Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 22


    అతను అతి శుభ్రం మనిషి. భయంలోంచి వచ్చిన అతి శుభ్రత అది.

 

    అసలీ కిరణ్ ఎమ్.బి.బి.ఎస్. చదివి ఎమ్.ఎస్, కూడా ఎలా చేశాడో అంతటితో ఆగక యమ్.సి.హెచ్. కూడా ఎలా పూర్తిచేశాడో అర్ధం కాదు ఆమెకి.

 

    అతనికి సూక్ష్మక్రిములంటేనే కాదు.... కత్తి పట్టుకొని సర్జరీ చేయాలన్నా.... ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయమే! అందుకే తనకై తనెప్పుడూ చిన్న సర్జరీ కూడా చేయడు. శరత్ చంద్రకి కేవలం అసిస్టెంట్ గానే నిలబడతాడు.

 

    సబ్జక్టును విపరీతంగా చదివి.... చదివి.... ఈ మందు ఈ జబ్బుని ఎలా తగ్గిస్తుంది, ఈ ఆపరేషన్ చేయడంవల్ల రోగికి యిలా స్వస్థత చేకూరుతుంది అనే విషయంకన్నా , ఈ మందువల్ల ఈ రియాక్షన్ రావచ్చు. ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరగవచ్చు అన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత చూపుతూ పాజిటివ్ ని వదిలేసి, క్రమక్రమంగా ఒక నెగిటివ్ ఆలోచనకి లొంగిపోయాడు. ఆ ఆలోచన అతన్నెప్పుడూ భయపెడుతుంది. ఎంతో చదివి, సబ్జక్టు గురించిన పూర్తి జ్ఞానం వుండీ కేవలం భయం వల్ల ఆచరణకి దూరమై నిరుపయోగంగా వున్న డాక్టర్లలో ఒకడు ఈ కిరణ్!

 

    "నిన్న ఆపరేషన్ చేసిన దానికి ఇవాళ చేతులు రుద్దుతున్నారా?" తెల్లబోతూ అడిగింది రవళి.

 

    "నిన్న ఆపరేషన్ తర్వాత ఆ చేతులతో రెండుసార్లు అన్నం కూడా తిన్నారు మేడం!"

 

    అక్కడే వుండి అన్నీ వింటున్న రాజ్యం అంది. కిరణ్ ని ఏడిపించడం ఆమెకి సరదా. అక్కడున్న వాళ్ళలో సీనియర్ నర్స్ ఆవిడే. వయసు యాభై ఏళ్లుంటాయి. కాస్త పొట్టిగా బొద్దుగా వుంటుంది.

 

    ఆవిడ సర్వీసులో రకరకాల పిచ్చివున్న కుర్ర డాక్టర్లని ఎంతోమందిని చూసింది. చదువుల్లో మహా మేధావులైన వాళ్ళంతా ఆమెకు బచ్చాల్లాంటి వాళ్ళే!

 

    "ఛ, నువ్వింక మాట్లాడకు సిస్టర్! అదంతా తెలియక చేసింది!" అన్నాడు.

 

    "ఇప్పుడు తెలిసిందిగా, స్టమక్ ని కూడా బయటికి లాగి బ్రష్ చేయండి" ఇంకా కవ్వించింది రాజ్యం.

 

    తొంగి చూస్తున్న నర్సులందరూ ముసిముసిగా నవ్వారు. వాళ్ళందరికి అతను భయస్తుడని తెలుసు!

 

    'వీర శివాజీ' అని రాజ్యం ఏడిపిస్తుంటుంది.

 

    వస్తూన్న నవ్వునాపుకుంటూ చేతులు కడుక్కుందామని, అతని ప్రక్కగా వెళ్ళి సింక్ దగ్గర సోప్ అందుకోబోయింది రవళి.

 

    "నో....!" అరిచినంత పని చేశాడు కిరణ్.

 

    బెదిరినట్లు ఆగిపోయింది రవళి.

 

    తెల్లబోయి చూసింది రాజ్యం.

 

    "మీరిప్పుడే చలపతిరావుని ముట్టుకొని వస్తున్నారు. మీ చేతిక్రిములు ఆ సోపుకి అంటించకండి! ప్లీజ్, వేరే సోపు తీసుకోండి" అన్నాడు.

 

    చిత్రంగా అతన్నే చూస్తూ నిలబడిపోయింది.

 

    ఎక్సెంటట్రిక్ లా వున్నాడు. మరీ ఇంత ఇది ఏమిటి అనుకొంది రవళి.

 

    "ఇప్పుడే వస్తా!" అనుకొంటూ హడావిడిగా పేషెంట్స్ వయిపు వెళ్ళిన రాజ్యం రెండు నిమిషాల్లో తిరిగివచ్చింది. బ్రష్ చేసిన చేతుల్ని నీళ్ళ వంపుకింద వుంచి కడుగుతున్నాడు కిరణ్.

 

    రాజ్యం కిరణ్ వెనక్కెళ్ళి నిలబడి, తన రెండు చేతులూ అతని షర్టుకు అదిమి వీపు మీద తుడుస్తూ -

 

    "ఇప్పుడే ఈ చేతులతో చలపతిరావుకి ఇంజక్షన్ ఇచ్చి వచ్చాను" అంది.

 

    "ఆ....! అంటూ మరుక్షణమే వంటిమీద షర్టులాగి మూలకి విసిరేశాడు. షర్టు లేని అతన్నలా చూస్తుంటే రాజ్యానికి ఉత్సాహం ఆగలేదు.

 

    ముందుకొక్క గంతేసి, అతను ఊహించని విధంగా ఆమె రెండు చేతుల్ని అతని ప్యాంటుకీ, నడుంచుట్టూ ఒంటికి పూసింది.

 

    "ఇప్పుడు మీ ఫ్యాంటుకి, చర్మానికి కూడా ఎయిడ్స్ వైరస్ అంటించాను. మరి ప్యాంటు కూడా....." నవ్వాపుకొంటూ ఆమె మూలకు విసిరిన షర్టు వయిపు కళ్ళతో చూపించింది.

 

    "పదండి డాక్టర్ మనం పోదాం. ఆయనకి చాలా పని వుంది ఇక్కడ" అంటూ రవళి చెయ్యందుకుని అవతలికి నడిచింది నవ్వుకొంటూ బయటకు వచ్చి శరత్ చంద్ర గదివయిపు అడుగు వేసింది రవళి.

 

    రవళి ముందు తనను ఆటపట్టిస్తున్నందుకు రాజ్యం మీద కోపం వచ్చింది కిరణ్ కి.

 

    అంతా గమనిస్తున్న సిస్టర్ మొహంలో నవ్వు కదలాడింది. అలా.... ఆ గది భయం బరువు నుండి కొద్దిగా తేలిక పడింది.

 

    మూడవ నెంబర్ బెడ్ మీద చలపతిరావు మాత్రం వీటన్నిటికీ అతీతంగా మత్తుగా పడుకొని వున్నాడు.

 

    అతని గురించిన వార్తతో హాస్పిటలంతా తల్లక్రిందలవుతున్నా అతనికి మాత్రం ఏవీ తెలీని ప్రశాంతత!


                             *    *    *    *


    గదిలోకొస్తూనే శరత్ చంద్రని చూసి ఆశ్చర్యపోయింది రవళి. ఏదో పోగొట్టుకున్న వాడిలా మంచమ్మీద కూర్చుని వున్నాడు. మొహంలో ఆందోళన తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవళి వచ్చినట్లుగా కూడా అతను గమనించలేదు. తెల్లని పావురంలా రెక్కకి గాయమై నెత్తిరోడుతున్నట్లు- శాంతికి చిహ్నమై మెరిసిపోతున్న తెలుపు రంగు పక్కమీద మనశ్శాంతి కోల్పోయిన వాడిలా కూర్చుని వున్నాడు.

 

    ఏం జరిగి వుంటుంది? ఎందుకలా కూర్చున్నారు? అనుకుంది. అతన్నలా చూస్తుంటే జాలి కలిగింది. ఏదో వాత్సల్యం పొంగుకొచ్చింది.

 

    "సారి!" మార్దవం నిండిన గొంతుతో పిలిచింది. ఉలిక్కిపడ్డట్టు చూశాడు. తడబాటును కప్పిపుచ్చుకుంటూ -

 

    "ఏమిటి? పేషెంట్ ని షిప్ట్ చేశారా?" అన్నాడు.

 

    "ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్" అంది.

 

    అంతే, ఆ తర్వాత అతనికింకేం అడగాలో అర్ధం కాలేదు. జీవం లేనట్లున్న అతన్నలా చూడలేకపోయింది. రవళి కాస్త నవ్వించవచ్చని రికవరీ రూమ్ లో కిరణ్ చేస్తున్న పనులూ, రాజ్యం ఏడిపించడం గురించి చెప్పింది.

 

    అతడు నవ్వలేదు. విషయం వింటూనే మొహంలో దిగులు ఛాయలు మాయమై సీరియస్ నెస్ సంతరించుకుంది. లేచి నిలబడి "రికవరీ రూమ్ కి వెళదాం! అతన్ని మందలించాలి" అన్నాడు.

 

    "ఇంకెక్కడి కిరణ్ గారు మేడమ్? బట్టలన్నీ తీసేసి, టవల్ చుట్టుకుని ప్రిపరేషన్ రూమ్ లో కూర్చున్నారు. బట్టలు తెమ్మని వార్డ్ బాయ్ ని ఇంటికి పంపించారు. అవి రావాలి, ఆయన స్నానంచేసి బయటపడాలి. నవ్వుతూ చెప్పింది రాజ్యం.

 

    టవలు చుట్టుకుని కూర్చున్న కిరణ్ ని ఊహించుకుని నవ్వేసింది రవళి.

 

    చలపతిరావుని పరీక్షిస్తున్నాడు శరత్ చంద్ర. కిరణ్ గురించేం మాట్లాడలేదు. సిస్టర్స్ కి భయం పోగొట్టడానికీ, వాళ్ళకి నమ్మకం కలిగించడానికీ, అవసరం లేకపోయినా చలపతిరావు శరీరాన్ని తాకుతూ, దుప్పటి సరిచేస్తూ అతని దగ్గరే కుర్చీ వేయించుకొని కూర్చున్నాడు.

 Previous Page Next Page