Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 20

 

    ఓ పక్క లాన్స్ లో కూర్చొని పనిచేసుకోనీకుండా వర్షం లోపలికి గెంటింది.
    పోనీ లోపల పని చేసుకుందామంటే ఎవడో డోర్ బెల్ మోగిస్తున్నాడు. కోపంగా వెళ్లి తలుపు తెరిచేసరికి ఎదురుగ్గా నిలబడ్డ వ్యక్తీ వినయంగా "న.....న.....నమస్కారం సార్!" అన్నాడు.
    "ఎవరువ్వు " కోపంగా అడిగాడు భీమారావ్.
    ఆ ఆకారం కొంచెం ఖంగారు పడింది గానీ అంతలోనే సర్దుకుంది.
    "నా పేరు ....దీప్ ...అహహ .....కాదండీ! భూప్ చంద్ -భూప్ చంద్-"
    "నీ బోడి పేరు గురించి కాదు నేనడుగుతోంది నువ్వెవరు? ఎందుకొచ్చావిక్కడికి?" తీవ్రంగా అడిగాడు భీమారావ్.
    అతను తమ అపోజిషన్ పార్టీ వాళ్ళ తనమీద ఎటాక్ చేయడానికి పంపించిన గుండా ఏమో అన్న అనుమానం తలెత్తిందతన్లో!
    'జాబ్ సార్...." అన్నాడు దీప్చంద్ ఎండిపోతున్న గొంతుని తడిచేసుకుని.
    "జాబా?"
    ఇంకా అనుమానంగా అడిగాడు భీమారావ్ . "....వాట్ జాబ్?"
    "నౌఖరుద్యోగం సార్!"
    "ఏ నౌఖరుద్యోగం?"
    దీప్ చంద్ కించెం చెప్పాలో తెలీలేదు. ఒరిజనల్ ప్లాన్ ప్రకారం తను నౌఖరుద్యోగం కోసం ఆర్.భీమారావ్ ఇంటికెళ్ళినప్పుడు - అమ్మాయి కూడా అక్కడ ఉండి - అంతా స్మూత్ గా జరిగేటట్లు చూడాలి. తనేమయినా తప్పులు మాట్లాడితే అమ్మాయే కవర్ చేసుకోవాలి.
    కానీ అమ్మాయి ఇంకా లోపల్నుంచి బయటకు రాకపోవడం అతనికి చాలా భయం కలుగజేసింది.
    ఆర్. భీమారావ్ వ్యవహారం చూస్తుంటే తను ఇంక ఏం మాట్లాడినా, ఏదో ఒక క్లిష్టపరిస్థితిలో పడిపోక తప్పెట్లు కనిపించడం లేదు.
    ఇలా ప్రియురాలి తండ్రి ఏదైనా పేచీ వచ్చినప్పుడు ప్రియుడు ఏం చేయాలో కూడా 'నేటి పిచ్చాళ్ళ రేపటి ప్రేమికులు" అనే ఇంగ్లీషు నవలలో వివరంగా రాశాడు రచయిత గ్రిస్టన్ క్రిష్టఫర్డ్.
    దాని ప్రకారం తను గంటకు నూట పధ్నాలుగు కిలోమీటర్ల వేగంతో బయటకు బులెట్ లాగా దూసుకుపోవాలి.
    వెనక్కు తిరిగి బుల్లెట్ లాగా దూసుకుపోవడానికి వీలుగా - ఓ అడుగు వెనక్కు వేశాడు దీప్ చంద్.
    లోపలి గది వేపుకున్న తలుపు వంక చూడటం, సమాధానమివ్వక పోవడం, ఓ అడుగు వెకనక్కు వేయడం ఇవన్నీ ఆర్. భీమారావ్ లో కొత్త అనుమానాలు కలిగించినయ్!
    "పట్టపగలే కూకట్ పల్లి ప్రాంతంలో దోపిడీ - ఇంటి యజమాని హత్య - రెండు లక్షల డబ్బూ - నగలతో దుండగుల పరారే - " అంటూ అంతకు ముందురోజే న్యూస్ పేపర్ హెడ్ లైస్న్ లో తను చదివిన వార్తా మళ్ళీ కమ్మముండు కదలాడింది.
    ఇప్పుడీ ఎదురుగ్గా నిలబడ్డ ఆకారం కూడా ఆ బాపతేనేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని రెండడుగులు వెనక్కు వేశాడు. చటుక్కున టేబుల్ సొరుగు లాగి అందులోంచి పిస్టల్ తీసి దీప్ చంద్ కి గురి పెట్టాడు.
    దీప్ చంద్ పై ప్రాణాలు పైనే పోయాయి!
    సరిగ్గా ఆ సమయంలో అమ్మాయి లోపలి గదిలోంచి హల్లో కొచ్చింది. అక్కడి దృశ్యం ఆమెకు - ఆమె ఎప్పుడూ కావాలని కోరుకోనేంత థ్రిల్ కలిగించింది. ఎప్పుడూ తండ్రి తనకు దగ్గర కూర్చోబెట్టుకుని అస్సాంలో రాజకీయ పరిణామాల గురించి, పంజాబ్ పరిణామాల ఊహాగానాల గురించి చెప్పే విషయాలతో విసిగిపోయి వుంది.
    "డాడీ!' అంటూ అరిచిందామె ఉత్సాహంగా.
    దీప్ చంద్ కి పోయిన ప్రాణాలన్నీ నెమ్మదిగా తిరిగి రావడం ప్రారంభించినాయ్. ఆమె ప్రవేశించేసరికి.
    ఆర్.భీమారావ్ కి అమ్మాయి అలాంటి అత్యవసరమైన సమయంలో రావడం అనందం కలిగించింది.
    "వెంటనే పోలీస్ కి ఫోన్ చేసేయ్యమ్మా! డేకాయిట్ వచ్చాడని చెప్పు-" అన్నాడు తన చూపు, పిస్టల్ గురీ కదపకుండా.
    అమ్మాయి ఉలిక్కిపడింది. దీప్ చంద్ కి తన తండ్రీకీ మధ్య చాలా పెద్ద ఎత్తున అపార్ధాలు జరిగిపోయాయని గుర్తించిందామె.
    "అయ్యో డాడీ! ఇతను డేకాయిట్ కాదు! మనింట్లో నౌఖరుద్యోగం కోసం వచ్చాడు - నౌఖరు కావాలని నువ్వు పేపర్లో వేయించావ్ కదా...."
    ఆర్.బీమారావ్ ఆశ్చర్యపోయాడు.
    "ఓ! నౌఖరుద్యోగం కోసం వచ్చాడా?"
    "అవును డాడీ!"
    "ఆ మాట నిజమేననిపించింది ఆర్. భీమారావ్ కి. ఎందుకంటె ఆ ఆకారం "జాబ్ - నౌఖరుద్యోగం" అంటూ ఏదేదో మాట్లాడాడు ఇందాక! ఐనాగానీ పిస్టల్ సొరుగులో పడేసే ముందు మరోసారి ఆ విషయం ఋజు చేసుకోవాలనిపించిందతనికి.
    "నువ్వు నౌఖరుద్యోగం కోసం వచ్చావా?" అడిగాడు దీప్ చంద్ ని.
    "అవునండీ! నౌఖరుద్యోగం కోసం వచ్చాను-"
    "అమ్మాయ్ ...." ఆప్యాయంగా కూతురిని పిలిచాడు ఆర్. భీమారావ్.
    "ఏం డాడీ?"
    "అతను నౌఖరుద్యోగం కోసం వచ్చాడని నీకెలా తెలుసు?"
    అమ్మాయి ఉలిక్కిపడింది. చటుక్కున నాలిక్కొరుక్కుంది. అనాలోచితంగా తనెంత చిక్కుల్లో ఇరుక్కు పోయిందా అని ఖంగారు పడుతూ దీప్ చంద్ వేపు చూసింది.
    దీప్ చంద్ ఎందుకైనా మంచిదని ఇంకో అడుగు వెనక్కు వేశాడు.
    "ఎలా తెలుసంటే .....ఎలా తెలుసంటే.....అదే డాడీ! అదే.....నాకు ఎలా తెలుసో తెలుసా?".....అదే- ఆ! గుర్తొచ్చింది ! అతని మొహం చూస్తే తెలీటం లేదు? నౌఖరుద్యోగం చేసేవాళ్ళు మొహాలు ఇలాగే ఉంటాయ్! మొన్న మనం చూసిన సినిమాలో కూడా నౌఖరు అచ్చం ఇలాగే లేడూ?"
    ఆర్. భీమారావ్ తను చూసిన ఆ సినిమాలోని నౌఖరు మొహం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించేడు గానీ సాధ్యం కాలేదు.
    దీప్ చంద్ తన ప్రియురాలు తన మొహం గురించి అలా మాట్లాడటం చాలా భాధ కలిగించింది.
    తన మొహం అతనెవరో ఇంగ్లీషు హీరో మొహంలా వుంటుందని ఆమె ఓసారి తనతో చెప్పింది.
    మరిప్పుడేమో తన మొహం చూస్తె చాలు నౌఖరు' అని తెలిసిపొతోందంటుంది.
    "ఏం చదువుకున్నావ్ నువ్వు?" అడిగాడు బీమారావ్.
    "బి.ఏ. అండీ!"
    "వ్వాట్?" అదిరిపడ్డాడు ఆర్. భీమారావ్. "నువ్వు గ్రాడ్యుయేట్ వా?"
    "అవునండీ?"
    "గ్రాడ్యుయేట్ వయుండి నౌఖరుద్యోగం కోసం వచ్చావా?"
    అమ్మాయి ఓ చేత్తో నెత్తి కొట్టుకుంది. 'ఏ ఎయిత్ క్లాసో , టెన్త్ క్లాసో అనక ఉన్నదన్నట్లు చెప్పేస్తాడేమిటి?"
    "అవునండీ! ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదండీ?"
    "అయితే పేపర్లో ఉన్న అర్హతలన్నీ చదివావా?"
    "చదివానండీ!"
    "ఆ అర్హతలన్నీ నీకున్నాయ్ కదూ?"
    "ఉన్నాయండీ!"
    "సపోజ్ - అపోజిషన్ పార్టీ వాళ్ళు మన ఇంటి ముందు ధర్నా చేశారనుకో వాళ్లనేలా గెంటుతావ్?"
    అమ్మాయికి ఆ ప్రశ్న అనందం కలిగించింది. ఎందుకంటే ఆ ప్రశ్న వేస్తె ఎలా సమాధానం చెప్పాలో భవానీశంకర్ ముందే చెప్పాడు.
    దీప్ చంద్ భవానీశంకర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు.
    "అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంటిముందు ధర్నా ప్రారంభించగానే ముందు నేను వెళ్ళి 'అయ్యగారు డిల్లీ లో వున్నారు- ఊళ్ళో లేరు' అని చెప్తానండీ! అది విని వాళ్ళు నిశ్సబ్దంగా ఎవర్ధారిన వాళ్ళు వెళ్ళిపోతారండీ! ఒకవేళ మిమ్మల్ని ఆ ప్రదర్శనల్లో ఎవరయినా కిటికీ లోంచి చూశారనుకోండి - అప్పుడయితే ప్రజల కోరిక మేరకు అయ్యగారు పార్లమెంట్ మెంబర్ షిప్ కి రాజీనామా చేసి  ప్రజా ఉద్యమంలో పాల్గొనటానికి నిశ్చయించుకున్నారు అని వాళ్ళతో అబద్దం చెప్తామండీ- అక్కడికీ వాళ్ళు వెళ్ళలేదనుకొండి - నేను పైకోచ్చేసి మేడ మీద బాల్కనీలో కనపడకుండా దాక్కుని కింద ధర్నా జరుపుతున్న వాళ్ళమీద కారం జల్లుతానండీ!!" బట్టీ పట్టినట్లు అప్పజెప్పాడతను.
    ఆర్ .భీమారావ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ధర్నా జరిపే వాళ్ళను చెదరగొట్టడానికి ఇంత అద్భుతమైన ఐడియాలున్నాయని తనకింతవరకూ తెలీదు.
    "ఒండర్ పుల్!" అన్నాడు.
    ఇదే అవకాశమనుకుని "సూపర్బ్" అంది అమ్మాయ్.
    "నాకు ఇలాంటి అద్భుతమైన ఉపాయాలతో క్రిక్కిరిసి పోయిన జీనియస్ లే కావాలి!" అన్నాడు ఆర్. భీమరావ్.
    దీప్ చంద్ మొహంలో భయం తొలగిపోయింది. ఆర్. భీమారావ్ నుంచీ తనకెలాంటి ప్రమాదమూ లేదన్న నమ్మకం కలిగింది.
    అమ్మాయి సంతృప్తిగా కళ్ళు మూసుకుని 'థాంక్స్ యూ భవానీ శంకర్!' అనుకుంది.
    "కమాన్ కమాన్- ఇంక చూస్తావేమిటి? లోపలి కెళ్ళు - అమ్మాయ్ - గూప్ చంద్ ని నేను నౌఖరుగా చేర్చేసుకుంటున్నాను. అతనికి సర్వెంట్ క్వార్టర్స్ చూపించు - యూనిఫారమ్ కూడా నాలుగు జతలిచ్చేయ్...."

 Previous Page Next Page