Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 23


    ఏదో చిన్నతనములో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకొని చూడటానికి వస్తే, అతడేదో పెళ్ళిచూపులకు వచ్చినట్లు పెళ్ళిమాటలు మొదలుపెట్టేసింది అక్క. అతడేదో తక్కువవాడయినట్లు 'గొప్పసంబంధం' తెస్తానన్నాడు తండ్రి.
    వీళ్ళందరినీ తను ఎలా సమర్ధించగలదు? తనవాళ్ళని తనే మరొకరిముందు ఎలా చిన్నబుచ్చి మాట్లాడగలదు? అసలు తన ఇంటి వాతావరణం చూసి సూర్యం ఏమనుకుంటున్నాడు?
    "ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు అనేకం ఇలానే ఉన్నాయి. ఆశలు ఆకాశాన్నందుతూ ఉంటాయి. అవి తీరే విధానాలు కనుచూపు మేర దూరములో ఎక్కడా ఉండవు. అశాంతి, అసహనం, ఆత్మవంచన, మిధ్యాడంబరాలు, ఇవన్నీ మనుష్యులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆడవాళ్ళు సాధిస్తోన్న అభ్యుదయం కూడా మేడిపండు లాగానే తయారవుతోంది. పాపం! ఎంతమంది ఉద్యోగినులు తమ కుటుంబాలకు ఆధారముగా ఉంటూ అవివాహితలుగా మిగిలిపోవలసి వస్తోందో?"
    ఈ మాటలు సూర్యం మనసులో మెదులుతున్నాయి. అయినా అతడు పైకేమీ అనలేకపోయాడు. తను ఉంగరం బహుమానంగా ఇస్తే, తులసి ఆనందంగా తీసుకోవటమే కాదు, చెయ్యి జాచి వేలికి తొడిగించుకుంది. కానీ, తులసికి తనొక మేనేజర్ గా మాత్రమే తెలుసు. తనను గురించి పూర్తిగా తెలుసుకున్నాక, తులసి రియాక్షన్స్ ఎలా ఉంటాయో?
    కృష్ణారావు కారులో వెళ్తూ తులసినీ, సూర్యాన్నీ చూసి కారు ఆపాడు. కృష్ణారావు ప్రక్కన అందమయిన అమ్మాయి కూర్చుని ఉంది.
    "హలో.....సూర్యం! ఎక్కడికి? రా ..... కారెక్కు!" అన్నాడు కృష్ణారావు. కృష్ణారావు ప్రక్కన కూర్చుని ఉన్న అమ్మాయి తులసిని కుతూహలంగా చూస్తోంది.
    "చంద్రా! ఈవిడే తులసి!" అని పరిచయం చేశాడు కృష్ణారావు.
    ఆ అమ్మాయి వెంటనే, "తులసి అంటే మీరేనా? సూర్యంగారు మీ గురించి ఎప్పుడూ చెప్పేవారు. ఎన్నాళ్ళనుండో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను." అంది సంబరంగా.
    తులసి తెల్లబోతూ, "మీరెవరు?" అంది.
    ఆ అమ్మాయి తల దించుకుంది. కృష్ణారావు, "సూర్యం! చంద్రను నేను పరిచయం చెయ్యనా?" అన్నాడు.
    సూర్యం వెంటనే, "ఈవిడ చంద్ర, ఒకప్పుడు బ్రోతల్ గా ఉండేది. ఎమర్జన్సీ వచ్చాక బ్రోతల్ హౌస్ మూతపడి, ఆ విషవలయంలోంచి బయటపడింది. ఇప్పుడు వృత్తి చెయ్యటం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది." అన్నాడు.
    సూర్యం అతి మామూలుగా ఈ విషయాలు చెప్తోంటే తులసికి మతి పోయినట్లయింది.
    "ఏమిటి?" అంది దిగ్బ్రమతో.
    "వినపడలేదా?" అన్నాడు స్థిమితంగా సూర్యం.
    తులసి ముఖం పాలిపోయింది. ఏమీ మాట్లాడలేదు. తనకు నమస్కారం చేసిన చంద్రకు ప్రతి నమస్కారం చెయ్యాలని కూడా తోచలేదు.
    సూర్యం కారు తలుపు తెరుచుకుని లోపల కూచుని "పోనియ్!" అన్నాడు. కారు సాగిపోయింది.
    "సూర్యంగారు ఎప్పుడూ మీ గురించి చెప్పేవారు" అన్న చంద్ర మాటలు తులసి మనసుకు సమ్మెటపోట్లులా తగులుతున్నాయి.
    తక్కువ అద్దెకు దొరుకుతుందని నీలకంఠం ఒక మారుమూల ప్రాంతంలో ఇల్లు తీసుకున్నాడు. ఆ కారణంచేత ఉంటున్నది పేరుకు మహానగరమయినా, తులసి ఉండే ప్రాంతం బాగా వెనుకబడిన పల్లెటూరికంటే అధ్వాన్నంగా ఉంటుంది అన్నివిధాలా....అక్కడికి కొంచెం దూరంలోనే లేబర్ క్లాస్ గుడిసెలు ఉన్నాయి. వాళ్ళ అరుపులూ, తిట్లూ గోలగా వినిపిస్తూ ఉంటాయి. మహానగరం మధ్యన నివశిస్తున్నా, ఆ జనం కొన్ని విషయాల్లో అడవి జనంకంటే అనాగరికంగా ప్రవర్తిస్తారు. రోడ్లమీదే మలమూత్రాలు విసర్జిస్తారు. ఇళ్ళముందు కూచుని తలంట్లు పోసుకుంటారు. బట్టలుతుక్కుంటారు. పనుల్లోకి బయలుదేరుతున్నప్పుడు మాత్రం ఒక నైలాన్ చీర స్టైయిల్ గా కట్టుకుని, ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకుని, తమ నాగరికతకు అక్కడితో గిరులు గీసుకుంటారు. ఆ కూలి జనం యధేచ్చగా వదిలే మురికినీరు అంతా డ్రైనేజ్ సరిగా లేకపోవటం వల్ల, పల్లాన్ని వెతుక్కుంటూ ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడూ. తులసి ఉంటోన్న ఇల్లు మరీ పల్లంలో ఉండటంవల్ల, ఆ నీరు ఆ ఇంటి పరిసరాల్లో కొంత మడుగులుగా కూడా నిలుస్తూంది. ఇక వర్షాకాలం అయితే అడగక్కర్లేదు. రకరకాల దుర్గంధాలు విలీనమయిన ఒక మహా దుర్గంధం మనుష్యుల్ని నిలువనియ్యదు. పుట్టింది మొదలుగా ప్రకృతితో ప్రకృతిలోని శక్తులతో, హోరాహోరీ పోట్లాడటానికి అలవాటుపడిపోయి రాటుదేలిపోయిన జనాన్ని ఈ కల్మషాలు అంతగా ఏం చెయ్యలేవు కాని, ఎటూ కాని మధ్యతరగతి కుటుంబాలను మాత్రం రకరకాల రోగాలతో ఆశీర్వదిస్తాయి. ఎన్నెన్నో రకాల ఇన్ ఫెక్షన్లు, కొత్త కొత్త రకాల జ్వరాలు, వైద్యశాస్త్రం కంటే రోగాలు విజృంభించి వృద్ధి పొందుతున్నాయి. ఎప్పుడైనా లక్ష్యాన్ని బట్టేకదా, లక్షణం!
    ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, తులసి కంపెనీకి వెళ్ళటం తప్పలేదు. రైన్ కోటు వేసుకోవాలంటే సిగ్గు_సంకోచం. ఆటోలో రావటానికి డబ్బులు లేవు. చూస్తూ చూస్తూ అయిదు రూపాయలు ఆటోకి పెట్టాలంటే ప్రాణం ఒల్లదు. అంచేత వానలో తడిసింది. జ్వరం వచ్చింది. టెంపరేచర్ నూరు డిగ్రీలు ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉండే చాలామంది ఆడపిల్లల్లాగే జ్వరాన్ని నిర్లక్ష్యంచేసి తనకు తోచిన క్రోసిన్ లాటి మాత్రలు వేసుకుని అలాగే కంపెనీకి వెళ్ళిపోయింది. కాని, వారం రోజులయినా జ్వరము తగ్గలేదు. టెంపరేచర్ నూరు నుంచి నూటరెండుకు పెరిగింది. నీరసం ఎక్కువయింది. అయినా అలాగే మొండిగా పనిలోకి వెళ్ళింది. తను టైప్ చేసిన మేటర్ సూర్యానికి అందించి రాబోతూ కళ్ళు తిరిగి పడిపోయింది. సూర్యం గాభరా పడుతూ వచ్చి తులసిని లేవదీశాడు. తులసి శరీరము కాలిపోతోంది.

 Previous Page Next Page