"బాయ్ ఇంకో కూల్ డ్రింక్ తెచ్చి ఆమె ముందుంచాడు.
"కమాన్ మిస్ కన్యకా! కమాన్! టేకిట్_" అన్నాడు అప్పల్రాజు.
కన్యక గ్లాసు అందుకుంది. అప్పల్రాజు ఫోన్ అందుకున్నాడు. "హలో రిసెప్షన్! రూమ్ వెకేట్ చేస్తున్నాను, బిల్ పంపించండి! అర్జెంట్"
కారు డ్రైవరు లోపలికొచ్చి నిలబడ్డాడు.
"వచ్చావా! కారులో పెట్రోల్ పోయించేశావా?
"పోయించాను సార్"
"అయితే లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టెయ్. మిస్ కన్యక సూట్ కేస్ అరె మీ లగేజ్ ఏది మిస్టర్ దీప్ చంద్?" ఆశ్చర్యంగా అడిగాడతను.
భవానీశంకర్ కేంచెప్పాలో తెలీలేదు. చకచకా ఆలోచించసాగాడు.
"నా లగేజా?"
"యస్_సూట్ కేస్, బాగ్ వగైరాలేమీ లేవా?"
"నో_నథింగ్" తాపీగా అన్నాడతను.
"మరి ఈ నెలరోజులూ మీకు బట్టలు?"
"వెళ్ళేప్పుడు రడీమేడ్ డ్రస్ కొంటాను. ఎందుకంటే ఒకసారి తొడిగిన బట్టలు నేను రెండోసారి తొడగను"
అప్పల్రాజుతో పాటు కన్యక కూడా అతనివేపు విస్మయంగా చూసింది.
"చాలా కాస్ట్ లీ హాబిట్ మిస్టర్ దీప్ చంద్! ఇంగ్లండ్ క్వీన్ కూడా ఇలా చేస్తుందనుకోను" అన్నాడతను.
బాయ్ బిల్ తెచ్చిఇచ్చాడు అప్పల్రాజుకి.
"కమాన్_లెటజ్ గో నౌ?" అంటూ బయటకు నడిచాడతను.
ముగ్గురూ హోటల్ ఆవరణలో ఉన్న టయోటాకారులో కూర్చున్నారు. కారు బయల్దేరింది.
"ఏ రడీమేడ్ షాప్ దగ్గర ఆపాలి మిస్టర్ దీప్ చంద్?" అడిగాడు అప్పల్రాజు.
"ఎనీ రేమండ్స్ షాప్!"
అప్పల్రాజుకి ఆశ్చర్యంగా వుంది. "రచయిత ఎంత ఖరీదయిన జీవితం అనుభవిస్తారు" అనుకుంటున్నాడతను.
కారు రేమండ్స్ షాప్ దగ్గర ఆగింది.
అప్పల్రాజూ, భవానీశంకర్ దిగి షాపులోకి నడిచారు. నాలుగు జతల బట్టలు సెలక్ట్ చేశాడతను. మొత్తం అన్నిటికీ కలిపి పన్నెండు వందలయింది బిల్. కౌంటర్ దగ్గరకెళ్ళాక జేబులు వెతకసాగాడతను.
"మైగాడ్! క్రెడిట్ కార్డ్ మర్చిపోయాను" అన్నాడతను అప్పల్రాజు వంక చూస్తూ.
"డోంట్ వర్రీ దీప్ చంద్! నా క్రెడిట్ కార్డ్ వుంది" అంటూ క్రెడిట్ కార్డ్ పర్స్ లోనుంచి తీశాడతను.
డ్రైవర్ పాకెట్ తీసుకెళ్ళి కారులో పెట్టాడు. కారు మళ్ళీ బయలుదేరింది.
"కేవలం నాలుగ్గంటల ప్రయాణం మిస్ కన్యకా! మీకు ఆంధ్రప్రదేశ్ హౌస్ బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను"
"ఆంధ్రప్రదేశ్ హౌసా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
"ఎస్! నేను మినిష్టర్ గా వున్నప్పుడు కట్టించానది. చాలా పెద్ద భవనం. ఆ రోజుల్లోనే పాతిక లక్షలు ఖర్చయింది. అప్పుడు అసెంబ్లీలో జరిగిన గొడవ గురించి మీకు తెలుసా?"
"ఏమిటది?" అడిగాడతను.
"ఒండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ రైటర్! నేనా భవనం కట్టించాక అసెంబ్లీలో ప్రతిపక్షాలకు చెందిన చిన్నారావ్ చాలా రభస లేవదీశాడు. చిన్నారావ్ నీకు తెలుసుకదూ? రుక్మిణి హజ్బెండ్ ఎమ్మెల్సీగా చేసిందామె. వెరీ బ్యూటిఫుల్ వుమన్. ఓసారి మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ కాకినాడలో దాచేసింది. ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెదకడానికెళ్తే అతను వెతక్కుండా డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేసింది. సీతాదేవి అనీ ఒండర్ ఫుల్ డాన్స్ ట్రూప్ వుందామెకి. స్టేజి ఎక్కారంటే జనం పక్షవాతం వచ్చినట్లు నోరు తెరచి చూస్తూండిపోడమే! సినిమాల్లో డాన్సులు ఏం పనికొస్తాయ్? ఆమెకిద్దరు భర్తలని అందరూ చెప్పుకునేవారుగానీ ఆ రెండో అతను భర్తకాదని తర్వాత తెలిసింది జస్ట్...పాత ప్రియుడట. ఇద్దరూ పరిస్థితులవల్ల, అదేదో సినిమాలలోలాగా త్యాగం చేసి పెళ్ళి చేసుకోకుండా, ఈ రోజుల్లో అంతటి త్యాగం ఎవరికుంది? మా బామ్మరిది వర్ధనరావ్ డేంజరస్ ఫెలో! ఓసారి ఏంచేశాడో తెలుసా? ఉంగరం అమ్మేశాడు."
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "ఉంగరం అమ్మేశాడా?"
"ఎస్! శమంతకమణి ఉంగరం పోయిందని ఒకటే గొడవ. అఫ్ కోర్స్! ఉంగరం అమ్మడానికి అతనికుండే కారణాలేవో అతనికున్నాయ్. రజనీకాంత్ అనీ మా ఫ్రెండ్ కజిన్ బ్రదర్ కొడుకొకడు కూడా అంతే. అమెరికాలో అమెరికన్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు."
భవానీశంకర్ కేమీ అర్థంకావటం లేదుగానీ చిరునవ్వు నవ్వుతూ వినసాగాడు. అందుకే అతనిమీద అభిమానం పెరిగిపోతోంది అప్పల్రాజుకి. ఇంతకుముందు తనేం చెప్పటం ప్రారంభించినా ఎవ్వరూ వినేవారు కాదు.
"మీ ఇద్దరికీ అతి ముఖ్యమయిన విషయం ఒకటి చెప్పదల్చుకున్నాను" అన్నాడు అప్పల్రాజు కొద్దిక్షణాలాగి.
"వెల్ కమ్ మైడియర్ సర్! కారీ ఆన్!"
"ఇప్పుడు నేను రాయబోతున్న అత్యంత ప్రాజెక్ట్ కి చాలా శ్రమపడాల్సి వస్తుంది మనం. గత పాతిక సంవత్సరాలనుంచీ నేను రాస్తున్న డైరీలు, నేను సంపాదించిన ఫోటోలు, ఎందరో రాసిన ఉత్తరాలు ఇవే నా ఆత్మకథకు ఆధారాలు. ఆత్మకథలో ఎక్కువభాగం నా రాజకీయ జీవితం గురించే వుంటుంది. ఆ డైరీలను చూచుకుంటూ, రాజకీయరంగంలో నాకు తెలిసిన వ్యక్తుల గురించి నోట్స్ లు తయారుచేసుకుంటే మన పని కొంచెం తేలికవుతుందని నా అభిప్రాయం."
"అదంతా నేనూ, మిస్ కన్యకా పాలూ, నీరులా కలిసిపోయి, చెట్టాపట్టాలేసుకుని ఆడుతూ పాడుతూ ఈజీగా చేసేస్తాం మైడియర్ సర్! టేకిట్ ఈజీ!" ఉత్సాహంగా అన్నాడు భవానీశంకర్.
కన్యక అతనివేపు కోపంగా చూసింది.
"ఇంతకూ నేను చెప్పదల్చుకున్న ముఖ్య విషయం ఏమిటంటే" అని గొంతు తగ్గించాడతను.
"ఈ ఆత్మకథలో ఎవరికీ తెలీని ఎన్నో రాజకీయ రహస్యాలను నేను రాసేయదల్చుకున్నాను. ఎవరు ఎలాంటి అవినీతి పనులు చేసిందీ, ఎంతెంత ఆస్తులు సంపాదించిందీ, ఎవరెవరికి ఎవరెవరితో అక్రమసంబంధాలున్నదీ, దీనిద్వారా వాళ్ళు పొందిన లాభాలు, సెక్రటరీలు వ్యతిరేకంగా నోట్ పుటప్ చేసినా దానిని ఎందుకు నిర్లక్ష్యం చేసి మంత్రులు శాంక్షన్ చేసిందీ, ఇలా ఎన్నో విషయాలు. ఈ పుస్తకం పబ్లిష్ అయితే ఎంతోమంది ముసుగులోని వ్యక్తులు వీధిన పడతారు. పడాలి కూడాను! కనుక పుస్తకం రిలీజయ్యేవరకూ మీకు తెలిసిన రహస్యాలు బయటకు పొక్కగూడదు. కేవలం మన ముగ్గురిమధ్యే ఈ రహస్యాలు మిగిలిపోవాలి. అందుకే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకూ ఎవరూ ఆంధ్రప్రదేశ్ హౌస్ వదలి బయటకు వెళ్ళకూడదన్న నిబంధన ఒకటి పెట్టాను కాంట్రాక్టులో."
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"డోంట్ వర్రీ మైడియర్ సర్! మీరు చెప్పే రహస్యాలలో ఒక అక్షరం కూడా బయటకు పొక్కదని నేనూ, మిస్ కన్యక సంయుక్తంగా హామీ ఇస్తున్నాం."
కన్యక అతనివేపు అసహనంగా చూసింది.
కారు మెయిన్ రోడ్ వదలి సన్నని రోడ్ వేపు తిరిగింది.
"అదిగో దూరంగా ఇళ్ళు కనబడుతున్నాయ్ చూశారా? అదే 'సింగారం' ఊరు. ఊరి మధ్యలో ఎత్తుగా భవనం కనబడుతోంది కదా! అదీ ఆంధ్రప్రదేశ్ హౌస్" చెప్పాడు అప్పల్రాజు.