"అలా చెప్పు" అన్నాడు సంతృప్తిగా.
ఎనభయ్యేళ్ళ సుదీర్ఘ కాలంలో ఓ మనిషి జీవితంలో ఎంతో మంది తారసపడి వెళ్ళిపోతూ వుంటారు. ఇంతకాలం భార్యాభర్తలిద్దరూ జీవించి ఉంటే ఒకరికొకరు భయంకరంగా అలవాటుపడి, ఒకరి వొకరు వికారంగా భరించి, ఆ వికారాలన్నీ ప్రేమ అనే భ్రమలోకి చొరబడి ఒకర్ని చూసి ఒకరు గొప్పగా మురిసిపోతూ వుంటారు.
"నిద్రపోతున్నావా?" అన్నాడు నరసింహంగారు.
"ఉహు"
"నాకు ఒక్కటే కోరిక..."
"చెప్పండి."
"అవధానిలా మంచంమీదనుంచి లేవలేని స్థితిలో పడిపోకుండా ఏ నిద్రలో వుండగానో ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాలని"
ఈ ప్రస్తావన ఆయన నోట్లోంచి కొన్ని వందలసార్లు వచ్చి వుంటుంది. ఆ మాటకొస్తే అరవైఏళ్ళు దాటిన ప్రతివాడూ సందర్భం చూసుకునో, సందర్భం కలుపుకునో ఎప్పుడో ఒకప్పుడు తానొక్కడే అతీతుడైనట్లు ఈ డైలాగు వల్లెవేస్తూ వుంటాడు.
"నాకు చావంటే భయంలేదు. పిలుపోస్తే ఏ క్షణానైనా సరే ఇక్కడ్నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధం. కాని ప్రాణం సులభంగా పోవాలి. మంచానపడి తీసుకుని తీసుకుని చావకూడదు."
ఇదో బడాయి_మిగతా వాళ్ళంతా రోగాలతో తీసుకుని తీసుకుని చావటానికిష్టపడుతున్నట్లు.
అసలు చావంటే హడలిపోతూ వుండేవాడే, అనుక్షణం తనకేమీ భయంలేదని గొప్పలకిపోతూ వుంటాడు.
అసలు చావంటే భయపడితే తప్పేమిటి? అదో పిరికితనం కాదు, జీవితాన్ని ప్రేమించటం, ఎక్కువకాలం బ్రతకాలనుకోవటం నేరం కాదు.
"అలా ఏం జరక్కూడదు. ముందు నేనే వెళ్ళిపోవాలి"
"ఎందుకని?"
"ప్రతి స్త్రీ పునిస్త్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కాబట్టి. అందరిలానే నేనూనూ"
కాని భార్యముందుపోతే భర్త ఆలనా పాలనా చూసేవాళ్ ఇంట్లో ఉండరు. అతనికి చేసేవాళ్ళుండరు. ఆడది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెట్టుకు రాగలదు"
పార్వతమ్మకు యీ మాట నిజమేననిపించింది.
వృద్ధ దంపతులిద్దరూ కాసేపు ఇలాంటి కబుర్లే చెప్పుకుని తర్వాత నిద్రలో పడిపోయారు.
6
నీరజ ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. టైపిస్టు ఉద్యోగం.
అంతకు ముందు ఆమె చాలా చాలా ఉద్యోగాలకు అప్లయి చేసింది. బోలెడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. ఒక్కటీ రాలేదు.
ఆమెకు జీవితం యాంత్రికంగా గడిచిపోవటమిష్టంలేదు. వయసు రాగానే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకోవటం, అందులో ఘోరంగా రాజీపడుతూ చేసుకోవటం...పెళ్ళయిన రెండో రోజునుంచీ రాజీకీ రాజీపడలేకపోవడానికీ మధ్య నలిగిపోతూ గడపటం, అక్కడ్నుంచీ జీవితం అమిత దుఃఖమయంగా కనబడటం...
మొదట్నుంచీ నీరజకు ప్రతిచిన్న అంశాన్ని గురించీ అతి లోతుగా ఆలోచించటమలవాటు.
తనకు తెలిసినంతవరకూ ఒకరికి యితరుల్లో_ఎంత సమర్ధించుకున్నా నచ్చిన లక్షణాలు కొన్నే వుంటాయి గానీ పూర్తిగా వుండవు. మిగతా వాటన్నిటికీ తలవంచటమే.
తలవంచటం చేతగాకపోతే వ్యతిరేకించి ఘర్షణ పడుతూ ఉండటం.
జీవితం ఎప్పుడూ దుఃఖమయమే. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఆ మొదట కొన్ని రోజులు సుఖంగానో, సుఖ భ్రాంతిలోనో, సెక్స్ ముసుగులోనో మునిగి తేలుతుంది. అక్కడ్నుంచి కీచులాటలు, అపార్థాలు, గలాటాలు, ఆర్ధిక సమస్యలు నిరంతర వేదనలతో కూడిన అల్లకల్లోలం.