్యూటిఫుల్ గాళ్ ఆన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్?" అడిగాడు భవానీశంకర్.
"మా సిస్టరండీ! పేరు పూజ. ఈయన చంద్రకాంత్ గారు పూజా! మీ బావ ఫ్రెండ్."
పూజ ఉలిక్కిపడింది.
"మైగాడ్! రచయిత చంద్రకాంత్ గారా?"
"ఎస్ ఫ్రెండ్! మనమే..." సగర్వంగా అన్నాడు భవానీశంకర్_
"ఫేమస్ రైటర్ చంద్రకాంత్ మనమే".
అమాంతం అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని కరచాలనం చేసిందామె.
"అయామ్ యువర్ ఫ్యాన్ మిస్టర్ చంద్రకాంత్! మీర్రాసిన "జీవితమా_ ఓ నిముషం ఆగు" అనే నవల నేనెన్నిసార్లు చదివానో! కెన్ యూ ఇమేజిన్?"
"నో.. నావల్ల కాదు."
"టూ హండ్రెడ్ టైమ్స్"
"నో.. నేన్నమ్మను."
"యూ మస్ట్ బిలీవ్! నా డైరీలో డిటైల్స్ కూడా రాసుకున్నాను ఎప్పుడెప్పుడు చదివిందీ_ నా డైరీ చూపించమంటారా..?"
"అహ.. డైరీ అవసరం లేదు మిత్రమా! అందమైన కళ్ళే అంతరంగ డైరీలని నేనే ఏదో నవల్లో రాశాను."
పూజ థ్రిల్ అయిపోయింది.
"అబ్బ...! సూపర్బ్ ఎక్స్ ప్రెషన్. అందమైన కళ్ళే అంతరంగ డైరీలు.. మీరుతప్ప ఇంకెవరు రాయగలరలా..?"