అందరం కాలనీ మధ్యలో ఆగిన ఆటోరిక్షా దగ్గరకు చేరుకున్నాం. ఆటోలో జనార్ధన్, యాదగిరి ఇద్దరూ కూర్చుని ఉన్నారు.
"ఏయ్! మేమేం ఊరోళ్ళం అనుకున్నావా? ఏయ్- మంచిగా జెప్తున్నా- మా కాలనీకి తీస్కపో! లేకుంటే నువ్వూ ఈడనే ఉంటావ్- నీ ఆటో భీ ఇక్కడనే ఉంటది!" అన్నాడు యాదగిరి.
ఆటోడ్రైవర్ మావేపు దీనంగా చూశాడు.
"ఇగో చూడండి సార్! అర్ధగంట కెళ్ళి కిరికిరి చేస్తున్రు ఈళ్ళు- నిర్భయ్ నగర్ కాలనీ ఇదేనంటే ఇనటం లేదు-"
"వీళ్ళెక్కడ ఎక్కారు ఆటో అసలు?" అడిగాడు శాయిరామ్.
"అదేసార్-కాలనీ బయటే బార్ లో నుంచి వచ్చి ఆటోలో కూర్చున్నారు. నిర్భయ్ నగర్ కాలనీ వెళ్ళాలన్నారు. ఆ కాలనీ ఇదే గద్సార్. ఆటో ఎందుకు అని ఎంత మొత్తుకున్నా విన్లేదు-"
"ఏమిటి యాదగిరీ గొడవ?" అడిగాం.
"చూడు బాస్! ఆటో ఎక్కికూచున్నామో లేదో ఇదే నిర్భయ్ నగర్ కాలనీ దిగమంటున్నాడు. తాగితే మాకు హోష్ ఉండదనుకున్నాడు!"
"అవును మరి! మన నిర్భయ్ నగర్ కాలనీ ఇదేగదా?" అన్నాడు రంగారెడ్డి.
"ఇదిగో- మనాళ్ళయుండి ఆ ఆటో వాడిని సపోర్ట్ చేస్తారా! మీకు సిగ్గులేదూ? దమ్ముంటే మమ్మల్ని సపోర్టు చేయాలి!" అన్నాడు జనార్ధన్ కళ్ళు కొంచెంగా తెరచి.
"అంటే ఇది మన కాలనీ కాదంటావా?" అడిగాడు శాయిరామ్.
"ఛస్తే కాదు౧ మన కాలనీకి ఇంకా చాలా దూరం పోవాలి!" అన్నాడు యాదగిరి.
"ఇదేం కిరికిరి షార్! అర్ధగంట కెళ్ళి! జర మదద్ జేయండి సార్- వాళ్ళను బయటకు లాగుదాం!" అన్నాడు ఆటో అతను.
"జనార్ధన్! ఏమిటోయ్ ఇది? ఆటో దిగండి!" అన్నాడు గోపాల్రావ్.
"మేము దిగం!" అన్నాడు యాదగిరి.
"ఎందుకని?" అడిగాడు శాయిరామ్.
"ఇది మన కాలనీ కాదు-"
"కాకపోవటమేమిటి? మీ ఇల్లు కనబడటంలే?"
"నా కసలు ఇల్లేలేదు-"
యాదగిరి భార్య ఆ మాట వినడంతోనే కోపంగా ముందుకొచ్చి నిలబడింది.
"ఏందీ నీ కసలు ఇల్లే లేదా?"
"లేదు-"
"ఇప్పుడు ఇల్లు లేదంటున్నావ్, ఇంకాసేపాగితే భార్య లేదంటావ్-"
"అవ్- నాకు భార్య గూడా లేదు-"
"ఓర్నాయనో- భార్య లేదంటున్నాడు" అంటూ గట్టిగా ఏడుపు మొదలు పెట్టిందామె.
అందరం అడ్డుపడి ఆమె ఏడుపు ఆపేశాం.
"ఇదిగో చూడవోయ్- ఇలారా ఓ సారి" ఆటోడ్రైవర్ ని పక్కకు పిలిచాన్నేను.
"ఏమిటి సార్?"
"నువ్వో పనిచెయ్- ఆటోని కాలనీ చుట్టూ ఓ రౌండ్ కొట్టించి తీసుకురా! అప్పుడు దిగుతారేమో చూద్దాం" సలహా ఇచ్చాడు రంగారెడ్డి.
ఆటో రివ్వున కాలనీ వెనుకవేపు నుంచీ రౌండ్ కొట్టి తిరిగివచ్చి మధ్యలో ఆగింది.
"ఇదే సార్ నిర్భయ్ నగర్ కాలనీ-" అన్నాడు అతను.
"గట్ల దారికిరా! ఎంత తాగినా గానీ మా కాలనీ ఏదో తెలుసుకోలేని బేవకూఫ్ ళు గాదు మేము.." అన్నాడు యాదగిరి ఆటో దిగుతూ.
జనార్ధన్ కూడా దిగి నిలబడ్డాడు.
ఆటోవాడు హఠాత్తుగా నా కాళ్ళమీదా రంగారెడ్డి కాళ్ళమీదా పడిపోయాడు.
"ఇయాళ నా ఆటోనీ, నా ఫ్యామిలీని బ్రతికించిన్రుసార్ - లేకుంటే ఈడనే తెల్లారిపోతుండె."
వాళ్ళిద్దరినీ బలవంతంగా ఇళ్ళల్లోకి ఈడ్చుకెళ్ళాము. ఆ మర్నాటి నుంచీ మా కాలనీ పేరు చెప్తే ఆటోవాళ్ళు రావడానికి తిరస్కరించటం మొదలుపెట్టారు. ఆటోలు, సైకిల్ రిక్షాలు అంతవరకూ నెమ్మదిగా వచ్చి అక్కడి నుంచీ మా కాలనీ దాటేవరకూ మాంచి స్పీడులో వెళ్ళిపోతున్నాయ్.
రోజూ రాత్రి పన్నెండు వరకూ వాళ్ళిద్దరూ కాలనీ అంతా తిరుగుతూ అందరినీ నిద్రలేపుతూ, పాటలు పాడుతూ నానాగొడవా చేసేయటం మామూలయిపోయింది.
శనివారం రాత్రి వాళ్ళతోపాటు చంద్రకాంత్ ఛటోపాధ్యాయ్ కూడా చేరి గట్టిగా పాటలు పాడడం ప్రారంభించేసరికి కాలనీలో ఆడాళ్ళందరికీ భయం పెరిగిపోయింది.
రోజుకో మగాడు చొప్పున వెళ్ళి ఆ గ్యాంగ్ లో చేరిపోతాడేమో అన్న అనుమానం వచ్చేసింది. అందుకే మర్నాడు శాయిరామ్ ఏర్పాటు చేసిన మీటింగ్ కు మగాళ్ళ కంటే ఆడాళ్ళే ఎక్కువమంది వచ్చారు.
"ఇదంతా పెగ్ నెంబర్ త్రీ వల్లే వస్తోంది!" అంది రాజేశ్వరి మైక్ ముందు నిలబడి. "వీళ్ళ మందుకి సంబంధించిన విషయాలన్నీ నేను సేకరించాను- చాలా బార్స్ లో! వీళ్ళ కెపాసిటీ ఏమిటంటే రెండు పెగ్గుల వరకూ ఎలాంటి సమస్యా ఉండదు. కానీ పెగ్ నెంబర్-త్రీ కొట్టగానే అమాయకులయిన మనలాంటి ప్రజలమీద పడి చిత్రవధ చేసేస్తున్నారు. కనుక పెగ్ నెంబర్ త్రీ కొట్టకుండా వాళ్ళకు అడ్డుపడదాం మనం!" అందామె. అంతా తప్పట్లు మార్మోగిపోయినయ్.
"అయితే వాళ్ళకు మూడోపెగ్ మాత్రం ఇవ్వకుండా నాలుగూ అయిదూ ఎన్నయినా ఇవ్వమని బార్ వాళ్లకు చెప్తేసరి!" అంది పార్వతీదేవి.
మేమందరం నవ్వాం ఆ సలహాకు! ఎందుకు నవ్వారని పార్వతీదేవి తరిచి తరిచి అడిగింది గానీ మేము చెప్పలేదు.
"వీళ్ళను మందు జోలికి పోకుండా చేయాలంటే ఒక అయిడియా ఉంది!" అంది రాజేశ్వరి.
"ఏమిటది?" ఆత్రుతగా అడిగారు జనార్ధన్ భార్య, యాదగిరి భార్య.
"హిప్నటైజ్ చేయటం! తాగుడంటే అలర్జీ కలిగేటట్లు హిప్నటైజ్ చేయిస్తే చాలు! ఇంక జన్మలో తాగరు."
"అద్భుతం - అద్భుతం!" అంటూ తప్పట్లు కొట్టింది చంద్రకాంత్ భార్య.
"ఇంకోమందు కూడా ఉంది" అన్నాడు రంగారెడ్డి.
"ఇసూల్ ఫిరామ్ అంటే (యాంటాబ్యూష్) టాబ్ లెట్లు వాడితే వాళ్ళకు ఆ తాగుడు సీసాలు చూస్తే చాలు భయం పట్టుకుంటుంది."
అందరూ తప్పట్లు కొట్టారు మళ్ళీ.
మా కాలనీలోనే ఉన్న వివిన్ పాల్ ఆ మధ్య ఆరుగంటల్లో హిప్నాటిజం క్రాష్ కోర్స్ నేర్చుకున్న విషయం మాకు గుర్తుకొచ్చింది. ఆ పనికి అతనినే నియోగించాము.
మర్నాడు రంగారెడ్డి డిసూల్ ఫిరామ్ టాబ్ లెట్లు రెండొందలు తెచ్చి జనార్ధన్ భార్యకూ, యాదగిరి భార్యకూ ఇచ్చాడు.
"రోజుకి రెండుచొప్పున- వాళ్ళకు తెలీకుండా మంచినీళ్ళల్లో వేసి తాగించండి" అంటూ సలహా ఇచ్చాడు.
ఆరోజు సాయంత్రమే వివిన్ పాల్ హిప్నాటిజం ప్రారంభించాడు.
యాదగిరి ఇంట్లోనే అందరం గుమి కూడాము.
"మీరిద్దరూ నావంకే చూస్తున్నారు" అన్నాడు వివిన్ పాల్.
"అవును చూస్తున్నాం" అన్నారు వాళ్ళిద్దరూ.
"నా కళ్ళల్లోకే చూస్తున్నారు-"
"అవును చూస్తున్నాం-"
"మీరిప్పుడు నిద్రావస్థలోకి వెళ్లిపోతున్నారు. మీ కళ్ళు మూతలుపడి పోతున్నాయ్. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. మీరు రెక్కలోచ్చిన పక్షుల్లా ఎక్కడికో, ఏ లోకాల్లోకో ఎగిరిపోతున్నారు. నా గొంతు తప్పితే ఇంక మీకు ప్రపంచంలో ఏమీ వినిపించడంలేదు..."