Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 20

    "ఈ ఆల్బంలో వున్న ఫోటోల్లో ఎవరు ఎవరో తెలీడం లేదు. జయసూర్యగారితో అమెరికా వెళ్లిన ఇద్దరు స్నేహితుల ఫోటోలు ఇందులో వున్నాయా?"

    "ఉన్నాయి.... " భూపాల్ గారు ఒక్కో ఫోటో చూపుతూ ఎవరో చెప్పసాగారు.

     "ఈ ఆల్బం నాకిస్తారా? ఇది మా డాడీకి చూపించి మళ్లీ జాగ్రత్తగా తెస్తాను ఇస్తారా?"

    "రోజుకొక్కసారైనా నా ఆల్బం తిరగేయకపోతే నాకు నిద్రపట్టదు. అడిగావు కదా? లేదు అని చెప్పే స్వభావం కాదు నాది. తీసుకెళ్లి మళ్లీ జాగ్రత్తగా తెచ్చివ్వాలి ఏం? తెచ్చిస్తావు కదా అమ్మాయ్?"

    "తప్పకుండా తెచ్చిస్తానండీ."


                         *    *    *    *    *

   
    మరునాడు ప్రక్క గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామిని కలిసింది కౌస్తుభ.

    " నా పేరు కౌస్తుభమణి అండీ. హరిద్వార్ కి మొన్న వెళ్లిన యాత్రా బృందంలో నేనూ వున్నాను. అక్కడ ఒక ఆశ్రమంలో మీ స్నేహితుడు జయసూరప్యగారు కలిశారు. సన్యాసిలా వున్నారు. మిమ్మల్ని కూడా కలసి తన క్షేమసమాచారాలు చెప్పమన్నారు. అందుకని మిమ్మల్ని వెదుకుతూ వచ్చాను."

    "మీరు......" స్వామి అయోమయంగా చూశాడు. అతడికిప్పుడు అరవయ్యేళ్లు, నుదుట విభూతిరేకలతో నిష్టగల మనిషిలా కనిపిస్తాడు. ముఖంలో ఏదో తేజస్సు తొణుకుతోంది.

    "నాది ఈ ప్రక్క గ్రామమే స్వామిగారూ! హరిద్వార్ లో మా ఇధ్దరికీ విచిత్రంగా పరిచయం ఏర్పడింది. నేను ఈ ప్రాంతానికి చెందిన మనిషినని తెలిసి చాసా సంతోషించారు.  జయసూర్యగారు. ఆయన ప్రస్తుత నామం చిదానందస్వామిలెండి. తను క్షేమంగా వున్నానని తన వాళ్లకి చెప్పమని నన్నర్దించారు. సరేనన్నాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రయాసపడి మిమ్మల్ని వెదుకుతూ వచ్చాను."

    "నిజం చెప్పు. నువ్వెవరు? నీకేం కావాలి?" స్వామి కోపంగా అడిగాడు.

     "నాకేం కావాలండీ బాబూ? జయసూర్యగారి క్షేమసమాచారాలు అందించడానికి వచ్చాను. అంతే!"
   
    "కాదు. మునిరాజు ముఠాకు సంబంధించిన దానివని నా అనుమానం. ఆ తామ్రపత్రం కోసమే కదా నువ్వొచ్చింది? ఆ తామ్రపత్రం నేను మన ముఖ్యమంత్రిగారికి అందజేశాను. ఆ తాళపత్రంలో ఏముందో నాకు తెలియదు. ఆ లిపి తెలిసినవాళ్లకే తెలుస్తుంది. ఆ లిపి తెలిసినవాళ్లను  రప్పించుకుని ఆ తామ్రపత్రం చదివించుకోమని చెప్పి వచ్చేశాను. ఆ తామ్రపత్రంలో ఏముందో చెప్పమని నన్ను వేధిస్తే నేనేం చెప్పగలను?"

    ఇప్పుడు తల పట్టుకోవడం కౌస్తుభ వంతు అయింది.

    "ఆ తాళపత్రం ఏమిటి? మునిరాజు ముఠా ఏమిటి? నాకంతా అయోమయంగా వుంది."

    "నాకూ అంతే అయోమయంగా వుంది అమ్మాయ్! నీ మాటలు నాకు అర్దంకావడంలేదు. ఎఫ్పుడో సన్యాసుల్లో కలిసిపోయిన జయసూర్య హరిద్వార్ లో నీకు కలిసి తన వాళ్ళకి క్షేమసమాచారాలు చెప్పమన్నా డా సన్యాసులకు నా వాళ్లు నా ఊరు అన్న భ్రాంతి ఎప్పుడో వదిలిపోయి వుంటుంది. వాళ్లు ఈ లోకంలో వున్నా లేనట్టే లెక్క. ఇహలోకసంబంధమైన వ్యామోహాలన్నిటికీ అతీతులైతేనే సన్యసిస్తారు. అలాంటిది నీకు జయసూర్య కలసి తన క్షేమసమాచారాలు చెప్పమన్నాడంటే నేనెలా  నమ్ముతాను? చెప్పు. నిధి రహస్యం తెలుసుకోవడానికే కదా  నువ్వొచ్చి ఈ డ్రామా ఆడుతున్నావు."

    "మీరనుకుంటున్నట్లు మునిరాజు ముఠాకు చెందినదాన్ని కాదు. మీ స్నేహితుడు జయసూర్య గురించి బాగా తెలిసినదాన్ని. అతడి జీవితంలో ఒక ముఖ్యపాత్రని. నల్లమల అడవిలో భైరవుని కొండ సమీపంలో జయసూర్య హత్యకు  గురిఅయ్యాడని నాకు తెలుసు. ఆ  తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికే నేనొచ్చాను."

    "ఆ హత్యారహస్యం నాకూ, ఆ మునిరాజు ముఠాకే తెలుసు. నీకు తెలిసివుంటే తప్పకుండా నువ్వు మునిరాజు ముఠాకు సంబంధించినదానివే అయి వుంటావు. లేకపోతే జయసూర్య కథలో ఒక ముఖ్యపాత్రవి ఎలా అవుతావు? అప్పటికి నువ్వు పుట్టనైనా పుట్టి వుండవు."

    "వయసు శరీరాలకే. ఆత్మలకు వయసు ఎవరు నిర్ణయిస్తారు స్వామీజీ?"

    "ఆత్మలంటున్నావు నువ్వు....."

    "ఏమో! నాకైతే తెలియదు నేనెవరో. మీ జయసూర్యే చెబుతాడు తనదీ, నాదీ జన్మజన్మల  బంధమని."

    "జయసూర్య ఆత్మకాదు. అతడు మళ్లీ పుట్టాడు శ్రీచక్రగా పూర్వజన్మ జ్ఞాపకాలతో అథడు తన పూర్వజన్మ అంటూ జయసూర్య కథ లేఖలద్వారా నాకందజేసినప్పుడు అతడిదంతా భ్రమ అని, ఒక విధమైన మానసిక రోగమని కొట్టివేసాను. కానీ మొన్నమొన్ననే తెలిసింది అతడు చెప్పేదంతా వాస్తవమని."

    కౌస్తుభ చెప్పనదంతా విని ఆరాటంగా అన్నాడు స్వామి. "నేనొక సారి శ్రీచక్రని చూడాలమ్మా."

    "ఆయన ప్రస్తుతం ఇక్కడ లేడు. సింగపూర్ లో వున్నాడు. కొద్దిరోజుల్లో వచ్చేస్తాడు. వచ్చాక మీకు తెలుపుతాను. కానీ ఆ నిధి రహస్యం రహస్యంగానే వుండిపోయిందా? ఆ మునిరాజు వాళ్లకు ఆ నిధి దక్కిందా? జయసూర్య హత్య చేయబడ్డాక ఏం జరిగింది? మొదలైన విషయాల్లో సస్పెన్స్ అలాగే వుండిపోయింది.

    "నిధి రహస్యం రహస్యంగానే వుండిపోయింది. కేతకి బొమ్మను  చెక్కిన ఆ పెద్ద బండరాయిని వాళ్లు డైనమైట్లతో పేల్చాలని చూసారు. కానీ సాధ్యపడలేదు. వాంతులు ప్రారంభమై పారిపోయారు. చంద్ర ఆత్మ  విముక్తికోసం జయసూర్య తలపెట్టిన హోమ కార్యక్రమం నేనుపూర్తి చేసాను. జయసూర్యకూ, నాకూ రక్తసంబంధం లేకపోయినా ఆత్మసంబందం  చేసాను. జయసూర్యకూ, నాకూ రక్తసంబంధం లేకపోయినా ఆత్మసంబంధం  వుంది. మేం ఒకే గురువుకు శిష్యులం. ఆ విధంగా అతడు నాకు  సోదరుడు అవుతాడు. నేను సోదరుడి  అధికారంతో అతడికి శ్రాద్దకర్మ నిర్వహించాను.  అతడు హత్య చేయబడ్డ విషయం ఎవరికీ చెప్పలేదు. నా గుండెలోనే దాచుకున్నాను. అతడు తపస్సుకోసం హిమాలయాల్లోకి వెళ్లిపోయాడని  చెప్పాను. తండ్రికీ అదే అబద్దం చెప్పాను, ఎక్కడో ఒకచోట అతడున్నాడన్న బ్రమలో ఆయన్ని వుంచి, తప్పు చేశానా చెప్పు?"

    "ఒకవిధంగా చూస్తే తప్పుకాదు .మరొకవిధంగా చూస్తే తప్పే, జయసూర్య హత్య చేయబడ్డ విషయం దాచి, మీరు హంతకులను రక్షించారు కదా? మీరెందుకు వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇచ్చి పోలీసులకు పట్టివ్వలేదు?"

    "వాళ్లు నరహంతకులు. నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, బోనెక్కి సాక్ష్యం చెప్పేలోగా వాళ్లు నన్ను హతమార్చేవాళ్లు. పోలీస్ కంప్లయింట్ యిచ్చి ఏం సాధించేవాడిని? ఇక్కడ వాళ్లు తప్పించుకున్నా, పైన భగవంతుడి  కోర్టు వుంది కదమ్మా? ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ముద్దాయిగా నిలబడాల్సిందేనమ్మా. అప్పుడు రెట్టింపు శిక్ష  పడుతుంది. ఆ నమ్మకం నాకుంది."

    "కానీ ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశారనే బాధ!"

    "జయసూర్య హత్య చేయబడ్డాడన్న నిజాన్ని నా గుండెలో  సమాధి చేయడానికి నేనెంత నరకం అనుభవించి వుంటానో నువ్వే వూహించు నిజం దాచడమే కాదు, అబద్దాలు కూడా చెప్పాను. ప్రపంచానికి. ఒక సదాచారి నోట అబద్దాలు రావాలంటే చాలా సంఘర్షణ జరుగుతుందమ్మా!"

    "ఇంతకుముందు మునిరాదు ముఠా నిధి రహస్యం చెప్పమని వేధించిందన్నారు"

    "ఇటీవల నేను మూలికా సేకరణవల్ల నల్లమల్ల వెళ్లినప్పుడు అక్కడ చెంచులు చెప్పారు.  బైరవుని కొండలోని నిధులను దక్కించుకోవడానికి  చాలా ముఠాలు బయలుదేరాయని. అలా ఎవరో స్వార్దపరుల చేతికి ఆ నిధి దక్కడం నాకిష్టంలేదు.  ప్రభుత్వానికి స్వాధీనపరుస్తే, ప్రజలకు దక్కుతుందన్న ఉద్దేశ్యంతో దానికి సంబంధించిన తాళపత్రం  మన ముఖ్యమంత్రి గారికి అందజేశాను. అవసరమయిన పూజా సామాగ్రితో, నిధి లభ్యమయితే  తీసుకెళ్లడానికి తగిన బందోబస్తుతో వస్తే, నిధిని స్వాధీన పరుస్తానని కూడా చెప్పాను. నాపేరు మాత్రం రహస్యంగా వుంచమని కోరాను. కానీ ఆ తాళపత్రం ముఖ్యమంత్రిగారికి ఇచ్చిన విషయం ఎలాగో పత్రికల్లో వచ్చేసింది.  మునిరాజు వాళ్లు ఎలాగో నా పేరు తెలుసుకుని, వచ్చి నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఆ తాళపత్రం మా తాతగారు సేకరించిందనీ,  అందులో వున్న లిపి నాకు తెలియదని,  ఆ తాళపత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చేశానని చెప్పాను. వాళ్లు నా మాట నమ్మినట్టు లేదు. ఇంకా ఏమేం ఎత్తులు వేస్తున్నారో తెలియదు. నన్ను ఎప్పుడు అటాక్ చేసి లేపేస్తారో తెలియదు. ఏమైనా నేను అన్నిటికీ సిద్దంగానే వున్నాను."

    "భైరవుని కొండలోని నిధిని  ప్రభుత్వానికి స్వాధీనపరిచే సందర్బం లోనే జయసూర్య హత్య విషయం బహిర్గత పరచి హంతకులను ప్రపంచం ముందు నిలబెడితే....."

    "నువ్వు చెప్పే ప్రపంచంలో కళ్లల్లో వత్తువు వేసుకుని కొడుకు కోసం నిరీక్షిస్తున్న ఒక ముసలి గుండె వుందనీ, ఆ నిజం తెలిస్తే, ఆ గుండె పగిలిపోతుందని మరువకు."

    "సాధు పురుషుడిగా పేరు పొందిన  భూపాల్ గారు తనకు తెలియకుండానే తన కొడుకును చంపిన హంతకులకు రక్షణ కవచం అయ్యారన్నమాట ప్చ్! చివరి క్షణాలలోనైనా ఆయన ఆశ నిరాశ కాక తప్పదుకదా! అప్పుడయినా ఆయన అసంతృప్తితో కళ్లు మూయాల్సిందే కదా!"

    "అదే ఆలోచన నన్ను పీడించేది.  ఇప్పుడు మాత్రం ఒక ఉపాయం తట్టింది. భూపాల్ గారి అంత్య సమయంలో శ్రీచక్రని జయసూర్యగా  ఆయన ముందు నిలబెట్టే బాధ్యతను నీమీద పెడుతున్నాను. నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీలో పని  చేస్తున్నానన్నావు. వేషాలుమార్చడం నీకో లెక్కకాదు ఒక వృద్దుడి ఆత్మశాంతి కోసం నువ్వా పని చేయక తప్పదు."

 Previous Page Next Page