Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 22


    తండ్రి ధోరణికే తులసి మనసు చికాకుపడుతుంటే, జానకి అందుకుంది.
    "అవును సొంతబిడ్డలాగే చూసుకున్నాం! ఆ రోజుల్లో పెన్సిల్ కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేకుండా సూర్యం అవస్థపడుతోంటే నేను పువ్వులు కొనుక్కోవటం మానేసి, సూర్యానికి పెన్సిల్ కొనిచ్చాను. గుర్తుందా సూర్యం?"
    "ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు లేమ్మా!" ఊరుకోలేక అనేసింది తులసి. అదృష్టం బాగుండి ఒకరు పైకివచ్చిన తరువాత వాళ్ళు కష్టకాలంలో ఎలా ఉండేదీ గుచ్చినట్లు చెప్పి, అప్పుడు తాము ఎంత సహాయం చేసిందీ చాతుకోవటం కొందరికెంతో ఇష్టం. తమ సంభాషణ ఎదుటివాళ్ళకెంత కష్టం కలిగిస్తుందో, ఆ ఆలోచనకూడా రాదు.
    ఆ రోజులు బహుశః సూర్యానికి భయంకరమయిన పీడకలలా ఉండి ఉండాలి! అవన్నీ తలచుకోవటం, ఇప్పటి ఈ స్థితిలో అతనికి బాగుంటుందా?
    "పరవాలేదు లెండి! ఇక్కడ నాకు కొత్తవాళ్ళెవరు?" సూర్యం నవ్వుతూ అన్నా ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం వినిపించింది తులసికి.
    "ఇప్పుడు ధనం ఎక్కడుంది? దాని మొగుడేం చేస్తున్నాడు?" కుతూహలంగా అడిగింది సుమతి.
    ఈ ప్రశ్న వినగానే సూర్యం ముఖం ఒక్కసారిగా నల్లబడిపోయింది. భరింపరాని ఆవేదన ఆ ముఖంలో స్పష్టంగా ప్రతిఫలించింది.
    "చచ్చిపోయింది."
    "చచ్చిపోయిందా? ఎలా? ఏం జబ్బు?"
    "జబ్బు చెయ్యలేదు. ఆత్మహత్య చేసుకొంది."
    "ఆ....త్మ....హత్య! ఎందుకు!"
    "బాధలు పడలేక."
    "బాధలుపడలేక ఆత్మహత్య చేసుకోగలరా? భయం వెయ్యదూ? అబ్బ! ఎంత హాయిగా చావగలిగిందీ!"
    సూర్యం ఆశ్చర్యంగా సుమతిని చూశాడు!
    "నువ్వూ చావు హాయిగా! పిల్లలకేం ఫరవాలేదులే! రోగిష్టి తల్లికంటే సవతి తల్లే మేలు?"
    ఎప్పుడు వచ్చాడో నీలకంఠం. చల్లగా నవ్వుతూనే తేలుకొండెలా అంటించాడు. ఆ మాట వినగానే రెచ్చిపోయింది సుమతి.
    "ఏమిటీ? నేను చచ్చిపోవాలా? అప్పుడే సంబంధం కూడా చూసుకున్నారా, సవతితల్లి అంటున్నారు? నా కన్నబిడ్డల్ని, నాకంటే అదెవత్తో బాగా పెంచుతుందా? నేను చావను. చచ్చినా చావను, మహాపతివ్రతా శిరోమణిని__ మీతోనే చస్తాను."
    తులసి నిస్సహాయంగా నిలబడిపోయింది. ఆ మూడ్ లో సుమతిని కంట్రోల్ చెయ్యాలని ప్రయత్నించినా ఏం లాభం లేదు.
    సూర్యం_సుమతినీ, నీలకంఠాన్నీ ఇబ్బందిగా చూసి నవ్వు తెచ్చిపెట్టుకొంటూ, "సుమతీ! మీ ఆయన మరొక పెళ్ళి ఎలా చేసుకుంటాడనుకున్నావ్? నీలాంటి అమ్మాయి ఆయనకు దొరకాలన్నా దొరుకుతుందా?" అన్నాడు.
    ఏ కళనుందో సుమతి కాస్త తగ్గి నోరుమూసుకొంది.
    "నామాటకేం గాని, మా తులసిలాంటి పిల్ల మాత్రం ఎవరికీ దొరకదు. దాన్ని నువ్వు పెళ్ళిచేసుకో!" అంది గబుక్కున.
    నిర్ఘాంతపోయింది తులసి. వంచిన తల ఎత్తలేకపోయింది. జానకి వెంటనే అందుకొంది.
    "ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకాలంటే దోసెళ్ళ కొద్దీ డబ్బు ఖర్చు చెయ్యాలి. నువ్వు దాన్ని కట్నం లేకుండా పెళ్ళిచేసుకుంటానంటే, అంతకంటే మాకేం కావాలి? తులసి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే, నాకు కాస్త మండూ మాకూ చూసేవాళ్ళు ఎవరూ ఉండరనుకో! పోనీలే నేనేమయిపోతేనేం?"
    అప్పుడే తులసి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయినట్లూ, తనకు మందు కొనిచ్చేవాళ్ళు లేక అవస్థపడుతున్నట్లూ ఊహించుకొని బాధపడిపోతూ అంది జానకి.
    జగన్నాథం పంతులు ఇంతెత్తున ఎగిరి పడుతూ, "నోరు మూసుకో! నేను తులసికి ఏ సంబంధమంటే ఆ సంబంధం చెయ్యను. నాకు వచ్చిన లక్షలో యాభైవేలు కట్నముగా ఇచ్చి, తులసికి గొప్ప దర్జా అయిన సంబంధం చేస్తాను" అన్నాడు.
    నీలకంఠం ఆశ్చర్యంగా, "మీకు బ్రాకెట్ లో లక్ష రూపాయలు వచ్చాయా?" అన్నాడు.
    పంతులు ధీమాగా, "ఇవాళ రాలేదు. కొంచెములో పోయాయి. రేపు తప్పకుండా వస్తాయి." అన్నాడు.
    నీలకంఠం కావాలని వెటకారంగా విరగబడి నవ్వి, "సూర్యంగారూ! కంగ్రాచ్యులేషన్స్. మీకు మా మావగారు పిల్లనియ్యనని అంటున్నారు." అన్నాడు.
    తులసి మనసు ముక్కలు ముక్కలయిపోతోంది. ఇంక నిలబడలేక, "సూర్యంగారూ! ఇంక వెళ్దామా?" అంది. తులసి ముఖం చూస్తే సూర్యానికి చాలా జాలి కలిగింది.
    "పదండి!" అన్నాడు లేచి.


                                    12


    "ఇవాళ ఎంత ఆశ్చర్యకరమైన, భయంకరమైన నిజాలు తెలుసుకున్నాను? నాన్నకీ, చివరికి అమ్మకి కూడా నేను పెళ్ళిచేసుకొని వెళ్ళిపోతానేమోననే భయమే! ఆ భయానికి రకరకాల రంగులు పులుముతున్నారు. ఆ ఇంట్లో__ఆ మనుష్యుల్లో, ఒక్కరికయినా, తాము ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? ఎందుకిలా తయారవుతారు మనుష్యులు? నేను కథల్లోలాగ నా కుటుంబం కోసం, అక్కకోసం, బావకోసం, బావ పిల్లలకోసం త్యాగాలు చెయ్యటానికి సిద్ధంగా లేను. నన్ను మీరు ఈ మురికి కూపంలోంచి బయటకు తీసుకుపోగలిగితే జన్మ జన్మలకూ మీకు కృతజ్ఞురాలినయి ఉంటాను. ఆ ఇంట్లో, ఆ వాతావరణంలో ప్రతి క్షణం ఒక నరకంగా ఉంది నాకు."
    ఈ మాటలన్నీ తులసి మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ, పెదవి విప్పి తాను మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడగలదు? సూర్యం తనపైన కొద్దిపాటి అభిమానం చూపిస్తున్నాడు. నిజమే! కానీ, ఏనాడూ ప్రేమ మాటలు మాట్లాడలేదు. పెళ్ళిచేసుకుంటాననీ అనలేదు. వేలికి ఉంగరం తొడిగాడు. అదీ అతను తొడగలేదు. అతడు ఉంగరం బహుమానముగా ఇస్తే, తనే చెయ్యి జాపింది. ఆ తరువాతయినా అతను ఏ విధమయిన చనువూ తీసుకోలేదు. ఒకవంక అభిమానం చూపిస్తోనే, అల్లంత దూరాన నిలబెట్టగలిగే గాంభీర్యమేదో అతని వ్యక్తిత్వములో ఉంది.

 Previous Page Next Page