Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 21


    మొదటి అంతస్థులోని గ్లాస్ డోర్స్ లో నుంచి కారు స్పష్టంగా కనిపిస్తూంది.


    గదిలోని లైట్ ఆఫ్ చేసి డ్రైవరుగా వచ్చిన వ్యక్తి చేతికి స్టెన్ గన్ అందించాడు.


    "జాగ్రత్తగా చూస్తుండు... నేను పడుకుంటాను. సరిగ్గా ఐదు గంటలకు లేపాలి. ఏమాత్రం ఒళ్ళు మరిచిపోయినా పదివేల బక్షీస్ కాదు, నీ ప్రాణాలు పోవచ్చు" చెప్పి అయిదు నిమిషాలలో నిద్రలోకి జారిపోయాడు రావూఫ్.


    సరిగ్గా అదే సమయంలో హోటల్ కి అభిముఖంగా వున్న బిల్డింగ్ లోని రాజన్ నిద్రపోతున్న సురేంద్రని లేపాడు "కారు వచ్చింది."


    ఆవులిస్తూ షాట్ గన్ని చేతిలోకి తీసుకున్న సురేంద్ర "కరెక్ట్ గానే చూశావా" అడిగాడు.


    "అంతా గమనిస్తూనే వున్నాను. వాళ్లు దిగడమూ, నెంబర్ ప్లేట్స్ మార్చడమూ..." ఓ క్షణం హోటల్ రూం వేపు చూసి "వెనీషియస్ బైండ్స్ దించకుండా గదిలో లైటు మాత్రమే ఆర్పేసాడూ అంటే బహుశా మనలాగే జాగ్రత్త పడుతున్నాడన్నమాట" అన్నాడు రాజన్.


    "వెళ్దామా" సురేంద్ర తొందరపడుతుంటే తల అడ్డంగా వూపిన రాజన్ "నీకేమన్నా మతి పోయిందా" కసురుకున్నాడు మందు తలకెక్కి అలా మాట్లాడుతున్నాడేమోనని. "అది కాదు. అంతా అనుకూలంగా వున్నట్టుందిగా" ఇంకా అతడి మాటలు పూర్తి కాలేదు దూరంగా పోలీస్ కారు సైరన్ వినిపించింది.


    క్షణంపాటు ఒళ్ళు జలదరించినట్టు ఇద్దరూ ఎలర్ట్ అయిపోయారు...


    ఊపిరి బిగబట్టుకుని రోడ్డువైపు చూస్తుంటే సైరన్ మోత మరీ దగ్గరగా వినిపించింది.


    ఇద్దరూ గన్స్ అందుకుని పోలీస్ కారును పరీక్షగా చూశారు కాని కారు అక్కడ ఆగలేదు.


    చాలా వేగంగా దూసుకుపోతోంది సిటీ పొలిమేరల వేపు...


    అర్ధంకాలేదు అంత రాత్రివేళ కారెందుకటు వెళ్తున్నదీ...


    పది నిముషాలకో మారు పెట్రోలింగ్ లో వున్న ఎస్.ఐ. తో మాట్లాడ్డం పనిగా పెట్టుకున్న అవినాశ్ ఎస్.ఐ. ప్రదీప్ నుంచి ఎటువంటి జవాబు రాకపోయేసరికి కంట్రోల్ రూం నుంచి సరాసరి అటుగా దూసుకుపోతున్నాడని ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికీ తెలీదు.


    మరో అయిదు నిమిషాలలో సిటీ పొలిమేరలకు చేరిన అవినాశ్ అక్కడ ప్రదీప్ రోడ్డు వారగా పడి వుండడం చూసి కంగారుగా సమీపించాడు. కాని అప్పటికే అతని ప్రాణాలు పోయివుండడంతో అర్థమైంది గాంగ్ వూరిలో అడుగుపెట్టారని. మేన్ పేక్ వైర్ లెస్ సెట్టు ఓ మూల పడివుంది.


    బిగుసుకుపోయిన ప్రదీప్ చేతిలోని రివాల్వర్ ను అందుకుని చెక్ చేశాడు.


    ఆ ఎన్ కౌంటర్ లో అతడు ఖర్చు చేసింది ఒకే ఒక బుల్లెట్.


    వెంటనే వైర్ లెస్ సెట్లో కంట్రోల్ రూంకి ఫోన్ చేశాడు. కేవలం అయిదు నిమిషాల వ్యవధిలో సిటీ పోలీస్ అంతా ఎలర్ట్ చేయబడింది.


    మరో పది నిమిషాలలో ధనుష్కోటికి ఈ వార్త చేరింది.


    భయమంటే ఎరుగని ధనుష్కోటి ఫాలభాగంపై స్వేదం అలుముకుంది తొలిసారి భయవిహ్వలంగా...


                               *    *    *    *


    రాత్రంతా నిద్రలేమితో ఏం చేయాలో పాలులోని శశాంక ఉదయం ఎనిమిది గంటలకల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.


    శశాంక నిజానికి ఆ క్షణాల్లో కోరుకుంటున్నదొక్కటే.


    తన ఆవేశానికి వారధి పడిపోయింది. కనీసం దోషికి శిక్ష పడాలి. ఆ కొద్దిపాటి సంతృప్తి అయినా తనకు దక్కాలి.


    ప్రేమగా అల్లుకున్న పొదరింటిలాంటి ఇంటిలో ప్రపంచానికి దూరంగా బ్రతకడమే అలవాటైన శశాంక భార్య ఆప్యాయతలో ఒకనాటి తండ్రి మరణాన్ని, చేజేతులా పోగొట్టుకున్న తల్లి చివరి క్షణాల్ని సైతం మరిచిపోగలిగాడు.


    ప్రభుత్వానికి సమాంతరంగా చీకటి చట్టాలను సృష్టించుకున్న "డాన్స్" చరిత్ర తెలీదతడికి.


    తమ వ్యవస్థ సవ్యంగా నడపడానికి కోట్ల రూపాయల్ని "పార్టీ ఫండ్"గా ఇచ్చే మరో "అండర్ వరల్డ్" వుందని కాని, బ్యూరోక్రసీ పొలిటికల్ చక్రాల వీల్ చైర్స్ పై కూర్చుని చక్రవర్తుల్లా ఎందర్నో శాసించే ఆ వర్గాలు చాలా బలమైనవని కాని, కేవలం డబ్బు కోసం మనుషుల రక్త మాంసాలతో వ్యాపారం చేయడం వారి దైనందిన జీవితమని కాని తెలియని శశాంక మామూలుగానే రణధీర్ని అడిగాడు "ఎంతవరకు వచ్చింద"ని.


    అసలే అవినాశ్ వేధింపుతో నిగ్రహాన్ని కోల్పోతున్న రణధీర్ ఎంత ఆవేశపడ్డాడూ అంటే "నేనేం చెయ్యాలో నాకు తెలుసు. మీరు నన్ను ఫాలోకావాల్సిన అవసరం లేదం"టూ అరిచాడు.


    "మిస్టర్ రణధీర్" శశాంక గొంతు కర్కశంగా పలికింది. "నా పని గాని, మీ పనిగాని కేవలం కంప్లయింట్ తో ఆగిపోదు. రిజల్ట్... ఎస్ రిజల్ట్ కావాలి... నేను మిమ్మల్ని ఫాలో కాకుండా ఆగేది అక్కడే"


    "అయామ్ బిజీ"


    "కాని నాకు జవాబు కావాలి."


    "నేరస్థుడు దొరికినపుడు మీకే తెలుస్తుంది."


    'ఎందుకు దొరకడు? నేను వివరాలతో సహా మీకు చెప్పాను".


    "మీరు చెప్పినదంతా వాస్తవం కావాలని రూలేం లేదు."


    "కనీసం అదన్నా రుజువు కావాలిగా".

    
    "అయినా ఆ రుజువుల్ని మీకు తెలియపరచాల్సిన అగత్యం లేదు." 

 Previous Page Next Page