"ఏవైంది వనజాక్షిగారూ?" మధు భయంగా అడిగాడు.
"వడియాలు నాయనా మడితో పెట్టుకున్నాను. కాస్త ఆగితే ఎండిపోను. అప్పుడే వచ్చేసావు ఏదో ముంచుకుపోయినట్లు" ఆవిడ రుసరుస లాడుతూ వడియాలు మూట కట్టసాగింది.
"క్రింద పలకరించిన ముసలాయన కోడలు" రిషితో రహస్యంగా చెప్పాడు మధు.
ఆవిడ వెళ్ళిపోయాక మధు రిషీ పైకొచ్చి తాళంతీసి రూంలో ప్రవేశించారు.
"మొత్తానికి మీ ఇంటాయన భలే వాడేనోయ్" అన్నాడు రిషి.
ఫ్రిజ్ లోంచి మంచినీళ్ళ సీసా తీస్తూ "ఇంటాయనా?" అన్నాడు ఆశ్చర్యంగా మధు.
"ఇందాక నిన్ను ఆలస్యమయిందేం?" అని కేకలేసి నాయన మీ ఇంటి ఓనర్ కాదా?" అడిగాడు రిషి.
మధు సీసా రిషి చేతికిచ్చి నవ్వుతూ- "ఇంట్లోని నాలుగు వాటాలకి నేనే ఓనర్ని" అన్నాడు.
రిషికి పొలమారినంత పనయింది.
"అదేంట్రా మరి వాళ్ళలా దబాయించి పారేస్తుంటే మాట్లాడవేం?" అన్నాడు.
"ఏం మాట్లాడాలి?" మధు షూస్ విప్పుతూ అన్నాడు. "నాన్నగారి హయాంలో కూడా వాళ్ళే మా టెనెంట్స్. అప్పుడు నేను చిన్న కుర్రాడ్ని కదా. అలా అదిరించి మాట్లాడటం పాపం అలవాటైపోయింది"
"ఏడిసినట్లుంది" రిషి గదిని పరికిస్తూ అన్నాడు.
"ఇప్పడు చెప్పు! ఎక్కడ దిగావు? ఏం పనిమీదొచ్చావు?" మధు అడిగాడు.
రిషి గెడ్డం నిమురుకుంటూ--- "పెద్ద పనిమీదే వచ్చాను. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. సామాన్లు ఏమీలేవు. ఇదిగో ఈ కవర్లో ఉన్న జత బట్టలు తప్ప. ఎడ్రస్ కేరాఫ్ రైల్వేస్టేషన్" అన్నాడు.
మధు కోపంగా- "ఏడిశావ్! కేరాఫ్ రైల్వేస్టేషన్ అనేంత ఖర్మ నీకెందుకురా నేనుండగా" అన్నాడు.
రిషి నవ్వి "ఇంత మర్యాదా మొహమాటం వుంటే ఇల్లు అనాధాశ్రమంగా మారిపోతుంది" అన్నాడు.
మధు నవ్వి- "ఇప్పుడు మాత్రం ఏం తక్కువ? ఒక్క వాటాలో వాడు అద్దిస్తే ఒట్టు" అన్నాడు.
"మరి ఎలా వూర్కుంటున్నావ్? ఖాళీ చేయించి వేరే ఇంకెవరికన్నా అద్దెకియ్యి" అన్నాడు కోపంగా రిషి.
"మధూ.... నాయనా మధూ!" అంటూ వనజాక్షి హడావుడిగా లోపలి కొచ్చింది.
"ఇదిగో వేడివేడిగా అరిటికాయ బజ్జీలు వేసాను. చెరినాలుగూ నోట్లో వేసుకోండి. గిన్నె కడిగిపెట్టడం మర్చిపోకు" అంటూ వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది.
ఇంతలో ఓ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి- "మా నాయనమ్మ కాఫీ తాగద్దంటోంది. ఓవల్టీన్ పంపిస్తుందట" అని రివ్వున పారిపోయాడు.
రిషి ఆశ్చర్యంగా చూస్తుండగానే- ఓ సార్! అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మల్లేష్ ఫ్యాన్ చంకన పెట్టుకుని వచ్చాడు. "నీ ఫ్యాన్ కరాబయింది గదా! ఇది కొన్ని దినాలు నడవనీ, గది చాలూ అయినంక గిది తీస్కపోత.... ఏమంటున్నా? సమజ్ అయిందా?" అన్నాడు బుంగమీసాలు మెలిపెడ్తూ.
"అయింది కానీ టిఫిన్ తిని వెళ్ళు" అన్నాడు మధు బజ్జీల ప్లేటు ముందుకు తోస్తూ.
"ఒద్దు సార్!" అంటూ ఎత్తుగా వున్న బుగ్గని చూపించాడు.
"ఆ జర్దా పాన్ వదలవుగదా!" మధు రిషికి ప్లేట్ యిస్తూ అన్నాడు.
"మల్ల రాత్రికొచ్చి అరుసుకుంట, పోతున్న" అని వెళ్ళిపోయాడు మల్లేష్.
మళ్ళీ ఇందాకటి పిల్లాడు ప్లాస్కుతో ఓవల్టీన్ తెచ్చి బల్లమీద పెట్టి "దొండకాయ కూర సయిస్తుందా మీ ఫ్రెండ్ కి? నానమ్మ అడిగి రమ్మంది" అన్నాను.
మధు రిషివైపు చూసాడు. రిషి నవ్వి తల అంగీకారంగా వూపాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు.
"చూస్తున్నావుగా! నేనేం తినాలో, ఎప్పుడేం చెయ్యాలో! నాకెలా బావుంటుందో అన్నీ వాళ్ళే నిర్దేశిస్తూ చేసుకుపోతారు. నేను కాస్త కిందా- మీదుగా చేస్తే చిరాకు పడతారు. దగ్గరవాళ్ళు ఆమాత్రం అనకుండా ఎలా చెప్పు? ఇంతటి ఆప్యాయతనీ, అభిమానాన్ని ఎలా వదులుకోమంటావు? ఇందాక అన్నవే అనాధాశ్రమం అని అందులో అనాధని నేనే. తల్లీ, తండ్రీ తోబుట్టువులు ఎవరూలేని అనాధని! వీళ్ళందరి మధ్యా వుంటేనే హాయిగా అనిపిస్తుంది. లేకపోతే అభద్రతా భావంతో నిద్రకూడా పోలేను" అన్నాడు మధు.
రిషి అర్ధం చేసుకున్నట్లుగా తలూపాడు.
"ఒంటరితనాన్ని మించిన శాపంలేదు!" అన్నాడు. అతన్ని ఆశ్రిత తలపులు చుట్టుముట్టాయి.
"ఓవల్టీన్ త్రాగు.... ఎక్కడికెళ్ళావు?" మధు భుజం పట్టి కుదిపాడు.
"నేనెందుకొచ్చానంటే...." రిషి చెప్పడం మొదలుపెట్టాడు.... "అన్నీ మర్చిపోయానని నాటకం ఆడి, వున్న మూడ్రోజుల్లో ప్రపంచాన్ని మరిపించింది. నేను ఎవరో తెలియని స్థితిలో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎవరో? ఏమిటో? ఎక్కడ్నించి వచ్చిందో?"
ఆశ్చర్యంగా వింటూ వుండిపోయాడు మధు.
* * * *
శ్రీజా....!
అతను ఎలా వున్నాడు? శరీరం వదిలి వచ్చినా మనసక్కడే ఉండిపోయింది. నాకు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే వుంది.... మొదటిసారి అతనివేపు చూసినప్పుడు అతని కళ్ళల్లో వెలుగు! మనసులోని కోరికను కళ్ళతో తోడి, చిరునవ్వుగా మార్చి, నామీద ఎలా చిలకరించాడో తెలుసా? సైకాలజీ స్టూడెంట్ ని అయిన నాకు అతన్ని పరీక్షించాలని తమాషా అయిన ఊహ పుట్టింది. ఒంటరితనం .... చీకటి.... చల్లటి వాతావరణం అతనిలో కలిగించే గిలిగింతా నేనూ గమనిస్తూనే వున్నాను.... నిప్పు అని తెలిసినా పట్టుకుని ఆడుకోవాలనుకున్నాను. అంతలో అనుకోకుండా ట్రెయిన్ యాక్సిడెంట్ సంభవించింది. నేను కళ్ళు తెరిసేసరికి నా మొహంలోకి అతను ఆత్రుతగా చూస్తుండటం చూడగానే నాలో ఓ చిలిపి ఊహ కలిగింది. దాని పర్యవసానమే అంతా మరిచిపోయినట్లు నటించడం. అనుకోకుండా మీ దగ్గరకే చేరడం! అసలు బయలుదేరింది మీ దగ్గరకే. తిన్నగా విజయవాడ వెళ్ళి మీరు ఇక్కడ వున్నారని తెలిసి ఇక్కడికి బయలుదేరాను.