Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 20


    భవానీశంకర్ నిర్ఘాంతపోయాడు.
    "కానీ అంకుల్ ఆ విషయాలన్నీ ఆ అమ్మాయితో మాట్లాడి ఎడ్జస్ట్ చేసేశాను కదా?"
    "ఎడ్జస్ట్ అయితే, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినట్లు?"
    "ఓ.కే. అంకుల్. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగి వుంటుంది. ఆమెతో మాట్లాడితేగానీ తెలీదు."
    "నీకు రావలసిన జీతం చెక్ రడీగా ఉంది. నీలాంటి డైనమిక్ యంగ్_ ఎడిటర్ని పోగొట్టుకోవటం చాలా బాధగా ఉంది"
    భవానీశంకర్ కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు.
    "ఆల్ రైట్ అంకుల్. నీ చేతిలో కూడా ఏమీలేదు పాపం."
    "కరెక్ట్ భవానీ? ఉంటే నిన్ను వదులుకొంటానా?"
    "పోనీ మన మాసపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరితే."
    "బాస్ డిస్మిస్ చేశాక మళ్ళీ నిన్ను చేర్చుకుంటే."
    "పోనీ నా పేరు మార్చుకుంటాను."
    "లాభంలేదు. తెలిసిపోతుంది."
    "ఓ.కే. అంకుల్! కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసి మళ్ళీ వస్తాను."
    "దటీజ్ బెటర్."
    భవానీశంకర్ చెక్ తీసుకుని ఆఫీస్ లోనుంచి బయటికొచ్చేశాడు. అతనికేమాత్రం నిరుత్సాహం కలుగలేదు. మిస్ కన్యక తన స్వంతమయ్యేవరకూ తనెన్ని కష్టాలుపడ్డా ఫర్వాలేదు.
    ముందు తనోసారి కన్యకను కలుసుకుని, తనమీద ఆమెకున్న కోపం కరిగిపోయేలా చేయాలి.
    ఆమె ఇల్లెక్కడో ఎలా తెలుసుకోవటం?"
    తన గదికి చేరుకుని చాపమీద పడుకున్నాడతను. ఎంత ఆలోచించినా ఏమీ ఉపాయం దొరకటం లేదు.
    హఠాత్తుగా దీప్ చంద్ తనకు అప్పజెప్పిన పని గుర్తుకొచ్చింది. వాచీ చూసుకున్నాడు. మూడవుతోంది.
    త్వరగా లేచి రడీ అయి హోటల్ ఎమరాల్డ్ కి చేరుకున్నాడతను. 314 రూమ్ బయట నిలబడి బెల్ మోగించాడు.
    మరుక్షణంలో తలుపు తెరుచుకుంది. తెల్లగావున్న గుబురుమీసాలూ, బట్టతలతో ఓ ఆకారం ఎదురుగ్గా నిలబడింది.
    "ఎవరు?" అడిగాడతను.
    "నేను దీప్ చంద్ పంపిం..."
    "ఓ దీప్ చంద్! కమాన్ రైటర్! కమాన్! పొద్దున్న చెప్పానుగదా కళ్ళజోడు ఇంట్లో మర్చిపోయి రావటంవల్ల ఎవరెవరు అనేదికూడా తెలీటంలేదు! నన్నడిగితే ఎన్ టిఆర్ వృద్ధులకు ఉచిత కళ్ళద్దాలు కూడా రేషన్ కార్డుమీద సప్లయ్ చేయాలంటాను వాడ్డూ యూ సే?"
    "చాలా మంచి స్కీమ్ సార్. నాపేరు భ..." లోపల సోఫాలో కూర్చుంటూ చెప్పబోయాడు.
    "అద్భుతమయిన స్కీమ్! ఫెంటాస్టిక్ స్కీమ్! ఒక్కసారి ఊహించుకో! రాష్ట్రంలోని తెలుగు వృద్దులందరూ రేషన్ కార్డుమీద లభించిన తెలుగు కళ్ళజోళ్ళు పెట్టుకుని తెలుగు రోడ్లమీద నడుస్తుంటే ఎంత బాగుంటుంది ప్రభుత్వానికి?"
    "థ్రిల్లింగ్ గా వుంటుంది సార్"
    "అవునా? మరా ఎమ్మెల్సీ కృష్ణారావ్ గాడు 'ఇది చెత్త స్కీమ్' అంటాడేమిటి!"
    "వాడుట్టి ఇడియట్ కాబట్టి..."
    అప్పల్రాజు మొఖంలో ఆనందం కనిపించింది. ఉదయం మాట్లాడినప్పుడు దీప్ చంద్ ప్రవర్తన మాటతీరు తనకు అంతగా నచ్చలేదు. కానీ ఇప్పుడుమాత్రం అతనిమీద అభిమానం కలిగింది.
    "యూ ఆర్ కరెక్టు రైటర్! బైదిబై నువువ్ కాఫీ తాగుతావా, కూల్ డ్రింకా?"
    "ఏమీ వద్దండి_ ఇంతకూ అసలు విషయం ఏమిటంటే...నన్ను దీప్ చంద్..."
    "ఏదొకటి తాగు! మనం స్టార్టయ్యేసరికి ఎలాగూ ఇంకో అరగంట పడుతుంది. మిస్ కన్యక ఇప్పుడే ఫోన్ చేసింది. తను రావటం ఓ అరగంట ఆలస్యం అవుతుందని"
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
    "మిస్ కన్యకా"
    "యస్ రైటర్! పొద్దున్న చెప్పానుకదా! మనం రాయబోయే ఆత్మకథ పూర్తయ్యేవరకు ఆమె నా సెక్రటరీగా వుండి మనకు సహాయం చేస్తూంటుంది! వెరీ నైస్ గాళ్! నేను ఇంటర్వ్యూ చేసిన పాతికమంది అమ్మాయిల్లోనూ మోస్ట్ టాలెంటెడ్ గాళ్! అంతెందుకు? ఆమె స్త్రీల సమస్యల మీద రాసిన ఆర్టికల్స్ చాలా పత్రికల్లో ప్రచురించారట! నీకు తెలుసా ఆ విషయం?"
    "ఆమె ఆర్టికల్స్ రాస్తుందా?"
    "అదే నా గొప్పతనం! అంతర్గతంగా ఉన్న టాలెంట్స్ ని తెలుసుకోగలను"
    భవానీశంకర్ మెదడులో స్విచ్ వేసినట్లు ఆలోచనల ప్రవాహం కదిలింది. మిస్ కన్యక అప్పల్రాజుకి సెక్రటరీగా పనిచేయబోతోందా? మిస్ కన్యక అంటే తను ప్రేమించిన కన్యకేనా అసలు? ఒకవేళ ఆమె అయితే నిజంగా ఎంతగొప్ప అవకాశమిది? ఆమెతోపాటు ఆ మాజీమంత్రి భవనంలో నెలరోజులపాటు కలసి గడిపే అద్భుత అవకాశం! దీప్ చంద్ నిజంగా అదృష్టవంతుడు. తనే దీప్ చంద్ అయితే ఎంత బావుండేది?
    బేరర్ కూల్ డ్రింక్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచాడు.
    "కమాన్ మిస్టర్ దీప్ చంద్ కమాన్_టేకిట్"
    భవానీశంకర్ మెదడులో మెరుపు మెరిసింది. గుండెలు వేగంగా కొట్టుకున్నయ్. అవును తనే దీప్ చంద్ అని అనుకుంటున్నాడు అప్పల్రాజు. కళ్ళజోడు తేలేదుకాబట్టి అసలు దీప్ చంద్ ఎలా వుంటాడో అతనికి తెలీదు. దీప్ చంద్ ఎలాగూ ఏ పరిస్థితిలోనూ అప్పల్రాజు దగ్గరకెళ్ళడు. ఈ పరిస్థితిలో తనే దీప్ చంద్ గా అక్కడికెళితే.
    "కమాన్ రైటర్! కమాన్! డోంట్ హెజిటేట్" బలవంతం చేశాడు అప్పల్రాజు.
    భవానీశంకర్ కూల్ డ్రింక్ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే డోరు బెల్ మోగింది.
    "కమిన్!" గట్టిగా అరిచాడు అప్పల్రాజు. గది తలుపు తీసుకుని ఓ సూట్ కేస్ తోపాటు కన్యక లోపలికొచ్చింది. ఆమెవంక పరీక్షగా చూశాడు అప్పల్రాజు.
    "ఎవరు మీరు?"
    "నేను కన్యకనండి"
    "హలో మిస్ కన్యకా! సారీ కళ్ళజోడులేదు. కమిన్! కాఫీ తాగుతారా, కూల్ డ్రింకా?"
    కన్యక సోఫాలో కూర్చుంటూ "థాంక్స్! ఏమీవద్దండి!" అని ఎదురుగ్గా భవానీశంకర్ ని చూసి ఉలిక్కిపడింది.
    "మిస్ కన్యకా! మీట్ మిస్టర్ దీప్ చంద్! ఫేమస్ తెలుగు రైటర్! ఈమె గురించి మీకు చెప్పానుగదా దీప్ చంద్! మిస్ కన్యక..."
    భవానీశంకర్ మొఖంలో ఆనందం వెలిగిపోయింది.
    "హలో హలో మిస్ కన్యకా! మనం మళ్ళీ ఇలా కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. వేర్ దేరీజ్ లవ్ దేరీజ్ గాడ్! పవిత్ర ప్రేమకు పరమాత్ముని సహకారముండును"
    "హలో" అంది కన్యక పొడిగా. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. అతనే ప్రముఖ రచయిత దీప్ చంద్ అని ఆమెకు తెలీదు.
    "అయితే మీకూ, మిస్ కన్యకకూ ముందే పరిచయం ఉందన్నమాట వెరీగుడ్! వెరీగుడ్" అన్నాడు అప్పల్రాజు.
    "పరిచయమా? యూ ఆర్ మిస్టేకన్ మైడియర్ సర్! పరిచయం కంటే పవిత్రమయిన బంధుత్వం!"
    "ఓ! రిలేషన్ షిప్! వండర్ ఫుల్ అయితే మన ఆత్మకథ ప్రాజెక్టు చాలా స్మూత్ గా, హ్యాపీగా సాగిపోతుందన్నమాట"
    "అలా జరక్కపోతే పందెం కట్టండి! ప్రతి పేజీ ఒక కళాఖండం అయిపోతుంది"
    కన్యకకేం మాట్లాడాలో తెలీటంలేదు. ఆమె మనసంతా కలవరపాటుతో నిండిపోయింది. తన ఫోటో అలా వారపత్రిక ముఖచిత్రంగా వేసిన వాడితోపాటు నెలరోజులు కలసి పనిచేయటం వాంఛనీయమేనా అన్న ఆలోచన ఆమెను సతమతంచేస్తోంది. ఈ విషయం ముందే తెలిసి ఉంటే తను ఖచ్చితంగా ఈ ఆఫర్ తిరస్కరించేదే! కానీ ఇప్పుడు ఇంతదూరం వచ్చాక అలా చేయటం సమంజసంగా కనిపించటంలేదు. అదీగాక నెలరోజుల్లో అయిదువేల రూపాయలు తక్కువ మొత్తమేంకాదు. తనకు చాలా అవసరం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో_

 Previous Page Next Page