Previous Page Next Page 
ఒకే రక్తం ఒకే మనుషులు పేజి 21


    
    ఆమెకు వళ్ళు జలదరించినట్లయింది. ఛీ! ఛీ! అనుకుంటూ లోపలకు పోయింది.
    
                                                      * * *
    
    వేడుకలన్నీ యధాతథంగా జరుగుతున్నాయి. పెళ్ళికూతుర్నీ, పెళ్ళికొడుకునీ ఎదురెదురుగా కూర్చోపెట్టి తతంగమంతా జరిపిస్తున్నారు. అమ్మలక్కలంతా చుట్టూ చేరారు.
    
    గిరిజకు కొత్తబట్టలు చుట్టబెట్టారు.
    
    పూలజడ అల్లారు. కళ్ళకి కాటుకదిద్దారు. వైభవంగా తయారుచేశారు.
    
    ఎదురుగా సుందరం చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు.
    
    ఒకరితో ఒకరికి గంధం పూయించారు. పూలచెండ్లు విసిరేయించారు. ఒకరు ఎంగిలిచేసిన తాంబూలం మరొకరితో కొరికించి వినోదించారు.
    
    గిరిజకి కోపం వస్తోంది. ఏడుపొస్తోంది. వళ్ళు జలదరిస్తోంది. అయినా బయటికేమీ తేల్చక అన్నీ యాంత్రికంగా చేస్తోంది.
    
    చివరకి పదిగంటలవేళా లోపలికి నెట్టి బయట గొళ్ళెం పెట్టారు.
    
    పందిరిమంచంమీద సుందరం శోభనం పెళ్ళికొడుకు హోదాలో వెలిగి పోతున్నాడు. హుందాగా కట్టుకొన్న పంచె, ముఖంమీదికి పడుతోన్న నల్లటి జుట్టూ, చిన్న మీసకట్టూ, పన్నీరు జల్లటంవల్ల మృదుసుగంధం వెదజల్లే వళ్ళూ...
    
    మెల్లగా లేచి నిల్చుని గిరిజదగ్గరకు వచ్చాడు.
    
    "బేబీ!"
    
    గిరిజ మాట్లాడలేదు.
    
    "అప్పుడే అంత సిగ్గా?"
    
    తనకేం సిగ్గు వెయ్యటంలేదు. తన మనసులో ఏం వుందో తనకే సరిగ్గా తెలియటంలేదు.
    
    "బేబీ!"
    
    "ఊఁ" అంది విధిగా.
    
    "నువ్వలా మౌనంగా వుంటే నాకేం బాగాలేదు. ఏమైనా మాట్లాడు."
    
    "ఏం మాట్లాడను?" అంది వినిపించీ వినిపించనట్లుగా.
    
    "ఇదివరకు ఎంతో ఫ్రీగా, సరదాగా వుండేదానివి. 'పెళ్ళి' అనేసరికి ఏదో మార్పు వచ్చేసింది నీలో."
    
    "పెళ్ళికాబట్టి" అందామనుకుంది.
    
    అతను దగ్గరకువచ్చి మృదువుగా భుజంమీద చెయ్యివేశాడు. "రా బేబీ!"
        
    ఆమెనలాగే పొదివిపట్టుకుని పందిరిమంచం దగ్గరకు తీసుకెళ్ళాడు. తెల్లగా మెరిసే దుప్పటి, పరిమళాలు వెదజల్లే పువ్వులు...
    
    "కూర్చో బేబీ!"
    
    ఆమెను కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నాడు.
    
    "బేబీ! ఈరోజు చాలా గొప్పగా వుందికదూ?"
    
    గిరిజ అస్పష్టంగా తలవూపింది.
    
    "చిన్నప్పట్నుంచి తనకు తెలిసిన సుందరాన్ని గుర్తుచేసుకుంటోంది. అతని వంటిన బట్టలు లేకుండా స్నానం చేస్తుంటే తను చూసింది. అల్లరి చేశాడని తల్లి బడితపూజ చేస్తుంటే చూసింది. 'బేబీ, బేబీ' అంటూ తనవెంట తిరుగుతూ తనతో ఆడిన పిచ్చి పిచ్చి ఆటలు గుర్తొచ్చాయి.
    
    ఆమెకళ్ళలో ఆ సుమ్ధారమే మెదుల్తున్నాడు.
    
    ఆ సుందరంలో దగ్గరతనమేగాని, కవ్వించే శక్తిలేదు. ఆ సుందరమే కళ్ళముందు కదుల్తున్నాడు.
    
    "బేబీ! బేబీ!" అంటూ ఆమెచెవిలో ఏదో చెబుతున్నాడు. ఏమీ వినిపించటం లేదు.
    
    అతని చేతులు ఆమెను చుట్టుకొనటం ఆమెకు లీలగా తెలుస్తుంది. ఆ చేతులు ఎక్కడెక్కడో కదుల్తున్నాయి. అతని ముఖం ఆమె చెంపల దగ్గరగా రావటం, ఏమిటోగా గమనించింది గాని, చెంపలమీద అతని పెదవులు ఆనుకున్నప్పుడు హఠాత్తుగా మేలుకుంది. 'వద్దు' అని ముఖం ప్రక్కకి త్రిప్పుకుని దూరంగా జరగబోయింది.
    
    అతని చేతులామెను కదలనివ్వలేదు. 'ఉహు' అంటూ మీదకు లాక్కుని, ఆమెను చేతుల్లో గట్టిగా బిగించి, ముఖమీదకు ఒంగాడు.
    
    "వద్దు, ప్లీజ్!" ఆమె పెనుగులాడుతుంది.
    
    "బేబీ!"
    
    "వద్దు, నన్ను వదిలెయ్యి నీకు దణ్ణం పెడతాను. నువ్వు వదిలెయ్యి బాబూ"
    
    అప్రయత్నంగా అతని చేతులామెను విడిచిపెట్టాయి. చప్పున అవతలకు జరిగి మంచంపట్టెమీద ముఖంవాల్చి నిశ్శబ్దంగా వుండిపోయింది.
    
    నిరీక్షించనిధి ఏదో జరిగినట్లుగా కొన్ని నిముషాలపాటు సుందరం మ్రాన్పడి ఉండిపోయాడు.
    
    కాని మళ్ళీ అంతలోనే మనసు సమాధానపర్చుకున్నాడు. అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు ఉదయించింది. ఇది తొలిరోజు. తన బంధువుల్లో అనేకులు తమ అనుభవాలు చెబుతూండగా విన్నాడు. ఆడపిల్లలు ఈ మొదటి రోజు చాలా పేచీ పెడతారు. మొగవాడి సహనానికి పరీక్ష ఒక్కో అమ్మాయి ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంది. సంతోషంకన్నా భయం ఎక్కువగా వుంటుంది. కాని అంతా బెదురే ఆ బెదురు తీర్చే బాధ్యత పురుషుడిది.
    
    ఆమె మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లు చెబుదామని 'బేబీ' అంటూ దగ్గరకు జరిగాడు.
    
    ఆమె తలత్రిప్పి చూడలేదు.
    
    "బేబీ!" అని మళ్ళీ పిలుస్తూ ఆమె భుజంమీద చెయ్యివేశాడు.
    
    ఆమె స్పర్శ అతనికి వెచ్చగా వుంది.
    
    అతని స్పర్శ ఆమెకు ఎలానూ లేదు.
    
    ఆమె స్పర్శ అతనికి హాయిగా వుంది.
    
    అతని స్పర్శ ఆమెకు ఎలానూ లేదు.
    
    ఆమె పలకలేదు.
    
    అతను లేచి మంచందిగి, చుట్టూ తిరిగి పట్టెకు అవతలనుంచి ఆమెకు దగ్గరగా వచ్చాడు.

 Previous Page Next Page