Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 20


    "నీ బ్రెయిన్ని నమ్ముకుంటే నన్ను కూడా సర్వనాశనం చేసేట్లున్నావు. మనిద్దరం కలిసి వెళితే అనుమానం వస్తుంది మిత్రమా! అంచేత నేను ముందు వెళ్ళి డ్రామా ఆడుతూంటాను. డ్రామా ఆఖర్లో నువ్వు రావాలి."
    "ఓకే బ్రదర్! వెళ్ళిపో_ ఆలస్యం చేయకు. కమాన్ ప్లీజ్! డోంట్ వేస్ట్ టైమ్."
    "మీ ఇంటి అడ్రస్ ఇవ్వకుండా ఎలారా?"
    "ఆటోవాడికి గుర్తులు నేనే చెప్తాను కదా?" అంటూ ఆటోని పిలిచి అరగంటసేపు ఇంటి గుర్తులు చెప్పాడు.
    అంతా వినేసరికి ఆటోవాడి బ్రెయినంతా పాడైపోయినట్లయింది.
    "అలా కన్ ఫ్యూజన్ చేయకండి సార్! మరీ ఎక్కువ గుర్తులు చెప్పకూడదు ఎప్పుడూ. వీలైనంత తక్కువగా మాట్లాడితే తేలిగ్గా అర్థమవుతూంది..." అన్నాడు నెత్తిమీద గట్టిగా కొట్టుకుంటూ...
    "వాడెందుకులే బ్రదర్! నేను చూపిస్తా ఇల్లు పద...." అన్నాడు భవానీశంకర్.
    ఆటో పావుగంటలో ఇల్లు చేరుకుంది.
    దిగి లోపలకు నడిచాడతను. హాల్లో ఎవరూ కనిపించలేదు.
    "హలో!" అన్నాడు హాల్లో నిలబడి_ "హలో... హలో... హలో... హలో..."
    సీత ఆతృతగా బయటికొచ్చింది. అలా పిట్టలా అరుస్తోంది ఎవరా అని చూడ్డానికి.
    అతనిని చూసి ఠక్కున ఆగిపోయింది.
    "ఎవరి కోసం?" అడిగిందామె.
    "ఇంకెవరి కోసం ఫ్రెండ్! మిసెస్ సీతా గోపాల్రావ్...."
    "నేనే సీతను. మీరు...."
    "ఏడ్చినట్లుంది మైడియర్ సీతాజీ_ మెయిల్ ఇచ్చి రమ్మని పిలిచేది మీరే. వచ్చాక మీరెవరని అడిగేది మీరేనా? వెరీబాడ్... వెరీబాడ్...."
    సీతకు ఛటుక్కున అర్థమైపోయింది.
    "మైగాడ్! మీరు చంద్రకాంత్ గారా?"
    "అంటే నేనెవరో తెలీకుండానే మెయిల్ ఇచ్చారన్నమాట. నాకు తెలుసు మేడమ్! ఇలాంటి తిరకాసేదో వుంటుందనీ..."
    "అహహ మీరు తెలీదని కాదు... మీరు తెలుసు కానీ మిమ్మల్నెప్పుడూ చూడలేదన్నమాట. అంటే మీరు తెలీదుగానీ, మీరు బాగా తెలుసు" తడబడుతూ అంది.
    "ఇంత అర్జంటుగా రమ్మని ఎందుకలా మెయిలిచ్చారు? ఎనీ ప్రాబ్లెమ్? గోపాల్రావ్ కేమైనా జబ్బు లాంటిది సడెన్ గా వచ్చిందా?"
    "అహహ అదీ_ అది... మీరు కూర్చోండి కాఫీ తెస్తాను."
    "కాఫీ ఇవ్వటం కోసం అర్జంటుగా రమ్మని మెయిలిచ్చి పిలిపించారా?" కోపంగా అడిగాడు.
    "అహహ! అదికాదు. ఇదంతా మా డాడీయే చేశారు."
    "ఎవరు? ఆ మిలటరీవాలానా? మరి అతనే కాఫీ తయారుచేశాడా?"
    అతని గొంతు విని అక్కడకు చేరుకుంటున్న కనకారావ్ కి వళ్ళు మండిపోయింది.
    "ఏయ్ నువ్వేలా మిలటరీవాలా అంది?" అమాంతం భవానీశంకర్ దగ్గరకొచ్చి అతనిని చొక్కా పట్టుకుని పైకి లేపుతూ అడిగాడు.
    "నో నో నో! యూ ఆర్ మిస్టేకెన్ మైడియర్ మిలటరీవాలా! మిలటరీవాలా అంటే నా ఉద్దేశ్యం మిలటరీవాలా అని కాదు_ నెవర్"
    "కాకపోతే మరేమిటి?"
    "మిలటరీ జెంటిల్మన్ అని అర్థం..."
    సీత చప్పున తండ్రికి అడ్డుపడింది.
    "డాడీ! ఈయనే చంద్రకాంత్ డాడీ౧ మన మెయిల్ అందగానే బయల్దేరి వచ్చేశారు. రైటర్ చంద్రకాంత్."
    "ఓ! దిస్ ఫెలో?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
    "ఎస్ డాడీ! సేమ్ ఫెలో...."
    "సో_ యూ ఆర్ మిస్టర్ చంద్రకాంత్?" చంద్రకాంత్ నడిగాడు అనుమానం తీరక.
    "ఎస్సర్! అయామ్ మిస్టర్ చంద్రకాంత్_ ఎనీ డౌట్?"
    "నో_ నో! ఓ వెరీ గ్లాడ్ టు సీయూ" బలవంతంగా కరచాలనం చేశాడు.
    "నేను కూడా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషించేవాడినే మిత్రమా! ఎటొచ్చీ నా చేతిని కొంచెం లూజ్ గా వదిల్తే తక్కువ ఫ్రాక్చర్స్ తో బయటపడతాను_ ఎక్కువ సంతోషంగా వుంటాను."
    కల్నల్ పగలబడి నవ్వాడు.
    "అహ్హహ్హహ్హ! మనం కొంచెం టఫ్ లే. ఆర్మీ కదా! సివిలియన్స్ అంతా డెలికేట్ సన్నాసులు. కమాన్_ సిడౌన్."
    చంద్రకాంత్ సోఫాలో కూలబడ్డాడు.
    "ఓకే! మిలటరీ జెంటిల్మన్! నన్ను అర్జంటుగా పిలిపించిన కారణం చెప్పనే లేదు."
    "ఆ_ ఎస్ దేరీజ్ రీజన్"
    భజన్ రావ్ ట్రేలో కాఫీలు తీసుకొచ్చాడు "వాటీజ్ దట్ రీజన్?" అడిగాడు భవానీ.
    "కాఫీ తీసుకోండి" అంది సీత.
    భవానీశంకర్ ఓ కప్పు అందుకున్నాడు.
    "షుగర్ తక్కువయితే ఇప్పుడే చెప్పండి సార్! నేను వెళ్ళాక గావుకేకలేస్తే కుదర్దు" అన్నాడు భజన్ రావ్.
    భవానీశంకర్ కాఫీ సిప్ చేశాడు.
    "ఆహా! ఒండర్ ఫుల్ కాఫీ_ మీ వంటవాడెవడోగానీ ఎక్కువకాలం బ్రతకడు."
    భజన్ రావ్ ఉలిక్కిపడ్డాడు.
    "ఎందుకని సార్?"
    "మంచి పేరు తెచ్చుకున్న వాడినే దేవతలు పైకి పిల్చేస్తారని మా తాతయ్య అంటుండేవాడు. అది ఫాక్ట్ కూడా_ ఇప్పుడీ మిలటరీ వాలాని చూడు_ దేవతలు చావనన్నా చస్తారుగానీ ఈ బాపతుని ఛస్తే పిలవరు."
    కనకారావ్ ముఖం జేవురించిందిగానీ తమాయించుకున్నాడు. "డోంటాక్ నాన్సెన్స్" అని భజన్ రావ్ వైపు తిరిగాడు.
    "భజన్ రావ్!" పిలిచాడతను.
    "ఎస్సర్!"
    "ఇక్కడే నిలబడి ముఖాలు చూడనక్కర్లేదు. గెటెవే" మండిపడుతూ అన్నాడు.
    భజన్ రావ్ లోపలికెళ్ళిపోయాడు.
    "మిస్టర్ చంద్రకాంత్! మిమ్మల్నో విషయం కన్ఫర్మ్ చేసుకోడానికని పిలిచాము" విషయంలోకొస్తూ అన్నాడు.
    "ఓ_ అలాగా ఫ్రెండ్! వెల్ కమ్_ ఏమిటది?"
    "అదే.. నిన్న రాత్రంతా మావాడు అయ్ మీన్ మా సనిన్లా_ అంటే మీ ఫ్రెండ్ గోపాల్రావ్ మీతో హోటల్ రూమ్ లో పార్టీ చేసుకుంటూ గడిపామని చెపుతున్నాడు. ఈజిటే ఫాక్ట్?" అది వెరిఫై చేసుకోడానికే మా అమ్మాయి నీకు మెయిలిచ్చింది.
    "ఇలా అర్జంటని మెయిలిచ్చి అందరినీ పిలిపించడం, అదీ మా అల్లుడు రాత్రంతా మీతో వున్నాడా లేదా అని వెరిఫై చేసుకోవడం చాలా నికృష్టమైన అయిడియా మేజర్! ఎవరు కనిపెట్టారీ అయిడియా?"
    కల్నల్ కి కోపం ఎక్కువయిపోయింది.
    "నేను మేజర్ ని కాదు."
    "మేజర్ కాకపోతే కెప్టెన్"
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్? అయామ్ కల్నల్."

 Previous Page Next Page