తర్వాత ఇద్దరు ముగ్గురొచ్చారు, ఆగారు గాని వాళ్ళడిగిన రేటు మరీ ఎక్కువగా అనిపించి, ఎక్కాలనిపించలేదు. తాను అన్యాయానికి గురవుతున్నానని బాధ కలిగినప్పుడు రాజీపడే మనస్తత్వం కాదాయనది.
కాని మనిషి జీవితంలో అడుగడుక్కి రాజీపడక తప్పదు. స్నేహితులతో, తోటి ఉద్యోగస్థులతో, తన క్రిందపనిచేసే స్టాఫ్ తో, ఇరుగు పొరుగులతో, తన వృత్తి ఉద్యోగాల్లోని లోటుపాట్లుతో, ఆఖరికి భార్యాపిల్లలతో ఎప్పటికప్పుడు రాజీపడక తప్పదు. మానవజీవిత రహస్యమంతా ఈ రాజీపడటంలోనే ఇమిడి ఉంది.
ఆయనకు ఉద్రేకమొచ్చి ఇంటికి నడిచి వెళ్ళిపోదామా అనుకున్నాడు. కాని శరీరం సహకరించటం లేదు.
చివరకు అనుకున్న రేటుకు బేరం కుదిరాక రిక్షా ఎక్కాడు.
* * * *
ఆ రాత్రి...
ఇంచుమించు రెండు గంటలవేళ నరసింహంగారికి నిద్ర మెలకువ వచ్చింది.
"పార్వతీ!" అని పిలిచాడు.
ఆమె వెంటనే కళ్ళు విప్పి "ఊ" అన్నది.
"పాపం అవధాని పరిస్థితి చాలా దారుణంగా వుంది.
"అవును. ఆయనకొచ్చిన సుస్తీ అలాంటిది."
"సుస్తీ గురించి కాదు నేను చెప్పేది. ఆస్తి పంపకాల కోసం పిల్లలు కాల్చుకు తింటున్నారు.
"బహుశా ప్రతి మనిషికి చివరిదశలో ఇలాంటి పరిస్థితి తప్పదనుకుంటాను.
ఆయనకు కోపమొచ్చింది. "జీవితాంతం కుటుంబం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం పైసా పైసా ప్రోగుజేసి సంపాదించిన ఆస్థిని, బ్రతికుండగానే కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకునే వాళ్ళకోసం ధారపోయమంటావా"
పిల్లల కోసం ప్రోగుచేసిన ఆస్తి.
అసలు మనిషి ప్రతిక్షణం ఆత్మవంచన చేసుకుంటూనే బ్రతుకుతాడు. జీవితమంతా ఆత్మవంచనలతోనే నిండి ఉంటుంది.
అందులో ఇదొకటి. మనిషి తన అవసరాలకోసం, సంతోషం కోసం అనుకూలిస్తున్న పరిస్థితుల ప్రకారం, కాలం కలసివస్తుంటే, డబ్బు మీద వ్యామోహంతో ఎడాపెడా సంపాదిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించటం అందరివల్లా కాదు. అది కొందరికి సాధ్యం. ఆ కొందరికే అన్నీ కలసివస్తూ వుంటాయి. ఆ మైకంలో, వున్మాదంలో ఉచ్ఛమూ నీచమూ కూడా మరచిపోతూ వుంటారు. డబ్బు అనేది ఓ నిషా. ఆ నిషాలో సంపాదిస్తూన్న కొద్ది తనివితీరక యింకా యింకా లోతుల్లోకి వెళ్ళిపోతూ వుంటాడు. అతనికి తెలీకుండానే కఠినంగా మారిపోతూ వుంటాడు. మనిషి తాను చేస్తోన్న కొన్నికొన్ని వికృతమైన కార్యకలాపాలకు తను బాధ్యత వహించటానికి అంగీకరించడు. ఈ ఆస్తులూ, వగైరాలు సంపాదించటం పిల్లల కోసం అన్నట్టుగా "ఇదంతా నా కోసమా? నాకే అయితే రోజుకు పది రూపాయలు సంపాదించుకుంటే చాలు. ఇదంతా పిల్లలకోసం. వాళ్ళ భవిష్యత్తు కోసం" అంటూ ప్రగల్భాలు పలుకుతూ వుంటాడు. అందులో తెలీకుండానే మానవ బలహీనతలో కూడిన నిజముంటే వుండి వుండవచ్చు. కాని ప్రపంచంలోని ప్రతి నిజంలోనూ సగం ఆత్మవంచన ఇమిడి ఉన్నట్టే ఇందులోనూ దానిభాగం సగమే, ఏ పిల్లల కోసమైతే ఆస్థినంతా కూడ పెట్టానని ప్రగల్భాలు పలుకుతూ వుంటాడో అవి వాళ్ళకోసం ఖర్చు పెట్టవలసి వచ్చేసరికి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు.
పార్వతమ్మ మౌనంగా వూరుకోవటం చూసి "మాట్లాడవేం?" అన్నాడు.
ఈ జీవితంమీద, ప్రపంచంమీద ఆమెకు కొన్ని భావాలున్నాయి. అవి నిర్దిష్టమైనవో కాదో ఆమెకు తెలియదు. ఒక్కో సందర్భంలో ఎంతో చనువు తీసుకుని తన అభిప్రాయాలు బయటకు చెప్పే అలవాటున్నా అతను కష్టపెట్టుకుంటాడనుకున్నప్పుడు తన భావాలు బయటకు చెప్పదు.
"ఏమీ లేదులెండి"
"నేను చెప్పింది నిజమా కాదా?"
"నిజమేలెండి"