Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 21

 

    ఈ సుబ్బారావుని మన మెరిగిన ప్లీడరు సుబ్బారావుని యెంత గొప్పచేసి వ్రాస్తున్నాడు౧ అంటారు మిత్రులు. కాని అయన కవిత్వంలో పదోవంతు మాధుర్యం లేని ఇంగ్లీషు కవి జీవితాల్ని గురించి 'హాహా' అనుకుంటో చదివిన వారు ఇంగ్లీషు వాళ్ళు 'కీట్సు' ను చంపారని షెల్లీ అందంగా పాడితే కంఠతా వల్లన వేసినవారే యీ మాటలనేది! కాని ప్రతిరోజూ కనబడేవాణ్ణి నేక్కిరింఛి నా ఉపేక్ష చేసినా గాయపడ్డానికి బతికి వున్న హృదయం కలవాణ్ణి తోటివాణ్ణి ఘనుడు, ఉత్తముడు అంటే నమ్మడం ఎంత కష్టం. మనుషుల ఆత్మల సేల్సుకి (Self) కి ఎంత గాయం! ఇంగ్లీషు అతను కాదు, ఇంగ్లీషు వాళ్ళ చేత గౌరవాన్ని పొందలేదు, చివరికి బెంగాలీ అతనన్నా కాదు, హిందీలోకి తర్జుమా కాలేదు, సారస్వత ఆచార్య కాళ్ళు పట్టలేదు, జమిందారు కాదు, జరీ టోపీ లేదు. సంస్కృత సమాసాలు లేవు, పండితుడు కాదు, అర్ధం లేని చిక్కులు లేవు -- యీ సులభ పరిచయుడు యీ సుబ్బారావు సాధారణ పదాల కవిత్వంలో గొప్పతనం  వొప్పుకోవడం ఎంత కష్టం?
    కవిత్వం , సౌందర్యం , ప్ర్రేమ -- ఇట్లాంటి విలువలు యీ నాటి మనుషుల మనస్సులో లేవు. వున్నాయని కొందరు ఘనం కోసం నటిస్తారు. ఆస్తి, పిల్లలు, గొడ్డు బీరువాలు చీరలు ఇళ్ళు- ఇవే నిజమైన విలువలు వాళ్ళకి. అవి కాని విలువలు వున్నాయని గట్టిగా అనేవాడు తమ ఆస్తి వృత్తి అధిక్యతని ప్రశ్నించేవాడు! క్షమింపరానివాడు. తమతో compitssion కి రారు కదా అనీ, కీర్తిని పంచమని అడగరు కదా అనీ, తమ ప్రాముఖ్యతని నొప్పించాడు కదా అని ధైర్యంతో , చచ్చిన artistits ని పూజించడం ఆనరికీ అంగీకారం. ఆ కవుల్ని తాము మెచ్చుకుంటే , తమ ఘనత
మర్యాదస్తుల్ని వోదలక ఏడిపించే కవులు లేకపోలేదు. వాళ్ళ పేర్లు ఎన్నటికీ బైటికి రావు. కాని పొలం మనుషుల్నీ, వాళ్ళ మోటు మాటలతో, ఆవు వాసనలతో, మట్టితో , వాంఛలతో , లోపాలతో , తీసుకొచ్చి, శృంగార మూర్తులను చేసి, వారి హృదయ ఔన్నత్యం ముందు వాళ్ళ శృంగార తేజస్సు ముందు- విర్రవీగే మీరందరూ, మీ భార్యలు, పతివ్రతలు, అల్పులు క్షద్రులు అంటే! ప్రేమ, శృంగారం ఉన్నాయనీ, వాంఛనీయమనీ, మరిచిపోవడానికి రోజూ తంటాలుపడే యీ ఆస్తి కొక్కులు, హక్కుల కొక్కులు ,ఆ కవిని, బతికివున్న వాణ్ణి , గొప్పచేస్తే భరించగలరా? వ్రాయడం అపాడనీ ఇంక వ్రాయనని పూచీనిచ్చాడనీ, కవిత్వాన్ని తలగుడ్డలో ఇరికించాడనీ, మండే హృదయాన్ని లాంకోటుకింద కప్పాడనీ, తమ వంటి ప్లీడరైనాడనీ, పిచ్చి వేషాలు వొదిలాడనీ , మర్యాదస్తుల గుంపులో చెరాడనీ నిశ్చయమైనాక కద ప్రజలు సుబ్బారావుని క్షమించింది? అట్లా కాలేదనే కద , కృష్ణశాస్త్రిని ఇంకా పూర్తిగా క్షమించి మన్నన చెయ్యంది! డొక్కు సన్మానాలతో అగౌరవ పరిచింది! శాస్త్రి గారూ, ఊర్వశీ గాడలింగన ప్రవాసీ , వెలితి మనుషుల వెకిలి సన్మానాలలో సంతుష్టిని వెతికారా!
    కవిత్వానికీ జీవితానికీ యేమిటి సంబంధమని ఎన్నేళ్ళమాట్తో తర్కం. ఉన్నదని కొన్నాళ్ళు, లేదని కొన్నాళ్ళూ! నాలో చూసుకుంటే నా జీవితానికీ , నా వ్రాతలకీ, ఎంతో కలియక కనబడుతుంది నాకు. నాతొ నా వ్రాత మారుతోంది. నా కలలు , నా ప్రేమలు, నా ఆశలు, నా నిరాశలూ, అన్నిటినీ పాడుతుంది. నాకలం. ఒకప్పుడు శ్రావ్యంగా, ఒకప్పుడు కఠోరంగా ! కాని నా మిత్రులలో గొప్ప కవిత్వం వ్రాశేవారి జీవితాలకీ ఆ కవిత్వం ఆశయాలకీ సంబంధం కనాబడదు నాకు. వారికి కనబడుతున్నందను కుంటాను; ఎవరికి వారికి, ఏమి వ్రాస్తేనేం? వ్రాతల వెనక్కి చూస్తెనేం, లేక ప్రస్తుతం ప్రతిఫలిస్తేనేం? హృదయంలోంచి వొచ్చిందా? వుత్త చమత్కారమా? అనేదే ముఖ్యం. జీవితం వ్రాతలకీ అనుగుణ్యంగా ఉందా? లేకపోతే యీ వ్రాతలు వుత్త పై మెరుగా? జీవితం అను గుణ్యంగా వుండనక్కరలేదా? ఒక రన్నట్లు వ్రాతలు = ఒక మూడ్ (Mood)లేక Highest moments of inspiration ఇన్ స్పిరేషనా? తక్కిన జీవితం అధమమైనా, ఏ పూర్వసంస్కారాన్నించొ ఉత్తమ కావ్యం కలగవచ్చా! ఏ రసికత్వమూ లేనివాడు ప్రేమ కావ్యాలూ, ఏ ధీరత్వమూ లేనివాడు ఆదర్శకీర్తనలూ, అల్పాత్ముడు ఉత్తమ ఉత్సాహాలు కల్పించగలరా? ఏ మంత్రి పెళ్ళి సమయమో వచ్చేటప్పటికీ ఒక కవి డోలూ, ఒక కవి బూరావూది కూడా దేశాన్ని నూత్న ప్రపంచానికి ఉదార ఆశయాలకి స్వేచ్చవీదులకి రక్త స్రావాలకి ఆకాశ విహరాలకి ఆంధ్ర పౌరుశాలకి పురిగొల్పగల శక్తుల్ని కలిగి ఉండగలడా? ఇదీ నా సమస్య!
    ఎందుకంటె మృతకవుల జీవితాలు , నిజమైన కవులని పరిశీలిస్తే; ఏదో గొప్ప "స్ట్రగుల్" ఒక తిరుగుబాటు, జీవితంలోనే ఒక ఆదర్శ ప్రయత్నం ఇట్లాంటివి కనబడతాయి. శ్రీనాధుడు పోతన్నా తీసుకోండి; కీట్సూ, షెల్లీ , బైరాస్ , వర్ద్సు వర్తు, బ్రౌనింగ్ , D.H. Laurance, మొదలైన వాళ్ళని వొదిలి, పోతున్నకన్న శ్రీనాధుడు నూరురెట్లు ఎక్కువ చక్కగా వ్రాస్తాడు. కాని ఆత్మ సంతుష్టికీ, - భక్తీ సంగతి మాట్లాడటం లేదు -- ఆత్మ ప్రోత్సాహానికి పోతన్న పలకవలసిందే!
    కవిత్వానికీ (కవిత్వమంటే వ్రాతలన్నీ) కవికీ, దీపానికి కాంతికీ వున్న సంబంధం అనుకుంటాను. అన్ని తెజస్సులూ, వికారాలూ మాలిన్యాలూ, దీపంలో వున్నవన్నీ కాంతిలో కనబడతాయి. నిర్మల దృష్టి కలవాళ్ళకి, కవిత్వమే కాదు, అద్భుతమైన కంఠమూ, మంచి చాతుర్యమూవిద్యా కలిగి కూడా ఆత్మలోకి పలకలేని కవులూ గాయకులెందరో యీ ఆంధ్రదేశంలో! పేర్లు చెప్పానా సంగీతం తెలీదనీ, ఆంధ్రాభిమానం లేదనీ అంటారు. ఆత్మలో మాట్లాడగల శక్తి కావాలంటే వ్రాతలోంచి గాని పటాల్లోంచి గాని సంగీతం లోంచి గాని అసలు "సోర్సు" లో జన్మస్థానంలో ముందు ఆత్మమధ్యర్యంవుండాలి. కళలకైనా ఆత్మ విద్యే ప్రధానమేమో! ఎందుకంటే ఏమి చేసినా, ఏమి వ్రాసినా , ఏమి పాడినా అత్మానుభవంనించి  ఎట్లా తప్పించుకోగలరు? ఎంత గొప్పగా పాడగలిగినా త్యాగరాజు కీర్తనని నాబోటివాడు యితరులలోకి పలికించగలడా రామభక్తి గలవాడు కాని? ఆ Emintion తెచ్చుకోగలవారు , రంగం మీది నటకుడివలె తెచ్చుకోగలవారున్నారు. ఏ షేక్ స్పియరో తప్ప తన అనుభవాన్ని మీరి యితర పాత్రల్ని తాను యేరిగినట్టే చిత్రించగల జీనియసులు అరుదు. నేను ఎక్కడన్నా స్త్రీ పాత్రని స్వభావసిద్దంగా చిత్రించినా అట్లాంటి స్త్రీని ఎరుగుదును గనక ఆమెతో బాధలు పంచుకున్నాను గనక. కాని ఎవరో అసామాన్య ప్రతిభావంతులు గొప్ప జీనియసులు స్త్రీతో పరిచయం లేకుండానే స్త్రీ హృదయాన్ని గురించి అద్భుతంగా వ్రాయవచ్చు. అది Inspiration కావచ్చు లేక తన ఆత్మతో విశ్వం ఆత్మని అందుకోడం వల్ల కావచ్చు. లేక పూర్వజన్మ సంస్కారం వల్ల కావొచ్చు.   ఏదో అన్నినో లేక అన్నీ వొకటేనో నాకు తెలీదు. జీనియసుల్ని ఆట్టా వుంచి సామాన్య చిత్రకారులు అనుభవం మీదనే తమ జీవిత నిర్ణయాల మీదనే ఆధారపడాలి, రసజ్ఞానం కోసం. అందువల్లనే జీవితానికీ, కళకీ సంబంధం తప్పదు. జీవితాన్ని మీరి వ్రాయగలవారు యుగపురుషులు, నా సోదర కవులు తాము యుగకారకులమంటే నేను మాత్రం కానని మాత్రమే అనగలను.

 Previous Page Next Page