Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 20

                                 


    "అచ్చా! మీరు శంకర్ దాదా ఏరియా వాండ్లా?" ఆప్యాయంగా అడిగాడు.
    "అవునండీ"
    "అయితే ఓపని జేయండ్రి. ఈ గుడిశెలయితే ఏసేసిన్రు మా వాళ్ళు! కనుక మీ ఇండ్ల జాగాలు మళ్ళీమీకే అమ్మేయమని మా వాండ్లతో జెప్తా. వాండ్ల దగ్గర మీజాగాలు మళ్ళీ కొనుక్కోండ్రి అప్పుడు ఈళ్ళకు వేరే జాగాలిస్తా నేను."
    మాకు మతిపోయినట్లయింది.
    "ఏమన్నారు? వాళ్ళ దగ్గర మా స్థలాలు మేమే మళ్ళీ కొనుక్కోవాలా?"
    "అవ్ మళ్ళా!"
    "మా స్థలంలో అక్రమంగా వాళ్ళు గుడిశె లేసుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర మా స్థలాలు మేము కొనుక్కోవట మేమిటి?"
    "ఇష్టమయితేనే కొనండ్రి భాయ్! లేకుంటే పోండ్రి! జబర్ధస్తేం లే"
    అందరం మొఖామొఖాలు చూసుకున్నాం.
    "పోనీలే! తలో రెండు వేలూ పడేస్తే వాళ్ళు వెళ్లిపోతారు కదా! దాంతో గొడవ వదిలిపోతుంది" అన్నాడు శాయిరామ్ రహస్యంగా.
    అందరూ శాయిరామ్ ఆలోచనను సమర్ధించాం.
    "సరే సార్! అందరం తలో రెండువేలూ కడతాం! వాళ్ళను ఖాళీ చేయించండి" పాండూ దాదా మళ్ళీ పగలబడి నవ్వాడు.
    "నీయవ్వ! భలే బఫ్లూన్లున్నారయ్యా మీరు. రెండువేల్రూపాయలకు రెండు గజాల స్థలం వస్తుందేమో! అది సరిపోతదా మీకు?"
    "అది కాద్సార్ మా స్థలాలు ఖాళీ చేస్తున్నందుకు రెండువేల రూపాయలు చాలదా?"
    "ష్! నేను చెప్పేది వినవయ్యా! ఈ ఏరియాల గిప్పుడు గజం నూటడెభై ధరున్నది. మీరు ఒరిజినల్ ఓనర్స్ కదాని ఇరవై రూపాయలు కన్సెషనిస్తున్నాం! గజం నూట యాభై లెక్కన పైసల్దెచ్చి ఇయ్యండి. ఒక్కదినంల అందర్నీ లేపేసి వేరే జాగాలో గుడిశె లేయిస్తా!"
    కొద్ది క్షణాలు మాకు నోటమాట రాలేదు.
    "ఇదన్యాయం సార్! అంత డబ్బు పెట్టి మా స్థలాలు మేమే కొనుక్కోవట మేమిటి? అసలు మాదగ్గర అంత డబ్బేలేదు"
    పాండూ దాదాకి కోపం వచ్చింది.
    "ఏయ్! మంచిగా మాట్లాడ్తుంటే నరకాలు జేస్తున్రు బే! ఎళ్ళండ్రి నీయవ్వ- స్థలం లేదు, గిలం లేదు! ఈ గుడిశెలీడనే వుంటయ్. ఏంజేస్కుంటరో జేస్కోండ్రి" అంటూ వెనక్కు తిరిగి "అరేయ్! మళ్ళీ ఈళ్ళెవరయినా వచ్చి నకరాలు జేసిన్రంటే కాళ్ళూ చేతులూ ఇరగొట్టి, పంపించండి" చెప్పేసి వెళ్ళిపోయాడు వెనక్కి.
    మేము నిశ్చేష్టులమయి అలాగే నిలబడిపోయాం.
    గుడిశెల వాళ్ళందరూ ఎవర్దారిన వాళ్ళెళ్ళిపోయారు.
    "ఏం చేద్దాం?" నీరసంగా అడిగాడు శాయిరామ్ కాసేపటి తర్వాత కోలుకుని.
    "ముందు ఇంటికెళ్దాం పదండి. జ్వరం వచ్చినట్లుంది" అన్నాడు గోపాల్రావ్. అందరం నిశ్శబ్దంగా కాలనీకి బయలుదేరాం.
    మర్నాడు అందరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాం. మమ్మల్ని అంతదూరంలో చూస్తూనే ఇన్ స్పెక్టర్ లంచాలు దొరకని టౌన్ ని చూసినట్లు చూశాడు.

        
    "ఉధరీ రోకో- ఓ లోగోం కో! క్యా హోనా పూఛో!" అంటూ గావుకేక పెట్టాడు మండిపడుతూ. కానిస్టేబుల్స్ తుప్పు పట్టిన తుపాకులు తీసుకొచ్చి మాకడ్డం నిలబడ్డారు.
    "క్యా హోనా?" హెడ్ కానిస్టేబుల్ బయటికొచ్చి అడిగాడు.
    "మీరు ఓ చిన్న సహాయం చేస్తారేమోనని" గొణిగాడు రంగారెడ్డి.
    "మదద్ కావాలి? ఏం మదద్ కావాలి? మీ కాలనీ ఓండ్లందరూ తురమ్ ఖాన్లు కదా! జులుస్ లు తీస్తరు, మినిష్టర్ సాబ్ దగ్గర షికాయత్ జేస్తరు! మళ్ళీ మా పోలీసోండ్ల తోటి ఏం పని?"
    "మాకు సహాయం వూరికే చేయనక్కర్లేదు హెడ్ గారూ! ఏదో చూసుకుందాం"
    హెడ్ మరింత కోపంగా చూశాడు. "ఏంది చూసుకునేది."
    "అదేసార్! మీకు తెలీందేముంది? ఎంతోకొంత డబ్బిస్తాం" దూరంగా దభేల్ మన్న చప్పుడు వినిపించింది. అంతవరకూ పక్కగదిలో అసహనంగా, మండిపడుతూ చూస్తోన్న ఇన్ స్పెక్టర్ కి ఆ డైలాగ్ అంత నెమ్మదిగా మాట్లాడినా ఎలా వినబడిందో తెలీదు. మరి! గాబరాగా, ఆనందంగా ఒక్క ఉదుటున లేచి ఆ కంగారులో కుర్చీని వెనక్కు పడేసి ఆత్రుతగా మా దగ్గర కొచ్చాడు.
    "బయట నిలబడి ముచ్చట్లేమయ్యా! లోపటరాండ్రి, ఏమైనా తక్ లీఫుంటే నాతో జెప్పాలె! రాండ్రి" అన్నాడు ఆప్యాయంగా ఆహ్వానిస్తూ.
    అందరం అతనిలోని సడెన్ మార్పుకి ఆశ్చర్యపోతూ, ఈ మార్పుకి కారణమైన డబ్బుని సృష్టించినవాడికి దణ్ణాలు పెట్టుకుంటూ ఇన్ స్పెక్టర్ గదిలోకి నడిచాం.
    "ఏమి సంగతి? ఏం మదద్ కావాలి?" అడిగాడతను.
    "మేమందరం కలిసి సిటీ బయట ఇళ్ళస్థలాలు కొనుక్కున్నాం సార్! కొని చాలా రోజులైంది. ఇవాళ మంచిరోజుని భూమిపూజ చేయడానికెళ్తే..."
    హ్హహ్హహ్హహ్హ! మాకు తెల్సు ఏం జరిగిందో! ఆడ గుడిశెళు వేసిన్రెవరో గంతనేనా?"
    అందరూ ఆశ్చర్యపోయాం.
    "అవ్ సార్! మీ కెట్లెరుక? అడిగాడు యాదగిరి.
    "మాకెరుక లేవయ్యా! పోలీసోండ్లకు తెలిసిందేముంటది? ఇప్పుడు ఆగుడిశె లోళ్ళను ఆ జాగల్లోకెళ్ళి భగాయించాల్న. గంతేగదా!"
    "అవున్సార్!"
    "అయితే కాష్ ఇవ్వండి!"
    రంగారెడ్డి మమ్మల్ని అందరినీ పక్కకు పిల్చుకెళ్ళాడు.
    "అందరూ ఎంతుంటే అంతివ్వండి" అన్నాడు.
    ఆడాళ్ళూ, మగాళ్ళూ, పిల్లలూ అందరూ తమ దగ్గరున్న డబ్బంతా ఊడ్చి రంగారెడ్డి చేతిలో పోశారు. రంగారెడ్డి ఆ చిల్లర నోట్లన్నీ లెక్కబెట్టడానికి రెండు గంటలుపట్టింది.
    "పదకొండు వందలు" అన్నాడు ఆనందంగా.
    "అమ్మో! పోలీసులకు అంతెందుకు? అయిదొందలు చాలు" అన్నాడు శాయిరామ్. కానీ అతని మాటలు ఎవరూ వినిపించుకోలేదు.
    వెయ్యి రూపాయలు లెక్కపెట్టి ఇన్ స్పెక్టర్ టేబుల్ మీదుంచాడతను. నలుగురు కానిస్టేబుల్స్ కలిసి అరగంటసేపు లెక్కపెట్టి "వేయిరూపాయలు" అంటూ చెప్పారు ఇన్ స్పెక్టర్ తో.
    ఇన్ స్పెక్టర్ మొఖంలో మళ్ళీ కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ కనిపించినాయ్.
    "ఏయ్! వెయ్యి రూపాయలేం లెక్కవయ్యా! ఫాల్తూ న్యూసెన్స్ కేస్ కే రెండు వేలిస్తారు! టీవీ టవర్ పక్కన అంధేరాలో నిలబడినామంటే ఒక్కో హెల్మెట్ కేస్కి రెండొందలు రాల్తయ్! మాకేం ముష్టిస్తున్రా?"
    అందరం ఇన్ స్పెక్టర్ ని బ్రతిమాలాము.
    "ఇది కేవలం అడ్వాన్సండీ" అన్నాడు శాయిరాం.
    "అంటే మిగతా ఎమౌంట్ ఎంతన్నమాట?"    
    "ఇంకో నాలుగువేలు ఇస్తామండీ!"
    "నాల్గువేలా? నడవదు. అయిదువేలయినా ఇయ్యాలె! సమజయిందా?"
    యాదగిరి రాజీ కుదిర్చాడు.
    "అచ్చా! ఠీక్ హై సాబ్! పాంచ్ హజార్ దేంగే!" అన్నాడతను.
    ఇన్ స్పెక్టర్ సంతృప్తి పడ్డాడు.
    "పనయినాంక మిగతా పైసలు ఇయ్యకుంటే ఏమౌతదో ఎరుకనా?"
    "నాకెరుకే సార్! మళ్ళీ మా జాగాల్లో గుడిసె లేయిస్తారు గంతనే కదా!"
    "కరెక్ట్! ఏయ్ కృష్ణా! నలుగురు జవాన్లతోటి వెళ్ళి ఆ గుడిసెళు తీయించు" అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్ కి పురమాయించాడు అతను.
    లావుగా, జగజ్జెట్టీల్లా నలుగురు పోలీసులు. ఒక అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్ తో సహా అందరం ఆనందంగా మా స్థలాలు చేరుకున్నాం! చాలామంది గుడిసెల ముందు కూర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న వారుని వాహిని తాగుతూ, బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు.

 Previous Page Next Page