భగవంతానికి విజిల్ వెయ్యాలన్నంత ఆనందం కలిగింది. కానీ అదేం మొహంలో కనబడనీయకుండా, దీనంగా మొహంపెట్టి పరమేశ్వరాన్ని చూస్తూ-
"ఎవరు మాత్రం వుంటారు సార్? నన్ను మాత్రం ఎవర్ని నియమించమంటారు చెప్పండి! చూస్తూ చూస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకోమని ఎలా చెప్పమంటారు సార్!" అన్నాడు.
అంతా గమనిస్తూనే వున్నాడు శరత్ చంద్ర. రోగిని మృత్యువుకు వదిలెయ్యడానికి అందరూ సిద్ధమవుతున్నట్లు అర్ధమవుతూనే వుంది. ట్రీట్ చేస్తే తమకి అంటుకొంటుందేమోనన్న భయంతో వదిలేస్తున్నారు.
"గోడలమీద ఫోటోల్లోని శాస్త్రజ్ఞులకి ఇంతకన్నా అవమానం మరొకటుంటుందా" అనుకున్నాడు. ఒక్కసారి తలపైకెత్తి చూశాడు.
ఎదురుగా ఫోటోలోని ఎడ్వర్ జెన్నర్ సిగ్గుతో తలదించుకొంటున్నట్లనిపించింది. ఆ రోజుల్లో ప్రాణాలు తీస్తున్న భయంకర స్మాల్ ఫాక్స్ కి మందు కనిపెట్టి, అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం తనకే స్మాల్ ఫాక్స్ తెప్పించుకుని, తనమీదే ప్రయోగం చేసికొన్న మహానుబావుడాయన.
"అలా అయితే ఎలా? ఎవరో ఒకరైనా వుండాలి!" పరమేశ్వరం మాటతో వాస్తవంలో కొచ్చాడు శరత్.
"అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు సార్? ఇవ్వాళ అమెరికాలోనే ఎయిడ్స్ రోగులని ట్రీట్ చెయ్యమని మొండికేస్తున్నారు డాక్టర్లు!" వెంటనే అన్నాడు భగవంతం.
"రిస్క్ - ?! నడిరోడ్డులో నిలబడాల్సి ట్రాఫిక్ పోలీస్ రిస్క్ అనుకొని డ్యూటీ మానుకొంటాడా?" బాధని గొంతులో కుక్కుకొంటూ అన్నాడు శరత్ చంద్ర.
"అయితే ఇప్పుడు ఎవర్ని డ్యూటీ చేయమంటారో మీరే చెప్పండి" ఎగదోశాడు భగవంతం.
"ఎవర్నీ చేయమనడం లేదు. ఆలోచనా విధానం మార్చుకోమంటున్నాను. అమెరికా అయినా, ఇండియా అయినా మనిషి మనిషే! పేషెంట్ దగ్గర నేనే వుండటానికి నిర్ణయించుకున్నాను" అన్నాడు.
ప్రశంసాపూర్వకంగా చూశాడు పరమేశ్వరం. ఆయన చాలాసేపటిగా శరత్ చంద్రనే గమనిస్తున్నాడు. చనిపోయే అవకాశం వున్న కేసులకి ఎక్కువ సర్జరీ చేస్తాడనే తప్ప, శరత్ చంద్ర సిన్సియారిటీ మీద ఆయనకి గౌరవం వుంది.
శరత్ చంద్ర నుండి ఈ సమాధానం వస్తుందని ఊహించలేదు భగవంతం. దెబ్బతిన్నట్లయింది అతనికి.
తన నిర్ణయంవల్ల వెయిటింగ్ లిస్ట్ లో వున్న రోగులు ఎంత ఇబ్బంది పడతారో... ఇంటి పరిస్థితి ఎంత దిగజారుతుందో.... అన్నీ అతనికి తెలుసు! కానీ.... కానీ.... ఈ పిరికి వాళ్ళకి పాఠం చెప్పాలి! తన రోగిని బ్రతికించుకోవాలి అనే ఆలోచన అన్నింటిని అధిగమించింది!
"నేను మీకు సాయంగా వుంటాను సార్!" అప్పుడు మాట్లాడింది రవళి.
అందరూ కాదంటున్న విషయాన్ని తను చేస్తాననడానికి ఏదో జంకు, పొరలా అప్పటివరకూ ఆమెని ఆక్రమించింది. శరత్ చంద్ర మాటలతో అది వీగిపోయింది.
అందరూ ఆమె వైపు చూశారు.
మగ డాక్టర్ల మేల్ ఈగో దెబ్బతింది. ముఖ్యంగా భగవంతానిది.
"నన్ను కాదనడానికెంత ధైర్యం? అనుకుంటూ రవళినీ, శరత్ నీ మార్చి మార్చి చూశాడు.
"ఇదెక్కడి ఆడదిరా బాబూ!" అని నమిలేటట్లు చూశారు మిగతావాళ్ళు.
* * * *
మీటింగ్ పూర్తయ్యాక ఎయిడ్స్ పేషెంట్ ని ప్రత్యేకంగా ఓ గదిలో వుంచే ఏర్పాట్లు చేయడానికి వెళ్ళింది రవళి. టైము తొమ్మిది దాటుతోంది.
ఉదయం చూసిన బేబీని చూడటానికి వెళ్ళాడు శరత్ చంద్ర.
"డాక్టర్ బాబు అంటూ ఎదురొచ్చాడు ఖాదర్!
"పిల్లాడిని తీసికెళ్ళిపొమ్మన్నారట. ఆపరేషన్ కుదరదా బాబూ?" అన్నాడు ఏదో మిణుకు మిణుకు మంటున్న చూపుతో.
"ఇప్పుడు కుదరదు బాబూ. కొంతకాలం ఆగి చేస్తే పిల్లాడికి బాగుంటుందని తర్వాత మేం అనుకున్నాం!" అబద్ధమే అయినా నమ్మకంగా చెప్పాడు. ఆ నమ్మకం కలిగించే ఆశ వాళ్ళకి మనశ్శాంతి నివ్వాలని అనుకున్నాడు.
"ఈరోజే తీసుకెళ్ళి పొమ్మని చెప్పారు డాక్టరు గారూ. కానీ .... వాడు ఏడిస్తే మాకు వణికి పుట్టి పోతోంది. పిల్లాడు నీలం రంగు అయిపోకుండా మందు వ్రాయండి బాబూ!" బ్రతిమిలాడుతున్నట్లన్నాడు ఖాదర్.
మంచం మీదికి వంగి బాబును పరీక్ష చేస్తూ అన్నాడు శరత్.
"నీలంరంగు పోవటానికి మందులుండవు. సాధ్యమైనంతవరకూ ఏడవకుండా చూడటమే మంది. ఓ రెండు రోజులు ఇక్కడే వుంచండి. బాబుని ఏడవకుండా ఎలా మానేజ్ చేయవచ్చో నర్సు నేర్పిస్తుంది. బాబుకి ఏడిచే అవసరం రానీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి!"
బాబు పరిస్థితిలో మార్పేమీ లేదు. ఎందుకుంటుంది.?
"అల్లా దయ బాబూ!" రెండు చేతులు పైకిలేపి, తల పైకెత్తి పైకి చూసి అన్నాడు ఖాదర్.
బాబుని చూస్తూ "మే గాడ్ బ్లెస్ యూ బేబీ!" అని మనసారా అనుకొని, అధైర్యపడవద్దని వాళ్ళకి చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు శరత్.
పేషెంట్ దగ్గర తనే వుంటానని మాట అయతే అనేశాడు గానీ, తర్వాత అతని మనసు మనసులో లేదు.
ఇంటి పరిస్థితి అయోమయంగా అనిపిస్తోంది. నీలిమకి ఏమని సమాధానం చెప్పాలి.
ఇంటికి వస్తానని చెప్పాడు. మువ్వ కూడా ఎదురుచూసి కోపం తెచ్చుకొని వుంటుంది.
జీవన్ కి దెబ్బ తగిలాక మెలకువతో ఉండగా వాడితో మాట్లాడలేకపోయాడు. ఏమనుకుంటున్నాడో?
ఏవేవో ఊహలతో మనసుని కష్టపెట్టుకొంటుంది నీలిమ. ఆ కష్టంతో తమ మధ్య దూరాన్ని కూడా పెంచుతోంది.
ఆలోచనతోనే తన గదిలోకి చేరాడు. కుర్చీలో కూర్చుంటూనే ఫోన్ మీదే చేయి వేశాడు. రిసీవర్ చుట్టూ వేళ్ళు బిగించి లిఫ్ట్ చేయకుండా అలాగే వుండిపోయింది అతని చెయ్యి. ఒక్కక్షణం మళ్ళీ ఆలోచించాడు.
ఫోను చేసి ఏమని చెప్పాలి నీలిమకు. 'ఇవాళ రాలేకపోతున్నానని, బహుశః రేపు కూడా! నమ్ముతుందా....? ఎలా రియాక్ట్ అవుతుంది?'
సాయంత్రం ఫోను చేసినప్పుడు 'ఊ.... ఆ.....' అనడం తప్ప ఒక్క మాట మాట్లాడని నీలిమతో ఇప్పుడు ఇంటికి రావడం లేదని ఎలా చెప్పాలి తను? అసలు మాట్లాడతుందా? ఫోను విసిరి కొడుతుందేమో? అనుకున్నాడు.
అప్రయత్నంగా రిసీవర్ చుట్టూ బిగుసుకున్న వేళ్ళు వదులయ్యాయి. ఫోను మీది నుండి చెయ్యి వెనక్కి వచ్చేసింది.