Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 21

 

    "అతనికి పేరు గూప్ చంద్ కాదు డాడీ - భూప్ చంద్ ...." సరిదిద్దిందామే.
    "భూత్ చంద్ .. ఒకే... భూత్ చంద్ లోపలికేళ్ళు - అర్జంటుగా యూనిఫారం తగిలించుకునిరా! నాకు చాలా హెల్ప్ చేయాల్సి ఉంది నువ్వు!"
    "నా పేరు భూప్ చంద్ అండీ! "భూత్' కాదు.....వినయంగా చెప్పాడు దీప్ చంద్.
    "దట్సాల్ రైట్ -సమ్ బ్లడీ చంద్ - హరియప్ - హరియప్-"
    సరిగ్గా అప్పుడే ఉరుము ఉరిమింది మళ్ళీ - అయితే ఈసారి ఇంకొంచెం భీకరంగా .
    ఆర్.బీమారావ్ టక్కున ఫోన్ దగ్గర కెళ్ళి టీవీ స్టేషన్ కి ఫోన్ చేశాడు.
    "హలో దూరదర్శన్ ఆపరేటర్ -" అంది ఓ ఆడపిల్ల చిరాగ్గా.
    "హలో - నువ్వెవరివో నా కనవసరం - ఇంకోసారి అలాంటి చెత్త వెదర్ ఫోర్ కాస్ట్ ఇచ్చారంటే మీ దూరదర్శన్ - మళ్ళీ దర్శనమివ్వకుండా మూయించేస్తాను జాగ్రత్త - " అని ఫోన్ పెట్టేశాడు.
    వెంటనే మళ్ళీ తన టేబుల్ దగ్గర కూర్చుని సర్వ్ రిపోర్ట్ తయారు చేయటం ప్రారంభించాడు.
    హటాత్తుగా మళ్ళీ ఉరిమింది.
    ఆ ఉరుము వెనుకే ఓ మెరుపు -
    ఆ మెరుపు వెనుకే మహేశ్వరిదేవి - నమస్తే - ఓ బలసిన చిన్నసైజు గుర్రంలా లోపలకు జొరబడింది.
    "నమస్తే ఆర్. భీమారావ్ గారూ - నమస్తే -" అంది బందర్లోని ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ సైరన్  కూతలా.
    ఆర్. బీమారావ్ అదిరిపడ్డాడు. అతను బందరు పార్టీ మీటింగ్ కెళ్ళినప్పుడు ఆ కంపెనీ సైరన్ విన్నాడు. తనింట్లో హటాత్తుగా అదే సైరన్ ఎలా మ్రోగిందా అన్న ఖంగారుతో కొద్ది క్షణాలు బుర్ర పనిచేయడం మానేసింది.
    వెనక్కు తిరిగి మహేశ్వరిదేవిని చూచి ఆశ్చర్యపోయాడు. "మీరా!" అన్నాడు అయోమయంగా . ఆమె ఎప్పుడు లోపలికొచ్చిందో తెలీటం లేదు.
    "అవును!" అందామె.
    "మరా సైరన్ సంగతేమిటి? ఎలా వినిపించింది?" అడిగాడతను.
    "ఏ సైరన్?" అడిగిందామె ఆశ్చర్యంగా.
    "అదే - ఇప్పుడు మీకు సైరన్ వినిపించలేదూ/ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ సైరన్-"
    "ఏమో నాకేం వినిపించలేదు"
    ఆర్. భీమారావ్ ఇంక లాభం లేదని ఆ టాపిక్ ఆపేశాడు.
    మహేశ్వరీదేవి అచ్చం గుర్రం సోఫాలో కుర్చున్నట్లే కూర్చుంది.
    "మీతో చాలా ముఖ్యమయిన విషయం మాట్లాడాలని వచ్చాను -" అంది ఓ క్షణమాగి.
    తనా ఎలక్షన్ సర్వే రిపోర్ట్ రాయకుండా ఇలా ఇంతమంది ఎందుకు అడ్డు పడుతున్నారో అతని కేమాత్రం అర్ధం కావటం లేదు.
    "ఏ విషయం?' అడిగాడు అక్కడే నిలబడి చిరాగ్గా.
    "ఇలా కూర్చోండి! చాలా ముఖ్యమయిన విషయం ఇది-"
    అయిష్టంగానే సోఫాలో కూర్చున్నాడతను.
    "చెప్పండి - ఏమిటది?"
    "మావారు - శివతాండవం - మీకు బాగా పరిచయం ఉంది కదా?"
    "లేకపోవడం ఏమిటి? మాపార్టీ న్యూస్ అంత ఎక్కువ ప్రచురించే డెయిలీ అదొక్కటే కదా?"
    "అవునా! ఇప్పుడాయనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని చేయాలంటున్నాను-"
    "అంటే మీ ఉద్దేశ్యం రోటరీ గవర్నర్, లయన్స్ గవర్నర్ లాంటి పోస్ట్ - కదూ?"
    "ఛీ! అవయితే! మీ దగ్గరకు రావటం ఎందుకు? నిజం గవర్నర్ పోస్ట్! మన రాష్ట్ర గవర్నర్!"
    ఆర్. భీమరావ్ కి పొజిషన్ అర్ధమయిపోయింది.
    శివతాండవంలాంటి - ఓ దద్దమ్మకు గవర్నర్ పోస్టా?
    తనకు క్లబ్ లో కలిసినప్పుడల్లా తనతో వాదనలే! తను చెప్పే ప్రతి విషయమూ కాదనడమే! అన్నీ తప్పులు మాట్లాడటమే. జనరల్ ఎలక్షన్ అయిదేళ్ళకోసారి అంటే - కాదు నాలుగేళ్ళకోసారి అంటాడు. బ్రిటన్ లో అధికారంలో ఉంది కాన్సర్వేటివ్స్ అంటే - కాదు లేబర్ పార్టీ అంటాడు.
    అమెరికా ప్రెసిడెంట్ రిపబ్లిక్ పార్టీ అంటే డెమొక్రసీ అంటాడు. రాజకీయాల్లో ఏబీసీడీలు తెలియని అలాంటి పక్షి ఓ డెయిలీకి చీఫ్ ఎడిటర్ గా ఎలా ఉన్నాడా అని తనకెప్పుడూ ఆశ్చర్యమే.
    అందాకా ఎందుకు? వెస్టీండీస్ , ఇండియాతో టెస్ట్ మాచ్ ఆడుతున్నప్పుడు కపిల్ దేవ్ అద్భుతమైన కాచ్ పట్టుకున్నాడనీ - అందువల్ల సునీల్ గవాస్కర్ అవుటయ్యాడనీ అన్నాడు -
    అదేమిటి వాళ్ళిద్దరూ మన టీమ్ వాళ్ళే కదా అంటే - వినిపించుకోడు! తను కళ్ళారా టీవీలో చూశానని వాదిస్తాడు.
    అలాంటి వెధవాయికి గవర్నర్ పదవా?
    నో! తన కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని అది! అతనికి గవర్నర్ పోస్టు తను ఇప్పించడు. సరికదా - ఇంకెవరయినా ఇప్పించాలనుకుంటే తప్పక అడ్డుపడతాడు.
    "మహేశ్వరిదేవిగారూ!" కోపంగా పిలిచాడు ఆర్.భీమారావ్.
    మహేశ్వరిదేవి ఆనందంగా అతని వేపు చూచింది.
    'చెప్పండి! ఆయనకు మీ దగ్గరకోసారి పంపించమంటారా?"
    "నా దగ్గరకా? ఎందుకు?"
    "అదే గవర్నర్ పోస్టుకి అప్లీకేషన్ ఫారాం అది - నింపాల్సి ఉంటుందేమో కదా-"
    "చూడండి - గవర్నర్ పదవికి ఉండాల్సిన ముఖ్యమయిన అర్థత శివతాండవానికి లేదు!" అన్నాడు ఆర్. భీమారావ్ నెమ్మదిగా.
    "ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "అతని మానసిక పరిస్థితి సవ్యంగా ఉండాలి . అంటే -- పిచ్చాడు కాకుండా ఉండాలి! మరి శివతాండవానికి ఈ అర్హత లేదు కదా?"
    మహేశ్వరి దేవికి వళ్ళు మండిపోయింది. ఆవిడ ముక్కు పుటాల్లో నుంచి ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉన్న మోటార్ సైకిల్ లా ఆవిరి వెలువడింది.
    "హు!' అంది అదే మోటార్ సైకిల్ కి కిక్ కొట్టిన శబ్దంతో.
    "మీరింక దయచేస్తే - నేను నా పని చూసుకుంటాను - " అన్నాడు ఆర్. భీమారావ్.
    మహేశ్వరీదేవి వెయ్యి టన్నుల క్రేనులా లేచి నిలబడింది.
    "అయితే ఆయనను గవర్నర్ గా రికమెండ్ చేయరన్న మాట!" అంది బెదిరింపుగా.
    "నేనే కాదు! ఏమాత్రం బుద్దున్నా - ఎవడూ పిచ్చాడిని గవర్నర్ గా చేయడు."
    "అయన పిచ్చాడు కాడని నేనంటున్నాను"
    "అవునని నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను"
    "అంతేనా?" అందామె.
    "అంతే!' అన్నాడు ఆర్. భీమారావ్.
    "ఎలక్షన్లో మా క్లబ్ వాళ్ళు మీకు చేసిన సహాయం మర్చిపోయారా?"
    "మీ బోడి క్లబ్ సహాయం ఉన్నా ఒకటే - లేకపోయినా ఒకటే! మాకు ముఖ్యమైనవి బలహీనవర్గాల ఓట్లూ గాని -- మీలాంటి వాళ్ళ ఓట్లు ఎవడికి అక్కర్లేదు"
    "ఐసీ-' అందామె ఇంకా ఆవేశపడిపోతూ.
    "యస్ - యూ కెన్ సి -" అన్నాడు భీమారావ్.
    "వచ్చే ఎలక్షన్లో నువ్వెట్లా గెలుస్తావో చూస్తాను" అందామె రోషంగా.
    "నువ్వు" అంటూ ఏకవచనం ప్రయోగించేసరికి భీమారావ్ కి అరికాలి మంట నెత్తికెక్కింది.
    తను రాజకీయ సభల్లో మాట్లాడుతూన్నప్పుడు ఎవరయినా జనంలో నుంచి 'ఒరేయ్ - నువ్వు అపరా" అనో- లేక "చాల్లే . దిగు " అనో , "సుత్తి వద్దు" అనో అనటం విన్నాడు గానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ చచ్చేంతగౌరవం ఇస్తారు.
    "గెటౌట్ !" అన్నాడు భీమారావ్ బయటకు చేయి చూపిస్తూ.
    మహేశ్వరి ఎదురుతిరిగింది.
    "నేను వెళ్ళను" అంది మొండి కేసి.
    భీమారావ్ ఈ పరిస్టితి ముందే ఊహించడం చేత "భూత్ చంద్ " అంటూ ఇల్లేగిరెట్లు అరచాడు. కొత్త నౌఖరు నుద్దేశించి.
    మరుక్షణంలో దీప్ చంద్ అద్భుతమయిన నౌఖరు యునిఫారమ్ తో ఓ ట్రేలో ఉప్మా , టమాటో పచ్చడి తీసుకుని బయటి కొచ్చాడు.
    "ఆ రాక్షసిని బయటకు గెంటు!" అన్నాడు భీమారావ్ ,మండి పడుతూ.
    దీప్ చంద్ కి ఏమీ అర్ధం కాలేదు. రాక్షసులనేవి పూర్వకాలంలో ఉండేవని తెలుసు గానీ - ఇప్పుడు వాటి ప్రసక్తి ఎందుకొచ్చిందో తెలీలేదు.
    "ఏ రాక్షసినండీ?" వినయంగా అడిగాడు.
    "అదిగో - అదే - ఆ బ్రహ్మరాక్షసిని !" అంటూ మహేశ్వరిని చూపించాడతను.
    దీప్ చంద్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    ఆమె రాక్షసిలానే కనబడుతోంది గానీ - రాక్షసుల్ని ఎలా బయటకు గెంటుతారో భవానీశంకర్ తనకు చెప్పలేదు.
    ఈలోగా మహేశ్వరిదేవి తన బాగ్ లో నుంచి ఓ ఫోటో తీసింది.
    "నన్ను రాక్షసి అన్నావ్ కదూ?" అందామె కసిగా.
    "అన్నాను."
    "అయితే ఇదిగో - నిన్నేం చేస్తానో చూడు! ఈ ఫోటో మా 'తెలుగు కిరణం' దినపత్రికలో ప్రచురించి నీ పరువు బజార్లో పెడతాను - మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలుస్తావో చూస్తాను -" అంటూ ఫోటో అతని ముఖం మీదకు విసిరికొట్టింది.
    ఇంక తను ఉపేక్షిస్తే లాభం లేదని చేతిలోని ట్రే టీపాయ్ మీదుంచి ఆమెను బయటకు గెంటడానికి ఆమె దగ్గరకు నడిచాడు దీప్ చంద్.

 Previous Page Next Page