Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 22


    మరికొద్దినిమిషాల తర్వాత కారు సింగారం ఊళ్ళోకి చేరుకుంది. ఒకేఒక్క మెయిన్ రోడ్ అయినా రోడ్డుమీద రద్దీలేదు రెండు సినిమా హాళ్ళు, అరడజను హోటళ్ళు, రెండు బార్లు, కొన్ని షాపులు__అదే సింగారం.
    ఊరికి కొంచెం దూరంగా వుంది ఆంధ్రప్రదేశ్ హౌస్.
    కొన్ని ఎకరాల స్థలంలో పెద్ద పెద్ద గార్డెన్స్ చెట్లమధ్య ఉందా భవనం. కారు గేటు ముందాపి హారన్ మ్రోగించాడు డ్రైవర్. ఓ నౌకరు పరుగుతోవచ్చి గేటుతెరచి అప్పల్రాజుకి సెల్యూట్ కొట్టాడు. కారు భవనం ముందున్న పోర్టికోలో ఆగింది డ్రైవర్ దిగివచ్చి బాక్ డోర్ తెరచి పట్టుకున్నాడు. ముగ్గురూ కారు దిగారు.
    "కమాన్! కమాన్! అన్నాడు అప్పల్రాజు భవనంలోకి నడుస్తూ.
    భవానీశంకర్, కన్యక అతని వెనకే లోపలకు నడిచారు. చాలా పెద్దహాలు అది గోడలకు మంచి పెయింటింగ్స్ అమర్చిఉన్నాయ్. హాలు మధ్యలో నిలువెత్తున్న ప్లవర్ వాజ్, సోఫాలు, టీపాయ్ లూ.
    ఓ మూల మేడమీదకు మెట్లున్నాయ్.
    "శమంతకమణీ!" పిలిచాడు అప్పల్రాజు. హాలుకి చివర ఉన్న గది తలుపులు తెరచుకుని శమంతకమణి బయటికొచ్చింది.
    "ఈమె శమంతకమణి! నా మిసెస్!" అన్నాడు అప్పల్రాజు. "ఈయనే దీప్ చంద్! ఫేమస్ రైటర్! ఈమె మిస్ కన్యక"
    "నమస్తే" అంది శమంతకమణి.
    "నమస్తే" అన్నారు భవానీశంకరు, కన్యకలు ఒకేసారి.
    "మీ రచనలంటే నాకెంతో ఇష్టం" అందామె.
    "థాంక్యూ!"
    "ముఖ్యంగా "చీకట్లో మగపిల్లలు" అంటే మరీ ఇష్టం!"
    "అలాగా! ఎందుకనో తెలీదుగానండీ, చాలామంది ఆ నవలే ఇష్టపడుతున్నారు" అన్నాడు భవానీశంకర్.
    "అందులో మాలిని పాత్ర నిజంగా సూపర్బ్"
    "ఐసీ!"
    "ఆమె అసలు ఆఖరులో రాజేష్ వర్మను చేసుకోపోతే ఆ థ్రిల్ ఉండేదికాదు"
    "అఫ్ కోర్స్! మీరన్నమాట నిజమే!"
    "మాలిని శ్యామ్ నెందుకు చేసుకోలేదో మీరు కారణాలు చెప్పలేదే?" అడిగిందామె.
    భవానీశంకర్ తడబడ్డాడు.
    "అవును! కావాలనే చెప్పలేదు_"
    "ఎందుకని?"
    "ఎందుకంటే అసలు కారణాలేమీ లేవుగనుక!"
    "లేకపోతే శ్యామ్ నే చేసుకోవచ్చుకదా?"
    "చేసుకోవచ్చు__చేసుకోవచ్చు! అందులో ఏమాత్రం నష్టం లేదు"
    "మరెందుకు చేసుకోలేదు?"
    "ఏమో! నాకే తెలీదు. అయ్ మీన్ తెలుసుగానీ_ఆల్ రైట్. ఆమె శ్యామ్ నే చేసుకోవాలని మీరు గట్టిగా అనేట్లయితే ఎండింగ్ మార్చేస్తాను. సెకండ్ ఎడిషన్ లో ఆమె శ్యామ్ నే చేసుకున్నట్లు రాస్తాను."
    శమంతకమణి అతనివేపు అనుమానంగా చూసింది.
    "అదేమిటి? నేను చెప్పినంత మాత్రాన ఎండింగ్ మార్చేస్తారా"
    "యస్ మేడమ్! మనది డెమొక్రసీ కదా! అంచేత పాఠకులు ఎలా కావాలని కోరితే నవలలాగే రాయాలని ప్రిన్సిఫుల్ పెట్టుకున్నాను. అంతెందుకు? ఇంకో నవల్లో హీరోయిన్ కాన్సర్ వల్ల చచ్చిపోయినట్లు రాశాను కానీ పాఠకులు ఒప్పుకోలేదు. తిరగబడ్డారు. మా ఇంటిముందు ధర్నా జరిపారు. నిరాహారదీక్ష శిబిరం వేశారు. చివరకు వాళ్ళమాట కాదనలేక ఆమెకు అకస్మాత్తుగా కాన్సర్ తగ్గిపోయినట్లూ ఆమె వారంరోజుల్లో మళ్ళీ మామూలు మనిషయిపోయినట్లు మార్చేశాను"
    "కానీ కాన్సర్ అలా తగ్గదు కదా?"
    "ఆమె ప్రియుడి దేవుడి పూజామందిరంలో ఆర్రోజులు రాత్రింబవళ్ళు పూజలు చేస్తాడు. అందుకని తగ్గిపోతుంది"
    "శమంతకమణి వాళ్ళు ఇక్కడే నెలరోజులుంటారు కనుక నువ్వు తరువాత తీరిగ్గా మాట్లాడవచ్చు" అన్నాడు అప్పల్రాజు కొంచెం చిరాకుగా.
    "ఓ.కే. మీరిద్దరూ మేడమీదకు వెళ్ళండి! అక్కడే మీకు గదులు కేటాయించాను" అని 'మారుతీరావ్' అంటూ పిలిచిందామె. బట్టతలఉన్న ఓ లావుపాటి వ్యక్తి వచ్చాడక్కడకు.
    "దీప్ చంద్ గారికి, కన్యక గారికి రూమ్స్ చూపించు అందామె.
    "ప్లీజ్ ఫాలోమీ సార్" అన్నాడతను మెట్లెక్కుతూ.
    "కమాన్ మిస్ కన్యకా!" అన్నాడు భవానీశంకర్ చిరునవ్వుతో. కన్యక అతనిమాటలు వినిపించుకోకుండా మారుతీరావ్ తోపాటు మెట్లెక్కసాగింది. మేడమీద పొడుగాటి నడవా_దాని కిరువేపులా మూడు మూడు గదులూ ఉన్నాయ్. ఆ నడవా దాటగానే పెద్దహాలు.
    మొదటిగది తలుపు తెరచి "ఈ గది మిస్ కన్యక కోసం" అన్నాడతను.
    కన్యక గదిలోకెళ్ళి తలుపు మూసివేసింది.
    ఆ పక్కనే ఉన్న గది తలుపు తెరచాడతను "ఇదిమీది" అన్నాడు భవానీశంకర్ తో.
    "థాంక్యూ మిస్టర్ మారుతీరావ్"
    "వెల్ కమ్ సార్! మీకెప్పుడు ఏంకావాలన్నా ఈ బెల్ నొక్కితే నౌకరు వస్తాడు"
    "ఓ వండర్ ఫుల్ ఎరేంజ్ మెంట్స్ మైడియర్ మారుతీరావ్"
    "మీకెలాంటి ఇబ్బంది కలిగినా ఇంటర్ కమ్ ఫోనులో నాకు రింగ్ చేయవచ్చు. రెడ్ కలర్ బటన్ నొక్కితే చాలు నేను ఫోన్ లో ఉంటాను"
    "రాత్రింబవళ్ళు?"
    "యస్సార్! రాత్రింబవళ్ళు"
    "ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీయే?"
    "యస్సార్! ట్వంటీఫోర్ అవర్సు ఆన్ డ్యూటీ"
    "ఆఫ్రికాలో కూడా నీలాంటి డ్యూటీకాంషన్ పీపుల్ లేరు మైడియర్ మారుతీరావ్! ప్లీజ్ కీపిటప్"
    "థాంక్యూ సర్" వినయంగా అని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడతను.
    "హమ్మయ్య" అనుకున్నాడు భవానీశంకర్. గది మధ్యలోని మంచంమీద హాయిగా పడుకుని పక్కగదిలోనే కన్యక ఉందన్న విషయం అతనికి చాలా సంతృప్తి కలిగించింది. అన్నీ సవ్యంగా జరిగితే నెలరోజులు లేదా తను తల్చుకుంటే ఆపైన మరికొన్ని రోజులు కూడా అత్తగారింట్లో గడిపినట్లు గడపవచ్చు. ఇక్కడ తను దీప్ చంద్ కాదు అన్న విషయం ఎవరికీ తెలీదు. ఇకముందు తెలిసే అవకాశం కూడా లేదు.


                             *    *    *    *


    కన్యక తన రూమ్ లోనుంచి బయటికొచ్చి మెట్లుదిగి భవనం బయటికి నడిచింది. ఆ భవనం చుట్టూ ఉన్న అందమయిన ఉద్యానవనాలూ, దూరంగా అడవిగా కనబడుతున్న చెట్లూ_ఇవన్నీ ఆమెకు చాలా ఆహ్లాదం కలిగిస్తున్నాయ్. ఇక్కడే, ఈ భవనంలోనే శాశ్వతంగా ఉండిపోయే అవకాశం వస్తే ఎంత బావుండు అనుకుందామె.
    "ఏమయినా సహాయం కావాలా మేడమ్?" వెనుకేవస్తూ అడిగాడు మారుతీరావ్.
    "ఉహు ఏమీ అక్కర్లేదు. అలా కాసేపు గార్డెన్ లో తిరిగివద్దామని..." చిరునవ్వుతో చెప్పిందామె.
    "వెల్ కమ్ మేడమ్! వెల్ కమ్! ఆంధ్రప్రదేశ్ హౌస్ గార్డెన్స్ మీకెంతో ఆనందం కలిగిస్తాయ్" అన్నాడతను.
    ఆమె ముందుకి నడిచింది.
    చీకటి పడిపోతోందప్పటికే. తోటలో నడుస్తూంటే చల్లని గాలి రకరకాల పూల సువాసనలతో గుబాళిస్తూ వీస్తోంది. ఓచోట పచ్చికలో కూర్చుందామె. "సిటీలో ఇలాంటి ఏకాంత ప్రదేశం ఎంత తపస్సు చేసినా దొరకదు" అనుకుందామె. తనకు ఇలా ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడం చాలా ఇష్టం.
    "హలో" అన్న పలుకరింపు విని ఆశ్చర్యంగా చూసిందామె . భవానీశంకర్ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు.
    "ఈ మాజీమంత్రి చాలా టేస్ట్ ఉన్నాడిలా కనబడుతున్నాడు. ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్, ఈ తోటలు. చాలా అద్భుతంగా ఉన్నాయ్! ఏమంటారు?"

 Previous Page Next Page