Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 21


    నీలూ కాకుండా ఇంకెవరికయినా ఫోన్ లిఫ్ట్ చేస్తే.... ఎక్స్ ప్లెయిన్ చెయ్యగలడు తను. ఎవరు లిఫ్ట్ చేస్తారు?? జీవన్ ఫోను దాకా రాలేడు. మువ్వ నిద్రపోయి వుంటుంది. ఇహ మిగిలింది నీలిమ తల్లిదండ్రులు. వాళ్ళకి చెప్పడం తనకసలు ఇష్టంలేదు.

 

    'కూతురికి చెప్పాల్సిన విషయం మాకు చెబుతున్నాడేమిటా' అని కొత్త అనుమానాలని లేవదీస్తారు.

 

    ఆలోచనల్లో వుండగానే తనకు తెలియకుండానే ఎప్పుడో కుర్చీలోంచి లేచాడు. ఆ గదిలో  ఓ గోడవార, మెత్తని పరువు వేసి తెల్లని దుప్పటి పరచిన మంచం వుంది. మరో ప్రక్క నిలువెత్తు గాద్రెజ్ బీరువా, వరుసగా వేసిన నాలుగు కుర్చీలు వున్నాయి. ఎదురుగోడకి అటాచ్ డ్ బాత్ రూమ్ తలుపు మూసి వుంది.

 

    ఆ గదిలో మిగిలిన కొద్ది ఖాళీ స్థలంలో అతను తల వంచుకొని పచార్లు చేస్తున్నాడు.

 

    తననర్ధం చేసుకొనే వాళ్ళెవరూ లేనట్టూ, ఒంటరి వాడయినట్లూ అనిపించింది.

 

    తన వాళ్ళెవరు?

 

    రోగులా? కుటుంబమా?

 

    కుటుంబం అనుకుంటే తను నమ్ముకున్న వృత్తికీ, తనను నమ్ముకున్న రోగులకీ న్యాయం చేయలేడు.

 

    తనను నమ్ముకున్న రోగులే తన వాళ్ళు అనుకుంటే మనిషి జీవితంలోని ప్రధాన భాగమయిన కుటుంబ అనుబంధాన్నీ మానసికంగా కోల్పోతున్నాడు.

 

    ఏ ఒక్కదానికీ అన్యాయం జరగకుండా సమన్వయం చేసుకోవజం తన చేతిలో లేదు. తన వృత్తి అటువంటిది. అర్ధం చేసుకొని భాగం పంచుకోగల మనుషులు దొరికితే తప్ప అది సాధ్యం కాదు.

 

    తిరుగుతూ తిరుగుతూ మంచమ్మీద కూర్చున్నాడు. అసహనంగా పిడికిళ్ళు బిగించి పరువు మీద బలంగా గుద్దాడు.


                                                *    *    *    *


    నిజానికి ఆ గదిలో ఎవ్వరూ ఎవ్వరికీ ఏమీ కారు! కానీ అందరికీ అన్నీ అయ్యే చిత్రమైన సంబంధం అది! మానిటర్ల కిక్.... కిక్.... మనే శబ్దం. ఆ గదిలోని వాళ్ళ గుండెలో ఒక్కొక్క సూది పొడుస్తున్నట్లు వ్యధ పెడుతోంది. పని చేసుకుపోతున్న వాళ్ళెవరి మొహాల్లో జీవం లేదు.

 

    భయాన్ని కప్పుకున్న ఆ గదిలో మూడవ నెంబర్ బెడ్ దగ్గర కెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అతనికి ఎనిమిది గంటలకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు నర్స్ లు.

 

    చేతులకు గ్లవ్స్ వేసికొని, డిస్పోజబుల్ సిరంజితో ఇంజక్షన్ చేసి, బి.పి. చెక్ చేసింది రవళి. రోగిని షిప్ట్ చేసేందుకు స్టాఫ్ కు సూచనలిస్తుండగా.... డాక్టర్ కిరణ్ ని పేషెంట్ దగ్గర వుండమని శరత్ చంద్ర చెప్పడం గుర్తొచ్చింది.

 

    "సిస్టర్! కిరణ్ గారు ఎక్కడ?" ప్రక్కనే నిలబడిన నర్స్ ను అడిగింది.

 

    గదికి ఓ ప్రక్కన గోడ అవతల వున్న సింక్ వేపు చూపించి "అక్కడున్నారు మేడమ్!" చెప్పింది నర్స్.

 

    'పేషెంట్ దగ్గర లేకుండా ఇంతసేపు అక్కడేం చేస్తున్నట్లు' అనుకొంటు అటువేపు నడిచింది రవళి. ఆమెని అనుసరించింది సిస్టర్. ఆమె పేరు రాజ్యం.

 

    సింక్ దగ్గరే నిలబడి వున్నాడు కిరణ్. ఆపరేషన్ చేయడానికి వెళ్ళేముందు డాక్టర్లు చేతులు రుద్దుకునే బ్రష్ తో మోచేతుల వరకూ బలంగా స్క్రబ్ చేసుకొంటున్నాడు. అతని మొహం గంభీరంగా వుంది.

 

    అర్ధం కాలేదు రవళికి.

 

    తనకు తెలిసి అప్పుడు ఆపరేషన్ లేదు. మరి ఇతనెందుకు స్క్రబ్ చేస్తున్నట్లు?!

 

    రవళి కిరణ్ దగ్గరకు రావడాన్ని తొంగి తొంగి చూస్తున్నారు ఆ గదిలోని సిస్టర్స్.

 

    అది గమనించిన రవళికి కుతూహలం కలిగింది.

 

    "ఇప్పుడు సర్జరీ లేదుగా. స్క్రబ్ చేసుకొంటున్నారేం?" అతని ప్రక్కకు వెళ్ళి మొహంలోకి చూస్తూ అడిగింది.

 

    "మీటింగ్ లో ఏం జరిగింది?" రవళి ప్రశ్న తనని కాదన్నట్లు తిరిగి ప్రశ్నించాడు.

 

    క్లుప్తంగా చెప్పింది రవళి. ఆమె చివర్లో చెప్పిన మాట వింటూనే ఆశ్చర్యంతో అతని కళ్ళు విప్పారాయి.

 

    "అయితే మీరు.... మీరు కూడా వుంటున్నారా?" స్క్రబ్ చేయడం ఆపి ఆమెనే చూస్తూ అన్నాడు.

 

    "అవునుగానీ, నేనడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు మీరు" అదేం పెద్ద విషయం కానట్లు అతన్ని మళ్ళీ అడిగింది.

 

    క్షణం ఆగి అతని చేతులవైపే చూసుకొంటూ "పేషెంట్ ఆపరేషన్ కి అసిస్ట్ చేశాను" అన్నాడు. అతని గొంతులో భయం దాక్కొని వుండడాన్ని గమనించింది.

 

    "అయితే?" అంది అనుమానంగా.

 

    "అయితే ఏమిటి ఆపరేషనప్పుడు ఆ బ్లడ్ నా చేతుల్లో ఎక్కడో ఓ చోట అంటకుండా పోదు. ఎయిడ్స్ క్రిమి చర్మం పొరల్లో ఎక్కడైనా దాక్కొని వుంటే నా గతేంకాను?" ఇంగ్లీషులో చెప్పాడు. అతను చెప్పడంలో చాలా సీరియస్ నెస్ ఇమిడి ఉంది.

 

    అర్ధమైంది రవళికి. కిరణ్ చాలా భయస్తుడు. మామూలు రోజువారి పనిలోనే రోగులనుండి సూక్ష్మజీవులు తననెక్కడ అంటుకుని రోగగ్రస్తుణ్ణి చేస్తాయోనని ప్రతిక్షణం భయపడుతుంటాడు.

 Previous Page Next Page