Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 21


    మమ్మల్ని చూడగానే గుడిసెల వాళ్ళంతా మళ్ళీ గుమికూడారు. ఈసారి మా పక్కన పోలీసుల్ని చూసేసరికి వాళ్ళ మొహాల్లో ఆందోళన కనిపించింది. మేము వాళ్ళ ముందు గర్వంగా, ధీమాగా నిలబడ్డాం. కాసేపట్లో వాళ్ళు మా కాళ్ళమీద పడిపోతారని మాకు తెలుసు!
    "వాళ్లు క్షమించమంటూ మనకాళ్ళ మీదపడినా మనం వాళ్ళను చూసి జాలి పడకూడదు" అన్నాడు రంగారెడ్డి.
    "అవునవును! ఇలాంటి దురాక్రమణ సన్నాసులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పోలీసులతో బాగా తోమించాలి" అన్నాడు గోపాల్రావ్.
    "చూస్తుండండి ఆళ్ళందరి కాళ్ళూ చేతులూ ఇరగ్గొడతారు" అన్నాడు యాదగిరి.
    "వాళ్ళ సంగతెలా ఉన్నా వాళ్ళ లీడర్ ని మాత్రం వదలకూడదు" అన్నాడు శాయిరామ్.
    "అవునవును! వాడిని వారం దినాలకు తక్కువ కాకుండా లాకప్ లో ఉంచి దినాము బొక్కలిరగ్గొడితే గానీ సుధరాయించడు"
    లావుపాటి పోలీస్ కానిస్టేబుల్ వాళ్ల మధ్యకు వెళ్ళాడు.
    "ఏయ్! ఈ జాగాలు ఎవళ్ళవిరా?" అడిగాడు లాఠీ భయంకరంగా తిప్పుతూ.
    వాళ్ళు కంగారుపడిపోయారు.
    "మావే దొరా!"
    "అంటే మీరు కొన్నారు బే?"
    "అవ్ దొరా?"
    "ఏయి? రిజిష్ట్రేషన్ పేపర్స్ తేండ్రా?"
    "లేవు దొరా! అయన్నీ మా లీడర్ దగ్గరున్నాయ్!"
    "ఎవళ్ళు రా మీ లీడర్! ఆడిని రమ్మను జల్దీ"
    నలుగురు లీడర్ కోసం పరుగెత్తారు.
    కానిస్టేబుల్ మళ్ళీ మాదగ్గర కొచ్చాడు.
    "చూశారా! మనమంటే ఈ ట్విన్ సిటీ లోనే అందరికీ హడల్. మీకెరుకనో లేదో నలుగురు దాదాలను లాకప్ లో వేసి కాళ్ళూ చేతులూ నా చేతుల్తోటే ఇరిచినా!"
    అందరం ఆశ్చర్యపోయాం.
    "నలుగురినా?" అనుమానంగా అడిగాడు వెంకట్రావ్.
    "అవ్! ఏమనుకున్నావ్ మళ్ళా? నలుగురికీ కాళ్ళూ చేతులూ ఇరిచేసినా! కొడుకులు పరేషానయి పోయిన్రు! ఇప్పుడేం జేస్తున్రో ఎరుకనా వాళ్ళు?"
    "ఏం జేస్తన్రు సార్?"
    "దెబ్బకు దాదాగిరి బంద్ జేసి మంచిగ ఇజ్జత్ తోటి బ్రతుకుతున్రు!"
    "అంటే మంచిగా ఉద్యోగాలు చేసుకుని పెళ్లాం బిడ్డల్ని బాగా చూసుకుంటూ జీవితం గడుపుతున్నారా సార్?"
    "ఉద్యోగం గిట్టా కాదు గానీ నాంపల్లి స్టేషన్ లో రైల్వే సీట్లు బ్లాకులో అమ్ముకుంటున్రు! మంచి మనుషులంటే గట్లుండాలి! దాదాగిరి చేస్తే ఏమొస్తది వయా! ఏదొక కొలువు జేసుకోవాలె! బతకాలె!"
    అప్పుడె గుడిసెల నాయకుడు వచ్చాడు.
    కానిస్టేబుల్ వాడిని వస్తూనే చొక్కా పట్టుకుని నేలమీద పడేసి తనని బయటకు గెంటుతాడని మాకు తెలుసు.
    కాని ఎందుకో కానిస్టేబుల్ అలా చేయలేదు.
    "ఎవళ్ళురా ఈడ గుడిసెలేయించిన్రు?" అనరిచాడు ఠీవిగా. వాళ్ళ నాయకుడు తాపీగా నడిచి కానిస్టేబుల్ దగ్గరకు చేరుకున్నాడు.
    అతనిని సమీపంగా చూస్తూనే ఉలిక్కిపడ్డాడు కానిస్టేబుల్ అతనితో పాటు మిగతా వారందరూ కూడా నిశ్చేష్టులయిపోయారు.
    "నేనే గుడిసె లేయించాన్రా! ఏమ్ సంగతి?" కానిస్టేబుల్ వంక క్రూరంగా చూస్తూ అన్నాడు ఆ లీడర్.
    కానిస్టేబుల్ అమాంతం ఎగిరి సెల్యూట్ కొట్టాడు.
    "హలో! నువ్వా అన్నా! నేనింకా ఎవళ్ళో అనుకుంటున్నానే!"
    "నేనే తంబీ! ఏమిటి సంగతి ఇంతమంది వచ్చిన్రు?"
    "అదే! ఈ గుడిసెలన్నీ వీళ్ళ జాగాల్లో వేసిన్రని కంప్లెయింట్ ఇచ్చిన్రు! దాని దిక్కుకెళ్ళి వచ్చినాం! నువ్వని ఎరుకలేదన్నా"
    "వీళ్ళంతా మావాండ్లేరా! అంతా గరీబోళ్ళున్నారు. ఒక్కసారి ఆళ్ళను సూడు! తిండీ, బత్తా ఏమున్నదివయ్యా వాండ్లకు?"
    పోలీసులు వాళ్ళవేపు చూశారు.
    అందరూ మంచి బట్టలతో లావుగా దున్నల్లాగున్నారు. ఒకో గుడిసె ముందూ వాళ్ళు ఖాళీ చేసిన బాటిల్స్ నాలుగయిదు కనిపిస్తున్నాయ్. బయటున్న మంచాల మీద ట్రాన్సిస్టర్లో సినిమా పాటలు వినిపిస్తున్నాయ్. కొన్ని గుడిసెల ముందు మోపెడ్లు, సైకిళ్ళు, స్కూటర్లు ఉన్నాయి.
    పోలీసు మొఖంలో జాలి కనిపించింది.
    "అవ్ భయ్! ఇస్కీమాకీ- మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలాయెగానీ గరిబోండ్లు గిట్లనే ఉన్నారు" జలైపడ్డారు వాళ్ళు. మాకు మతిపోయినట్లయింది.
    పోలీసులు వాళ్ళందర్నీ చీల్చి చెండాడేస్తారనుకుంటే వాళ్ళు ఆ దాదాకే సలాం కొడుతున్నారు. దాదా మా వంక కోపంగా చూసి పోలీసులతో మాట్లాడ సాగాడు.
    "ఇగో సూడండి భయ్యా! వాళ్ళంతా పాగల్ గాళ్ళున్నారు! గరీబోండ్లతో జిద్ చేస్తారు వయ్యా? ఈళ్ళకేమయినా అకల్ ఉన్నదా? మనమందరం కలిసి వాండ్లకు మదద్ చేయాలె! మనమే గుడిసెలు కట్టించి ఇయ్యాలే! అదిపోయి ఉన్నది పీకేస్తానంటే ఏమ్మాటది?"
    పోలీసులు మావేపు అసహ్యంగా చూశారు.
    మాకు వళ్ళు మండిపోయింది.    
    "ఏయ్! మీకు పైసిలిచ్చింది ఈడకెళ్ళి గుడిసెలు తీయించమని౧ నీతులు చెప్పమని కాదు" అన్నాడు యాదగిరి మండిపడుతూ.
    పావుపాటి కానిస్టేబుల్ మావేపు క్రూరంగా చూశాడు.
    "ఏయ్! జర సంబాల్ కే బాత్ కరో! పైసలిచ్చినం అంటున్నావేం సంగతి? నీయవ్వ మీరిచ్చిన వెయ్యిరూపాయలు మాకు ఒక్క నిముషం ఖర్చు! సమజయింది? లక్షల ఇచ్చినట్లు లొల్లి పెడుతున్రు! నడవండ్రి ఈడకెళ్ళి! గరీబోళ్ల తోటేందివయ్యా కిరికిరి!" మాకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు. నిశ్శబ్దంగా వెనక్కు తిరిగి మా కాలనీ వేపు బయల్దేరాం.    
    అందరం మా ఏరియా కౌన్సిలర్ ని కలుసుకున్నాం.
    ఆయన్తో సంగతంతా జెప్పాం.
    "ఆ గుడిసెలు ఏడున్నాయ్?"
    "మా జగాల్లో సార్?"
    "మీ జగాలేడున్నయ్ వయా?"
    చెప్పాం.
    "ఆ పాండూదాదాతోటి కిరికిరి భాయ్. వానికి మస్తు పైసలిస్తేగానీ జగాలు ఖాళీ చేయడు"
    "ఎన్ని పైసలవుతయ్ సార్?"
    "పాండుదాదాకి పదివేలు! నాకు పాతికవేలు!"
    అందరం షాకయ్యాం.
    "అదేంటి సార్! అంత డబ్బు ఖర్చయ్యేట్లుంటే ఆ జగాలు వదులుకోవటమే మంచిది కద్సార్"

 Previous Page Next Page