Previous Page Next Page 
అహల్య పేజి 21


    'ప్రభూ!'


    'ఔను! అహల్యా! నువ్వు గౌతముడి వెంటే వెడుతూంటే నా సర్వాధికారాలూ ఆయన హోమాగ్నిలో వేసే తృణంతో సమానం కావనిపించింది. అఖిలలోక పాలన అమరలోక నినాదం. అంతా వృధా! వృధా! అనిపించింది. నిన్ను చేపట్టలేని అధికారం వ్యర్ధం అనిపించింది. రాక్షసులు మా లోకంపై దండెత్తి వచ్చి మమ్ములను జయించి మా లోకంలోని అచ్చెరలణు చెరపట్టినట్లు- నిన్ను ఆ మహర్షి నుండి బలాత్కారంగా పొందాలనిపించింది.'


    'ప్రభూ!'


    'కానీ- పెద్దరికం అడ్డు వచ్చింది.'


    'ప్రభూ!'


    'అవును. మా పెద్దరికం కాదు. పరమేష్టి పెద్దరికం. గౌతముల పెద్దరికం అడ్డు వచ్చాయి.'


    'ప్రభూ!'


    'కానీ ఆ బ్రహ్మ ఆయనకి నిన్ను ధారపోస్తే నువ్వు నన్ను వెదుక్కుంటూ రావడం నా అదృష్టం దేవీ!'


    'ప్రభూ!'


    అప్పుడే నీ చూపులు నాపై వలపుని చెప్పకనే చెప్పాయి. అందరికంటే ముందు భూ ప్రదక్షిణం చేసి వచ్చాననీ, అమరేంద్రుడననీ నన్ను నీవు గుర్తించి చూసిన తొలిచూపు ఒక్కటే చాలు అహల్యా!


    అన్నింటికంటే మిన్నగా అభిషక్తుడిని చేసినట్లుగా భావించాను!'


    'ప్రభూ!'


    'కదలకు అహల్యా! నిన్ను కోరి కోరి నీవు దొరక్క విరహంలో వేగి వేగిపోయిన ఈ గుండెలకు నీ స్పర్శతో శాంతిని కల్గించు. నీకోసం పరితపిస్తూ నీరాక కోసం నిరీక్షిస్తూ రెప్ప పాటు లేక నిలిచిపోయిన నాకు- నువ్వే కరుణించి కనికరించి నా చెంతకు వచ్చిన అదృష్టాన్ని చెరగనీకు'


    'ప్రభూ!'


    'అవును. ప్రభువునే! అఖిల లోకాలకూ ప్రభువును. అచ్చెరలకు ప్రభువును. మహర్షులకు ప్రభువును. మానవులకు ప్రభువును. కానీ నీకు ప్రభువును కాను అహల్యా! పతి కాలేకపోయిన అదృష్టహీనుడ్ని! నన్ను 'ప్రభూ' అని కించపరచకు!'


    'ప్రభూ! ప్రభూ! నేను ప్రభూ. కనులు విప్పి చూడండి. నేను అహల్యను కాను...'


    ఆశనిపాతం లాంటి ఆ మాటలు వినీ వినగానే ఇంద్రుడు చలించిపోయాడు. అప్రమత్తుడయ్యాడు.


    కళ్ళు తెరిచి చూశాడు.


    అప్పటికే కౌగిలి వీడిన ఆమె- దూరంగా నిలుచుంది. ఆమె దూతిక. ఇంద్రుడి ఆంతర్యం ఎరిగిన దూతిక.


    శచీదేవి అలిగినా, ఆగ్రహించినా, పతిని మన్నించకపోయినా శచీదేవిని ఇంద్రుడి యెడల ప్రసన్నం చేసే ఆంతరంగిక చెలి.


    అన్య వనితలన్నా, అందమైన అతివలన్నా ఆశపడి అందం వెంట అహరహం వెంటపడే ఇంద్రుడంటే శచీదేవికి కోపం రానిదెప్పుడూ? అందుకే శచీదేవి మనస్సుని మళ్ళించే పని ఆమెకే! చప్పున నమస్కరించింది.


    'తమరు ఒంటరిగా ఉన్నారనీ, అన్య మనస్కంగా ఉన్నారనీ, ఏదో తెలియని ఆవేదన తమని నిరంతరం వేధిస్తున్నదనీ శచీదేవమ్మగారు చెప్పారు. తమ దిగులుకి హేతువు తెలుసుకుని తమ దిగులు తీర్చే గురతర బాధ్యతని నా మీద మోపారు. అందుకే నేను ఇక్కడికి సాహసించి రాగలిగాను. తమరు అహల్యా చింతనలో చిక్కిపోయారని చెప్పకనే చెప్పుకున్నారు.'

    
    'ఊ!' అన్నాడు ఇంద్రుడు.


    'నన్ను విశ్వసించండి ప్రభూ! తమ గుండెల నిండుగా నిండుకున్న అహల్యాదేవి గురించి శచీదేవి గారికి తెలియనివ్వను. నేను అమ్మగారిని అంతరంగిక దాసినే! కానీ తమరి ఏలుబడిలోని దాన్ని. తమకే నమ్మిన బంటును. ఇంతకాలం తమపై ఆగ్రహించిన అమ్మగారిని ప్రసన్నం చేసే బాధ్యత నేను మోశాను.


    ఇప్పుడు ప్రయత్నించి ఆ అహల్యమ్మగారు తమ యెడల ప్రసన్నం అయ్యేట్లు చేసే బాధ్యత స్వీకరిస్తున్నాను. ఆడవారి మనసెరిగి అతికినట్లు బొంకి ఒప్పించగల నేర్పున్న నాకది అసాధ్యం కాదనుకుంటున్నాను!'


    'దూ.. తి.. కా...'


    'మన్నించండి మహేంద్రా! అన్ని లోకాలకూ అధినాధులై- అందరినీ శాసించగల మీరు ఒక అబల, ఒక మానవ కాంత కోసం యిలా పరితపించడం చూడలేను! నయాన్నో, భయాన్నో, సామంతోనో, దానంతోనో ఆమె మనసు మార్చగలను. ఆ ప్రయత్నంలో విజయం సాధించి ప్రభువులకు మనశ్శాంతి చేకూర్చగలను. అని నమ్మినదాన్ని నేను. చేజారిన తమ సుఖాన్ని తమ చేతులకు అమృత ఫలంగా అందించే ప్రయత్నం చేస్తాను.'


    'ఊ!'


    'ప్రభూ! స్త్రీలు చల చిత్తులు. చపల చిత్తులు. అందునా బ్రహ్మకూతురిగా సృష్టింపబడి- దేవేంద్రాది దేవతలు తనని పెండ్లాడాలని భూప్రదక్షిణ పుణ్యం కోసం పరుగులెత్తి- చివరికి ముక్కు మూసుకుని జప తపాల్లో మునిగే ఒక జడదారికి ధారపోయబడి అసంతృప్తితో అడుగులు వేసిన ఆడదాని మనసు మార్చటం ఎంతసేపు ప్రభూ?'


    'దూతికా...'

 Previous Page Next Page