Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 22

                                 


    "వదులుకోండి! ఈడకెందు కొచ్చిన్రు మళ్ళా?"
    "మీరు మా కౌన్సిలర్ కద్సార్! మదద్ జేస్తారేమో అని వచ్చినాం."
    "పుకట్ గా ఏ కౌన్సిలర్ అయినాగానీ మదద్ జేస్తార్ వయా? అయినా పుకట్ గా మీకెందుకు సర్వీస్ చేయాలి నేను?"
    "ఎందుకేంటి సార్! ఎలక్షన్ టైమ్ లో మీరు మా ఇండ్లకొచ్చి ఓట్ల గురించి రిక్వెస్ట్ జేసిన్రు గదా! మీకే ఓట్లేసినం గనుక మీరే మదద్ జేయాలె"
    "ఓట్లకు మస్తు పైసలిచ్చినాన్రా భయ్! రెండు కోట్లు ఖర్చాయె- ఎరుకనా? ఆ పైసలన్ని ఎవడిస్తాడు నాకు. గిట్లనే వసూళ్లు జేసుకోవాలె"
    మేం మళ్ళీ షాకయ్యాం.
    "ఏంది సార్? మా ఓట్లకు పైసలిచ్చినావ్-" అడిగాడు యాదగిరి.
    "నువ్వుగాకపోతే- నీ తమ్ముడింకోడికి ఇచ్చినారా భయ్! ఒక్కొక్క కాలనీకి ఆరు లక్షలిచ్చినా"
    "ఆళ్ళెవరికో ఇస్తే మాకేం సంబంధం సార్"    
    "ఇగో ఈ బేకార్ మాటలొద్దు. పని గావాల్నా? వద్దా?"
    మేమంతా చర్చించుకున్నాం. అంత డబ్బు ఇవ్వటం కంటే ఆ స్థలాలు వదులుకోవటం మంచిదని డిసైడ్ జేసుకున్నాం.
    "ఎలాగో మన జగాలు వదులుకుంటున్నాం. మరి ఆ పోలీసులకిచ్చిన పైసలు ఎందుకు వదలాలి? వెళ్ళి మన పైసలు మనకిమ్మని అడుగుదాం" అన్నాడు యాదగిరి.

         
    మర్నాడు అందరం పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇన్ స్పెక్టర్ ని కలుసుకున్నాం!
    "ఏంది? మళ్ళీ వచ్చిన్రు?" చిరాకుగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "మా జగాలు ఖాళీ చేయిస్తానని పైసలు తీసుకున్నారు కద్సార్- మీ వాళ్ళు చేయించలేకపోయిన్రు-"
    "అవ్- ఎవరో లావార్సీగాళ్ళుంటే ఖాళీ చేయిపిస్తాం! పాండూదాదా ఎంక్రోచ్ చేస్తే మేమెట్ల ఖాళీ చేయిస్తాం? ఆడు ఎమ్మెల్యే మనిషికదా! ఎమ్మెల్యేతోటి ఠకరార పెట్టుకుంటారు ఎవళ్ళయినా! ఓల్డ్ సిటీకి ట్రాన్స్ ఫర్ అయిపోతాం! ఎరుకనా?"
    "అయితే మా డబ్బు మాకిచ్చేయండి-" అన్నాడు యాదగిరి.
    ఇన్ స్పెక్టర్ షాకయ్యాడు.
    "ఏందీ! మీ పైసలు మీకియ్యాల్నా? మీకేమయినా దమాకున్నాదా? పోలీసులకిచ్చిన పైసలు ఎన్నడయినాగానీ తిరిగొస్తాయ్?"
    "రాకుంటే ఆళ్ళను మా జగాల్లోకెళ్ళి ఖాళీ చేయించండి సార్-" యాదగిరి పట్టుబట్టాడు.
    మా కందరికీ కూడా తెలుసు- పోలీసులు ఏమైనా చేయగలరు గానీ ఒకసారి తీసుకున్న పైసలు మాత్రం వాపస్ చేయలేరు. అది వాళ్ళ వీక్నెస్- అందుకే యాదగిరి ఆ వీక్నెస్ మీద దెబ్బకొట్టాడు.
    గోపాల్ రావ్ కలుగజేసుకున్నాడు.
    "చూడండి సార్- డబ్బు వాపసివ్వకపోతే ఈ మేటరు నా పత్రికలో హెడ్ లైన్స్ లో పబ్లిష్ చేస్తా-"
    దాంతో ఇన్ స్పెక్టర్ కొంచెం షేకయ్యాడు.
    "అరె! మీరేడ దొరికిన్రురా భయ్! పైసలు రిటర్న్ జేసే ఆదతే మాకు లేదు- ఇగో ఒకపని జేయండ్రి! శంకర్ దాదా ఎరుకే కదా! ఆయన దగ్గరకు పోయి ఆయన మదద్ తీసుకోండి. ఇంకొన్ని పైసలయితే ఖర్చవుతాయ్ గానీ మీ జాగాలన్నీ మీ చేతికొస్తయ్- కావాల్నంటే నేను భీ శంకర్ దాదాకి ఫోన్ చేస్తా-" అంటూ సెల్ ఫోన్లో శంకర్ దాదాకి రింగ్ చేశాడు.
    "నమస్తే అన్నా౧ నేను జగన్ ని! ప్రమోషన్ ఏడొచ్చిందన్నా! నువ్ గట్టిగా తల్చుకుంటేనే గానీ కాదది- అదిసరేగానీ నాతానకో లాండ్ గ్రాబింగ్ కేస్ వచ్చిందన్నా! అందరూ మిడిల్ క్లాసోళ్ళు- పైగా నీ నియోజకవర్గం వాళ్ళు. ఆళ్ళ జాగాలన్నీ ఆ పాండూదాదా మనుషులు కబ్జా జేసిన్రు- ఆళ్ళను నీతానకు పంపుతున్నా! జర మదద్ జేయన్నా- ఆవ్- పైసలిస్తరు- బరాబరిస్తారు- దాన్దిక్కు కెళ్ళి ఫికర్ లేదు- ఓకే అన్నా థాంక్యూ-" ఫోన్ పెట్టేశాడు.
    "విన్నారు గదా- ఇంక శంకర్ దాదాను కలుసుకోండ్రి-"
    అందరం వెళ్ళి శంకర్ దాదాని కలుసుకున్నాం. మమ్మల్ని చూడగానే గుర్తుపట్టాడతను.
    "అరె నీ యవ్వ- మీరా! నేను గుర్తుపట్టనట్లు ఆ ఇన్ స్పెక్టర్ రికమండేషనెందుకూరా భయ్- సంగతేంటో జెప్పండ్రి-"
    అంతా వివరించాం- పదివేలకు బేరం కుదిరింది. వారం రోజులు టైమివ్వమన్నాడు శంకర్ దాదా.
    వారం తర్వాత మేమూ మా ఇళ్ళస్థలాల దగ్గరకెళ్ళే సరికి ఒక్క గుడిశె కూడా కనిపించలేదక్కడ.
    "థూ నీ యవ్వ- ఏ.పి. గవర్నమెంట్- ఏ.పి. పోలీస్ డిపార్ట్ మెంట్- ఆళ్ళు చెయ్యలేని పని శంకర్ దాదా చేశాడు- గూండాలంతా అసెంబ్లీలోకీ పార్లమెంట్ లోకీ వస్తున్రంటే రాకేం జేస్తరు మళ్ళా!
    మనలాంటి ఎడ్యుకేటెడ్ గూడా వాండ్లకే ఓట్లేసే పరిస్థితులాయె-" అన్నాడు యాదగిరి కసిగా.

                                   *  *  *  *  *

 Previous Page Next Page