అన్నింటికంటె తులసికి విచిత్రమనిపించిన విషయము "వెధవచాకిరీ! ఇంతమందికి చాకిరీ చెయ్యలేక చస్తున్నాను. నేను మాత్రం రోగిష్టిదానిని కాదా ఏమిటి? అని సుమతి విసుక్కోవటం.
సుమతికి ఫిట్స్ వస్తాయని జానకి ఆరోగ్యంగా తిరగగలిగినంతవరకూ ఇంటిపని మూడువంతులు తనే చేసేది. ఇప్పుడు తల్లి మంచమెక్కితే అక్క అలా విసుక్కోవటం తులసికెలాగో అనిపించింది. అయినా సుమతిని ఏమీ అనలేకపోయేది తులసి. సుమతి ముఖంచూస్తే లోకంలో దైన్యమంతా అక్కడే గూడుకట్టుకున్నట్లు కనిపించేది. ఆ ముఖంలోకి చూస్తూ అక్కను మరింత హింసించగలిగేశక్తి తులసికి లేకపోయింది. అంచేత ఉద్యోగం చేస్తూనే అక్కకు చేతనయినంతవరకూ ఇంటిపనిలో సాయం చేయడానికి ప్రయత్నించేది తులసి.
ఆరోజు సాయంత్రం బస్ స్టాప్ లో నిలబడి బస్ కోసం ఎదురుచూస్తోంది తులసి. అనుకోకుండా సూర్యం వచ్చి పక్కన నిలబడ్డాడు. తులసి కంగారుపడి సర్దుకొని తడబడుతూ "మీరు ఇటు ఎక్కడకు వెళ్తున్నారు?" అంది.
సూర్యం నవ్వి "ఎక్కడికీ వెళ్ళటంలేదు. మీ ఇంటికే వస్తున్నాను. మిమ్మల్ని నా ఇంటికి పిలిచాను. మీరు తిరిగి మీ ఇంటికి ఆహ్వానించరా? ఇక మీరెలాగూ పిలవరని నిర్ధారణ చేసుకుని నేనే వస్తున్నాను" అన్నాడు. ఆ సమాధానానికి తులసి నవనాడులూ కృంగిపోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వాతావరణమెలా ఉంటుందో? పిల్లలు ఇల్లంతా ఎంత చిందరవందరచేసి ఉంచుతారో? అక్కా బావా పోట్లాడుకొంటూ ఉంటారో? లేక అమ్మ నాన్నా పోట్లాడుకొంటూ ఉంటారో? లేక చచ్చిపోతున్నాను అనుకుంటూ ఎప్పటిలా గొడవచేస్తూ ఉంటుందో? అక్క కాస్త కుదురుగా మాట్లాడే స్థితిలో ఉంటుందో? లేక బావతో అరిచి అరిచి పిచ్చిదానిలా ఏదిపడితే అది వాగే దశలో ఉంటుందో?
తులసి మాట్లాడకపోవటం చూసి "ఏమిటలా ఆలోచిస్తున్నారు? ఆ ఇంట్లో నాకు కొత్తవాళ్ళెవరు? అందర్నీ ఒకసారి చూడాలని ఉంది" అన్నాడు సూర్యం.
"నేనిప్పుడు ఇంటికి వెళ్ళటంలేదు. అమ్మకు టానిక్ కొనాలి." గొణుగుతున్నట్లుగా అంది.
"దీనిదేముంది? ఇద్దరం కలిసి టానిక్ కొనుక్కునే ఇంటికి వెళ్దాం!"
ఇక తులసి తప్పించుకోలేక పోయింది__
ఇంటికి వచ్చేసరికి ఏ పోట్లాటలూ లేక, ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉండటం చూసి "హమ్మయ్య" అనుకుంది తులసి.... జానకి మంచం దగ్గరగా కూచుని తనచేత్తో తల్లి గుండెలు రాస్తోంది సుమతి. ఆ దృశ్యం చూసిన తులసి మనసు ఏదోలా అయిపోయింది. ఈ కుటుంబాలలో మమకారాలు బాగా ఉన్నాయి. కానీ పరిస్థితులు ఎక్కడికక్కడ దుడ్డుకర్రలతో నడుములు విరక్కొడుతోంటే ఆ మనసులు రకరకాల వికృతాలను పొందుతున్నాయి.
సుమతి సూర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, "ఆయనెవరే?" అని అడిగింది.
సుమతి అంతగా చదువుకోలేదు. వచ్చినకొద్ది చదువూ పూర్తిగా మరిచిపోయింది. సంస్కారమూ, సభ్యత ఇవన్నీ ఆలోచించేటంత స్థిమితం ఆ నలిగిపోయిన, నలిగిపోతున్న మనసుకు లేదు. ఏదైనా సుమతికి నచ్చజెప్పాలని చూసినా ప్రయోజనం లేదు. తనలో ఏదైనా పొరపాటు ఉందని ఎవరైనా అంటే వెంటనే వాళ్ళమీద విరుచుకు పడిపోతుంది సుమతి.
ఇంటికెవరైనా వచ్చినప్పుడు మర్యాదగా నమస్కారం చెయ్యడం, పరిచయం చేసేవరకూ ఆగటం, ఇవన్నీ సుమతి ఏనాడో వదిలేసింది.
సుమతి ధోరణికి తులసి కలవరపడుతోంటే సూర్యం మాత్రం ఒక కుర్చీ జానకి మంచం దగ్గరగా లాక్కుని కూచుండి, "నన్ను మరిచిపోయావా సుమతీ!" అన్నాడు నవ్వుతూ.
ఈ మాటలతో జానకి, సుమతి ఇద్దరూ సూర్యాన్ని పరీక్షగా చూసి తెల్లబోతూ ఒకరి మొఖం మరొకరు చూసుకున్నారు.
"నేను సూర్యాన్ని....."
ఈ మాటలు వినగానే జానకి మంచంలో లేచికూచుని "ఏమిటి? నువ్వు సూర్యానివా? ధనలక్ష్మి తమ్ముడివా?" అంది.
జానకి కంఠములో వినిపించిన కొద్దిపాటి నిరసన తులసి మనసుకే గుచ్చింది. సూర్యం ముఖములోకూడా నవ్వు ఎగిరిపోయింది.
"నువ్వా? ఇప్పుడు ఏ బళ్ళో నౌకరుగా ఉన్నావ్?" అంది పాతరోజులు గుర్తుచేసుకొంటూ. ఆనాటినుంచీ ఈనాటివరకూ సజీవముగా ఉన్న చులకనభావముతో తులసి కంగారుపడిపోయి, "అక్కా! ఈయన ప్రస్తుతము నేను పనిచేస్తున్నకంపెనీలో మేనేజర్ గా వున్నారు. మనమంటే ఏదో ఉండే అభిమానముకొద్దీ మనింటికి వచ్చారు కానీ...." అంటూ ఆగిపోయింది ఎదురుగా సూర్యం ముఖం చూస్తూ. తులసికి మరింత ఆశ్చర్యం కలిగిస్తూ సూర్యం నవ్వుతూనే కూచున్నాడు.
"ఆ!" అంటూ నోరు తెరిచేశారు జానకి, సుమతి. "ఎవరూ?" అంటూ లోపలికొచ్చాడు జగన్నాథం పంతులు. "మన సూర్యం అండీ! ఇప్పుడు పెద్ద మేనేజర్ అయ్యాట్ట" సంబరంగా చెప్పింది జానకి.
ధనలక్ష్మి తమ్ముడు, 'మన సూర్యం' అయిపోయాడు. కంఠములో నిరసనలేదు, సంభ్రమము తప్ప. "ఒరె! ఒరే! నువ్వట్రా? ఎంతవాడివయి పోయావ్?" ఆప్యాయముగా భుజము మీద ఒక్కటి చరిచాడు జగన్నాథం పంతులు.
"ఏదో మీ దయవల్ల....." వినయముగా అన్నాడు సూర్యం.
ఆ వినయము జగన్నాథం పంతులులోని పంతులుకి ఒక్కసారిగా ఊపిరిపోసింది. ఇటీవలకాలములో అతనిముందు ఆ మాత్రము వినయము చూపించినవాళ్ళే లేరు.
"నాకు చాలా సంతోషంగా ఉందోయ్! ఆ రోజుల్లో ఒక్క అణా డబ్బులకోసం గంటలకొద్దీ నా కాళ్ళు పట్టేవాడివి. అణా చేతిలో పడగానే పొంగిపోయేవాడివి. పాపం! చిన్న తప్పు చేసినా బెత్తముతో చావబాదేసేవాడిని. మంచివాడివిలే! ఎప్పుడూ ఎదిరించేవాడివి కావు. కాబట్టే ఇంతపైకి వచ్చావనుకో! కొట్టానంటే ఊరికే కొట్టానా? నిన్ను నా సొంత బిడ్డలా చూసుకున్నాను గనుక స్వతంత్రముగా కొట్టాను."