అప్పటికే పధ్నాలుగు హత్య కేసుల్లో ఇరుక్కున్న రావూఫ్ అహ్మదాబాద్ లోని ఓ గాడ్ ఫాదర్ ముఠాకి చెందినా చాలా ముఖ్యమైన వ్యక్తి.
బాంబే, డామన్ సముద్ర తీరాల్లో కస్టమ్స్ పెట్రోలింగ్ ఎక్కువ కావడంతో దేశంలోని చాలామంది గుజరాత్ సముద్ర తీరంలో స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఉధృతం చేశారు.
ప్రస్తుతం ఆ కారులో జామ్ నగర్ జిల్లా జావక్ సలయా సముద్రతీరం నుంచి సుమారు ముప్పై లక్షల ఖరీదుచేసే 'క్రాక్' అనబడే మాదకద్రవ్యం తరలించబడుతోంది. 'కాకాయిన్' డ్రగ్ కి ఆధునికమైన రూపమైన మాక్రాన్, హెరాయిన్ని మించిన వ్యసనభరితమైనది.
యువతను వేగంగా ఆకట్టుకునే ఈ క్రాక్ ని తొలిసారి హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టి కోట్ల లాభాన్ని సంపాదించాలనుకున్న ఓ మాఫియా కింగ్ ప్రయత్నాన్ని ముందే పోలీసులు పసిగట్టారు. అదీ మరో గాంగ్ లీడర్ సహకారంతో.
అందుకే విమానంలో రవాణా కావాల్సిన క్రాక్ ని ఆఖరి నిమిషంలో ఫ్లైట్ లో కాక రోడ్డు ద్వారా సిటీకి రప్పించే ప్రయత్నం చేశాడు ధనుష్కోటి.
విమానాశ్రయమంటే వుండేది ఒక్కటే కాబట్టి సునాయాసంగా దొరికే అవకాశముందని భావించి ఇరవై నాలుగు గంటలు ఆలస్యంగా కారులో రప్పిస్తున్న ధనుష్కోటి పొరపాటుపడ్డాడు కొత్తగా సిటీకి వచ్చిన డిసిపి అవినాష్ విషయంలో.
ముందు రోజు ఎయిర్ పోర్టులో గట్టిగా నిఘా వేసిన అవినాష్ ఆ సాయంకాలం తదితర పోలీసాఫీసర్లతో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. విషయాన్ని పసిగట్టిన స్మగ్లింగ్ గాంగ్ క్రాక్ రవాణా రద్దుచేసుకున్నారు కాబట్టి ఇక ఆ విషయంపై పెద్దగా శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదని అందరికీ తెలియపరిచారు.
ఒక అనుభవంగల పోలీసాఫీసరుగా మాఫియా కింగ్స్ తో సంబంధబాంధవ్యాలుగల పోలీసాఫీసర్లే ఆ విషయాన్ని చేరవేసి తీరుతారన్నది అతని బలమైన నమ్మకం.
రణధీర్ తన విధేయతని ప్రకటించి ధనుష్కోటికి తెలియపరిచాడు.
అదే అవినాష్ కోరింది కూడా అని తెలీని ధనుష్కోటి తన ఏర్పాట్లలో తను తలమునకలయ్యాడు తప్ప, అవినాష్ నమ్మకం గల కొందరు పోలీసాఫీసర్లని సిటీ పొలిమేర్లలో కాపలా వుంచాడని వూహించలేకపోయాడు.
సరిగ్గా అంబాసిడర్ తొమ్మిదో మైలురాయి దాటుతుండగా వెనుక ఓ మోటార్ సైకిల్ చప్పుడు వినిపించింది.
రావూఫ్ వెనక్కి తిరిగి చూశాడు.
యూనిఫారంలో వున్న ఓ ఎస్సై శరవేగంతో కారు అనుసరిస్తున్నాడు.
రావూఫ్ నిద్రమత్తు ఎగిరిపోయింది.
కారు వేగాన్ని పెంచమనడానికి బదులు కొద్దిగా స్లో చేయమని ఆదేశమిచ్చాడు డ్రైవర్ని చూస్తూ...
సిటీలో పూర్తిగా అడుగుపెట్టకముందే తాడో పేడో తేల్చుకోవాలని ఆలోచించాడు ఏనాడూ హత్యలకి వెనుకాడని రావూఫ్.
అప్పటికే మోటార్ సైకిల్ కారుకి చాలా సమీపంగా వచ్చింది.
అవకాశాన్ని చేజార్చుకోలేదు రావూఫ్.
రెప్పపాటులో రావూఫ్ చేతిలోని స్టెన్ గన్ నిప్పులు కక్కి నగర పొలిమేరల్లోని నిశ్శబ్దతని రాక్షసంగా భంగపరిచింది.
శరీరం జల్లెడగా మారి రక్తం ఫౌంటెన్ లా బయటికి చిమ్ముతుంటే బండితోపాటు నేలకొరిగిపోతూ కూడా రివాల్వర్ తో గురిచూసి కాల్చాడు కాని అది కారు టైరుక్కాక డిక్కీలో నుంచి దూసుకుపోయింది.
మరోసారి ట్రిగ్గర్ ని నొక్కాలని ప్రయత్నించాడు కాని అప్పటికే శక్తి ఉడిగిపోయిన ఎస్.ఐ. ప్రదీప్ చేతిలో రివాల్వర్ తోనే కట్టెలా బిగుసుకుపోయాడు.
ఒక ప్రమాదం గట్టెక్కిన రావూఫ్ అసలేమీ జరగనంత సాధారణంగా సిగరెట్ వెలిగించుకోవడం ఎవరన్నా గమనిస్తే గుజరాత్ కిల్లర్ గా రావూఫ్ ఎందుకు పిలవబడుతున్నదీ అర్థమైపోతుంది.
అప్పటికే పెరేడ్ గ్రౌండ్స్ ని దాటేసిన కారు కొద్దిగా స్లో అయింది.
హైదరాబాద్ రావూఫ్ కి కొత్త కాదు. చాలాసార్లు వచ్చాడు. కొన్ని ప్రత్యేకమైన విధుల నిర్వహణకి మాత్రమే పురమాయింపబడే రావూఫ్ మార్గం చూపిస్తుంటే మరో అయిదు నిమిషాల్లో క్లాక్ టవర్ సమీపంలోని హోటల్ ప్రాంగణంలోకి వచ్చింది కారు.
ఓ క్షణంపాటు చుట్టూ కలియచూసిన రావూఫ్ ఓవర్ కోటును స్టెన్ గన్ కు చుట్టి నెమ్మదిగా బయటకు దిగాడు.
నిశ్శబ్దంగా వుంది చుట్టూ.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి బయటకు దిగి కారు లాక్ చేశాడు. రావూఫ్ పర్సనల్ గా అన్ని డోర్స్ చెక్ చేశాక డ్రైవర్ కేసి చూస్తూ ఏదో సౌంజ్ఞ చేశాడు. డిక్కీలోని సామాగ్రిని తీసి కారు నెంబరు ప్లేట్స్ మారుస్తుంటే రావూఫ్ పరిసరాల్ని గమనిస్తూనే వున్నాడు ఏకాగ్రతగా. దూరంగా కౌంటర్ పై తల ఆన్చి నిద్రపోతున్నాడు రిసెప్షన్ క్లర్క్. కుడివైపు "ఇన్" అనే బోర్డున్న ప్రహరీ గేటు దగ్గరి వాచ్ మెన్ అక్కడ ఓ స్కూల్ పై కూర్చుని బయటకు చూస్తున్నాడు తప్ప ఇదేం గమనించడం లేదు.
అయిదు నిమిషాల్లో ముగిసిపోయిందా కార్యక్రమం. చేతిలో స్టెన్ గన్ చుట్టూ ఓవర్ కోట్ ని సర్ది చూసుకుని మరు నిమిషంలో కౌంటర్ ని చేరాడు. రావూఫ్ క్లర్కుని నిద్రలేపి "సమద్ ఖాన్" పేరు మీద బుక్ చేయబడిన డబుల్ రూం కీస్ తీసుకుని తన 201 గదిలోకి అడుగుపెట్టాడు.