Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 21


    "అన్నీ వినబడుతున్నాయ్" అన్నాడు జనార్ధన్.

 

    "వినబడుతున్నా ఆ సంగతి బయటకు చెప్పకూడదు" కోపంగా అరిచాడు పాల్.

 

    "మీరిప్పుడు ప్రగాఢమయిన, ప్రశాంతమయిన, పవిత్రమయిన, ప్రక్షాళనమయిన స్థితిలో కెళ్ళిపోయారు- ఛస్తే బయటకు రాలేరు! వస్తే చచ్చారే! ఇప్పుడు మీకు నేనేది ఇచ్చినా మజ్జిగలాగానే కనబడుతుంది! మీరేం తాగినా మజ్జిగలాగానే కనబడుతుంది. ఇల్లంతా మజ్జిగమయం౧ బార్ అంతా మజ్జిగ మయం! ప్రపంచమంతా మజ్జిగ మయం!" అంటూ ఆపి యాదగిరి భార్యకు సైగ చేశాడు పాల్.

 

    ఆమె వెంటనే రెండు గ్లాసుల్నిండా బ్రాందీ పోసుకొచ్చి వాళ్ళిద్దరి ముందూ చెరో గ్లాసూ పెట్టింది.

 

    "ఇప్పుడు మీరు మీ ముందు గ్లాసుల్లో ఉన్న మజ్జిగ తాగుతారు!" అన్నాడు పాల్.

 

    "మజ్జిగా?"

 

    "అవును తాగండి-"

 

    "వద్దు! మజ్జిగంటే మాకు అలర్జీ!" గ్లాసులు విసిరికొడుతూ అన్నారు వాళ్ళు అందరం పాల్ ని కౌగిలించుకున్నాం. "ఇంక నీ హిప్నాటిజంకి తిరుగులేదు" అంటూ అభినందించాం.

 

    "అంతే! వీళ్ళిక ఎప్పుడు బ్రాందీ తాగినా మజ్జిగలా అనిపిస్తుంది. కనుక ఎప్పటికీ వీళ్ళిక మందు కొట్టరు" అన్నాడతను విజయగర్వంతో.

 

    "ఫెంటాస్టిక్! ఈ వార్త మా పేపర్లో వేసేస్తాను" అన్నాడు గోపాల్రావ్.

 

    "ఇంక మీరిప్పుడు నార్మల్ ప్రపంచంలో కొచ్చేస్తారు. అయితే బ్రాందీ విస్కీల్లాంటివి ఏం తాగినా మీకు పుల్లని మజ్జిగ తాగినట్లే అనిపిస్తుంది-" అన్నాడు పాల్.

 

    వాళ్ళిద్దరూ మామూలు ప్రపంచంలో కొచ్చేశారు.

 

    వెంటనే టాబ్ లెట్లు కలిపిన మంచినీళ్ళు ఇద్దరికీ ఇచ్చేసింది జనార్ధన్ భార్య.

 

    అది తాగ్గానే మమ్మల్ని చూసి 'కెవ్వు'మని అరచారిద్దరూ.

 

    "ఏమిటలా అరచారు?" అడిగాడు రంగారెడ్డి.

 

    "భయం వేసింది ఎందుకో!" భయంగా చెప్పారు వాళ్ళు.

 

    రంగారెడ్డి గర్వంగా మా అందరివేపూ చూశాడు.

 

    ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ మళ్ళీ బార్ కెళ్తోంటే నేను రహస్యంగా వాళ్ళను వెంబడించి వాళ్ళకి తెలీకుండా ఆ పక్క రూమ్ లోనే కూర్చున్నాను.

 

    "పిచ్చి సన్యాసులు- మనం నిజంగానే హిప్నటైజ్ అయిపోయా మనుకున్నారు-" అన్నాడు జనార్ధన్. నేను షాకయ్యాను.

 

    ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు కాసేపు.

 

    "ఆ టాబ్లెట్స్ కలిపిన మంచినీళ్ళు తాగ్గానే మనకు నిజంగానే భయం వేసిందని కూడా భలే బోల్తాపడ్డారు-"

 

    మళ్ళీ నవ్వుకున్నారిద్దరూ.

 

    బేరర్ బాటిల్ తీసుకెళ్ళి వాళ్ళ ముందున్న గ్లాసుల్లో మందు పోయటం నాకు కనబడుతూనే ఉంది.

 

    రెండు నిముషాలే నిశ్శబ్దంగా ఉన్నారిద్దరూ.

 

    "ఇదేదో మజ్జిగ వాసన వేస్తోందేమిటి?" అన్నాడు జనార్ధన్.    

 

    "అవునన్నా! నేనూ అదే చెప్దామనుకుంటున్న నీతో-" అన్నాడు యాదగిరి.

 

    జనార్ధన్ బేరర్ ని పిలచాడు.

 

    "యస్సార్"

 

    "బ్రాంది అదోలా ఉందేమిటివాళ?"

 

    "అదే బ్రాండ్ కద్సార్ తెచ్చింది?"

 

    "అఫ్ కోర్స్ బ్రాండ్ అదేననుకో- ఇంకే కష్టమరూ దీన్ని గురించి ఏమీ చెప్పలేదా?"

 

    "చివరి కాబిన్లో కూర్చున్నాయన చెప్పారు సార్!"

 

    "ఏమని?"

 

    "ఈసారి స్టాక్ చాలామంచి స్టఫ్ తో వచ్చిందని-"

 

    "ఐసీ- సరే- నువ్వెళ్ళు"

 

    మళ్ళీ అయిదు నిమిషాల నిశ్శబ్దం.

 

    "నేను తాగలేనుగురూ! నా కింకా మజ్జిగవాసనే కొడుతోంది" అన్నాడు జనార్ధన్?

 

    "నాకూ అంతే!"

 

    "వదిలేసి వెళ్లిపోదామా?"

 

    "వాంతులు చేసుకోవటం కన్నా అదే మంచిది గదా!"

 

    "ఒకవేళ- బై ఛాన్స్- జస్ట్ ఫర్ అవర్ సేక్- ఆ పాల్ గాడి హిప్నాటిజం ఏమయినా వర్క్ చేసిందంటావా?"

 

    "ఏమోగురూ! నాకేం సమజ్ కావటం లేదు-"

 

    "సరే-పద! రేపు చూద్దాం!"

 

    వారం రోజులు గడిచిపోయింది. ఇప్పుడు జనార్ధన్, యాదగిరి నిజంగానే భయం భయంగా చూస్తున్నారు మా అందరివంకా! జనార్ధన్ రాత్రుళ్ళు తన నీడనే చూచుకుని కెవ్వున అరుస్తున్నాడని వాళ్ళావిడ చెప్పింది.    

 

    చివరకు వాళ్ళిద్దరూ మందు మానేశారు. కాలనీవాళ్ళందరం కలసి పాల్ కి వెయ్యిరూపాయల పర్స్ బహుకరించాం!

 

    ఆ మర్నాడే పాల్ ఆ వెయ్యి రూపాయలూ బార్ లో జనార్ధన్ కీ, యాదగిరికీ డ్రింక్స్ సర్వ్ చేసిన బేరర్ కి ఇస్తూంటే నేనూ రంగారెడ్డి, శాయిరామ్ చూడటం తటస్థించింది.

 

    వెనుకనుంచి వెళ్ళి పాల్ భుజం మీద చెయ్యి వేశాము.

 

    గాల్లోకి ఎగిరిపడ్డాడు పాల్.

 

    "మీరా!" అన్నాడు పాలిపోయిన మొఖంతో.

 

    "సంగతేమిటి?" అడిగాడు శాయిరామ్.

 

    ఆ బేరర్ నిజంగానే బ్రాందీలో బటర్ మిల్క్ కలిపి ఇచ్చాడు వాళ్ళకు- అందుగ్గాను నేను వెయ్యి రూపాయలు అతనికివ్వాలని ఒప్పందం!"

 

    "అయితే ఇది నీ హిప్నాటిజం ప్రభావం కాదన్నమాట!"

 

    "ఎందుకో అది పనిచేయలేదు గురూ! నాకు నేర్పించినవాడిని వదలన్లే- ఎప్పుడో పట్టుకుని తుక్కు రేగ్గొట్టేస్తాను-"

 

    అందరం నవ్వేశాము.

 

    "కాని గురూ! దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి నా ప్రిస్టేజ్ పోతుంది."

 

    బ్రతిమాలసాగాడు పాల్.

 

    "సరే!" అన్నాం అయిష్టంగానే.

 

    చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆరోజు అందరం ఉదయం పదిగంటల వరకూ సుఖంగా నిద్రపోవాలని నిర్ణయించుకున్నాము.

 

    కానీ ఉదయం ఆరయేసరికి బయట పెద్ద కోలాహలం వినిపించేసరికి కాలనీని తిట్టుకుంటూ బయటకు వెళ్ళక తప్పలేదు నాకు.

 

    అక్కడి దృశ్యం చూస్తూనే నిద్రమత్తంతా వదిలిపోయింది.

 

    పాల్ ఇంటిముందు కొన్ని వేలమంది స్త్రీలు క్యూ కట్టి నిలబడి ఉన్నారు.


                                                       *  *  *  *  *

 Previous Page Next Page