రాంబాబు రాణి వైపు చూశాడు.
"నేను ముందే చెప్పానా? వజ్రాలు నేను కాజేయలేదని?"
"మరేమయినట్లు?"
"ఆ విక్కీ వాటిని ఎక్కడ పెట్టాడో చెప్పేవరకూ కనుక్కోవటం కష్టం"
"అయితే నువ్వు మరి ఆ రోజు విక్కీ ఇంట్లో మనం సోదా చేస్తున్నప్పుడు మధ్యలో సడెన్ గా ఎందుకు పారిపోయావు?"
"చెప్పాను కదా_ విక్కీగాడికి మనిద్దరం ఒకటయ్యామని తెలీకూడదు. అందుకే వాడి అసిస్టెంట్ వీర్రాజు చూసేట్లు పారిపోయాను."
"ఆ తర్వాతేం చేశావు?"
"మిగిలింది నా పర్సనల్ విషయం."
"పోలీస్ లకి తెలీకుండా దొంగలకేం పర్సనల్ విషయాలుంటాయ్?"
"ఒకతనిని ఆ టైమ్ కి కలుసుకుంటానికి చెప్పాను."
"తెలుసు. నువ్వు ఒకడితో ఎఫైర్ పెట్టుకున్నావు_ వాడితో ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ కెళ్ళావు. ఆ తర్వాత ఇద్దరూ చెడిపోయిన లిఫ్ట్ లో యిరుక్కుపోయారు. ఆ తర్వాత నీ ఇంటికెళ్ళావు" సీరియస్ గా చాలా గొప్ప పరిశోధకుడిలాగా చెప్పాడు.
"మైగాడ్! మీకివన్నీ ఎలా తెలిసినయ్?" విస్తుపోతున్నట్లు నటిస్తూ అంది రాణి.
రాంబాబు మరింత గర్వంగా చూశాడు.
"ఎవరు ఎప్పుడెక్కడ ఏం చేస్తోందీ మనం వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే వుంటాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ రాంబాబు_ ఓ.కే.!"
రాణి నవ్వుకుంది.
అప్పుడే విక్కీ రాసిన 'పోలీసులు వారి సైకాలజీ' బుక్ లో చదివింది. కామన్ సెన్స్ తో తెలుసుకోగలిగిన విషయాలన్నీ ఎంతో కష్టపడి ఎందుకూ పనికిరాని పద్ధతుల ద్వారా తెలుసుకొంటూంటారు పోలీసులు! అంతేకాదు, తాము అలా కనుక్కోవడంలో సూపర్ హ్యూమన్ బీయింగ్స్ ని అంతా అనుకోవడమే వారికి నచ్చిన సైకాలజీ అని విక్కీ రాశాడు. అంతేకాదు, వారు అలా అనుకోడానికి తగిన ప్రోత్సాహం కలిగించటం ప్రతి దొంగ లేక నేరస్థుని కర్తవ్యమని కూడా సలహా యిచ్చాడు.
"ఆల్ రైట్! మనిద్దరం వెళ్ళి ఆ విక్కీ గాడిని అడుగుదాం పద."
రాణి లాకప్ లో నుంచి బయటికొచ్చింది.
జీప్ లో విక్కీ ఉన్న సెల్ కి చేరుకున్నారు.
"వాడిని నేను ఇంటరాగేట్ చేయాలి_ మీరంతా వెళ్ళిపోండి"
కానిస్టేబుల్స్ కి చెప్పి సెల్ లోకి నడిచాడు రాణీతో.
విక్కీ రాంబాబుని చూస్తూనే నవ్వాడు.
"నీకోసమే చూస్తున్నా_ ఇంకా రాలేదేమిటా అని. దా! దా! దా!"
"ష్... అలా మాట్లాడితే మా వాళ్ళకు నామీద కూడా అనుమానం కలుగుతుంది. జాగ్రత్త!"
"అయితే ఎందుకొచ్చావసలు?"
"వజ్రాలు ఎక్కడ పెట్టావ్?"
"కిండర్ గార్డెన్ స్కూల్లో కుర్రాడి నడిగినట్లు అడుగుతున్నావు. నీ మెదడు అదే దశలో వుండిపోయిందని నాకు తెలుసు గానీ_ నేను ఆ దశలో లేను 'ఫలానా చోట పెట్టాను' అని చెప్పేయడానికి"
"ఒరే విక్కీ_ పిచ్చివాగుడు వాగకు_ ఆ వజ్రాలు అమ్మేయటానికి ఏర్పాట్లు చేస్తాన్నేను. నిన్ను ఎలాగూ తర్వాత పోలీసులు వదిలేస్తారు. వదలకపోతే అప్పుడు నేను వదిలించే ఏర్పాటు చేస్తా. అర్థమయిందా?"
"ఆహా... చాలా గొప్ప ప్లాన్లు కూడా వేస్తావన్న మాట నువ్వు. అందుకే పోలీస్ డిపార్ట్ మెంటులోకి సెలక్ట్ చేసి వుంటారు నిన్ను. ఏయ్ రాంబాబూ! నన్ను లోపల వేయించింది నువ్వే_ ఏమీ తెలీనట్లు నాటకమాడుతోంది నువ్వే_ నా దగ్గర కాదు నీ వేషాలు_ నన్ను జైల్లో నుంచి వదిలే వరకూ వజ్రాలు ఎక్కడ దాచిండీ చెప్పను"
"చెప్పకపోతే జీవితాంతం నువ్వు జైల్లోనే ఉండేట్లు చేస్తాను. నా సంగతి నీకు తెలీదు."
"ఏం ఫర్లేదు. వజ్రాలు నీకు దక్కకుండా వుంటే_ జైల్లో ఎంతకాలం వున్నా ఓ.కే!"
రాంబాబు కేం చేయాలో తెలీలేదు.
"సరే_ చావ్_ నువ్వు జైల్లోనే భూస్థాపితం అయ్యేట్లు చేస్తాను" అన్నాడు కసిగా.
వాళ్లిద్దరూ వెళ్ళగానే విక్కీ వీర్రాజు వచ్చాడతనిని చూడ్డానికి.
"నువ్వో పనిజేయాల్రా! చేయగలవా?"
"ఏంటది"
"ఇలా దగ్గరకు రా."
తన తల కటకటాల దగ్గరకు చేర్చాడు వీర్రాజు.
"వజ్రాలు రెండూ మన చేపల ఎక్వేరియంలో వేశాను. అవి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసేయాలి_ మనం దొంగ నగలు అమ్మే షాప్ లో ఇచ్చేసెయ్."
"పోలీసులకు తెలుస్తుందేమో!
"ష్! పోలీసుల పేరెత్తకు_ వాళ్ళు నీ జోలికి రార్లే. వాటిని ఆ షాప్ లో అమ్మేసి మళ్ళీ వచ్చి నాక్కనబడు."
వీర్రాజు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
తనూ రాణీ వాటికి అమ్మేసి లేచిపోతారని పిచ్చి బాస్ కీ తెలీదు అనుకున్నాడు.
* * * *
రచయిత చంద్రకాంత్ టీవీ ఛానెల్ ఆఫీస్ కొచ్చాడు.
ఛానెల్ క్రియేటివ్ హెడ్ నీలకంఠం మందు కొడుతున్నాడు గదిలో.
"ఏంటి గురువుగారూ! అర్జంటుగా రమ్మని కబురు చేశారంట?" అన్నాడు టేబుల్ మీద కూర్చుంటూ.
నీలకంఠానికి కోపం ఆగలేదు.
"నీకేమయినా బుద్ధుందా? నీకెన్నిసార్లు చెప్పాను_ హిందీ సీరియల్స్ ని మక్కికి మక్కీ కాపీ కొట్టొద్దని. ఇదిగో ఈ ఉత్తరం చూడు. నువ్వు కాపీ కొట్టిన ఒరిజినల్ హిందీ సీరియల్ తాలూకూ ప్రొడ్యూసర్ లాయర్ నోటీస్ పంపాడు" ఉత్తరం చంద్రకాంత్ ముఖాన కొట్టాడు.
అది చదివేసరికి చంద్రకాంత్ కి భయం వేసింది.
"మనం కాపీ కొట్టినట్లు ఎక్కడో బాంబేలో ఉన్నవాడికి ఎలా తెలిసిందంటావ్?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
"ఎవడో మనమంటే పడనోడు చేసిన పని యిది."
"మా ఘోస్ట్ రైటర్ కి ముందే చెప్పాను బాస్! ఉన్నదున్నట్లు కాపీ కొట్టకురా అని. వాడికి మరీ బద్ధకం బలిసిపోయి వున్నదున్నట్లు దంచేస్తున్నాడు."
"అందుకే నీ స్క్రిప్ట్ నువ్వే రాయటం అలవాటు చేసుకోమన్నాను."
"మూడువేలు పడేస్తే రాసిచ్చే వాడున్నప్పుడు మనకెందుకు బాస్ ఆ హెడేక్."
"ఇప్పుడా లాయర్ నోటీస్ కి ఏం సమాధానం చెప్తావు?"
"నాకేం తెలుసు? మీరేగా అది కాపీ కొట్టి రాయమంది?"
"ఆ తప్పుడు వాగుడే వాగొద్దన్నాను. పోన్లే కదాని మంచి రేటింగ్ ఉన్న హిందీ సీరియల్ స్క్రిప్ట్ ని రహస్యంగా తెప్పించి నీకిచ్చి రాయించినందుకు నా మీదకే తోస్తావ్?"
"మాతో వూరికే రాయిస్తున్నావా? రాసే ఛాన్స్ నాకిచ్చినందుకు కిక్ బాక్స్ తీసుకోవటంలా? పైగా ప్రొడ్యూసర్ దగ్గర మళ్ళీ కమీషన్ కొట్టేయటంలా?"
నీలకంఠం స్టన్ అయిపోయాడు.
తనకు ఇంతవరకూ ఏ రచయితా ఇలా ఎదురు తిరగలేదు.